చింతూరు (రంపచోడవరం): ఇటీవల దండకారణ్యంలో వరుస ఎదురుదెబ్బలు తగులుతున్న మావోయిస్టులు ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నారు. ఈ క్రమంలో నేటి నుంచి 8వ తేదీ వరకు జరుగనున్న పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(పీఎల్‌జీఏ) వారోత్సవాలు ఘనంగా నిర్వహించడంతో పాటు భారీ సంఘటనలకు పాల్పడడం ద్వారా తమ ఉనికిని చాటుకునేందుకు వ్యూహాలు పన్నుతున్నట్టు తెలిసింది. దీంతో ఆంధ్రా, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికలు జరిగిన అనంతరం దంతెవాడ జిల్లా ఆరన్‌పూర్, సుక్మా జిల్లా సక్లేర్ వద్ద జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 18 మంది మావోయిస్టులు మృతిచెందారు.
ఇదే సమయంలో ఆ రాష్ట్ర పోలీసులు పలువురు మావోయిస్టులను అరెస్టు చేశారు. దీంతో సేఫ్‌జోన్ కోసం మావోయిస్టులు ఆంధ్రా, తెలంగాణ, ఒడిశా సరిహద్దుల్లో మకాం వేసే అవకాశముందని నిఘావర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల జిల్లా ఎస్పీ విశాల్‌గున్ని చింతూరు సబ్ డివిజన్ పరిధిలోని సరిహద్దు పోలీస్‌స్టేషన్లను సందర్శించారు. సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికల నేపథ్యంలో నిరంతరం అప్రమత్తంగా వుండాలని, నిఘా వ్యవస్థను బలోపేతం చేసుకుని మావోయిస్టుల కదలికలను గుర్తించాలని ఆయన సూచించారు. అనంతరం తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్‌దత్‌తో ఆయన ప్రత్యేకంగా సమావేశమై సరిహద్దుల్లో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై చర్చించారు.
మావోయిస్టుల అడ్డుకట్టకు సరిహద్దుల్లో మూడు రాష్ట్రాల పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించడంతో పాటు సమాచార వ్యవస్థను మెరుగు పరుచుకుని మావోయిస్టుల జాడ కనుగొనేందుకు ప్రణాళిక సిద్ధం చేసేలా ఈ సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. ప్రధానంగా విలీన మండలాల్లో చర్ల, శబరి ఏరియా కమిటీ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నందున సరిహద్దు గ్రామాల్లో అదనపు బలగాలతో కూంబింగ్‌ను ముమ్మరం చేయడంతో పాటు ప్రధాన రహదారుల వెంబడి వాహనాల తనిఖీలు, సోదాలు నిర్వహిస్తున్నారు.
ఎన్నికలే టార్గెట్‌గా: కాగా సరిహద్దు రాష్ట్రమైన తెలంగాణలో ఈ నెల 7వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మావోయిస్టులు ఆ ఎన్నికలను టార్గెట్ చేయవచ్చని నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చిన మావోయిస్టులు ప్రచారం నిమిత్తం సరిహద్దు మండలాలకు వచ్చే నేతలను టార్గెట్ చేసే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు. ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో మావోయిస్టుల ప్రభావం అధికంగా వుంది.
ఇప్పటికే మావోయిస్టులు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ మంత్రితో పాటు తాజా మాజీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేసేందుకు రెక్కీ నిర్వహించినట్టు ఆ రాష్ట్ర పోలీసులు ప్రకటించారు. మరోవైపు మావోయిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం, ఈస్ట్ గోదావరి జిల్లాల కార్యదర్శి కొయెడ శాంబయ్య అలియాస్ ఆజాద్ భార్య సుజాతక్కను రెండ్రోజుల క్రితం పోలీసులు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో అరెస్టు చేసినట్టు ప్రకటించారు. దీనికి నిరసనగా ఆజాద్ ఎన్నికల వేళ దాడులకు పాల్పడే అవకాశముందని నిఘావర్గాలు హెచ్చరిస్తున్నాయి. ప్రధానంగా ఛత్తీస్‌గఢ్‌లో ఆపరేషన్ ప్రహార్–4 పేరుతో పోలీసులు వరుస ఎన్‌కౌంటర్లు జరుపుతున్నారు. దీంతో దండకారణ్యం పరిధిలోని మూడు రాష్ట్రాల సరిహద్దుల్లో ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. వరుస ఎన్‌కౌంటర్లతో ఓ వైపు పోలీసులు, తమ ఉనికిని చాటుకునేందుకు మరోవైపు మావోయిస్టులు వ్యూహాలు రచిస్తుండడంతో ఆదివాసీ పల్లెలు బిక్కుబిక్కుమంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment