సాక్షి, హైదరాబాద్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన న్యూ డెమోక్రసీ నాయకులు లింగన్న మృతదేహానికి శుక్రవారం గాంధీ ఆస్పత్రిలో రీ పోస్టుమార్టం జరిగింది. హైకోర్టు ఆదేశాలతో.. గాంధీ సూపరింటెండెంట్ శ్రవణ్ ఆధ్వర్యంలో ముగ్గురు సీనియర్ వైద్యులు లింగన్న మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ ప్రక్రియను అధికారులు వీడియో తీశారు. అనంతరం భారీ బందోబస్తు మధ్య లింగన్న మృతదేహాన్ని స్వస్థలానికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందుకు సంబంధించిన రిపోర్ట్‌ను అధికారులు 5వ తేదీన సీల్డ్ కవర్‌లో కోర్టులో సమర్పించనున్నారు.
ఈ నేపథ్యంలో లింగన్న కుమారుడు హరి సాక్షి టీవీతో మాట్లాడుతూ.. తన తండ్రిది బూటకపు ఎన్‌కౌంటర్ అని ఆరోపించారు. తన తండ్రిని అక్రమంగా అరెస్ట్ చేసి.. ఆ తర్వాత కాల్చి చంపారని చెప్పుకొచ్చారు. తన తండ్రిని పోలీసులు చిత్రహింసలకు గురిచేశారని విమర్శించారు. కుటుంబ సభ్యులకు చెప్పకుండానే తన తండ్రి మృతదేహానికి ఖమ్మంలో పోస్టుమార్టం నిర్వహించారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తన తండ్రి వద్ద ఎటువంటి ఆయుధాలు లేవని స్పష్టం చేశారు.
కాగా, లింగన్న ఎన్‌కౌంటర్ బూటకమని ఆరోపిస్తూ ప్రజా సంఘాల నేతల పలుచోట్ల ఆందోళనకు దిగారు. లింగన్న మృతిపై రాష్ట్ర పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ హైకోర్టులో అత్యవసర ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం లింగన్న మృతదేహానికి రీ పోస్టుమార్టం నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో లింగన్న మృతదేహాన్ని కొత్తగూడెం నుంచి ఈ రోజు తెల్లవారు జామున 4 గంటలకు గాంధీ ఆస్పత్రికి తీసుకువచ్చారు. లింగన్న రీ పోస్టుమార్టం నివేదికను అధికారులు 5వ తేదీన కోర్టుకు సమర్పించనున్నారు.
గాంధీ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత..
లింగన్న రీ పోస్టుమార్టం నేపథ్యంలో గాంధీ ఆస్పత్రి పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గాంధీ ఆస్పత్రి వద్ద నిరసన చేపట్టిన ఆందోళనకారుల్ని పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. అలాగే లింగన్న మృతదేహాన్ని చూడటానికి గాంధీ ఆస్పత్రికి వచ్చిన న్యూడెమోక్రసీ నాయకులు ప్రదీప్, అరుణలను పోలీసులు అడ్డుకున్నారు. వారిని అరెస్ట్ చేసి నారాయణగూడ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.
విమలక్క, సంధ్య అరెస్ట్..
లింగన్న మృతదేహాన్ని చూసేందుకు గాంధీ ఆస్పత్రి వద్దకు చేరుకున్న పివోడబ్ల్యూ అధ్యక్షురాలు సంధ్యను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, సంధ్యకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కొద్ది సేపటికి సంధ్యను అరెస్ట్ చేసిన పోలీసులు ఆమెను బొల్లారం పోలీసు స్టేషన్‌కు తరలించారు. అలాగే గాంధీ ఆస్పత్రి వద్దకు చేరుకున్న విమలక్కను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment