ఎవరీ సాగర్‌..? | New Democrats top leaders Incognito Force | Sakshi
Sakshi News home page

ఎవరీ సాగర్‌..?

Published Sun, Dec 10 2017 12:22 PM | Last Updated on Wed, Oct 17 2018 3:43 PM

New Democrats top leaders  Incognito Force - Sakshi

యదళ్లపల్లి విశ్వనాథం (ఆజాద్‌), 
కొమురం వెంకటేశ్వర్లు(గణేష్‌), 
ఆవునూరి నారాయణ స్వామి(మధు), 
దనసిరి సమ్మయ్య(గోపి), 
లింగన్న, 
ఏనుగుల చంద్రారెడ్డి్డ(సాగర్‌), 
‘..........?’
వీరంతా ఎవరనేదేగా మీ ప్రశ్న..! 

ఇల్లెందు:  
భూమి కోసం.. భుక్తి కోసం.. 
భూస్వామ్య వ్యవస్థ నుంచి విముక్తి కోసం.. 
సమ సమాజ స్థాపన కోసం... 

ఇంటిని విడిచి, కుటుంబీకులను వదిలి, విప్లవ బాట పట్టిన ఒకప్పటి ఉడుకు రక్తపు యువకులే వీరంతా. ఆ తరువాతి రోజుల్లో న్యూడెమోక్రసీ నాయకులు. తుపాకులు చేబూని, జన రక్షణ పేరుతో అడవికి పయనమైన అజ్ఞాత దళాల అగ్ర నేతలు.

వనంలో ఉన్నంత కాలం
వీరు సురక్షితంగా ఉన్నారు..!
జనంలోకి వచ్చిన తర్వాత
పోలీసులకు దొరికిపోతున్నారు..!! 
వనం వదిలి.. జనంలోకి వచ్చి.. 
జైలుకెళుతున్నారు...!!! 

‘‘అసలేం జరుగుతోంది..? న్యూడెమోక్రసీ (రాయల–చంద్రన్న) అజ్ఞాత అగ్ర నేతలంతా ఇలా ఒకరొక్కరుగా పోలీసులకు ఎలా పట్టుబడుతున్నారు..? ఇటీవలి కాలంలో మధు, గోపి, లింగన్న, సాగర్‌ వరుసగా పట్టుబడ్డారు. ‘..........’

ఈ ఖాళీలో చేరే తరువాతి నేత పేరేమిటి..?’’ 
న్యూడెమోక్రసీ శ్రేణులు, ద్వితీయ శ్రేణి నాయకులు, ఆ పార్టీలోని రెండు వర్గాలను అభిమానించే–ఆరాధించే సానుభూతిపరులు, అడవి బిడ్డలు.. అందరూ ఆవేదనాపూరిత స్వరంతో అడుగుతున్న ప్రశ్నలివి. వారిని కలవరపెడుతున్న సమాధానం లేని సందేహాలివి.

మొన్న లింగన్న.. నిన్న సాగర్‌.. రేపు..? 
పోలీసులు మహా ఉత్సాహంతో ఉన్నారు. న్యూడెమోక్రసీ అజ్ఞాత దళ అగ్ర నేతల్లో ఒకరైన లింగన్నను మొన్న పట్టుకున్నారు. మరుసటి రోజున చంద్రన్న వర్గం రాష్ట్ర నాయకుడు ఏనుగుల చంద్రారెడ్డి అలియాస్‌ చంద్రం అలియాస్‌ సాగర్‌ను అరెస్ట్‌ చేశారు. ‘ఆ తరువాత ఎవరు..?’ పోలీసుల్లో ఉత్సుకతను, ఎన్డీ శ్రేణుల్లో కలవరపాటును కలిగిస్తున్న ప్రశ్న ఇది. 

ఎవరీ సాగర్‌..? 
ఏనుగుల చంద్రారెడ్డి అలియాస్‌ చంద్రం అలియాస్‌ సాగర్‌ది కూసుమంచి మండలం రాజుపేట గ్రామం. ఉన్నత విద్యావంతుడు. ఖమ్మంలో డిగ్రీ చదివారు. ఆ రోజుల్లోనే అలీగఢ్‌ యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ (పీజీ) చేశారు. అంతేకాదు.. పీజీలో గోల్డ్‌ మెడల్‌ కూడా సాధించారు. ఖమ్మంలో పీడీఎస్‌యూ నాయకుడిగా, కొత్తగూడెం–మణుగూరులో ఐఎఫ్‌టీయూ నాయకుడిగా పనిచేశారు. 17 ఏళ్ల క్రితం అడవి బాట (అజ్ఞాత వాసం) పట్టారు. లింగన్న–సాగర్‌ సమకాలికులే కాదు, ప్రాణ మిత్రులు కూడా. 

గుండాల దళానికి లింగన్న, ఆళ్లపల్లి దళానికి సాగర్‌ నేతలుగా పనిచేశారు. ఐదేళ్ల తర్వాత బయ్యారం ఏరియాకు సాగర్‌ వెళ్లారు. అక్కడ అశోక్‌ దళంతో కలిసి పనిచేశారు. కొన్నేళ్ల క్రితం చర్చల పేరుతో వీరిని మావోయిస్టులు పిలిచారు. అక్కడ వీరి నుంచి ఆయుధాలను లాక్కుని ఉత్త చేతులతో పంపించేశారు. విచిత్రంగా వీరిద్దరినీ ఒకే రోజున (ఈ నెల 7న) పోలీసులు పట్టుకున్నారు. మధ్యాహ్నం లింగన్నను, అర్థరాత్రి వేళ సాగర్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

చిక్కిందెవరు..? మిగిలిందెవరు..? 
ఉమ్మడి ఖమ్మం–వరంగల్‌ జిల్లా ఏరియా(ఈ రెండు జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతం)లో న్యూడెమోక్రసీ(చందన్న–రాయల)కి దాదాపుగా 12 అజ్ఞాత దళాలు ఉన్నాయి. కీలక అజ్ఞాత–అగ్ర నేతలుగా ఆజాద్, గణేష్, సురేష్, ప్రతాప్, మధు, గోపి, లింగన్న, సాగర్, అశోక్‌ ఎదిగారు. వీరంతా ఇప్పుడు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో చూద్దాం. 

ఆజాద్‌: రాయల వర్గం జిల్లా నాయకుడైన ఈయన, మూడు నెలల కిందట బెయిల్‌పై విడుదలయ్యారు. మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లారు. 

గణేష్‌: రాయల వర్గం జిల్లా నాయకుడైన ఈయన బెయిల్‌పై బయటికొచ్చారు. పార్టీతో ఏమాత్రం సంబంధం లేకుండా ఇంటి వద్దనే ఉంటున్నారు. 

సురేష్‌: చంద్రన్న వర్గం జిల్లా నాయకుడైన ఈయన బెయిల్‌పై బయటికొచ్చారు. బూర్గంపాడు ఏరియాలో లీగల్‌గా పనిచేస్తున్నారు. 

ప్రతాప్‌: చంద్రన్న వర్గానికి చెందిన ఈయనను పోలీసులు నెల కిందట అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం జైలులో ఉన్నారు. 

మధు: న్యూడెమోక్రసీ రాయల వర్గం రాష్ట్ర నాయకుడైన ఈయన నెల కిందట బెయిల్‌పై బయటికొచ్చారు. ఇల్లెందు కేంద్రంగా లీగల్‌గా పనిచేస్తున్నారు.

 గోపి: రాయల వర్గం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, మహబూబాబాద్‌ జిల్లా కార్యదర్శిగా ఉన్నారు. గత నెల 30న పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం జైలులో ఉన్నారు. 

లింగన్న: రాయల వర్గం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి. ఈ నెల 7న మధ్యాహ్నం రఘునాథపాలెం వద్ద పోలీసులు అరెస్ట్‌ చేశారు. జైలులో ఉన్నారు. 

సాగర్‌: చంద్రన్న వర్గం రాష్ట్ర కమిటీ సభ్యుడు. 7వ తేదీ అర్ధరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జైలులో ఉన్నారు. 

అశోక్‌: చంద్రన్న వర్గం దళ నేత. ఖమ్మం–వరంగల్‌ ఏరియా కార్యదర్శిగా ఉన్నారు. పైన తెలిపిన అందరిలోకి ఈయనే సీనియర్‌. పోలీ సుల ‘వాంటెడ్‌ లిస్ట్‌’లో అశోక్‌తోపాటు, ఇతని దళ సభ్యుడైన మోరే రవి కూడా ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. 

అసలేం జరుగుతోంది..? 
న్యూడెమోక్రసీలో అసలేం జరుగుతోంది..? సుదీర్ఘ కాలంగా అజ్ఞాత జీవితం గడుపుతున్న ఆ పార్టీ నేతలు ఒకరొక్కరుగా ఎందుకు పోలీసులకు ‘చిక్కుతున్నారు’? ఏజెన్సీలో, జిల్లా రాజకీయాల్లో ప్రస్తుతం ఇది ఆసక్తికర చర్చనీయాంశంగా మారింది.  ఇప్పటివరకు అరెస్టయిన వారంతా ‘అనారోగ్యం’తో బాధపడుతున్నవారే(నట). వైద్యం కోసం వనం నుంచి జనంలోకి (ఆస్పత్రికి) వస్తున్నారు. అరెస్టవుతున్నారు. దశాబ్దాల కాలంగా అజ్ఞాత వాసం గడుపుతున్న అనేకమంది అజ్ఞాత నాయకుల్లో కొందరైనా వైద్యం కోసం గతంలో పట్టణాల్లోకి వచ్చి ఉంటారు. వైద్యం పూర్తయిన తరువాత తిరిగి అజ్ఞాతంలోకి వెళ్లి ఉంటారు. అప్పడెప్పుడూ అరెస్టులు జరగలేదు.

ఇప్పుడు మాత్రమే జరుగుతున్నాయి. ఎందుకు? 
కీలక స్థాయిలోని అజ్ఞాత నాయకులు జనంలోకి రావడం అనివార్యమైనప్పుడు విప్లవ పార్టీ్టలు అనేక జాగ్రత్తలు తీసుకుంటాయి. నాడు తెలంగాణ సాయుధ పోరాటంలో జరిగింది, ఇప్పుడు మావోయిస్టు పార్టీలో జరుగుతున్నది ఇదే. మావోయిస్టు పార్టీ కీలక నేతలెవరూ (శ్రీరాముల శ్రీనివాస్‌ మినహా) గత కొన్నేళ్లుగా బయటికొచ్చి అరెస్టయింది లేదు. న్యూడెమోక్రసీ నాయకులు మాత్రమే ఇలా వరుసపెట్టి పోలీసులకు చిక్కుతున్నారు. 

దీనిని ఎలా భావించాలి..? 
పోలీసుల విజయంగానా..?! 
న్యూడెమోక్రసీ వైఫల్యంగానా..??!!

‘ఏకే’పై ‘గురి’..! 
తుపాకుల్లో శక్తివంతమైనది ఏకే–47. అశోక్‌ కూడా అంతే. న్యూడెమోక్రసీలోని అజ్ఞాత దళ నేతల్లో ఈయనే సీనియర్‌. బయ్యారం మండలం రామచంద్రాపురం గ్రామస్తుడు. ప్రస్తుతం చంద్రన్న వర్గంలో ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌ జిల్లా ఏరియా కార్యదర్శిగా ఉన్న ఇతని అసలు పేరు వజ్జా పొట్టయ్య అలియాస్‌ అశోక్‌. పార్టీలోని సహచరులు పిలిచే పేరు మాత్రం.. ‘ఏకే’! బాల్యంలోనే విప్లవోద్యమ బాట పట్టిన ఇతని వయసు కూడా దాదాపుగా ‘47’ సంవత్సరాలు ఉంటాయి!! అత్యంత ‘శక్తివంత’ నాయకుడైన ఈ ‘ఏకే–47’పై మహబూబాబాద్‌ పోలీసులు గురి పెట్టారు. పాల్వంచ వద్ద ఓ రాజకీయ నాయకుడిని పట్టపగలు కొట్టి చంపిన కేసులో ప్రధాన నిందితుడైన మోరే రవి, ఈ ‘ఏకే’ దళంలోనే ఉన్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. పోలీసుల ‘వాంటెడ్‌’ జాబితాలో మోరే రవి పేరు ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement