సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రా, ఒడిశా బోర్డర్ (ఏవోబీ) మావోయిస్టులకు సురక్షిత స్థావరం. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని, అసలు ఇక్కడ మావోల సంచారమే లేదంటూ రాష్ట్ర హోం మంత్రి నుంచి కిందిస్థాయి పోలీసు అధికారులు ఇప్పటివరకూ చెబుతూ వచ్చారు. అడపాదడపా చిన్న ఘటనలు జరిగినపుడు.. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన మావోలు చేసిన పని అని పోలీసులు తేలిగ్గా తీసుకున్నారు. 2016 అక్టోబర్‌లో రామ్‌గుడా ఎన్‌కౌంటర్‌లో ఆర్కే కుమారుడు మున్నాతో పాటు 32 మంది కీలక మావో నేతలు నేలకొరిగారు. ఆ తర్వాత కొంతకాలం కూంబింగ్ ఆపరేషన్ కొనసాగించిన పోలీసులు ఇక మావోల జాడలేదని నిర్ణయానికి వచ్చారు. ఈ కారణంగానే గత ఏడాదిన్నరగా విశాఖ మన్యంలోనే కాదు.. ఏవోబీలోనే కూంబింగ్ ఆపరేషన్లు క్రమేపీ తగ్గించేశారు. పోలీస్ ఇన్‌ఫార్మర్ల నెపంతో ఎక్కడైనా ఒకరిద్దర్ని మావోలు మట్టుబెట్టినా, లేదా ఎక్కడైనా వాహనాలకు నిప్పుపెట్టినా ఒకటి రెండు పార్టీలతో గాలింపు చర్యలు చేపట్టడం.. ఆ తర్వాత మానివేయడం జరుగుతోంది. ముఖ్యంగా ఏడాదిగా ఎలాంటి ప్రత్యేక కూంబింగ్ ఆపరేషన్స్ చేయలేదు. ఇదే మావోలకు కలిసొచ్చిందని చెబుతున్నారు.
విశాఖలో ప్రత్యేక బలగాలు..
విశాఖలో గ్రేహౌండ్స్ దళాలు, ప్రత్యేక పోలీస్ బలగాలు ఉన్నాయి. పైగా 16వ ఏపీఎస్పీ బెటాలియన్ కూడా ఉంది. బెటాలియన్‌లో ఏ నుంచి హెచ్ వరకు కంపెనీకి 128 మంది చొప్పున ఎనిమిది కంపెనీల ప్రత్యేక పోలీసు బలగాలున్నాయి. అలాగే గ్రే హౌండ్స్‌లో 1ఏ,1బీ,1సీ,1డీ నుంచి 4ఏ,4బీ,4సీ,4డీ చొçప్పున యూనిట్‌కు 30 మంది చొప్పున 16 యూనిట్లు ఉన్నాయి. యాంటీనక్సల్స్ స్క్వాడ్ (ఏఎన్‌ఎస్) కంపెనీ (128 మందితో) ఉంది. పాడేరులో ఏఎస్పీ, నర్సీపట్నంలో ఓఎస్డీ, విశాఖలో ఎస్పీ, ఏఎస్పీ (అడ్మిన్), ఏఎస్పీ (ఆపరేషన్), డీఐజీ, ఇంటిలిజెన్స్ ఎస్పీ, గ్రేహౌండ్స్ ఎస్పీ విశాఖ కేంద్రంగానే పనిచేస్తుంటారు. ఇంతమంది పోలీసు ఉన్నతాధికారులు.. ఇన్ని బలగాలు ఉన్నా విశాఖ ఏజెన్సీలో కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేయడం విమర్శలకు తావిస్తోంది. పైగా ఇటీవల మావో అగ్రనేత చలపతి ఏవోబీలోనే ఉన్నాడని సమాచారం ఉందని పోలీసులు ప్రకటన కూడా చేశారు. అయినా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. మావో అగ్రనేత కదిలికలు ఉన్నప్పుడు కూంబింగ్ ఆపరేషన్ ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో ఉదాసీనంగా వ్యవహరించడం వల్లే ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను మావోలు పట్టపగలు సులువుగా హతమార్చారని చెబుతున్నారు. విశాఖ మన్యంలోనే కాదు ఏవోబీలో కూడా మావోల కదలికలులేవని, రామ్‌గుడ ఎన్‌కౌంటర్ తర్వాత మావోలు పొరుగు రాష్ట్రాలకు పారిపోయారని హోంమంత్రి, కిందిస్థాయి పోలీసుల అధికారి వరకూ ప్రకటనలు చేశారు. ప్రభుత్వ ప్రకటనలు తమను రెచ్చగొట్టేలా ఉన్నాయని భావించిన మావోలు.. ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలన్న ఆలోచనతోనే ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమలను మట్టుబెట్టినట్టు తెలుస్తోంది.
సాంకేతిక పరిజ్ఞానం వాడుకోలేదా?
- ఉరుములు, పిడుగులను ముందుగానే గుర్తిస్తాం. ప్రజలను అప్రమత్తం చేస్తాం. ప్రాణాపాయం నుంచి రక్షిస్తాం.
- ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశాల్లో కూర్చుని మన రాష్ట్రంలో ఎవరితోనైనా ముచ్చటిస్తారు. మారుమూల ప్రాంతాల్లోని జనం యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటారు.
- రాష్ట్రంలో ఏ గ్రామంలోనైనా వీధి దీపం వెలిగిందో లేదో ముఖ్యమంత్రి కోర్ డ్యాష్‌బోర్డులో వెంటనే తెలుసుకోవచ్చు. సమాచార, సాంకేతిక పరిజ్ఞానం వాడకంపై సందర్భం ఉన్నా లేకున్నా రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న మాటలవీ..
సాక్షి, అమరావతి: ప్రపంచస్థాయి అత్యున్నతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ అద్భుతమైన పరిపాలన సాగిస్తున్నామని ఊదరగొడుతున్న టీడీపీ ప్రభుత్వం 50 మంది సాయుధ మావోయిస్టుల కదలికలను ఏమాత్రం గుర్తించలేకపోయింది. శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్, మాజీ ఎమ్మెల్యేను చుట్టుముట్టి తీసుకెళ్లి మట్టుబెట్టినా ప్రభుత్వానికి తెలియలేదు. అదేదో అత్యంత మారుమూల ప్రాంతమేమీ కాదు. మండల కేంద్రానికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో జనసంచారం ఉన్నచోటే ఘాతుకం చోటుచేసుకుంది. మన్యంలో మావోయిస్టుల తాజా దుశ్చర్య వెనుక ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని స్థానికులు అంటున్నారు. తమ నాయకులను మావోయిస్టులు మట్టుబెట్టిన తీరును, ఇంటెలిజెన్స్ వైఫల్యాన్ని అరకు, పాడేరు ప్రాంత వాసులు తూర్పారపడుతున్నారు.
సమాచారం అందినా నిర్లక్ష్యమేనా?
అత్యాధునిక టెక్నాలజీని వాడుకోవడంలో మనం మొదటి స్థానంలో ఉన్నామని ప్రభుత్వం నిత్యం చెప్పుకుంటోంది. అయితే, విశాఖ మన్యంలో మావోయిస్టుల రాకను ముందుగా ఎందుకు గుర్తించలేకపోయారన్నది ప్రశ్నార్థకంగా మారింది. పదేళ్ల కిందటే రాష్ట్రంలో తీవ్రవాదుల కార్యకలాపాలు ఎక్కువగా ఉన్నప్పుడు పోలీసులు హైదరాబాద్ కేంద్రంగా ఒక శాటిలైట్ నెట్‌వర్క్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అడవుల్లో బృందాలు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి? ఎంతెంతమంది తిరుగుతున్నారు? వారి వద్ద ఏ ఆయుధాలు ఉన్నాయనేది ఆ నెట్‌వర్క్ ద్వారా గుర్తించి ప్రతిదాడులు నిర్వహించారు. ఈ టెక్నాలజీ ఆధారంగానే మావోయిస్టుల కదలికలను గుర్తించి, పలు ఎన్‌కౌంటర్లు చేశారు. ఇప్పుడు అంతకంటే మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం పోలీసుల వద్ద ఉంది. అరకు ప్రాంతంలోని దాదాపు అన్ని గిరిజన గూడేల్లో సెల్‌ఫోన్ టవర్లు ఏర్పాటు చేశారు. పైగా గిరిజన ప్రాంతాలపై పోలీసుల నిఘా ఎక్కువగా ఉంది. అయినా మావోయిస్టుల వ్యూహాలను పసిగట్టడంలో నిఘా వర్గాలు విఫలమయ్యాయి. ఆంధ్రా–ఒడిశా సరిహద్దు(ఏఓబీ)లో పోలీసులకు, మావోయిస్టులకు నిత్యం అంతర్యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో మావోయిస్టుల కదలికలు కనిపిస్తున్నాయని, మూడు నెలలుగా అరకు కేంద్రంగా వారి కార్యకలాపాలు పెరిగాయని సమాచారమున్నా పోలీసు విభాగం పెడచెవిన పెట్టినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
గుంటూరు జిల్లాలో పలువురికి నోటీసులు
గుంటూరు : మావోయిస్టుల కాల్పుల్లో అరకు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు మృతి చెందిన నేపథ్యంలో గంటూరు జిల్లాలోని ప్రజాప్రతినిధులు, ప్రధాన రాజకీయ పార్టీల నాయకుల భద్రతపై పోలీసులు దృష్టి సారించారు. ముఖ్యంగా గతంలో మావోయిస్టు షెల్టర్ జోన్లుగా ఉన్న నల్లమల అటవీ ప్రాంతం అధికంగా ఉన్న పెదకూరపాడు, మాచర్ల, వినుకొండ, గురజాల నియోజకవర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులకు పోలీసులు ముందస్తు హెచ్చరికలు చేస్తూ నోటీసులు జారీ చేస్తున్నారు. ఇందులో భాగంగా వైఎస్సార్‌సీపీ పెదకూరపాడు సమన్వయకర్త కావటి మనోహర్‌నాయుడు ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు అచ్చంపేట మండలంలో చేçపట్టనున్న పాదయాత్రను ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటలలోపు ముగించాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment