ఆక్వా ఎగుమతుల్లో మీసం మెలేస్తున్న భారత్‌ | 4. 20 lakh hectares of Prawn Farming: Andhra pradesh | Sakshi
Sakshi News home page

ఆక్వా ఎగుమతుల్లో మీసం మెలేస్తున్న భారత్‌

Published Mon, Sep 9 2024 5:03 AM | Last Updated on Mon, Sep 9 2024 5:03 AM

4. 20 lakh hectares of Prawn Farming: Andhra pradesh

‘సాక్షి’తో కేంద్ర మత్స్య శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ సాగర్‌ మెహ్రా

4.20 లక్షల హెక్టార్లలో రొయ్యల సాగు 

2008లో 75 వేల టన్నులుండగా.. ప్రస్తుతం 10 లక్షల టన్నులకు చేరిక 

2022–23లో రూ.43,135 కోట్ల విలువైన రొయ్యల ఎగుమతి 

యూఎస్, చైనా సహా 132 దేశాలకు..

2023–24లో ఏపీ నుంచి రూ.19,420 కోట్ల సీఫుడ్‌ ఎగుమతులు 

2025 నాటికి దేశం నుంచి రూ.లక్ష కోట్ల ఎగుమతులు లక్ష్యం

సాక్షి, విశాఖపట్నం: ఎగుమతులను ప్రోత్సహించేలా ప్రభుత్వం తీసుకొచి్చన సంస్కరణలు.. మార్కెటింగ్‌ సౌకర్యాలు సత్ఫలితాలివ్వడంతో గడచిన పదేళ్లలో భారత్‌ నుంచి మీసం మెలేసేలా రొయ్యల ఎగుమతులు, ఉత్పత్తి దూసుకుపోతున్నాయని కేంద్ర మత్స్య శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ సాగర్‌ మెహ్రా అన్నారు. విశాఖలో జరిగిన మత్స్యశాఖ ఎగుమతుల ప్రోత్సాహ సదస్సుకు హాజరైన మెహ్రా ‘సాక్షి’తో పలు అంశాలపై మాట్లాడారు. 2023–24లో ఏపీ నుంచి ఏకంగా 19,420 కోట్ల సీఫుడ్‌ ఉత్పత్తుల ఎగుమతి జరిగిందనీ.. ఆక్వా ఉత్పత్తులు, ఎగుమతుల్లో దేశంలోనే ఏపీ టాప్‌లో ఉందని తెలిపారు. సాగర్‌ మెహ్రా.. ఇంకా ఏమన్నారంటే...  

4.20 లక్షల హెక్టార్లలో రొయ్యల సాగు 
దేశవ్యాప్తంగా 4.20 లక్షల హెక్టార్లలో రొయ్యల సాగు కొనసాగుతోంది. 12 సంవత్సరాల్లో సాగు రెట్టింపైంది. మరో 2.20 లక్షల హెక్టార్లలో సాగు చేసేందుకు అనువైన వాతావరణం దేశంలో ఉంది. 2008లో రొయ్యల ఉత్పత్తి 75 వేలు టన్నులుండగా.. 2022–23 సంవత్సరంలో 10 లక్షల టన్నులకు చేరుకుంది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం వల్లే ఈ ఫలితాలు సాధ్యమవుతున్నాయి. మన దేశ రొయ్యల కోసం వివిధ దేశాలు ఎదురుచూస్తున్నాయి. 2010–11లో కేవలం రూ.8,175 కోట్ల విలువైన రొయ్యల ఎగుమతులు జరగ్గా.. 2022–23 లో రూ.43,135 కోట్ల విలువైన ఎగుమతులు జరిగాయి. 2025 నాటికి దేశం నుంచి రూ.లక్ష కోట్ల ఎగుమతులు చేయాలని కేంద్ర మత్స్యశాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఆ దిశగా.. సీఫుడ్‌ పరిశ్రమలకు కావల్సిన ప్రోత్సాహకాలు అందిస్తున్నాం.  

132 దేశాలకు ఎగుమతులు 
భారత్‌ ఆక్వా ఉత్పత్తులకు విదేశాల్లో భారీగా డిమాండ్‌ ఉంది. భారత్‌ నుంచి 132 దేశాలకు సీఫుడ్‌ ఎగుమతులు జరుగుతున్నాయి. 2023–24లో 132 దేశాలకు రూ.60,523 కోట్ల సీఫుడ్‌ ఎగుమతులు జరిగాయి. గ్లోబల్‌ మార్కెట్‌లో 4 శాతం వాటాతో 6వ అతిపెద్ద ఎగుమతిదారుగా భారత్‌ నిలిచింది. మన దేశం నుంచి యూఎస్‌ఏకు 34.5 శాతం, చైనాకు 18.76, జపాన్‌కు 5.42, వియత్నాంకు 5.30, థాయ్‌లాండ్‌కు 3.82 శాతం ఎగుమతులు జరుగుతున్నాయి. ఇందులో ఫ్రోజెన్‌ ష్రింప్‌ వాటా 40 శాతం ఉంది.  

ఎగుమతుల్లో ఏపీ టాప్‌
సీఫుడ్, ఆక్వా ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్‌ అద్భుతంగా దూసుకుపోతోంది. దేశంలోనే టాప్‌ లో ఉంది. 2018–19 నాటికి 13,855 కోట్ల విలువైన ఉత్పత్తులు ఏపీ నుంచి ఎగుమతి అవ్వగా.. 2023–24 లో ఏపీ నుంచి రూ.19,420 కోట్ల విలువైన 3,47,927 మెట్రిక్‌ టన్నుల సీ సీఫుడ్‌ ఎగుమతి జరిగింది. మొత్తంగా అగ్రి ఎక్స్‌పోర్ట్స్‌లో ఆంధ్రప్రదేశ్‌ 31 శాతం వాటాతో అగ్రగామిగా ఉండగా.. తర్వాత స్థానాల్లో కేరళ 13, మహారాష్ట్ర 12, తమిళనాడు 11, గుజరాత్‌ 8.5 శాతంతో ఉన్నాయి. ప్రస్తుతం కొన్నిరకాల చేపలు మాత్రమే భారత్‌నుంచి ఎగుమతి అవుతున్నాయి. గ్లోబల్‌ మార్కెట్‌లో ఎన్నో రకాల చేపలకు డిమాండ్‌ ఉంది. వాటిని అందిపుచ్చుకుంటే.. అంతర్జాతీయ సీఫుడ్‌ మార్కెట్‌ని శాసించే స్థాయికి భారత్‌ చేరుకుంటుంది.  

సవాళ్లను అధిగమించేందుకు ప్రణాళికలు 
సీఫుడ్‌ ఎగుమతుల్లో ఎదురవుతున్న సవాళ్లని అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. మత్స్య సంపద ఉత్పత్తిలో యాంటీబయాటిక్స్‌ వినియోగం తగ్గిస్తున్నాం. వివిధ దేశాల్లో డిమాండ్‌కు అనుగుణంగా చేపలు, ఆక్వా ఉత్పత్తుల్ని ప్రోత్సహిస్తున్నాం. చైనా, వియత్నాం దేశాల తరహాలో ఆక్వా ఉత్పత్తుల్లో వైవిధ్యాన్ని ప్రోత్సహిస్తున్నాం. కోల్డ్‌ చైన్‌ సౌకర్యాలు, హైజనిక్‌ హ్యాండ్లింగ్‌.. ఇలా భిన్నమైన ప్రణాళికలు అమలు చేస్తూ అంతర్జాతీయ స్థాయిలో మత్స్య ఉత్పత్తుల ఎగుమతుల్లో భారత్‌ తిరుగులేని శక్తిగా ఎదిగేలా ప్రయత్నాలు ముమ్మరం చేశాం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement