సాక్షి, ఖమ్మం(గుండాల) : అప్పుడే తెల్ల వారింది.. రైతన్నలు చేను చెలకల్లోకి పయనమవుతున్నారు.. ఒక్కసారిగా అటవీ ప్రాంతం నుంచి తుపాకుల మోత.. దీంతో భయాందోళనకు గురై ఉరుకులు పరుగులు పెట్టారు.. తేరుకునే సరికి పోలీసులకు, ఎన్డీ దళాల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయనే విషయం దావానలంలా వ్యాపించింది. ఈ కాల్పుల్లో న్యూడెమోక్రసీ అజ్ఞాత దళాల నేత, రీజినల్ కార్యదర్శి పూనెం లింగయ్య(50) అలియాస్ లింగన్న మృతి చెందాడు. మరో నేత గోపన్నతో సహా ముగ్గురు సభ్యులు తప్పించుకున్నారు. ఇంకో ఇద్దరు పోలీసుల అదుపులో నుంచి తప్పించుకున్నారు. క్రమంగా చుట్టుపక్కల జనం సంఘటన స్థలానికి చేరుకున్నారు. లింగన్న మృతదేహాన్ని మార్గం తప్పించి తరలిస్తుండగా జనం వెంటపడ్డారు. పోలీసులపై రాళ్లు విసిరారు. దీంతో పోలీసులు సుమారు 40 రౌండ్ల వరకు గాలిలోకి కాల్పులు జరిపారు. పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ సంఘటన మండలంలోని దేవళ్లగూడెం రోళ్లగడ్డ మధ్య బుధవారం చోటుచేసుకుంది.
పది రోజులుగా కూంబింగ్..
జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు మావోయిస్టు వారోత్సవాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గత వారం పది రోజులుగా మండల సరిహద్దు ప్రాంతాల్లో కూంబింగ్ ముమ్మరంగా కొనసాగుతోంది. అప్పటికే పోలీసుల టార్గెట్‌గా ఉన్న లింగన్న, ఆయన ఆరుగురు దళ సభ్యు లు రోళ్లగడ్డ సమీపంలోని పందిగుట్టపై ఉన్నట్లు సమాచారం. దీంతో పక్కా ప్రణాళికతో గ్రేహౌండ్స్ బలగాలు సుమారు మంగళవారం రాత్రికే ఆ అటవీ ప్రాంతంలో మోహరించారు. బుధవారం తెల్లవారు జామున పోలీసులు లింగన్న, దళ సభ్యుల స్థావరాల వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో ఎదురుకాల్పులు జరిగాయి.
లింగన్న మృతి.. తప్పించుకున్న దళ సభ్యులు
పోలీసులకు, దళానికి మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో లింగన్న మృతి చెందగా దళంలో ఉన్న బయ్యారం దళకమాండర్ గోపన్నతో పాటు మరో ఐదుగురు తప్పించుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరు దళ సభ్యులు దేవళ్లగూడెం–రోళ్లగడ్డ మధ్య తుపాకులతో పారిపోతుండగా అదుపులోకి తీసుకుని సంఘటన స్థలానికి తీసుకెళ్లినట్లు స్థానికుల సమాచారం. అయితే అప్పటికే లింగన్న మృతి చెందాడు.
పందిగుట్ట వద్ద పడిగాపులు
ఎదురుకాల్పులు జరిగిన సంఘటనా స్థలానికి ఏం జరిగిందోనని తెలుసుకునేందుకు చుట్టపక్క గ్రామాల ప్రజలు, పార్టీ నాయకులు సుమారు 300 మంది పైగా పందిగుట్ట ప్రాంతానికి చేరుకున్నారు. ఉదయం 9 గంటల ప్రాంతం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గుట్టపైకి పోలీసులు ఎవరినీ వెళ్లనివ్వలేదు. మీడియాను సైతం అడ్డుకున్నారు. అప్పటికే పోలీసులపై నినాదాలు చేశారు. చాలా సేపటి తర్వాత మీడియా, జనం కలసి గుట్టపైకి వెళ్లారు. స్థావరాల వద్ద అన్నం, కూరగాయలు, వాటర్ క్యాన్లు, తదితర సామగ్రి మాత్రమే ఉన్నాయి. గుట్టపై పోలీసులుగానీ, మృతదేహాలు గానీ లేవు. మరో దారిలో పోలీసులు మృతదేహా న్ని మోసుకెళ్తుండడాన్ని గమనించి జనం వెంటపడ్డారు.
మృతదేహం అడ్డగింత...ఉద్రిక్తత
సాధారణంగా ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశంలోనే మృతదేహాన్ని ఉంచి మీడియాకు చూపించి గ్రామస్తుల సహకారంతో మృతదేహాలను తీసుకెళ్తుంటారు. అలా జరగకుండా మరో మార్గంలో తరలిస్తుండగా వెంట పడుతూ ఉద్రేకానికి గురైన ప్రజలు పోలీసులపై రాళ్లు రువ్వారు. మృతదేహాన్ని వదిలి పోలీసులు కొద్ది దూరం వెళ్లారు. అప్పటికే ఇద్దరు పోలీసుల తలలు పగిలాయి. దీంతో ప్రతిఘటించిన పోలీసులు గాలిలో 18 విడతలుగా సుమారు 40 రౌండ్లకు పైగా కాల్పులు జరుపుతూనే జనాన్ని చెదరగొట్టారు. ఈ సంఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మీడియాపై సైతం పోలీసులు విరుచుకుపడ్డారు.
మూడు దఫాలుగా కాల్పులు
పందిగుట్ట ప్రాంతంలో కాల్పులు మూడు దఫాలు గా పది నిమిషాలకోసారి జరిగాయి. స్థావరంపై ఒకసారి, సభ్యులు పారిపోతుండగా, ఇద్దరు సభ్యులను అదుపులోకి తీసుకునప్పుడు మరోసారి కాల్పులు జరిగాయని స్థానికులు చెబుతున్నారు.
పోలీసులు కనికరించలేదు
గుండాల: నా భర్తను ఒక్కసారి చూద్దామని దగ్గరకు వెళితే.. పోలీసులు కనీసం కనికరం చూపించలేదంటూ లింగన్న భార్య కన్నీరు మున్నీరయింది. సంఘటనా ప్రాం తం నుంచి గుండాల వరకు మృతదేహాన్ని తీసుకొస్తుండగా క్షణంపాటు కూడా చూపించలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యుల రోదనలు స్థానికులను కంట తడి పెట్టించింది. ప్రతి ఒక్కరికీ లింగన్న సుపరిచితుడు కావడంతో బంధువులతో, పాటు చుట్టపక్కల గ్రామాల నుంచి జనం తండోపతండాలుగా తరలివచ్చారు. మృతదేహాన్ని ట్రాక్టర్ ద్వారా గుండాలకు తీసుకవచ్చి సుమోలో కొత్తగూడెం తరలించారు. ఇల్లెందు ఇన్‌చార్జి డీఎస్పీ ఎస్‌ఎం అలీ గుండాలకు చేరుకుని పరిస్థితిన సమీక్షించారు.
కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రిలో లింగన్న మృతదేహం
సింగరేణి(కొత్తగూడెం): సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ అజ్ఞాత దళనేత లింగన్న మృతదేహాన్ని పోలీసులు కొత్తగూడెంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి బుధవారం సాయంత్రం తీసుకువచ్చారు. డాక్టర్ల సమ్మె కారణంగా బుధవారం పోస్టుమార్టం నిర్వహించే అవకాశం లేకపోవడంతో మృతదేహాన్ని భద్రపరిచారు. గురువారం లింగన్న మృతదేహానికి ఇక్కడే పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశాలున్నాయి. కాగా ఆస్పత్రి వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మార్చురీ వద్ద గ్రేహౌండ్స్, సివిల్ పోలీసులను మోహరించారు. ఆందోళనకారులు ఆస్పత్రికి చేరుకుంటారనే సమాచారంతో వన్‌టౌన్ సీఐ కుమారస్వామి పర్యవేక్షణలో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
గాలింపు చేపడుతుండగా కాల్పులు జరిపారు
కొత్తగూడెం: కూంబింగ్ చేపడుతున్న సమయంలో ఎదురైన నక్సల్స్ కాల్పులు జరపడంతో.. ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చిందని, ఈ కాల్పుల ఘటనలో ఒక నక్సలైట్ మృతిచెందగా, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకోగా వారు పారిపోయినట్లు జిల్లా ఎస్పీ సునీల్‌దత్ తెలిపారు. బుధవారం సాయంత్రం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సంఘటన స్థలంలో ఒక నక్సలైట్ మృతదేహాన్ని గుర్తించడంతోపాటు ఎస్‌ఎల్‌ఆర్ రైఫిల్, విప్లవ సాహిత్యం, కొంత సామగ్రిని స్వాధీనపరచుకున్నట్లు వివరించారు. పారిపోతున్న సాయుధులైన రామకృష్ణ, మహేష్ అనే నక్సలైట్లను అదుపులోకి తీసుకోగా.. నక్సల్స్ సానుభూతిపరులు వారిని అడ్డగించి, రాళ్లు రువ్వి, అపహరించుకుని పోయారని పేర్కొన్నారు.
మృతిచెందిన నక్సలైట్‌ను పూనెం లింగయ్య అలియాస్ లింగన్నగా గుర్తించామని, ఇతను న్యూడెమోక్రసీ కార్యదర్శిగా పనిచేస్తున్నాడని, ఇతనిపై జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. కాల్పుల ఘటనలో మహబూబాబాద్ జిల్లా కొత్తగూడేనికి చెందిన స్టేట్ కమిటీ మెంబర్ ధనసరి సమ్మయ్య అలియాస్ గోపన్న, జిల్లా కమిటీ సభ్యుడు ఆరేం నారాయణ అలియాస్ నరేష్, అజ్ఞాత దళ సభ్యుడు నాగన్న ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. పోలీసులపై దాడి చేసిన నక్సల్స్ సానుభూతిపరులపై, పోలీసు కస్టడీలో ఉన్న ఇద్దరు నక్సల్స్‌ను అపహరించినందుకు గుండాల ఠాణాలో కేసులు నమోదు చేసినట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment