మావోయిస్టుల చేతిలో డ్రోన్లు! | Maoists Are Using Drones in Telangana | Sakshi
Sakshi News home page

మావోయిస్టుల చేతిలో డ్రోన్లు!

Published Sat, Mar 14 2020 3:23 AM | Last Updated on Sat, Mar 14 2020 5:26 AM

Maoists Are Using Drones in Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టుల సంచారం కలకలం రేపుతోంది. ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఏడు యాక్షన్‌ టీంలు తెలంగాణలోకి ప్రవేశించాయన్న సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు నిఘా పెంచారు. ఉమ్మడి ఆదిలాబాద్‌లోని చెన్నూరు నుంచి పాత ఖమ్మం జిల్లాలోని చర్ల వరకు గాలింపు ముమ్మరం చేశారు. ఈ ప్రాంతాలన్నీ నదీ పరివాహకాలే. దీంతో మావోయిస్టులు తెలంగాణలోకి ప్రవేశించాలంటే.. తప్పనిసరిగా గోదావరి నదిని దాటాలి.

రెండు నుంచి మూడు కిలోమీటర్ల వెడల్పున్న నదిని దాటేముందు గట్టుకు అవతల పోలీసులు ఉన్నారో లేదో ధ్రువీకరించుకునేందుకు మావోయిస్టులు డ్రోన్లను వినియోగిస్తున్నారని సమాచారం. వేసవి సమీపించడం, అడవిలో ఆకులు రాలుతుండటంతో ఛత్తీస్‌గఢ్‌లో సీఆర్‌పీఎఫ్‌ దళాలు ‘ఆపరేషన్‌ ప్రహార్‌’పేరిట దండకారణ్యాన్ని జల్లెడ పడుతున్నాయి. వారి నుంచి తప్పించుకోవడంతోపాటు తెలంగాణలో కొత్త రిక్రూట్‌మెంట్‌ కోసం మావోయిస్టులు సరిహద్దు దాటి వస్తున్నారు. మార్చి ఆఖరివారంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాజెక్టుల పరిశీలనలో భాగంగా కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులను సందర్శించే అవకాశాలున్నాయి. దీంతో పోలీసు డిపార్ట్‌మెంట్‌ ఈ ప్రాంతంలో అణువణువూ గాలిస్తున్నాయి.

అంతా అలర్ట్‌..! 
కొత్తగూడెం పరిధిలోని నీలాద్రిపేట వద్ద మావోయిస్టులు పోలీసులు తారసపడ్డారు. పోలీసులను చూసిన ఏడుగురు మావోలు తప్పించుకుని పారిపోయారు. ఈ సందర్భంగా వంటసామగ్రి, విప్లవ సాహిత్యం, ఐఈడీ (ఇంప్రూవైజ్‌డ్‌ ఎక్స్‌ప్లోజివ్‌ డివైజ్‌)లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరి కోసం పోలీసులు ఇంకా గాలిస్తున్నారు. భద్రాచలం జిల్లాలో ఎస్పీ సునీల్‌దత్‌ ఆధ్వర్యంలో పోలీసులు హెలికాప్టర్, డ్రోన్ల సాయంతో వెదుకుతున్నారు. గతేడాది జూలై 12న ఎంపీటీసీ నల్లూరి శ్రీనివాసరావు హత్య తరువాత మళ్లీ ఇప్పుడే మావోల కదలికలు మొదలవడం గమనార్హం. ఎలాగైనా తెలంగాణలో ఉనికిని చాటుకోవాలని ప్రయత్నిస్తోన్న హరిభూషణ్‌–శారద దంపతులే శ్రీనివాసరావు హత్యలోనూ నిందితులు కావడం గమనార్హం. దూకుడుగా వెళ్లడం, యువతను ఆకర్షించడమే లక్ష్యంగా వీరు పావులు కదుపుతున్నారు. మొత్తానికి అటు ఆపరేషన్‌ ప్రహార్, ఇటు తెలంగాణ పోలీసుల కూంబింగ్‌తో రెండు వైపులా మావోయిస్టులను ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. ముఖ్యంగా చెన్నూరు, ఏటూరునాగారం, కాటారం, ముత్తారం, చర్ల, దుమ్ముగూడెం, వెంకటాపురం, వాజేడు మండలాల్లో తనిఖీలు పెంచారు. ఆదివాసీలు, గూడెలలో నలుగురు అనుమానితులను పోలీసులు అరెస్టు చేయడంతో మరింత కలకలానికి దారి తీసింది. మరోవైపు పోలీసులు ఎప్పుడు ఎవరిని పట్టుకుపోతారో తెలియక.. ఆదివాసీలు బిక్కుబిక్కుమంటున్నారు.

ఇటు ‘సూడో’ వసూళ్లు.. 
పోలీసులు గాలింపులు తీవ్రతరం చేయడం, మావోయిస్టుల పోస్టర్లు విడుదల చేశారు. ముఖ్యంగా ఏజెన్సీలోని స్థానిక వ్యాపారులు, ప్రజా ప్రతినిధులు, అధికార పార్టీ నాయకులను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇదే అదనుగా.. సందట్లో సడేమియా అన్నట్లుగా.. కొత్తగూడెం, భద్రా ద్రి ఏజెన్సీ ప్రాంతాల్లో నకిలీ నక్సలైట్ల గోల మొదలైంది. స్థానిక వ్యాపారులు, అధికార పార్టీ నాయకులను డబ్బులు ఇవ్వాలంటూ బెదిరింపు లేఖలు పంపుతున్నారు.

పోస్టర్లు విడుదల
దండకారణ్యంలో గుత్తికోయ తెగలకు చెందినవారే మావోయిస్టు పార్టీలో ప్రస్తుతం సభ్యులుగా ఉన్నారు. వీరికి తెలుగుభాష కూడా రావడంతో ఇక్కడికి వచ్చి సులువుగా జనాల్లో కలసిపోవడం, రిక్రూట్‌మెంట్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. వీరిలో మావోయిస్టు పార్టీ కార్యదర్శి అగ్రనేత హరిభూషణ్, ఆయన భార్య శారద కూడా ఉన్నట్లు సమాచారం. వీరిని సులువుగా గుర్తించేందుకు వీలుగా పోలీసులు వారి ఫొటోలతో ఉన్న పోస్టర్లు చెన్నూరు నుంచి చర్ల వరకు అంటించారు. వీరి సమాచారం చెప్పినవారికి రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు నగదు బహుమతి కూడా ప్రకటించారు. వాస్తవానికి ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ప్రాబల్యం బాగానే ఉంది.  

కానిస్టేబుల్‌ కిడ్నాప్, హత్య
తెలంగాణ–ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో మావోయిస్టుల కదలికల నేపథ్యంలో తాజాగా విధుల్లో ఉన్న ఓ కానిస్టేబుల్‌ని అపహరించి హత్య చేశారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని సుకుమా జిల్లా అరగట్ట సమీపంలోని అడవుల్లో ఓ కానిస్టేబుల్‌ను మావోయిస్టులు హతమార్చారు. సుకుమా జిల్లా ఎస్పీ శలాబ్‌ సిన్హా మీడియా సమావేశంలో ఈ విషయాన్ని ధ్రువీకరించారు. జిల్లా రిజర్వ్‌ గార్డ్‌ (డీఆర్‌జీ) గా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ను సుకుమా జిల్లాలోని అరగట్ట వద్ద సొంత గ్రామంలోనే కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లి మావోలు చంపారని తెలిపారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కీలకాధికారి పర్యటన
ఇటు పోలీసులు మావోయిస్టుల వేట సాగిస్తూనే గ్రామాల్లో తనిఖీలు పెంచారు. ఇప్పటికే ఇద్దరు ఐపీఎస్‌ అధికారులు భద్రాద్రి కొత్తగూడెం పరిధిలో ప్రత్యేక ఆపరేషన్లలో పాల్గొంటున్నారు. ఇల్లందు మండలం పరిధిలోని బాలాజీ నగర్, బోజ్జయిగూడెం గ్రామ పంచాయతీలను శుక్రవారం ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర సందర్శించారు. స్థానిక పోలీసులతో కలసి వచ్చిన ఆయన పల్లె ప్రగతి కార్యక్రమాలు, నర్సరీలు, డంపింగ్‌ యార్డ్‌ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఓ వైపు మావోల కోసం కూంబింగ్‌ జరుగుతుండగానే.. పోలీసు ఉన్నతాధికారి గ్రామాల పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement