ప్రతీకాత్మక చిత్రం
సాక్షి ప్రతినిధి, వరంగల్/వెంకటాపురం: తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దు అయిన ములుగు–బీజాపూర్ జిల్లాల అటవీ ప్రాంతం లో మంగళవారం ఉదయం తుపాకుల మోత మోగింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. గ్రేహౌండ్స్‌కు చెందిన ఓ జవాను తీవ్రంగా గాయపడ్డాడు. మృతి చెందిన మావోయిస్టుల్లో ఓ మహిళ ఉంది.
40–50 మంది ఉన్నారని తెలుసుకొని..
తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో 40–50 మంది సంచరిస్తున్నారని ఈ నెల 16న సమాచారం అందింది. టార్గెట్‌గా మారిన కొందరు సర్పంచ్‌లు, కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకుల హత్యలకు ప్లాన్ వేసినట్లు తెలిసింది. రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన కర్రిగుట్టల వద్ద సాయుధ మావోయిస్టులు సంచరిస్తున్నారనే పక్కా సమాచారంతో తెలంగాణ గ్రేహౌండ్స్, ఛత్తీస్‌గఢ్ పోలీస్, సీఆర్‌పీఎఫ్ బలగాలు జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి.
మంగళవారం ఉదయం 6 గంటలకు కర్రిగుట్టల వద్ద పోలీస్ బలగాలకు మావోయిస్టులు ఎదురుపడటంతో వాళ్లు వెంటనే పోలీసులపై కాల్పులకు దిగారు. ప్రతిగా పోలీసులు ఎదురు కాల్పులు జరపగా ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్‌సింగ్ పాటిల్ ఓ ప్రకటనలో తెలిపారు. వీళ్లలో ఒక మహిళా మావోయిస్టు, ఇద్దరు పురుషులు ఉన్నారు.
ఎదురు కాల్పుల్లో ఓ జవాను తీవ్రంగా గాయపడగా అతడిని హెలికాప్టర్‌లో హనుమకొండ ఆర్ట్స్ కళాశాల ఆవరణకు తరలించి ప్రథమ చికిత్స చేసి తర్వాత హైదరాబాద్ తరలించారు. ఘటనా ప్రాంతం నుంచి ఓ ఎస్‌ఎల్‌ఆర్, ఓ ఇన్‌సాస్ రైఫిల్‌తో పాటు ఒక సింగిల్ బోర్, 10 రాకెట్ లాంచర్ల కిట్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.
తప్పించుకున్న వాళ్ల కోసం కూంబింగ్: ములుగు ఎస్పీ
మృతి చెందిన మహిళా మావోయిస్టును వాజేడు–వెంకటాపురం ఏరియా కమిటీ కార్యదర్శి మడకం సింగే అలియాస్ శాంతక్క అలియాస్ అనితగా పోలీసులు గుర్తించారు. ఈమె ఇటీవల వెంకటాపురం మండలం మాజీ సర్పంచ్ రమేశ్‌ను అపహరించి హత్య చేసిన ఘటనలో ప్రధాన నిందితురాలిగా ప్రకటించారు. మరొకరు ఇల్లెందు–నర్సంపేట ఏరియా కమిటీ కార్యదర్శి కొమ్ముల నరేశ్ అలియాస్ బుచ్చన్నగా గుర్తించారు. మూడో వ్యక్తిని మాత్రం ఇంకా గుర్తించలేదు.
ఈయన ములుగు–ఏటూరునాగారం డీవీసీఎం సుధాకర్ అని సమాచారం. పక్కా సమాచారంతోనే మావోయిస్టుల కోసం రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో కూంబింగ్ జరుగుతోందని ములుగు ఎస్పీ ప్రకటించారు. ఎన్‌కౌంటర్ నుంచి తప్పించుకున్న మావోయిస్టుల కోసం ఇంకా కూంబింగ్ సాగుతోందన్నారు. కాగా ఎన్‌కౌంటర్‌లో మృతిచెందారని భావిస్తున్న సుధాకర్ ద్వారా ఆదివాసీలతో భారీ స్థాయిలో నియామకాలకు మావోయిస్టు పార్టీ వ్యూహరచన చేసినట్టు తెలిసింది. తాజా ఎన్‌కౌంటర్‌తో కొత్త నియామకాలకు పోలీసులు అడ్డుకట్టవేసినట్టేనని భావిస్తున్నారు.
సుక్మాలో మరో ఎన్‌కౌంటర్.. మహిళా మావోయిస్టు మృతి
దుమ్ముగూడెం: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా లోని మార్జుమ్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మహిళా మావోయిస్టు మృతి చెందింది. మార్జుమ్ అటవీ ప్రాంతంలో కట్టేకళ్యాణ్ ఏరియా కమిటీ తెహ్క్వారా ప్రాంతానికి చెందిన మన్హగు, మున్నీ, ప్రదీప్, సోమదుతో పాటు 20–25 మంది సాయుధ మావోయిస్టులు ఉన్నారని పోలీసు బలగాలకు సమాచారం అందింది.
దీంతో దంతెవాడ, బస్తర్, సుక్మా జిల్లాల డీఆర్‌జీ బృందాలు మంగళవారం సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో మావోయిస్టులు ఎదురుపడగానే ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల తర్వాత ఘటనా స్థలంలో పరిశీలించిన భద్రతా బలగాలు మహిళా మావోయిస్టు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆమెను మార్జుమ్ ఏరియా కమిటీ సభ్యురాలు మున్నీగా గుర్తించినట్టు బస్తర్ రేంజ్ ఐజీ పి.సుందర్ రాజ్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment