linganna
-
జనం హృదయంలో లింగన్న
గుండాల: బాల్యం నుంచే విప్లవ భావాలతో.. ఉద్యమ బాటలో నడిచి.. 22 ఏళ్లు అజ్ఞాత జీవితం గడిపి.. భూమి, భుక్తి, విముక్తి కోసం పోరాటమే ఊపిరిగా ఎన్నో సమస్యలను పరిష్కరిస్తూ.. ఆటుపోట్లను ఎదుర్కొంటూ జైలు జీవితాన్ని లెక్కచేయక వీరోచితంగా పోరాడి అమరుడైన జననేత లింగన్న తమ గుండెల్లో పదిలంగా ఉన్నాడని ప్రజలు అంటున్నారు. లింగన్న ఎన్కౌంటర్లో మృతి చెంది శుక్రవారానికి ఏడాది పూర్తయింది. అయినా.. ఆ ఘటన తాలూకు దృశ్యాలు ఇంకా కళ్లముందు కదలాడుతూనే ఉన్నాయని చెబుతున్నారు. న్యూడెమోక్రసీ అజ్ఞాత దళనేత, రీజినల్ కార్యదర్శి పూనెం లింగయ్య అలియాస్ లింగన్న బాల్యం నుంచే విప్లవ భావాలు కలిగి ఉండి విద్యార్థి, యువజన సంఘాలతో పనిచేస్తూనే 1997లో అజ్ఞాతంలోకి వెళ్లాడు. 22 ఏళ్లపాటు అజ్ఞాత జీవితం గడిపాడు. 2017 డిసెంబర్లో ఖమ్మంలో వైద్యం పొంది తిరిగి వస్తున్న క్రమంలో రఘునాథపాలెం వద్ద అరెస్టు చేశారు. జైళ్లో మూడు నెలలు, ఇంటి వద్ద మరో మూడు నెలల పాటు ఉన్నారు. మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లాలని నిర్ణయించుకుని వెళ్లాడు. అప్పటి నుంచి లింగన్న పోలీసులకు టార్గెట్ అయినట్లు సమాచారం. జూలై 28 నుంచి మావోయిస్టు వారోత్సవాల్లో భాగంగా ఉమ్మడి ఖమ్మం–వరంగల్ జిల్లా సరిహద్దుల్లో గ్రేహౌండ్స్ బలగాలు అడవిని జల్లెడ పడుతున్నాయి. ఈ క్రమంలోనే రోళ్లగడ్డ అటవీ ప్రాంతంలో పందిగుట్ట వద్ద జరిగిన ఎన్కౌంటర్లో లింగన్న మృతి చెందాడు. అనంతరం మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తుండగా ప్రజలు పోలీసులపై రాళ్ల వర్షం కురిపించారు. ప్రజలంతా ఒక్కసారిగా పోలీసులపై తిరగుబాటు చేయడం ఇదే తొలిసారి కావచ్చని పలువురు చెబుతున్నారు. అలా దాడి చేసిన మండలానికి చెందిన పార్టీ నాయకులతో పాటు స్థానికులైన 60 మందిపై పోలీసులు కేసులు పెట్టి విడుతల వారీగా జైలుకు పంపారు. కాగా, కోర్టు అనుమతితో గతేడాది సెప్టెంబర్ 29న గుండాలలో సంతాపసభ నిర్వహించారు. లింగన్న కుటుంబ సభ్యులు వారి సొంత భూమిలోనే స్మారక çస్తూపం నిర్మించుకున్నారు. నవంబర్ 16 అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు స్థూపాన్ని కూల్చారు. ఆ ప్రాంతంలో లింగన్న జ్ఞాపకాలు ఉండొద్దని భావించి కొందరు స్తూపాన్ని కూల్చారని ప్రజలు ఆరోపించారు. అయినా ఆయన త్యాగాలు, ఆయన అమరత్వం వృథా కావని, తమ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాడని ప్రజలు పేర్కొంటున్నారు. ఆయన ఆశయ సాధన కోసం పోరాడుతూనే ఉంటామని ఎన్డీ పార్టీ నాయకులు చెబుతున్నారు. రెండు రోజుల్లో పాటల సీడీని ఆవిష్కరిస్తున్నట్లు వారు తెలిపారు. జైలు నుంచి వచ్చిన లింగన్న మండలంలోని ప్రతి ఇంటికి వెళ్లి పలుకరించిన తీరును ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. -
నోటికి ప్లాస్టర్ అంటించి, అగర్‌బత్తీలతో కాల్చి...
సాక్షి, ఉట్నూర్ రూరల్ : కంటికి రెప్పలా కాపాడాల్సిన ఓ వార్డెన్ చిన్నారులపై లైంగికదాడికి పాల్పడుతున్నాడు. అర్ధరాత్రి నిద్రలేపి మరీ ఈ అరాచకానికి ఒడిగడుతున్నాడు. ఈ కీచకపర్వం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాల వసతి గృహంలో వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. మండల కేంద్రంలోని ఓ ఇంగ్లిష్ మీడియం ఉన్నత పాఠశాల అక్కడే హాస్టల్ నిర్వహిస్తోంది. విద్యార్థులపై హాస్టల్ వార్డెన్ కొమ్ము లింగన్న లైంగిక దాడులకు పాల్పడుతున్నాడు. ఈ విషయమై విద్యార్థుల తల్లిదండ్రులు రెండు నెలల క్రితం ప్రిన్సిపాల్‌కు వివరించినట్లు సమాచారం. అయినా సదరు వార్డెన్‌లో మాత్రం మార్పు రాలేదు. దీంతో పిల్లల తల్లిదండ్రులు గురువారం పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. పిల్లలను అర్ధరాత్రి నిద్ర లేపి లైంగిక వేధింపులకు గురిచేసేవాడని, వినకపోతే నోటికి ప్లాస్టర్ అంటించి, అగర్‌బత్తీలతో కాల్చేవాడని పిల్లలు తమకు ఏడుస్తూ విన్నవించారని తల్లిదండ్రులు పేర్కొన్నారు. గతంలో ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశామని, పిల్లల పరువుపోతుందని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పడంతో ఆగిపోయామని తెలిపారు. అదే సమయంలో వార్డెన్ కనిపించడంతో ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు అతడిపై దాడి చేశారు. సీఐ నరేశ్, ఎస్సై అనిల్ విద్యార్థుల తల్లిదండ్రులను సముదాయించారు. వార్డెన్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసినట్లు ఎస్సై అనిల్ తెలిపారు. -
డీజీపీని కలిసిన న్యూ డెమోక్రసీ నేతలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ న్యూడెమోక్రసీ నేతలు మంగళవారం తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిని కలిశారు. కొత్తగూడెం జిల్లా, గుండాల మండలంలో లింగన్న ఎన్కౌంటర్ సందర్భంగా గ్రామస్తులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డీజీపీకి వినతి పత్రం ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. లింగన్న ఎన్కౌంటర్ సందర్భంగా జరిగిన ఘర్షణలో దాదాపు 30మంది అమాయకులపై సెక్షన్ 307 ప్రకారం కేసలు నమోదు చేశారన్నారు. పోలీసులు నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డీజీపీని కోరినట్లు తెలిపారు. ఎన్కౌంటర్లో చనిపోయిన లింగన్న సంతాప సభలకు అనుమతి ఇవ్వాలని డీజీపీని కోరామన్నారు. తమ అభ్యర్థన పట్ల డీజీపీ మహేందర్ రెడ్డి సానుకూలంగా స్పందించారని.. జిల్లా పోలీసు అధికారులతో నివేదిక తెప్పించుకుని పరిశీలిస్తానని డీజీపీ హామీ ఇచ్చారని తెలిపారు. -
అదునుచూసి హతమార్చారు..
సాక్షి, ఖమ్మం(ఇల్లెందు) : నిన్నటి వరకు ఎన్డీ నేత మధు జైళ్లో.. అదే స్థాయిలో ఉన్న లింగన్న తిరిగి అజ్ఞాతంలోకి వెళ్లి ఉద్యమ విస్తరణకు సన్నద్ధమవుతున్న వేళ అదును చూసి హతమార్చారని అనుకుంటున్నారు. 2012లో ఎన్డీలో సంభవించిన చీలిక రెండు వర్గాలకు తీరని నష్టంగా మారింది. 2016 నుంచి అగ్రనేతలంగా వరుస అరెస్టుల పర్వం జరిగింది. ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న గోపీ నుంచి మొదలుకొని విజయ్, రమేష్ వరకు జనజీవనంలో ఉన్న మధు, ఐలయ్య వరకు అంతా అరెస్టు అయిన నేతలే. అయితే పోలీసులు మాత్రం వీరు రెండో దఫా అజ్ఞాతంలోకి వెళ్లటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అజ్ఞాతంలో ఉన్న వారందరినీ లేకుండా చేయాలనే లక్ష్యంలో పోలీసులు వరుస అరెస్టులకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో అజ్ఞాతంలో ఉన్న నేతలు మళ్లీ అడివి బాట పడుతుండటంతో ఒక వైపు పీడీ యాక్టులు పెట్టి జైళ్ల పాలు చేయటం, మరొక వైపు భయభ్రాంతులకు గురి చేసేందుకు ఎన్కౌంటర్లకు తెరలేపారనే ప్రచారం జరుగుతోంది. లింగన్న ఎన్కౌంటర్ లాంటి సంఘటనలు ఎన్డీకి కొత్త కాకపోయినప్పటికీ ఈ ఎన్కౌంటర్ ఆ గ్రూపుల్లోని అజ్ఞాత నేతలకు ఒక సంకేతంగా చూపించేందుకే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. లింగన్న లాంటి ఓ కీలక నేతను కోల్పోవడటం ఎన్డీకి కోలుకోలేని దెబ్బగా అభివర్ణిస్తున్నారు. సుదీర్ఘకాలం అజ్ఞాతంలో... సుదీర్ఘకాలం అజ్ఞాతంలో ఉండి ప్రజలతో సత్సం బంధాలు కలిగి ప్రజల మధ్య వైరుధ్యాలు, ఘర్షణలను సునాయాసంగా ప్రజాకోర్టుల ద్వారా పరిష్కరించి అందరినీ మెప్పించి పంపించే నేతను కోల్పోవడం తీరని లోటుగా భావిస్తున్నారు. సిద్ధాంత, రాజకీయ సంక్షోభం ఎదుర్కొంటున్న ఎన్డీకి ఈ తరుణంలో లింగన్నను ఎన్కౌంటర్ రూపంలో కోల్పోవటం కొంత నష్టమేనని చెప్పవచ్చు. 2017 డిసెంబబర్ 7న రఘునాథపాలెం వద్ద అరెస్టు అయిన లింగన్న కొద్ది కాలం జైలు జీవితం గడిపి బయటకు వచ్చి ఇంటి వద్ద ఉన్నాడు. ఈ క్రమంలో మధు రెండో దఫా హైదరాబాద్‌లో అరెస్టు కావటంతో సర్పంచ్, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలు రావటం తమకు ప్రతికూల పరిస్థితి ఎదురు కావటంతో గత్యంతరం లేని పరిస్థితిలో ఎంపీటీసీ ఎన్నికల ముందు అజ్ఞాతంలోకి వెళ్లారు. గుండాల మండంలో మెజార్టీ ఎంపీటీసీలను కైవసం చేసుకుని ఎంపీపీని, జెడ్పీటీసీ నిలబెట్టుకున్నారు. అధికార టీఆర్ఎస్ పుంజుకుంటుదని అంతా భావించారు, కానీ ఎంపీపీ, జెడ్పీటీసీ చేజారటం, ఎన్డీ ఖాతాలో జమ కావటం లింగన్న కృషేనని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో లింగన్న ఎన్కౌంటర్లో హతమయ్యారు. ఎన్‌కౌంటర్‌కు ముందు.. తర్వాత ఏమైంది...? ఇదిలా ఉండగా ఎన్‌కౌంటర్‌కు ముందు ఎన్‌కౌంటర్‌కు తర్వాత ఏమి జరిగింది. ఈ ప్రశ్నలకు సమాధానాలు అంతుచిక్కటం లేదు. ఎన్‌కౌంటర్‌కు ముందు అక్కడ ఏమి జరిగింది.. ఎన్ని గంటల సమయంలో ఎన్కౌంటర్ జరిగింది.. ఎన్ని రోజుల నుంచి ఆ ప్రదేశంలో విడిది పొందారు.. అన్ని రోజులు ఒకే ప్రదేశంలో విడిది పొందటానికి గల కారణాలు ఏమిటి, అక్కడ విడిది పొందిన సమాచారం ఎంత మందికి తెలుసు, ఆ ప్రదేశం అంత సేఫ్ కానిది అయినా అన్ని రోజులు ఎందుకు అక్కడే విడిది పొందినట్లు, ఎన్కౌంటర్ సమయంలో ఆ స్థలంలో ఎంత మంది సభ్యులు ఉన్నారు, ఎన్కౌంటర్ తర్వాత వారంతా ఎటు వెళ్లారు.. ఇంకా గాయపడిన సభ్యులు ఉన్నారా.. వారంతా ఎన్డీ కంట్రోల్లోకి వచ్చి ఆ రోజు జరిగిన సంఘటన పూర్వాపరాలు వెల్లడించారా లాంటి ప్రశ్నలకు సమాధానాలు లభించాల్సి ఉంది. రఘునాథపాలెంలో అరెస్టుకు పూర్వమే లింగన్న లొంగిపోయే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరిగిన క్రమంలోనే అరెస్టు అయి ఆరు నెలల వరకు ఇంటివద్దనే ఉండి రెండో దఫా అడవిబాట ఎందుకు పట్టాడు.. లింగన్న ఎన్‌కౌంటర్‌పై ఎన్నో ప్రశ్నలు అందరి మదిలో మెదులుతున్నాయి. బాటన్న దళంలో సభ్యుడిగా చేరిన లింగన్న 22 ఏళ్ల కాలంలో జిల్లా కార్యదర్శి, రీజియన్ కమిటీ కార్యదర్శి, రాష్ట్ర కమిటీ సభ్యుడి స్థాయికి ఎదిగారు. -
హైకోర్టు ఆదేశాలతో లింగన్న మృతదేహానికి రీ పోస్ట్‌మార్టం
-
అడుగడుగునా తనిఖీ..
సాక్షి, కొత్తగూడెం: సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రీజినల్ కార్యదర్శి పూనెం లింగన్న ఎన్కౌంటర్ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. అజ్ఞాత దళాల కమాండర్‌గా ఉన్న లింగన్న ఎన్‌కౌంటర్‌తో గుండాల మండలంలోని ఆదివాసీ గిరిజనుల్లో ఆగ్రహం పెల్లుబికింది. ఊహించని రీతిలో సమీప గ్రామాల ప్రజల నుంచి తిరుగుబాటు ఎదురు కావడంతో ఇల్లెందు, పినపాక నియోజకవర్గాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు మరింత పకడ్బందీగా వ్యవహరించారు. ఇప్పటికే మావోయిస్టు పార్టీ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నడుస్తుండడంతో పోలీసు బలగాలు ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని దండకారణ్యంతో పాటు ఇల్లెందు, పినపాక ఏజెన్సీ పరిధిలోనూ భారీగా కూంబింగ్ చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో న్యూడెమోక్రసీ కమాండర్ లింగన్న ఎన్‌కౌంటర్‌తో మరింత అలజడి నెలకొంది. లింగన్న మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. దీంతో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాయల, చంద్రన్న వర్గాలతో పాటు ఇతర సంఘాలకు చెందిన సానుభూతిపరులు ఆస్పత్రి వద్దకు వస్తుండగా జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్డీ (రాయల) రాష్ట్ర కార్యదర్శి డీవీ.కృష్ణ, ఎన్డీ (చంద్రన్న) రాష్ట్ర కార్యదర్శి సాధినేని వెంకటేశ్వర్రావుతో పాటు ఆ పార్టీలకు చెందిన రాష్ట్ర, జిల్లా, స్థానిక నాయకులను, తెలంగాణ ప్రజాఫ్రంట్ తదితర సంఘాల నాయకులను ఇల్లెందు, మణుగూరు, గుండాల, ఆళ్లపల్లి, టేకులపల్లి, కొత్తగూడెం పరిధిలో అరెస్టు చేసి ఆయా పోలీసుస్టేషన్లకు తరలించారు. దీంతో జిల్లావ్యాప్తంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. లింగన్న సొంత మండలం గుండాలలో 144 సెక్షన్ విధించారు. అంత్యక్రియలకు సైతం ప్రజలు రాకుండా పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారని ఎన్డీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రీపోస్టుమార్టంపై హైకోర్టులో పిటిషన్.. కొత్తగూడెం ఏరియా ఆస్పత్రిలో లింగన్న మృతదేహాన్ని పోస్టుమార్టం చేసి కుటుంబసభ్యులకు అప్పగించేందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే లింగన్నను పట్టుకుని కాల్చిచంపారని ఆరోపిస్తున్న పార్టీ, పౌరహక్కుల సంఘం నాయకులు మాత్రం సిట్టింగ్ జడ్జి సమక్షంలో పోస్టుమార్టం చేయించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు ఆదేశాల కోసం సాయంత్రం వరకు ఉత్కంఠగా ఎదురుచూడాల్సి వచ్చింది. సాయంత్రం హైకోర్టు తీర్పు రావడంతో రీపోస్టుమార్టం కోసం లింగన్న మృతదేహాన్ని హైదరాబాద్ తరలించాల్సి వచ్చింది. హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో మెడికల్ బోర్టు సీనియర్ అధికారులతో పోస్టుమార్టం చేయించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించాలని సూచించింది. పోస్టుమార్టం నివేదికను సీల్డ్కవర్లో ఇవ్వాలని ఆదేశించింది. ఎన్కౌంటర్ పూర్తి వివరాలపై 5వ తేదీ నాటికి కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా గుండాలలో అంత్యక్రియల కోసం వివిధ ప్రాంతాలకు చెందిన వారు వస్తుండడంతో పోలీసులు భారీగా మోహరించారు. జిల్లాలో అడుగడుగునా పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. దీంతో ఇల్లెందు డివిజన్లో ఉద్రిక్తత నెలకొంది. అదేవిధంగా ఎక్కడి నాయకులను అక్కడే అరెస్టు చేసి కొత్తగూడెం ఆస్పత్రికి సైతం రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు పోలీసులు జిల్లా ఏజెన్సీ మొత్తం జల్లెడ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే టెన్షన్ వాతావరణం నెలకొంది. -
లింగన్న రీ పోస్టుమార్టం పూర్తి
సాక్షి, హైదరాబాద్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన న్యూ డెమోక్రసీ నాయకులు లింగన్న మృతదేహానికి శుక్రవారం గాంధీ ఆస్పత్రిలో రీ పోస్టుమార్టం జరిగింది. హైకోర్టు ఆదేశాలతో.. గాంధీ సూపరింటెండెంట్ శ్రవణ్ ఆధ్వర్యంలో ముగ్గురు సీనియర్ వైద్యులు లింగన్న మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ ప్రక్రియను అధికారులు వీడియో తీశారు. అనంతరం భారీ బందోబస్తు మధ్య లింగన్న మృతదేహాన్ని స్వస్థలానికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందుకు సంబంధించిన రిపోర్ట్‌ను అధికారులు 5వ తేదీన సీల్డ్ కవర్లో కోర్టులో సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో లింగన్న కుమారుడు హరి సాక్షి టీవీతో మాట్లాడుతూ.. తన తండ్రిది బూటకపు ఎన్కౌంటర్ అని ఆరోపించారు. తన తండ్రిని అక్రమంగా అరెస్ట్ చేసి.. ఆ తర్వాత కాల్చి చంపారని చెప్పుకొచ్చారు. తన తండ్రిని పోలీసులు చిత్రహింసలకు గురిచేశారని విమర్శించారు. కుటుంబ సభ్యులకు చెప్పకుండానే తన తండ్రి మృతదేహానికి ఖమ్మంలో పోస్టుమార్టం నిర్వహించారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తన తండ్రి వద్ద ఎటువంటి ఆయుధాలు లేవని స్పష్టం చేశారు. కాగా, లింగన్న ఎన్కౌంటర్ బూటకమని ఆరోపిస్తూ ప్రజా సంఘాల నేతల పలుచోట్ల ఆందోళనకు దిగారు. లింగన్న మృతిపై రాష్ట్ర పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ హైకోర్టులో అత్యవసర ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం లింగన్న మృతదేహానికి రీ పోస్టుమార్టం నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో లింగన్న మృతదేహాన్ని కొత్తగూడెం నుంచి ఈ రోజు తెల్లవారు జామున 4 గంటలకు గాంధీ ఆస్పత్రికి తీసుకువచ్చారు. లింగన్న రీ పోస్టుమార్టం నివేదికను అధికారులు 5వ తేదీన కోర్టుకు సమర్పించనున్నారు. గాంధీ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత.. లింగన్న రీ పోస్టుమార్టం నేపథ్యంలో గాంధీ ఆస్పత్రి పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గాంధీ ఆస్పత్రి వద్ద నిరసన చేపట్టిన ఆందోళనకారుల్ని పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. అలాగే లింగన్న మృతదేహాన్ని చూడటానికి గాంధీ ఆస్పత్రికి వచ్చిన న్యూడెమోక్రసీ నాయకులు ప్రదీప్, అరుణలను పోలీసులు అడ్డుకున్నారు. వారిని అరెస్ట్ చేసి నారాయణగూడ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. విమలక్క, సంధ్య అరెస్ట్.. లింగన్న మృతదేహాన్ని చూసేందుకు గాంధీ ఆస్పత్రి వద్దకు చేరుకున్న పివోడబ్ల్యూ అధ్యక్షురాలు సంధ్యను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, సంధ్యకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కొద్ది సేపటికి సంధ్యను అరెస్ట్ చేసిన పోలీసులు ఆమెను బొల్లారం పోలీసు స్టేషన్‌కు తరలించారు. అలాగే గాంధీ ఆస్పత్రి వద్దకు చేరుకున్న విమలక్కను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
అడవిలో అలజడి
-
ముమ్మాటికీ బూటకమే..
సాక్షి, ఖమ్మం(ఇల్లెందు) : తూటాల మోత, ఎన్కౌంటర్ ఘటనతో మన్యం ప్రజలు ఉలిక్కిపడ్డారు. అడవిలో అలజడి అలుముకుంది. ఒక వైపు మావోయిస్టు వారోత్సవాలు, మరొక వైపు సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి లింగన్న ఎన్‌కౌంటర్‌తో గుండాల ఏజెన్సీ ఉలిక్కిపడింది. గుండాల మండలం రోళ్లగడ్డ అటవీ ప్రాంతంలోని పందిగుట్ట మీద జరిగిన ఎదురు కాల్పుల్లో గుండాల మండలం రోళ్లగడ్డ గ్రామానికి చెందిన పూనెం లింగయ్య, అలియాస్ లింగన్న(50) మృతి చెందాడు. 22 ఏళ్ల క్రితం అజ్ఞాత వాసంలోకి వెళ్లిన లింగన్న 2017 డిసెంబర్లో వైద్యం కోసం ఖమ్మం వెళ్లి వస్తూ రఘునాథపాలెం వద్ద అరెస్టు అయ్యాడు. జైలుకు వెళ్లి విడుదలైన అనంతరం 6 నెలల పాటు గుండాలలోని ఇంటి వద్ద ఉన్న లింగన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ముందు మళ్లీ అటవీ బాట పట్టాడు. ఆ తర్వాత గుండాల ఎంపీపీని, జెడ్పీటీసీని కైవసం చేసుకుని ఉనికి కాపాడుకున్నారు. ఇటీవల కాలంలో మావోయిస్టులు ఏజెన్సీలోకి అడుగు పెట్టినట్లు పసిగట్టిన పోలీసులు కూంబింగ్‌ను ఉధృతం చేశారు. మావోయిస్టు అమరవీరుల వారోత్సవాల నేపథ్యంలో గ్రేహౌండ్స్ బలగాలను మోహరింపజేసి కూంబింగ్‌ను చేపట్టారు. ఈ క్రమంలో రోళ్లగడ్డ పందిగుట్ట మీద జరిగిన ఎన్కౌంటర్లో అంతమయ్యాడు. అజ్ఞాతంలోకి వెళ్లిన నేపథ్యం ఇదే.. 1996–97లో ఎన్డీకి, పీపీజీ శంకరన్నకు మధ్య తారాస్థాయిలో యుద్ధం జరిగింది. ఈ ఘర్షణ క్రమంలో గుండాల మండలంలోని లింగగూడెం, దేవాళ్లగూడెం, రోళ్లగడ్డ వద్ద పలు దఫాలు క్రాస్ఫైరింగ్లు జరిగి ఇరు వర్గాలు దళసభ్యులను కోల్పోయాయి. ఈ క్రమంలో గుండాల మండలంలోని రోళ్లగడ్డ, దేవాళ్లగూడెం, లింగగూడెం, చీమలగూడెం, నర్సాపురం తండాలకు చెందిన పలువురు ముఖ్య నేతలు అడవిబాట పట్టారు. అందులో లింగన్న సైతం అజ్ఞాతంలోకి వెళ్లాడు. లీగల్ కార్యకర్తగా పీవైఎల్‌లో పని చేసిన లింగన్న గ్రామస్థాయి నుంచి మండల స్థాయికి ఎదిగాడు. రెండు పార్టీల మధ్య ఘర్షణలో ఇల్లీగల్‌గా మారి దళసభ్యుడు నుంచి జిల్లా కార్యదర్శి, రాష్ట్ర కమిటీ సభ్యుడు స్థాయికి ఎదిగాడు. గతేడాది క్రితం ఎన్డీ చంద్రన్న వర్గంలోకి వెళ్లిన ఆయన రెండు రోజుల తర్వాత పార్టీ, కుటుంబ సభ్యుల ఒత్తిడికి తలొగ్గి తిరిగి ఎన్డీ రాయల వర్గంలో చేరాడు. అయితే ఆనాడు అజ్ఞాతం వీడే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరిగింది. పోలీసులు కూడా పలు దఫాలు లింగన్నను పట్టుకునేందుకు అదును కోసం ఎదురు చూశారు. ఈ క్రమంలో వైద్యం కోసం వెళ్లిన లింగన్నను ఎస్ఐ గోపి రఘునాధపాలెం వద్ద వల పన్ని పట్టుకున్నారు. 2012 నుంచి నష్టం ఆరంభం.. 2012లో న్యూడెమోక్రసీలో చీలిక సంభవించింది. నాటి నుంచి ఆ పార్టీ కోలుకోలేనంత నష్టపోతోంది. సుధీర్ఘకాలం అజ్ఞాత జీవితంలో ఉన్న అగ్రనేతలు అరెస్టులు అవుతుండడంతో శ్రేణుల్లో అయోమయం వ్యక్తమవుతోంది. ఒకానొక దశలో ఆ పార్టీలోని దిగువ శ్రేణి నేతలు సైతం అరెస్టులను చూసి విస్తుపోతున్నారు. ఖమ్మం–వరంగల్ ఏరియా పరిధిలోని అజ్ఞాత ఉద్యమం ఒడిదొడుకులకు గురవుతోంది. కుటుంబ వివరాలు.. 22 ఏళ్ల క్రితం అడవి బాట పట్టిన లింగన్నకు భార్య సారమ్మ, కుమారుడు హరినాథ్, కూతురు హైమావతిలు ఉన్నారు. లింగన్న అటవీ బాట పట్టిన తర్వాత 15 ఏళ్ల క్రితం గుండాల గిరిజన గురుకుల పాఠశాలలో వంట వర్కర్‌గా సారమ్మ చేరింది. నాటి నుంచి నేటి వరకు గుండాల గురుకులం వద్ద మటంలంక గ్రామంలో ఓ ఇల్లు ఏర్పాటు చేసుకుని అక్కడే నివసిస్తోంది. సుధీర్ఘ కాలం ఉద్యమ నేతగా ఉన్న లింగన్న ప్రస్థానం ఈ ఎన్‌కౌంటర్‌తో ముగిసింది. కాచనపల్లి పోలీస్ స్టేషన్లో 35మంది నిర్బంధం.. ఎన్కౌంటర్ వార్త తెలిసిన వెంటనే సీపీఐ (ఎంఎల్)న్యూడెమోక్రసీ పార్టీ నాయకురాలు, జెడ్పీటీసీ చండ్ర అరుణ ఆధ్వర్యంలో 35మంది మూడు వాహనాల్లో గుండాలకు వెళ్తుండగా కాచనపల్లి వద్ద పోలీసులు అటకాయించి అదుపులోకి తీసుకున్నారు. వారందరినీ అరెస్టు చేసిస్టేషన్లో నిర్బంధించారు. ఈ సంఘటనను పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ముమ్మాటికీ బూటకమే.. గుండాల మండలంలో జరిగిన ఎన్కౌంటర్ కచ్చితంగా బూటకమే. అనారోగ్యంతో బాధపడుతున్న లింగన్నను పోలీసులు పట్టుకుని హతమార్చి ఎన్కౌంటర్ కథ అల్లారు. ప్రజా ఉద్యమాల కోసం జీవితాన్ని ధారపోసిన లింగన్న సేవలు ఎనలేనివి. గుండాల, ఇల్లెందు, టేకులపల్లి, బయ్యారం, పాఖాల కొత్తగూడెం మండలాల్లో లింగన్న ఆధ్వర్యంలో వేలాది ఎకరాల పోడు భూములు సాగు చేసుకుని ప్రజలు జీవిస్తున్నారు. అనేక ప్రజా పోరాటాల్లో లింగన్న పాత్ర ఉంది. – మధు, ఎన్డీ రాష్ట్ర నేత, చండ్ర అరుణ, జెడ్పీటీసీ -
ఎన్డీ నేత లింగన్న హతం
సాక్షి, ఖమ్మం(గుండాల) : అప్పుడే తెల్ల వారింది.. రైతన్నలు చేను చెలకల్లోకి పయనమవుతున్నారు.. ఒక్కసారిగా అటవీ ప్రాంతం నుంచి తుపాకుల మోత.. దీంతో భయాందోళనకు గురై ఉరుకులు పరుగులు పెట్టారు.. తేరుకునే సరికి పోలీసులకు, ఎన్డీ దళాల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయనే విషయం దావానలంలా వ్యాపించింది. ఈ కాల్పుల్లో న్యూడెమోక్రసీ అజ్ఞాత దళాల నేత, రీజినల్ కార్యదర్శి పూనెం లింగయ్య(50) అలియాస్ లింగన్న మృతి చెందాడు. మరో నేత గోపన్నతో సహా ముగ్గురు సభ్యులు తప్పించుకున్నారు. ఇంకో ఇద్దరు పోలీసుల అదుపులో నుంచి తప్పించుకున్నారు. క్రమంగా చుట్టుపక్కల జనం సంఘటన స్థలానికి చేరుకున్నారు. లింగన్న మృతదేహాన్ని మార్గం తప్పించి తరలిస్తుండగా జనం వెంటపడ్డారు. పోలీసులపై రాళ్లు విసిరారు. దీంతో పోలీసులు సుమారు 40 రౌండ్ల వరకు గాలిలోకి కాల్పులు జరిపారు. పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ సంఘటన మండలంలోని దేవళ్లగూడెం రోళ్లగడ్డ మధ్య బుధవారం చోటుచేసుకుంది. పది రోజులుగా కూంబింగ్.. జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు మావోయిస్టు వారోత్సవాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గత వారం పది రోజులుగా మండల సరిహద్దు ప్రాంతాల్లో కూంబింగ్ ముమ్మరంగా కొనసాగుతోంది. అప్పటికే పోలీసుల టార్గెట్‌గా ఉన్న లింగన్న, ఆయన ఆరుగురు దళ సభ్యు లు రోళ్లగడ్డ సమీపంలోని పందిగుట్టపై ఉన్నట్లు సమాచారం. దీంతో పక్కా ప్రణాళికతో గ్రేహౌండ్స్ బలగాలు సుమారు మంగళవారం రాత్రికే ఆ అటవీ ప్రాంతంలో మోహరించారు. బుధవారం తెల్లవారు జామున పోలీసులు లింగన్న, దళ సభ్యుల స్థావరాల వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో ఎదురుకాల్పులు జరిగాయి. లింగన్న మృతి.. తప్పించుకున్న దళ సభ్యులు పోలీసులకు, దళానికి మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో లింగన్న మృతి చెందగా దళంలో ఉన్న బయ్యారం దళకమాండర్ గోపన్నతో పాటు మరో ఐదుగురు తప్పించుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరు దళ సభ్యులు దేవళ్లగూడెం–రోళ్లగడ్డ మధ్య తుపాకులతో పారిపోతుండగా అదుపులోకి తీసుకుని సంఘటన స్థలానికి తీసుకెళ్లినట్లు స్థానికుల సమాచారం. అయితే అప్పటికే లింగన్న మృతి చెందాడు. పందిగుట్ట వద్ద పడిగాపులు ఎదురుకాల్పులు జరిగిన సంఘటనా స్థలానికి ఏం జరిగిందోనని తెలుసుకునేందుకు చుట్టపక్క గ్రామాల ప్రజలు, పార్టీ నాయకులు సుమారు 300 మంది పైగా పందిగుట్ట ప్రాంతానికి చేరుకున్నారు. ఉదయం 9 గంటల ప్రాంతం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గుట్టపైకి పోలీసులు ఎవరినీ వెళ్లనివ్వలేదు. మీడియాను సైతం అడ్డుకున్నారు. అప్పటికే పోలీసులపై నినాదాలు చేశారు. చాలా సేపటి తర్వాత మీడియా, జనం కలసి గుట్టపైకి వెళ్లారు. స్థావరాల వద్ద అన్నం, కూరగాయలు, వాటర్ క్యాన్లు, తదితర సామగ్రి మాత్రమే ఉన్నాయి. గుట్టపై పోలీసులుగానీ, మృతదేహాలు గానీ లేవు. మరో దారిలో పోలీసులు మృతదేహా న్ని మోసుకెళ్తుండడాన్ని గమనించి జనం వెంటపడ్డారు. మృతదేహం అడ్డగింత...ఉద్రిక్తత సాధారణంగా ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలోనే మృతదేహాన్ని ఉంచి మీడియాకు చూపించి గ్రామస్తుల సహకారంతో మృతదేహాలను తీసుకెళ్తుంటారు. అలా జరగకుండా మరో మార్గంలో తరలిస్తుండగా వెంట పడుతూ ఉద్రేకానికి గురైన ప్రజలు పోలీసులపై రాళ్లు రువ్వారు. మృతదేహాన్ని వదిలి పోలీసులు కొద్ది దూరం వెళ్లారు. అప్పటికే ఇద్దరు పోలీసుల తలలు పగిలాయి. దీంతో ప్రతిఘటించిన పోలీసులు గాలిలో 18 విడతలుగా సుమారు 40 రౌండ్లకు పైగా కాల్పులు జరుపుతూనే జనాన్ని చెదరగొట్టారు. ఈ సంఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మీడియాపై సైతం పోలీసులు విరుచుకుపడ్డారు. మూడు దఫాలుగా కాల్పులు పందిగుట్ట ప్రాంతంలో కాల్పులు మూడు దఫాలు గా పది నిమిషాలకోసారి జరిగాయి. స్థావరంపై ఒకసారి, సభ్యులు పారిపోతుండగా, ఇద్దరు సభ్యులను అదుపులోకి తీసుకునప్పుడు మరోసారి కాల్పులు జరిగాయని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కనికరించలేదు గుండాల: నా భర్తను ఒక్కసారి చూద్దామని దగ్గరకు వెళితే.. పోలీసులు కనీసం కనికరం చూపించలేదంటూ లింగన్న భార్య కన్నీరు మున్నీరయింది. సంఘటనా ప్రాం తం నుంచి గుండాల వరకు మృతదేహాన్ని తీసుకొస్తుండగా క్షణంపాటు కూడా చూపించలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యుల రోదనలు స్థానికులను కంట తడి పెట్టించింది. ప్రతి ఒక్కరికీ లింగన్న సుపరిచితుడు కావడంతో బంధువులతో, పాటు చుట్టపక్కల గ్రామాల నుంచి జనం తండోపతండాలుగా తరలివచ్చారు. మృతదేహాన్ని ట్రాక్టర్ ద్వారా గుండాలకు తీసుకవచ్చి సుమోలో కొత్తగూడెం తరలించారు. ఇల్లెందు ఇన్చార్జి డీఎస్పీ ఎస్ఎం అలీ గుండాలకు చేరుకుని పరిస్థితిన సమీక్షించారు. కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రిలో లింగన్న మృతదేహం సింగరేణి(కొత్తగూడెం): సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ అజ్ఞాత దళనేత లింగన్న మృతదేహాన్ని పోలీసులు కొత్తగూడెంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి బుధవారం సాయంత్రం తీసుకువచ్చారు. డాక్టర్ల సమ్మె కారణంగా బుధవారం పోస్టుమార్టం నిర్వహించే అవకాశం లేకపోవడంతో మృతదేహాన్ని భద్రపరిచారు. గురువారం లింగన్న మృతదేహానికి ఇక్కడే పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశాలున్నాయి. కాగా ఆస్పత్రి వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మార్చురీ వద్ద గ్రేహౌండ్స్, సివిల్ పోలీసులను మోహరించారు. ఆందోళనకారులు ఆస్పత్రికి చేరుకుంటారనే సమాచారంతో వన్‌టౌన్ సీఐ కుమారస్వామి పర్యవేక్షణలో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. గాలింపు చేపడుతుండగా కాల్పులు జరిపారు కొత్తగూడెం: కూంబింగ్ చేపడుతున్న సమయంలో ఎదురైన నక్సల్స్ కాల్పులు జరపడంతో.. ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చిందని, ఈ కాల్పుల ఘటనలో ఒక నక్సలైట్ మృతిచెందగా, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకోగా వారు పారిపోయినట్లు జిల్లా ఎస్పీ సునీల్‌దత్ తెలిపారు. బుధవారం సాయంత్రం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సంఘటన స్థలంలో ఒక నక్సలైట్ మృతదేహాన్ని గుర్తించడంతోపాటు ఎస్ఎల్ఆర్ రైఫిల్, విప్లవ సాహిత్యం, కొంత సామగ్రిని స్వాధీనపరచుకున్నట్లు వివరించారు. పారిపోతున్న సాయుధులైన రామకృష్ణ, మహేష్ అనే నక్సలైట్లను అదుపులోకి తీసుకోగా.. నక్సల్స్ సానుభూతిపరులు వారిని అడ్డగించి, రాళ్లు రువ్వి, అపహరించుకుని పోయారని పేర్కొన్నారు. మృతిచెందిన నక్సలైట్‌ను పూనెం లింగయ్య అలియాస్ లింగన్నగా గుర్తించామని, ఇతను న్యూడెమోక్రసీ కార్యదర్శిగా పనిచేస్తున్నాడని, ఇతనిపై జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. కాల్పుల ఘటనలో మహబూబాబాద్ జిల్లా కొత్తగూడేనికి చెందిన స్టేట్ కమిటీ మెంబర్ ధనసరి సమ్మయ్య అలియాస్ గోపన్న, జిల్లా కమిటీ సభ్యుడు ఆరేం నారాయణ అలియాస్ నరేష్, అజ్ఞాత దళ సభ్యుడు నాగన్న ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. పోలీసులపై దాడి చేసిన నక్సల్స్ సానుభూతిపరులపై, పోలీసు కస్టడీలో ఉన్న ఇద్దరు నక్సల్స్‌ను అపహరించినందుకు గుండాల ఠాణాలో కేసులు నమోదు చేసినట్లు వివరించారు. -
ఎవరీ సాగర్..?
యదళ్లపల్లి విశ్వనాథం (ఆజాద్), కొమురం వెంకటేశ్వర్లు(గణేష్), ఆవునూరి నారాయణ స్వామి(మధు), దనసిరి సమ్మయ్య(గోపి), లింగన్న, ఏనుగుల చంద్రారెడ్డి్డ(సాగర్), ‘..........?’ వీరంతా ఎవరనేదేగా మీ ప్రశ్న..! ఇల్లెందు: భూమి కోసం.. భుక్తి కోసం.. భూస్వామ్య వ్యవస్థ నుంచి విముక్తి కోసం.. సమ సమాజ స్థాపన కోసం... ఇంటిని విడిచి, కుటుంబీకులను వదిలి, విప్లవ బాట పట్టిన ఒకప్పటి ఉడుకు రక్తపు యువకులే వీరంతా. ఆ తరువాతి రోజుల్లో న్యూడెమోక్రసీ నాయకులు. తుపాకులు చేబూని, జన రక్షణ పేరుతో అడవికి పయనమైన అజ్ఞాత దళాల అగ్ర నేతలు. వనంలో ఉన్నంత కాలం వీరు సురక్షితంగా ఉన్నారు..! జనంలోకి వచ్చిన తర్వాత పోలీసులకు దొరికిపోతున్నారు..!! వనం వదిలి.. జనంలోకి వచ్చి.. జైలుకెళుతున్నారు...!!! ‘‘అసలేం జరుగుతోంది..? న్యూడెమోక్రసీ (రాయల–చంద్రన్న) అజ్ఞాత అగ్ర నేతలంతా ఇలా ఒకరొక్కరుగా పోలీసులకు ఎలా పట్టుబడుతున్నారు..? ఇటీవలి కాలంలో మధు, గోపి, లింగన్న, సాగర్ వరుసగా పట్టుబడ్డారు. ‘..........’ ఈ ఖాళీలో చేరే తరువాతి నేత పేరేమిటి..?’’ న్యూడెమోక్రసీ శ్రేణులు, ద్వితీయ శ్రేణి నాయకులు, ఆ పార్టీలోని రెండు వర్గాలను అభిమానించే–ఆరాధించే సానుభూతిపరులు, అడవి బిడ్డలు.. అందరూ ఆవేదనాపూరిత స్వరంతో అడుగుతున్న ప్రశ్నలివి. వారిని కలవరపెడుతున్న సమాధానం లేని సందేహాలివి. మొన్న లింగన్న.. నిన్న సాగర్.. రేపు..? పోలీసులు మహా ఉత్సాహంతో ఉన్నారు. న్యూడెమోక్రసీ అజ్ఞాత దళ అగ్ర నేతల్లో ఒకరైన లింగన్నను మొన్న పట్టుకున్నారు. మరుసటి రోజున చంద్రన్న వర్గం రాష్ట్ర నాయకుడు ఏనుగుల చంద్రారెడ్డి అలియాస్ చంద్రం అలియాస్ సాగర్‌ను అరెస్ట్ చేశారు. ‘ఆ తరువాత ఎవరు..?’ పోలీసుల్లో ఉత్సుకతను, ఎన్డీ శ్రేణుల్లో కలవరపాటును కలిగిస్తున్న ప్రశ్న ఇది. ఎవరీ సాగర్..? ఏనుగుల చంద్రారెడ్డి అలియాస్ చంద్రం అలియాస్ సాగర్‌ది కూసుమంచి మండలం రాజుపేట గ్రామం. ఉన్నత విద్యావంతుడు. ఖమ్మంలో డిగ్రీ చదివారు. ఆ రోజుల్లోనే అలీగఢ్ యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ) చేశారు. అంతేకాదు.. పీజీలో గోల్డ్ మెడల్ కూడా సాధించారు. ఖమ్మంలో పీడీఎస్‌యూ నాయకుడిగా, కొత్తగూడెం–మణుగూరులో ఐఎఫ్టీయూ నాయకుడిగా పనిచేశారు. 17 ఏళ్ల క్రితం అడవి బాట (అజ్ఞాత వాసం) పట్టారు. లింగన్న–సాగర్ సమకాలికులే కాదు, ప్రాణ మిత్రులు కూడా. గుండాల దళానికి లింగన్న, ఆళ్లపల్లి దళానికి సాగర్ నేతలుగా పనిచేశారు. ఐదేళ్ల తర్వాత బయ్యారం ఏరియాకు సాగర్ వెళ్లారు. అక్కడ అశోక్ దళంతో కలిసి పనిచేశారు. కొన్నేళ్ల క్రితం చర్చల పేరుతో వీరిని మావోయిస్టులు పిలిచారు. అక్కడ వీరి నుంచి ఆయుధాలను లాక్కుని ఉత్త చేతులతో పంపించేశారు. విచిత్రంగా వీరిద్దరినీ ఒకే రోజున (ఈ నెల 7న) పోలీసులు పట్టుకున్నారు. మధ్యాహ్నం లింగన్నను, అర్థరాత్రి వేళ సాగర్‌ను అదుపులోకి తీసుకున్నారు. చిక్కిందెవరు..? మిగిలిందెవరు..? ఉమ్మడి ఖమ్మం–వరంగల్ జిల్లా ఏరియా(ఈ రెండు జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతం)లో న్యూడెమోక్రసీ(చందన్న–రాయల)కి దాదాపుగా 12 అజ్ఞాత దళాలు ఉన్నాయి. కీలక అజ్ఞాత–అగ్ర నేతలుగా ఆజాద్, గణేష్, సురేష్, ప్రతాప్, మధు, గోపి, లింగన్న, సాగర్, అశోక్ ఎదిగారు. వీరంతా ఇప్పుడు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో చూద్దాం. ఆజాద్: రాయల వర్గం జిల్లా నాయకుడైన ఈయన, మూడు నెలల కిందట బెయిల్‌పై విడుదలయ్యారు. మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లారు. గణేష్: రాయల వర్గం జిల్లా నాయకుడైన ఈయన బెయిల్‌పై బయటికొచ్చారు. పార్టీతో ఏమాత్రం సంబంధం లేకుండా ఇంటి వద్దనే ఉంటున్నారు. సురేష్: చంద్రన్న వర్గం జిల్లా నాయకుడైన ఈయన బెయిల్‌పై బయటికొచ్చారు. బూర్గంపాడు ఏరియాలో లీగల్‌గా పనిచేస్తున్నారు. ప్రతాప్: చంద్రన్న వర్గానికి చెందిన ఈయనను పోలీసులు నెల కిందట అరెస్ట్ చేశారు. ప్రస్తుతం జైలులో ఉన్నారు. మధు: న్యూడెమోక్రసీ రాయల వర్గం రాష్ట్ర నాయకుడైన ఈయన నెల కిందట బెయిల్‌పై బయటికొచ్చారు. ఇల్లెందు కేంద్రంగా లీగల్‌గా పనిచేస్తున్నారు. గోపి: రాయల వర్గం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, మహబూబాబాద్ జిల్లా కార్యదర్శిగా ఉన్నారు. గత నెల 30న పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం జైలులో ఉన్నారు. లింగన్న: రాయల వర్గం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి. ఈ నెల 7న మధ్యాహ్నం రఘునాథపాలెం వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. జైలులో ఉన్నారు. సాగర్: చంద్రన్న వర్గం రాష్ట్ర కమిటీ సభ్యుడు. 7వ తేదీ అర్ధరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జైలులో ఉన్నారు. అశోక్: చంద్రన్న వర్గం దళ నేత. ఖమ్మం–వరంగల్ ఏరియా కార్యదర్శిగా ఉన్నారు. పైన తెలిపిన అందరిలోకి ఈయనే సీనియర్. పోలీ సుల ‘వాంటెడ్ లిస్ట్’లో అశోక్‌తోపాటు, ఇతని దళ సభ్యుడైన మోరే రవి కూడా ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. అసలేం జరుగుతోంది..? న్యూడెమోక్రసీలో అసలేం జరుగుతోంది..? సుదీర్ఘ కాలంగా అజ్ఞాత జీవితం గడుపుతున్న ఆ పార్టీ నేతలు ఒకరొక్కరుగా ఎందుకు పోలీసులకు ‘చిక్కుతున్నారు’? ఏజెన్సీలో, జిల్లా రాజకీయాల్లో ప్రస్తుతం ఇది ఆసక్తికర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు అరెస్టయిన వారంతా ‘అనారోగ్యం’తో బాధపడుతున్నవారే(నట). వైద్యం కోసం వనం నుంచి జనంలోకి (ఆస్పత్రికి) వస్తున్నారు. అరెస్టవుతున్నారు. దశాబ్దాల కాలంగా అజ్ఞాత వాసం గడుపుతున్న అనేకమంది అజ్ఞాత నాయకుల్లో కొందరైనా వైద్యం కోసం గతంలో పట్టణాల్లోకి వచ్చి ఉంటారు. వైద్యం పూర్తయిన తరువాత తిరిగి అజ్ఞాతంలోకి వెళ్లి ఉంటారు. అప్పడెప్పుడూ అరెస్టులు జరగలేదు. ఇప్పుడు మాత్రమే జరుగుతున్నాయి. ఎందుకు? కీలక స్థాయిలోని అజ్ఞాత నాయకులు జనంలోకి రావడం అనివార్యమైనప్పుడు విప్లవ పార్టీ్టలు అనేక జాగ్రత్తలు తీసుకుంటాయి. నాడు తెలంగాణ సాయుధ పోరాటంలో జరిగింది, ఇప్పుడు మావోయిస్టు పార్టీలో జరుగుతున్నది ఇదే. మావోయిస్టు పార్టీ కీలక నేతలెవరూ (శ్రీరాముల శ్రీనివాస్ మినహా) గత కొన్నేళ్లుగా బయటికొచ్చి అరెస్టయింది లేదు. న్యూడెమోక్రసీ నాయకులు మాత్రమే ఇలా వరుసపెట్టి పోలీసులకు చిక్కుతున్నారు. దీనిని ఎలా భావించాలి..? పోలీసుల విజయంగానా..?! న్యూడెమోక్రసీ వైఫల్యంగానా..??!! ‘ఏకే’పై ‘గురి’..! తుపాకుల్లో శక్తివంతమైనది ఏకే–47. అశోక్ కూడా అంతే. న్యూడెమోక్రసీలోని అజ్ఞాత దళ నేతల్లో ఈయనే సీనియర్. బయ్యారం మండలం రామచంద్రాపురం గ్రామస్తుడు. ప్రస్తుతం చంద్రన్న వర్గంలో ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లా ఏరియా కార్యదర్శిగా ఉన్న ఇతని అసలు పేరు వజ్జా పొట్టయ్య అలియాస్ అశోక్. పార్టీలోని సహచరులు పిలిచే పేరు మాత్రం.. ‘ఏకే’! బాల్యంలోనే విప్లవోద్యమ బాట పట్టిన ఇతని వయసు కూడా దాదాపుగా ‘47’ సంవత్సరాలు ఉంటాయి!! అత్యంత ‘శక్తివంత’ నాయకుడైన ఈ ‘ఏకే–47’పై మహబూబాబాద్ పోలీసులు గురి పెట్టారు. పాల్వంచ వద్ద ఓ రాజకీయ నాయకుడిని పట్టపగలు కొట్టి చంపిన కేసులో ప్రధాన నిందితుడైన మోరే రవి, ఈ ‘ఏకే’ దళంలోనే ఉన్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. పోలీసుల ‘వాంటెడ్’ జాబితాలో మోరే రవి పేరు ఉంది. -
మొన్న మధు.. నిన్న గోపి.. నేడు లింగన్న...
న్యూడెమోక్రసీ పార్టీ అజ్ఞాత దళ అగ్ర నేతలను పోలీసులు వరుసగా అరెస్ట్ చేస్తున్నారు. మావోయిస్టుల మాదిరిగా తుపాకులు చేబూని, అడవుల్లో దాక్కుని, అజ్ఞాతంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ దళాలపై పోలీసులు దృష్టి కేంద్రీకరించారు. ప్రధానంగా దళాల నేతలను అరెస్టు చేస్తున్నారు. మొన్న మధును, నిన్న గోపిని, నేడు లింగన్నను అరెస్ట్ చేశారు. ఈ జాబితాలో తరువాతి స్థానం ఎవరిదో..! గతంలో ఎన్నడూ లేనట్టుగా ఇటీవలి కాలంలో ఇలా వరుస అరెస్టులు ఎందుకో..?! న్యూడెమోక్రసీ శ్రేణుల్లో, సానుభూతిపరుల్లో, ప్రజల్లో వ్యక్తమవుతున్న సందేహాలివి. ఇల్లెందు: న్యూడెమోక్రసీ అజ్ఞాత దళాలకు చెందిన అగ్ర నేతల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ముఖ్య నాయకుల్లో ఇప్పటివరకు ఆవునూరి నారాయణ స్వామి (మధు), దనసరి సమ్మయ్య (గోపి), పూనెం లింగయ్య (లింగన్న)ను అరెస్ట్ చేశారు. ఏడాది క్రితం... న్యూడెమోక్రసీ రాయలవర్గానికి చెందిన అజ్ఞాత దళ నేతలు యదళ్లపల్లి విశ్వనాధం(ఆజాద్), కొమురం వెంకటేశ్వర్లు (గణేష్) అరెస్టయ్యారు. గుండాల మండలం బాటన్న నగర్ గ్రామం వద్ద గణేష్‌ను, ఇల్లెందు మండలం మాణిక్యారం గ్రామం వద్ద ఆజాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్డీ చంద్రన్న వర్గానికి చెందిన సురేష్, ప్రతాప్‌ను కూడా మాణిక్యారం వద్దనే అరెస్ట్ చేశారు. జులై 25న... మధును గార్లలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఉల్ఫా కేసులో జైలుకు పంపారు. నెల రోజుల క్రితమే బెయిల్‌పై బయటకు వచ్చారు. అప్పటి నుంచి ఇల్లెందు కేంద్రంగా లీగల్ కార్యకలాపాలు సాగిస్తున్నారు. నవంబర్ 30న... మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి దనసరి సమ్మయ్య (గోపి)ని నవంబర్ 30న మహబూబాబాద్‌లోని ఓ ఇంటిలో ఉన్నారన్న సమాచారంతో పోలీసులు వల పన్నారు. పట్టుకునేందుకు ప్రయత్నించారు. తప్పించుకుని ఆటోలో వెళుతుండగా అరెస్ట్ చేశారు. డిసెంబర్ 7న... రఘునాధపాలెం వద్ద గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో లింగన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. న్యూడెమోక్రసీ కీలక నాయకుల్లో ఇతను ఒకరు. 20 ఏళ్లుగా అజ్ఞాతంలోనే... గురువారం అరెస్టయిన లింగన్న, గత 20 ఏళ్లుగా అజ్ఞాత వాసంలో ఉన్నారు. 1997లో న్యూడెమోక్రసీకి, పీపీజీ శంకరన్నకు మధ్య తారాస్థాయిలో యుద్ధం జరిగింది. గుండాల మండలంలోని లింగగూడెం, దేవాళ్లగూడెం, రోళ్లగడ్డ వద్ద పలుమార్లు ఈ రెండు పార్టీలకు చెందిన దళాల మధ్య కాల్పులు (క్రాస్ ఫైరింగ్) జరిగాయి. ఇరువైపులా దళ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలోనే గుండాల మండలంలోని రోళ్లగడ్డ, దేవాళ్లగూడెం, లింగగూడెం, చీమలగూడెం, నర్సాపురం తండాలకు చెందిన కొందరు ఎన్డీ నాయకులు అడవి బాట (అజ్ఞాత వాసం) పట్టారు. వారిలో లింగన్న కూడా ఉన్నారు. అప్పుడు అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయన ఇప్పటివరకు బయటకు రాలేదు. ఎవరీ లింగన్న...? ఈయన స్వస్థలం.. గుండాల మండలం రోళ్లగడ్డ గ్రామం. పీవైఎల్‌లో లీగల్‌గా పనిచేశారు. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయికి, ఇల్లీగల్‌గా దళ సభ్యుడి నుంచి జిల్లా కార్యదర్శి స్థాయికి ఎదిగారు. ఇటీవల ఎన్డీ చంద్రన్న వర్గంలోకి వెళ్లారు. రెండు రోజుల తర్వా (పార్టీ, కుటుంబీకుల ఒత్తిడికి తలొగ్గి) తిరిగి ఎన్డీ రాయల వర్గంలోకి వచ్చారు. సుదీర్ఘ అజ్ఞాత వాసం నుంచి బయటికొస్తారని అప్పుడు ప్రచారం జరిగింది. పోలీసులు కూడా లింగన్నను పట్టుకునేందుకు అదును కోసం ఎదురుచూశారు. రఘునాధపాలెం వద్ద గురువారం అరెస్ట్ చేశారు. 2012 నుంచి కష్టకాలం... న్యూడెమోక్రసీ పార్టీకి 2012లో కష్ట–నష్ట కాలం మొదలైంది. ఈ సంవత్సరంలోనే ఆ పార్టీ రెండుగా (రాయల వర్గం–చంద్రన్న వర్గం) చీలింది. నాటి నుంచి ఆ పార్టీ కోలుకోలేనంతగా నష్టపోతోంది. సుదీర్ఘకాలంగా అజ్ఞాత జీవితంలో ఉన్న అగ్ర నేతలు ఒకరొక్కరుగా అరెస్టవుతుండడంతో ఆ పార్టీ దిగువ శ్రేణి నాయకుల్లో, కేడర్‌లో అయోమయం నెలకొంది. ఖమ్మం–వరంగల్ ఏరియా పరిధిలోని అజ్ఞాత ఉద్యమం ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది. అజ్ఞాతంలో మిగిలింది చోటా–మోటా నాయకులే... ఎన్డీ రాయల వర్గానికి చెందిన అజ్ఞాత నాయకుల్లో దాదాపుగా అందరూ అరెస్టయినట్టే. ఇక మిగిలింది చోటా–మోటా నాయకులే. బయ్యారం ఏరియాలో బండారి ఐలయ్య, ఇల్లెందు ఏరియాలో రమేషన్న, గుండాల ఏరియాలో శంకరన్న, చెట్టుపల్లి ఏరియాలో యాకన్న, ఆళ్లపల్లి–బంగారుచెల్క ఏరియాలో ఆజాద్ ఉన్నారు. అరెస్టయి, ఏడాది క్రితం విడుదలైన ఆజాద్.. తిరిగి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఎన్డీ వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన ప్రశ్న ఒక్కటే.. ‘‘మొన్న మధు, నిన్న గోపి, నేడు లింగన్న. ఈ జాబితాలో తరువాతి స్థానం ఎవరిది..? మున్ముందు ఇలా ఇంకెంతమంది..? అజ్ఞాత దళాలు మనుగడ సాగిస్తాయా..?’’. లింగన్నను కోర్టుకు అప్పగించాలి ఖమ్మంమయూరిసెంటర్: న్యూడెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి, రీజనల్ కమిటీ సభ్యుడు, అజ్ఞాత దళ నేత లింగన్నను రఘునాథపాలెం మండలంలోని ఎస్ఎన్.మూర్తి పాలిటెక్నిక్ కళాశాల వద్ద జిల్లా పోలీసులు అరెస్ట్ చేసినట్టు ఆ పార్టీ రాష్ట సహాయ కార్యదర్శి పోటు రంగారావు చెప్పారు. లింగన్నను వెంటనే మీడియా ముందు ప్రవేశపెట్టి, కోర్టుకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పూనెం లింగయ్య (లింగన్న వైద్యం కోసం ఖమ్మం వచ్చి వెళ్తుండగా, పక్కా సమాచారంతో నిఘా వేసి అరెస్ట్ చేశారని చెప్పారు. ఆదివాసీ గిరిజనుడైన లింగన్నది గుండాల మండలం రోళ్ళగడ్డ గ్రామమని, 1997లో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ప్రతిఘటన దళంలో సభ్యుడిగా చేరాడని చెప్పారు. గుండాల, ఇల్లెందు, టేకులపల్లి మండలాల్లో ఆదివాసీ భూమి, రైతాంగ సమస్యలపై అనేక పోరాటాలు సాగించాడని చెప్పారు. లింగన్నను మట్టుపెట్టేందుకు పోలీసులు అనేకసార్లు ప్రయత్నించారని చెప్పారు. వీటి నుంచి లింగన్న తప్పించుకుని ప్రజాపోరాటాలు సాగించాడని అన్నారు. ఆయన గత ఇరవయ్యేళ్లుగా అజ్ఞాత జీవితం గడుపుతున్నట్టు చెప్పారు. ‘‘ప్రభుత్వం, పోలీసుల తీరు చూస్తుంటే.. లింగన్నకు ప్రాణ హాని తలపెడతారేమోనని అనుమానంగా ఉంది’’ అని ఆయన భయాందోళన వ్యక్తం చేశారు. ‘‘లింగన్నకు ఎలాంటి హాని తలపెట్టవద్దు. కోర్టులో హాజరుపరచాలి’’ అని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వరరావు, నాయకులు ఆవుల వెంకటేశ్వర్లు, సీవై పుల్లయ్య, జి.రామయ్య, ఆవుల అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
తాగొచ్చి వేధిస్తున్నాడు..
తాగడానికి డబ్బులివ్వలేదని భార్యను ఓ ప్రబుద్ధుడు చితకబాదాడు. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కర్నూలు జిల్లా వలుగొండ మండల కేంద్రానికి చెందిన లింగన్న కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా మద్యానికి బానిసై భార్య హనుమంతమ్మ(38)ను వేధిస్తున్నాడు. తాగడానికి డబ్బులు ఇవ్వమని విచక్షణారహితంగా కొడుతుండటంతో.. ఆమె శుక్రవారం పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆటోలు ఢీకొని బాలుడి మృతి
కర్నూలు(పెద్దకడబూరు): పెద్దకడబూరు మండలానికి సమీపంలోని మఠమమ్మబండ వద్ద పెద్దకడబూరు-ఆధోని రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు ఆటోలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో లింగన్న(12) అనే ఏడో తరగతి విద్యార్థి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
భార్య పుట్టింటికి వెళ్లిందని ఆత్మహత్య
కల్యాణదుర్గం: కుటుంబకలహాలతో ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సోమవారం అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం మల్లాపురం గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన లింగన్న(40) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా, గత కొంతకాలంగా కుటుంబకలహాల నేపథ్యంలో లింగన్న భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య తిరిగి రాకపోవడంతో మనస్తాపం చెందిన లింగన్న ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.