Prawn farming
-
ఆక్వా ఎగుమతుల్లో మీసం మెలేస్తున్న భారత్
సాక్షి, విశాఖపట్నం: ఎగుమతులను ప్రోత్సహించేలా ప్రభుత్వం తీసుకొచి్చన సంస్కరణలు.. మార్కెటింగ్ సౌకర్యాలు సత్ఫలితాలివ్వడంతో గడచిన పదేళ్లలో భారత్ నుంచి మీసం మెలేసేలా రొయ్యల ఎగుమతులు, ఉత్పత్తి దూసుకుపోతున్నాయని కేంద్ర మత్స్య శాఖ జాయింట్ డైరెక్టర్ సాగర్ మెహ్రా అన్నారు. విశాఖలో జరిగిన మత్స్యశాఖ ఎగుమతుల ప్రోత్సాహ సదస్సుకు హాజరైన మెహ్రా ‘సాక్షి’తో పలు అంశాలపై మాట్లాడారు. 2023–24లో ఏపీ నుంచి ఏకంగా 19,420 కోట్ల సీఫుడ్ ఉత్పత్తుల ఎగుమతి జరిగిందనీ.. ఆక్వా ఉత్పత్తులు, ఎగుమతుల్లో దేశంలోనే ఏపీ టాప్‌లో ఉందని తెలిపారు. సాగర్ మెహ్రా.. ఇంకా ఏమన్నారంటే... 4.20 లక్షల హెక్టార్లలో రొయ్యల సాగు దేశవ్యాప్తంగా 4.20 లక్షల హెక్టార్లలో రొయ్యల సాగు కొనసాగుతోంది. 12 సంవత్సరాల్లో సాగు రెట్టింపైంది. మరో 2.20 లక్షల హెక్టార్లలో సాగు చేసేందుకు అనువైన వాతావరణం దేశంలో ఉంది. 2008లో రొయ్యల ఉత్పత్తి 75 వేలు టన్నులుండగా.. 2022–23 సంవత్సరంలో 10 లక్షల టన్నులకు చేరుకుంది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం వల్లే ఈ ఫలితాలు సాధ్యమవుతున్నాయి. మన దేశ రొయ్యల కోసం వివిధ దేశాలు ఎదురుచూస్తున్నాయి. 2010–11లో కేవలం రూ.8,175 కోట్ల విలువైన రొయ్యల ఎగుమతులు జరగ్గా.. 2022–23 లో రూ.43,135 కోట్ల విలువైన ఎగుమతులు జరిగాయి. 2025 నాటికి దేశం నుంచి రూ.లక్ష కోట్ల ఎగుమతులు చేయాలని కేంద్ర మత్స్యశాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఆ దిశగా.. సీఫుడ్ పరిశ్రమలకు కావల్సిన ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. 132 దేశాలకు ఎగుమతులు భారత్ ఆక్వా ఉత్పత్తులకు విదేశాల్లో భారీగా డిమాండ్ ఉంది. భారత్ నుంచి 132 దేశాలకు సీఫుడ్ ఎగుమతులు జరుగుతున్నాయి. 2023–24లో 132 దేశాలకు రూ.60,523 కోట్ల సీఫుడ్ ఎగుమతులు జరిగాయి. గ్లోబల్ మార్కెట్లో 4 శాతం వాటాతో 6వ అతిపెద్ద ఎగుమతిదారుగా భారత్ నిలిచింది. మన దేశం నుంచి యూఎస్ఏకు 34.5 శాతం, చైనాకు 18.76, జపాన్‌కు 5.42, వియత్నాంకు 5.30, థాయ్‌లాండ్‌కు 3.82 శాతం ఎగుమతులు జరుగుతున్నాయి. ఇందులో ఫ్రోజెన్ ష్రింప్ వాటా 40 శాతం ఉంది. ఎగుమతుల్లో ఏపీ టాప్సీఫుడ్, ఆక్వా ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా దూసుకుపోతోంది. దేశంలోనే టాప్ లో ఉంది. 2018–19 నాటికి 13,855 కోట్ల విలువైన ఉత్పత్తులు ఏపీ నుంచి ఎగుమతి అవ్వగా.. 2023–24 లో ఏపీ నుంచి రూ.19,420 కోట్ల విలువైన 3,47,927 మెట్రిక్ టన్నుల సీ సీఫుడ్ ఎగుమతి జరిగింది. మొత్తంగా అగ్రి ఎక్స్‌పోర్ట్స్‌లో ఆంధ్రప్రదేశ్ 31 శాతం వాటాతో అగ్రగామిగా ఉండగా.. తర్వాత స్థానాల్లో కేరళ 13, మహారాష్ట్ర 12, తమిళనాడు 11, గుజరాత్ 8.5 శాతంతో ఉన్నాయి. ప్రస్తుతం కొన్నిరకాల చేపలు మాత్రమే భారత్‌నుంచి ఎగుమతి అవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్లో ఎన్నో రకాల చేపలకు డిమాండ్ ఉంది. వాటిని అందిపుచ్చుకుంటే.. అంతర్జాతీయ సీఫుడ్ మార్కెట్‌ని శాసించే స్థాయికి భారత్ చేరుకుంటుంది. సవాళ్లను అధిగమించేందుకు ప్రణాళికలు సీఫుడ్ ఎగుమతుల్లో ఎదురవుతున్న సవాళ్లని అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. మత్స్య సంపద ఉత్పత్తిలో యాంటీబయాటిక్స్ వినియోగం తగ్గిస్తున్నాం. వివిధ దేశాల్లో డిమాండ్‌కు అనుగుణంగా చేపలు, ఆక్వా ఉత్పత్తుల్ని ప్రోత్సహిస్తున్నాం. చైనా, వియత్నాం దేశాల తరహాలో ఆక్వా ఉత్పత్తుల్లో వైవిధ్యాన్ని ప్రోత్సహిస్తున్నాం. కోల్డ్ చైన్ సౌకర్యాలు, హైజనిక్ హ్యాండ్లింగ్.. ఇలా భిన్నమైన ప్రణాళికలు అమలు చేస్తూ అంతర్జాతీయ స్థాయిలో మత్స్య ఉత్పత్తుల ఎగుమతుల్లో భారత్ తిరుగులేని శక్తిగా ఎదిగేలా ప్రయత్నాలు ముమ్మరం చేశాం. -
‘ఆక్వా’ సంక్షోభం తాత్కాలికమే
సాక్షి, రాజమహేంద్రవరం: ‘ఆక్వా సంక్షోభం అంతర్జాతీయ స్థాయిలో ఏర్పడిందని.. మరో రెండు నెలల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని.. సంక్షోభం నుంచి రైతులను గట్టెక్కించేందుకు ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు రొయ్యలు కొనుగోలు చేస్తామని సీఫుడ్స్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు అల్లూరి ఇంద్రకుమార్, రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్రావ్, అసోసియేషన్ నేతలు వెల్లడించారు. రాజమహేంద్రవరంలో గురువారం ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు తదితర జిల్లాలకు చెందిన రైతులు, ఎగుమతిదారుల సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో వారు మాట్లాడారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ఫలితంగా యూరోపియన్, చైనాల జీరో కోవిడ్ పాలసీ అమలు, అమెరికాలో వనామీ రొయ్యల నిల్వలు పెరిగిపోవడం లాంటి పరిణామాలతో ఆక్వా రంగం గత మూడు నెలలుగా సంక్షోభాన్ని ఎదుర్కొంటోందన్నారు. డిసెంబర్, జనవరి నెలల్లో విదేశాల్లో పండుగలు ఉన్నాయని.. అక్కడ నిల్వ ఉన్న సరుకుతోపాటు దేశంలో ఎగుమతిదారుల వద్ద ఉన్న సరుకు అమ్ముడుపోతుందని, ఫలితంగా భారత్‌లో తిరిగి రొయ్యల ఎగుమతులు పుంజుకుంటాయన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు అండగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం సూచించిన మేరకు 100 కౌంట్ రూ.210, 30 కౌంట్ రూ.380కి కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రతిరోజూ ధరల్లో మార్పులేకుండా 10–20 రోజుల పాటు నిర్ణీత ధర ఇచ్చేందుకు అంగీకరించారు. సంక్షోభంలో ఉన్న రైతులను ఆదుకోవాల్సింది పోయి.. కొంతమంది జె–ట్యాక్స్, ఆ ట్యాక్స్, ఈ ట్యాక్స్ అంటూ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలను మానుకోవాలని హితవు పలికారు. వ్యవసాయం తర్వాత అత్యధిక సాగులో ఉన్న ఆక్వా రంగంపై లేనిపోని ఆరోపణలుచేసి రైతులతో రాజకీయం చెయ్యొద్దని వారు విజ్ఞప్తి చేశారు. క్రాప్ హాలిడే ఆలోచనే లేదు: ఆక్వా రంగం సంక్షోభాలు రైతులకు కొత్తేమీకాదన్నారు. టైగర్ రొయ్య సాగులో నష్టాలు చూశారన్నారు. ప్రస్తుతం వనామీలో సంక్షోభం తాత్కాలికమేనని వారు స్పష్టంచేశారు. రైతులు క్రాప్ హాలిడే ప్రకటిస్తారన్న ఆరోపణలను వారు ఖండించారు. అలాంటి ఆలోచన రైతులకు లేదన్నారు. కేవలం గిట్టుబాటు ధర కావాలని డిమాండ్ చేస్తున్నారన్నారు. అందుకనుగుణంగా ప్రభుత్వం ఎప్పటికప్పుడు రైతులు, ఎగుమతిదారులను సంప్రదిస్తూ సూచనలు చేస్తోందన్నారు. ఇందుకుగాను ఒక కమిటీ వేసి మరీ పర్యవేక్షిస్తోందని గుర్తుచేశారు. రైతుల సమస్యలపై సంప్రదించేందుకు త్వరలో టోల్‌ఫ్రీ నంబర్‌ను కూడా ఏర్పాటుచేస్తామన్నారు. రైతులకు సూచనలు.. ఆక్వా రంగంలో నష్టాల నుంచి గట్టెక్కాలంటే రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాలని విధానాలపై వక్తలు అవగాహన కల్పించారు. భవిష్యత్తులో ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా రైతులకు పలు సూచనలు చేశారు. అవి.. ► అందరూ ఒకేసారి పంట వేసి ఇబ్బందులు పడకుండా క్రాప్ రొటేషన్ పద్ధతి పాటించాలి. ► ఎగుమతులకు ఇబ్బందికరంగా మారిన 100 కౌంట్ రొయ్యల సాగుకు స్వస్తిపలికి 70, 80, 30 కౌంట్ రొయ్యలపై దృష్టిపెట్టాలి. ► చెరువుల్లో తక్కువ స్థాయిలో సీడ్ వేసి ఎక్కువ కౌంట్ సాధించేలా ప్రణాలికాబద్ధంగా వ్యవహరించాలి. ► దేశంలో 8 లక్షల మెట్రిక్ టన్నుల రొయ్యలు ఉత్పత్తి అవుతుంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే 5 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి జరుగుతోంది. ► ఇందులో సింహభాగం ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచే ఉంటోంది. పెద్ద రైతులకూ విద్యుత్ సబ్సిడీ ఇవ్వాలి ప్రభుత్వం చిన్న రైతులకు విద్యుత్ సబ్సిడీ ఇస్తోంది. వాటిని పెద్ద రైతులకూ అమలుచేయాలి. మేతల ధరలు పెరగడంతో ఉత్పత్తి వ్యయం పెరుగుతోంది. నాణ్యమైన సీడ్, మేత లభించకపోవడం ఓ కారణమైపోతోంది. – రుద్రరాజు నానిరాజు, ఆక్వా రైతులు, కోనసీమ -
ఆక్వా సాగులో నష్టాలెందుకు వస్తున్నాయ్?
ఈ చిత్రంలో వ్యక్తి.. సతీష్. కృష్ణా జిల్లా బందరు మండలంలో 20 ఎకరాల విస్తీర్ణంలోని చెరువుల్లో వనామీ సాగు చేస్తున్నాడు. ఎకరానికి లక్ష చొప్పున 20 లక్షల రొయ్యి పిల్లలు వదిలాడు. గత మూడు రోజులుగా వాతావరణ మార్పులతో కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నాడు. మంగళవారం అర్ధరాత్రి ఆక్సిజన్ లోపించి రొయ్య పిల్లలు చెరువుల పై భాగానికి వచ్చేశాయి. ఇది గమనించి అప్పటికప్పుడు ఎకరానికి కిలో చొప్పున 20 కిలోల ఆక్సిజన్ బిళ్లలు చల్లడంతో రొయ్యి పిల్లలు బతికిపోయాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పిల్లలకు వెచ్చించిన రూ.6 లక్షలు నష్టపోవాల్సి వచ్చేది. ఇది.. ఆక్వా రైతు అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని వివరించే ఘటన. ఈ చిత్రంలో వ్యక్తి.. కల్లూరు బాబు. నెల్లూరు జిల్లా వాకాడు మండలం కల్లూరులో రొయ్యల సాగు చేస్తున్నాడు. ఒక ఎకరా చెరువులో రూ.45 వేలు ఖర్చు చేసి లక్ష రొయ్య పిల్లలను వదిలాడు. అప్పటి నుంచి రొయ్యలు పట్టే వరకూ కరెంట్ బిల్లు రూ. 50 వేలు వచ్చింది. రొయ్యలకు రెండు టన్నుల ఫీడ్ వాడాడు. దీనికి రూ.1.60 లక్ష అయింది. అలాగే చెరువులో ఆక్సిజన్ కోసం ఏరేటర్స్, జనరేటర్‌కు అద్దె, దాని ఇంధనం, కాపలాదారు కూలీకి రూ.50 వేలు ఖర్చు చేశాడు. ఇలా అన్నిటికి కలిపి రూ.3.5 లక్షలు వ్యయమైంది. దిగుబడి.. 80 కౌంట్ రొయ్యలు టన్ను వచ్చింది. వాటిని విక్రయించగా రూ. 1.90 లక్షల రాబడి వచ్చింది. దీంతో రూ.1.15 లక్షల నష్టం వాటిల్లింది. ఇవి.. సతీష్, కల్లూరు బాబు బాధలు మాత్రమే కాదు. రాష్ట్రవ్యాప్తంగా ఆక్వా రైతులందరూ ఇలాంటి కష్టాలే ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆక్వా సాగులో రైతుల కష్టాలపై ప్రత్యేక కథనం.. సాక్షి, మచిలీపట్నం: డాలర్ల పంటగా పిలిచే ఆక్వా రంగంలో ఎన్నో కన్నీటి కష్టాలు ఉన్నాయి. సాగు ప్రారంభం నుంచి దిగుబడి వరకూ రైతుల కష్టం అంతా ఇంతా కాదు. ప్రతిక్షణం అప్రమత్తంగా ఉంటేనే పంట చేతికి దక్కేది.. లేకపోతే తీవ్ర నష్టాలు తప్పవు. ఆక్వా సాగుకు వైరస్ సోకడంతోపాటు ధరలు తగ్గిపోతే నష్టాల ఊబిలో కూరుకుపోవాల్సిందే. రాష్ట్రంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో ఆక్వా రంగం విస్తరించి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల ఎకరాల్లో అధికారికంగా, 1.20 లక్షల ఎకరాల్లో అనధికారికంగా సాగు జరుగుతోంది. సీడ్ నుంచే కష్టాలు ప్రారంభం చెరువును బాగుచేసి రొయ్య పిల్లలు (సీడ్) వేయడం నుంచి ఆక్వా సాగు ప్రారంభమవుతుంది. చెరువు లోతును బట్టి లక్ష నుంచి లక్షన్నర వరకు పిల్లలను వదులుతారు. పిల్లల్ని వదిలిన క్షణం నుంచి ప్రతిరోజూ చెరువు వద్ద అప్రమత్తంగా ఉండాలి. రోజూ మూడు, నాలుగు పర్యాయాలు వాటికి మేత (ఫీడ్) ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కపూట మేత ఇవ్వకపోయినా రొయ్య దిగుబడిపై ప్రభావం పడుతుంది. రాత్రిళ్లు సైతం పిల్లల పరిస్థితిని పరిశీలిస్తుండాలి. ఎప్పటికప్పుడు మారిపోయే వాతావరణ పరిస్థితుల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. అధిక ఉష్ణోగ్రతలు, శీతల వాతావరణంలో ఆక్సిజన్ కొరత ఏర్పడి పిల్లలు ఎక్కువగా చనిపోతుంటాయి. ఈ సందర్భంలో ఆక్సిజన్ బిళ్లలను ఎకరానికి కిలో చొప్పున చల్లాలి. ఏరేటర్లు క్రమంగా తిరుగుతున్నాయో? లేదో? గమనిస్తుండాలి. ఎకరం చెరువులో లక్ష వరకు పిల్లలకు రూ.30 నుంచి రూ.40 వేలు, మేత (ఫీడ్), మందులు, చెరువు లీజుకు మొత్తం రూ.4–5 లక్షలు వెచ్చించాలి. ఎకరం చెరువుకు విద్యుత్ బిల్లు నెలకు రూ.5 నుంచి రూ.10 వేల వరకు వస్తుంది. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే ఏరేటర్ను వినియోగించాల్సి ఉంటుంది. ఎకరానికి రెండు ఏరేటర్లు వినియోగిస్తారు. అంటే.. రోజుకు రూ.500 డీజిల్ రూపంలో అదనపు భారం పడుతోంది. పంట దిగుబడి ఆశించిన మేర అందితేనే లాభాలు ఆర్జించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం హేచరీల నుంచి నాసిరకం పిల్లలు దిగుమతి అవుతుండటంతో లక్ష పిల్లలను చెరువులో వేస్తే 30 నుంచి 40 శాతం వరకు చనిపోతున్నాయి. దీంతో పెట్టిన పెట్టుబడులు కూడా రాని దుస్థితి. వైరస్‌లతో తీవ్ర నష్టం వాతావరణంలో నెలకొంటున్న మార్పులతో వైరస్లు (వైట్‌స్పాట్, విబ్రియో), ఈహెచ్‌పీ (ఎండ్రోజోవన్ హెపటోపినై) అనే ప్రొటోజోవా విజృంభిస్తున్నాయి. వీటి నియంత్రణకు మందులు, మినరల్స్ చెరువులో చల్లాల్సి ఉంటుంది. లేని పక్షంలో రొయ్యల్లో నాణ్యత లోపిస్తుంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర ఉండటం లేదు. వెనామీ రొయ్యలు గతేడాది 30 కౌంట్ (కిలోకి 40 రొయ్యలు) రూ.500 ఉండగా ప్రస్తుతం రూ.380కు మించడం లేదు. గతేడాదితో పోల్చితే టన్నుపై రూ.60 వేల నుంచి రూ.70 వేల వరకూ ధరలు పడిపోయాయి. పంట బాగా వచ్చిందంటే.. ఎకరానికి టన్ను నుంచి టన్నున్నర దిగుబడి వస్తుంది. ప్రస్తుత ధరల ప్రకారం చూస్తే రాబడి రూ. 5–6 లక్షల మధ్య ఉంటుంది. పెట్టుబడి రూ.4–5 లక్షల వరకు అవుతోంది. వ్యయప్రయాసల కోర్చి పగలనక, రాత్రనక పనిచేస్తే.. మూడు నెలల కష్టానికి కేవలం రూ.లక్ష ఆదాయం మాత్రమే లభిస్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఏదైనా తేడా వస్తే.. పెట్టుబడి మొత్తం బూడిదలో పోసినట్లే. 60 కౌంట్ వరకు రొయ్యి పెరిగితే.. పెద్దగా నష్టం లేకుండా పెట్టుబడులు అయినా వస్తాయి. కౌంట్ 60 దాటితే... రైతు నష్టపోయినట్లే. కౌంట్ 100 దాటితే... పెట్టుబడి దాదాపు పోయినట్లే. 100 కౌంట్ దాటితే ఎగుమతికి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. స్థానికంగా అమ్ముకోవాల్సిందే. స్థానికంగా విక్రయిస్తే పెద్దగా ధరలు ఉండవు. రొయ్యలకు దేశీయంగా పెద్దగా ధర వచ్చే మార్కెటింగ్ లేదు. అమెరికా, ఐరోపా, ఆసియాలోని కొన్ని దేశాలకు ఎగుమతి చేయాల్సి వస్తోంది. ఇదే అదునుగా భావించిన కొనుగోలుదారులు సిండికేటై ధరలు అమాంతం తగ్గించేస్తున్నారు. గత పక్షంలో ధరల పతనం ఇలా.. పక్షం క్రితం 100 కౌంట్ రొయ్యలు టన్ను ధర రూ. 2.30 లక్షలు ఉండగా.. ప్రస్తుతం రూ.2 లక్షలే ఉంది. అలాగే 90 కౌంట్ టన్ను రూ.2.50 లక్షలు ఉండగా.. ప్రస్తుతం రూ.2.20 లక్షలే పలుకుతోంది. ఇలా ప్రతి కౌంట్‌పై టన్నుకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకూ ధరలు పతనం అయ్యాయి. రాబోయే రోజుల్లో ధరలు మరింత పతనమవుతాయనే రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆక్వా రైతుల డిమాండ్లు ఇవీ.. ►రైతుల చేతికి పంట వచ్చే సమయానికి వ్యాపారులంతా సిండికేట్‌గా మారి ధరలు తగ్గిస్తుండటంతో రైతులు నష్టపోతున్నారు. నెక్.. రోజూ కోడిగుడ్డు ధరలను ప్రకటించినట్టే దేశీయంగా, అంతర్జాతీయంగా రొయ్యల ధరలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాలి. ►రొయ్యల మందులు, మేతలు, రొయ్య పిల్లల ఉత్పత్తి మీద దేశంలో ఎలాంటి నియంత్రణ లేదు. నాణ్యత లేనివి మార్కెట్లోకి రాకుండా ప్రభుత్వం నియంత్రించాలి. నాణ్యత లేని సరుకు అమ్మితే చర్యలు తీసుకొనే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ►నష్టాల పాలవుతున్న ఆక్వా రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. రొయ్య పిల్లల నాణ్యత చాలా ముఖ్యం రొయ్యల సాగులో రొయ్య పిల్లల నాణ్యత చాలా ముఖ్యం. నాణ్యత లేని పిల్లలు మార్కెట్లోకి వస్తున్నాయి. తల్లి రొయ్యకు కనీసం 100 రోజులు ఉంటేనే పిల్లలు ఆరోగ్యంగా ఉంటాయి. వీటిని తీసుకుని మన ప్రాంతానికి అలవాటుపడేలా మరో 20–30 రోజుల పాటు హేచరీల్లో వేయాలి. ఇక్కడి నీరు, వాతావరణం, నేలను అలవాటు చేసిన తర్వాత చెరువులో వేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. – పట్టపు శ్రీనివాసరావు, చెరుకుమిల్లి, కృత్తివెన్ను మండలం, కృష్ణా జిల్లా ధరల తగ్గుదలతో నష్టాలు వాతావరణం అనుకూలించకపోవడం, వైట్‌కట్, వైరస్‌లతో పిల్లలు చనిపోతున్నాయి. డ్రెయిన్లలో ఉప్పు శాతం ఎక్కువగా ఉండటంతో ఇబ్బందిగా ఉంది. నాణ్యత లేమితోపాటు దాణా ధరలు పెరగడంతో ఖర్చులు పెరిగి నష్టాలొస్తున్నాయి. – పులగం శీను, చెరుకుమిల్లి, కృత్తివెన్ను మండలం, కృష్ణా జాగ్రత్తలు పాటించాలి రొయ్యల సాగులో జాగ్రత్తలు పాటిస్తే మంచి దిగుబడులు సాధ్యమే. నేను మూడెకరాల్లో వనామీ రొయ్యల సాగు చేసి ఇటీవల మూడున్నర టన్నుల దిగుబడిని సాధించాను. ఎకరం చెరువులో 60 వేల పిల్లలను మాత్రమే వేసి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను. – నారాయణ, రుద్రవరం, బందరు మండలం, కృష్ణా అవగాహన ఉంటే ఆక్వా లాభదాయకం రైతుల్లో అవగాహన, వాతావరణ అనుకూలత ఉంటే ఆక్వాకల్చర్ లాభదాయకమే. అయితే కనీస మెలకువలు, అవగాహన లేక నష్టాలను చవి చూడాల్సి వస్తోంది. ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాలు, భౌతిక, రసాయనిక మార్పులతో రొయ్యలు మనుగడ సాగించలేకపోవడంతో రైతులకు నష్టాలు తప్పడం లేదు. చేపలు చనిపోతే నీటిలో పైకి తేలతాయి. కానీ రొయ్యలు చనిపోతే చనిపోయినట్లు కూడా తెలియదు. రొయ్య పిల్లలు చనిపోతే చెరువులో కిందకు చేరి వ్యర్థాలుగా మారి విషపూరిత రసాయనాలుగా మారతాయి. ఎగువ భాగంలో ఉండే చెరువు నీటిలో వైరస్ ఉంటే.. అది దిగువన ఉన్న చెరువులకు కూడా సోకుతుంది. దీన్ని ఆక్వా రైతులు గ్రహించలేకపోతున్నారు. లాభాలు అధికంగా వస్తాయనే ఆశతో ఎకరానికి వేయాల్సిన రొయ్యల పిల్లల సంఖ్య కంటే రెట్టింపు వేస్తున్నారు. దీంతో అవి పెరిగేందుకు చెరువు సరిపోవడం లేదు. అంతేకాకుండా కృత్రిమ ఆహారం, రసాయనిక ఆహారాలను రెట్టింపు వేస్తున్నారు. ఆహారం మొత్తం పిల్లలకు చేరకుండా సగం నీటిలో కలిసి అడుగున విషపదార్థంగా మారుతుంది. ఈ వాతావరణంలో పెరిగిన రొయ్యలు తినడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. ఇలాంటి రొయ్యలనే విదేశాలు తిప్పిపంపేస్తున్నాయి. – ఆచార్య కె.వీరయ్య, కోఆర్డినేటర్, మ్యాట్రిక్స్ ఆక్వాకల్చర్ సెంటర్, ఏఎన్‌యూ -
ఉప్పుటేరునూ మింగేశారు
భీమవరం : ప్రభుత్వ భూములను కబ్జా చేయడంలో అక్రమార్కులకు అడ్డూ అదుపూలేకుండా పోయింది. చివరికి ఉప్పుటేరు పరివాహక ప్రాంతంలోని భూములనూ మింగేస్తున్నారు. భూములను కబ్జా చేసి దర్జాగా చెరువులు తవ్వి రొయ్యలను సాగుచేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మత్తు నిద్రను వీడడం లేదు. దొంగపిండి, లోసరిలో 100 ఎకరాల కబ్జా భీమవరం మండలంలోని కృష్ణాజిల్లా సరిహద్దు గ్రామాలైన దొంగపిండి, లోసరిలు ఉప్పుటేరును ఆనుకుని ఉన్నాయి. డ్రెయిన్ మధ్యలో గట్టు పక్కన 120 ఎకరాల బీడు భూములు ఉన్నాయి. వీటిలో 100 ఎకరాలను అక్రమార్కులు కబ్జా చేసేశారు. చెరువులు తవ్వేసి రొయ్యలను సాగు చేసుకుంటూ జేబులు నింపుకుంటున్నారు. మిగిలిన భూమిపైనా కన్నేసి దాన్ని చేజిక్కించుకునేందుకు యత్నిస్తున్నారు. దొంగపిండి నుంచి లోసరి వరకు ఉన్న ఉప్పుటేరులో గట్టును ఆనుకుని కిక్కిస, మడ అడవులు, ఆల్చీ దుబ్బులతో కూడిన బీడు భూములు ఉన్నాయి. చెట్లను నరికివేసి చెరువులు తవ్వేయడంతో పర్యావరణానికి పెనుముప్పు వాటిల్లే పరిస్థితి ఏర్పడిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రెండు జిల్లాల మధ్య తగాదా ఉప్పుటేరు మధ్యలో ఉన్న బీడు భూముల్లో పాగా వేసేందుకు అటు కృష్ణా జిల్లాలోని పల్లిపాలెం, లక్ష్మీపురం గ్రామస్తులు ఇటు పశ్చిమలోని లోసరి, దొంగపిండి గ్రామాల మధ్య తగవు నడుస్తోంది. ఇటీవల పల్లిపాలెం గ్రామస్తులు లోసరి వైపు ఉన్న డ్రెయిన్ భూమిలోకి వచ్చి జెండాలు పాతి భూఆక్రమణ చేసేందుకు ప్రయత్నించగా ఇటువైపు గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో ఇరు జిల్లాలలోని గ్రామాల మధ్య ఆ భూములు మావంటే మావని వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా అధికారులు సర్వే చేయించి అధికభాగం లోసరిలోనే ఉన్నాయని తేల్చారు. జోరుగా పంపకాలు లోసరి సమీపంలో ఉప్పుటేరులో ఉన్న సుమారు 50 ఎకరాల బీడు భూములను గ్రామస్తులు కుటుంబాలలోని రేషన్‌కార్డుల వారీగా గుర్తించి పంపకాలు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. పోరంబోకు భూమిలో పాగా వేసి వాటిలో కూడా రొయ్యల సాగు చేసేందుకు యత్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అడ్డుకోవాలని పలువురు కోరుతున్నారు. -
మీసం మెలేసిన రొయ్య!
సాక్షి, నెల్లూరు : రొయ్య మీసం మెలేసింది.. రొయ్యల చరిత్రలో మునుపెన్నడూ లేనంతగా వెనామీ రొయ్యలు అత్యధిక ధర పలుకుతున్నాయి. కిలో రొయ్య ధర సోమవారం నాటికి రూ.680 పలికింది. ఇది 20 ఏళ్ల రొయ్యల సాగు చరిత్రలోనే అత్యధిక ధర. ఎన్నడూ లేని విధంగా ధర పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సముద్ర తీరప్రాంతంలోని సూళ్లూరుపేట, కోట, వాకాడు, గూడూరు, ముత్తుకూరు, టీపీ గూడూరు, ఇందుకూరుపేట, విడవలూరు, బోగోలు, కావలి, అల్లూరు తదితర మండలాల పరిధిలో 12 వేల హెక్టార్లలో 4 వేల మందికి పైగా రైతులు వెనామీ రొయ్యల సాగు చేపట్టారు. అమెరికాలో సాగుచేస్తున్న వెనామీ ఎనిమిదేళ్ల క్రితం జిల్లాకు చేరింది. ఐదేళ్లుగా జిల్లాలో వెనామీ సాగు పెరిగింది. ఈ సమయంలో ఎన్నడూ కిలో రొయ్యలు రూ.200 నుంచి రూ. 300 దాట లేదు. రొయ్య ధర ప్రస్తుతం కిలో రూ.680 పలుకుతోంది. సోమవారం (కిలోగ్రాముకు) 30 కౌంట్ రొయ్య రూ. 680 ఉండగా 40 కౌంట్ రూ.600, 50 కౌంట్ రూ.550 పలికింది. ఎనిమిదేళ్ల వెనామీ చరిత్రలోనే కాదు 21 ఏళ్ల టైగర్, ఇండికాస్ రొయ్యలసాగు చరిత్రలోనే ఇంతధర ఎన్నడూ లేదు. ఈ లెక్కన లక్ష రొయ్యల సీడ్‌కు సరాసరి 70 శాతం దిగుబడి 1500 కిలోల లెక్కన ప్రస్తుత ధరతో రూ.7.5 లక్షలు రాబడి వస్తోంది. లక్ష రొయ్యల సాగుకు సంబంధించి సీడ్ రూ. 50 వేలతో పాటు ఫీడ్, విద్యుత్, నీటి శుభ్రత పరిరక్షణ తదితర ఖర్చులు లెక్కిస్తే మొత్తం రూ. 2.5 లక్షలు అవుతుంది. ఒక్కొక్క రొయ్య పెంపకానికి రూ. 2.50 ఖర్చు వస్తోంది. ఈ లెక్కన పెట్టుబడి పోను లక్ష రొయ్యల సీడ్ లో సరాసరి 70 శాతం దిగుబడి 1500 కేజీలు లెక్కిస్తే రూ.5 లక్షలకు తగ్గకుండా ఆదాయం వస్తున్నట్లు వెనామీ రైతులు పేర్కొంటున్నారు. హెక్టారులో నిబంధనల మేరకు 6 లక్షల సీడ్ వేయాల్సి ఉంది. అయితే రైతులు హెక్టారులో సుమారు 10 లక్షల వరకూ సీడ్‌ను పెంచుతున్నారు. ఈ లెక్కన ప్రస్తుత ధరతో లెక్కిస్తే వెనామీ రైతుల ఆదాయం పెద్ద ఎత్తున ఉండే అవకాశముంది. రైతన్న ఏమంటున్నారు.. ‘వెనామీ’ బాగుంది. మూడేళ్ల నుంచి వెనామీ రొయ్యల సాగు హెక్టారులో చేపట్టా. ఈ ఏడాది అక్టోబర్ వరకు వెనామీకి పెద్దగా ధరలు లేవు. కిలో రూ.300కు మించి అమ్మింది లేదు. అక్టోబర్ నుంచి రేట్లు పెరిగాయి. ప్రస్తుతం కిలో రూ.680కి పైగా పలుకుతోంది. ఇలా ధరలుంటే రైతులకు మంచి ఆదాయం. -హనుమంతరావు నాయుడు, రైతు, రాముడిపాళెం, నెల్లూరు జిల్లా జిల్లాలో రొయ్యల సాగు ఎప్పుడు ప్రారంభమైంది: 1991 నుంచి ఏ రకం రొయ్యలు సాగు చేస్తున్నారు: టైగర్, స్కాంపీ, ఇండికాస్ వెనామీ రకం ఎప్పుడొచ్చింది: 8 ఏళ్ల క్రితం జిల్లాకు వచ్చింది వెనామీ పెంపకం కాలం ఎంత: 90 రోజుల నుంచి 110 రోజులు. ఎప్పుడు విక్రయించవచ్చు: కేజీ కౌంట్ 30 నుంచి 50 లోపు ఎప్పుడైనా దీనిని విక్రయించుకోవచ్చు. ఎన్ని గ్రాములు పెరుగుతుంది: 30.3 గ్రాముల వరకూ పెరుగుతుంది. ఎక్కడ డిమాండ్ ఉంది: వెనామీకి విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. అక్కడ కేజీ రొయ్య ధర రూ. 1200 కు పైనే ఉంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి: క్వాలిటీ సీడ్ వేసుకోవాలి. ప్రభుత్వ అనుమతులు ఉన్న కంపెనీల నుంచి నాణ్యత కలిగిన ఫీడ్‌ను వాడాలి. రొయ్యల చెరువుల్లోకి బయటనుంచి హానికర క్రిములు, కీటకాలు రాకుండా జాగ్త్రలు తీసుకోవాలి. ఆక్సిజన్ సరఫరా సక్రమంగా జరిగేలా చూడాలి. ఇందుకోసం ఏరియేటర్లను ఉపయోగించాలి. -
రొయ్యల అమ్మకాలపై ఆంక్షలు
=స్థానికులకు విక్రయంపై వ్యాపారి షరతు =నష్టపోతున్న తాండవ జాలర్లు గొలుగొండ, న్యూస్‌లైన్: తాండవ జలాశయంలో రొయ్యలవేట సాగిస్తున్న జాలర్లకు అరకొర సొమ్ము చెల్లింపు, అమ్మకాలపై ఆంక్షలు విధించడం వివాదాస్పదమవుతున్నాయి. మూడేళ్ల నుంచి తునికి చెందిన ఒక వ్యాపారి తాండవ రొయ్యలపై పెత్తనం సాగిస్తున్నారు. కొంతమంది స్థానికులు ఆయనకు అండగా నిలిచి జాలర్ల పొట్టకొడుతున్నారు. మార్కెట్లో తాండవ రొయ్యకు ఎంతో గిరాకీ ఉన్నా స్థానికంగా వేట సాగించే జాలర్లకు కిలో రూ.115 నుంచి రూ.130 మాత్రమే చెల్లిస్తున్నారు. అంతగా పనికిరాని బిగ్ చేప పిల్లలను జలాశయంలో వేసి వేటగాళ్లు, స్థానిక వ్యాపారుల పొట్టగొడుతున్నారు. త్వరగా పెరిగే బిగ్చేపలు తినడం వల్ల ప్రజలు రోగాలు పాలవుతారు. వ్యాపారి తాను చేపపిల్లలు ఇస్తున్నందున రొయ్యలు తనకే అమ్మాలని ఆంక్షలు విధించి మార్కెట్లో లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. ఈ జలాశయంలో దొరికే విలువైన రొయ్యలు ఇక్కడ నుంచి తమిళనాడు, కర్ణాటక, కోల్‌కతా, ఇతర ప్రాంతాలతో పాటు గ్రేడ్-1 రొయ్య విదేశాలకు కూడా ఎగుమతి అవుతోంది. ఇతర రాష్ట్రాల్లో కిలో రూ.800 వరకు పలుకుతున్నట్టు తెలిసింది. అయితే ఆ వ్యాపారి స్థానికంగా ప్రజలకు ఒక్క రొయ్య కూడా విక్రయించరాదన్న ఆంక్షలతో జాలర్లు స్థానికంగా ఎవ రికీ అమ్మడం లేదు. దీంతో గొలుగొండ, నర్సీపట్నం, నాతవరం మండలాల్లో తాండవ రొయ్యలు తినడానికి నోచుకోవడం లేదు. దీంతో స్థానిక జాలర్లకు సరైన గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నారు. ఏటా తాండవ జలాశయంలో రూ.80 లక్షల నుంచి రూ.3 కోట్ల వరకు రొయ్యల వ్యాపారం జరుగుతుంది. దీనినిబట్టి స్థానిక జాలర్లు సుమారు రూ.2 కోట్ల మేరకు నష్టపోతున్నట్టు అంచనా. దీనిపై మత్స్యశాఖ అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. తాండవ జలాశయం పరివాహక ప్రాంతాలైన పొగచెట్లపాలెం, వెంకటాపురం, గొలుగొండ, జోగుంపేట, మరో 10 గ్రామాల్లో 450 మంది వరకు మత్స్యకారులు జలాశయంపైనే జీవనం సాగిస్తారు. దీనిపై మత్స్యశాఖ నర్సీపట్నం ఏడీ నిర్మలను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా రొయ్య పిల్లలను తాండవ జలాశయంలో వేయలేదని, అవి సహజసిద్ధంగా వచ్చినవని తెలిపారు. ధర నిర్ణయించే అధికారం తమకు లేదని, జాలర్లు అందరూ కలిసికట్టుగా ధర నిర్ణయించుకుని అమ్ముకోవలసి ఉందన్నారు. తునికి చెందిన రొయ్యల వ్యాపారి అప్పారావును వివరణ కోరగా సమాధానం చెప్పడానికి నిరాకరించారు. -
వెనామీపై వ్యాధుల సునామీ!
కైకలూరు, న్యూస్‌లైన్ : ఓ సారి అతివృష్టి, మరోసారి అనావృష్టి.. ఇపుడేమో సమైక్యాంధ్ర ఉద్యమ ఫలితంగా అతలాకుతలమవుతున్న ఆక్వారైతును వ్యాధుల సునామీ భయపెడుతోంది. డెల్టాలో వరి తరువాత ప్రధాన సాగుగా వెనామీ (రొయ్యల్లో ఒక రకం) ఖ్యాతికెక్కింది. దేశవ్యాప్తంగా ఈ ఏడాది ప్రారంభంలో 2 లక్షల 45 వేల 613 టన్నుల రొయ్యల ఎగుమతి జరగగా, దానిలో లక్షా 23 వేల 551 టన్నులు వెనామీ దే. ఈ సాగులో మన రాష్ట్ర వాటా దాదాపు 80 వేల టన్నులుగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 70 వేల ఎకరాల్లో వెనామీ సాగవుతుండగా, జిల్లాలోనే 30 వేల ఎకరాల్లో జరుగుతుంది. యాంటీ డంపింగ్, దిగుమతుల సుంకం వంటి ఒడిదొడుకులను అధిగమించి ముందుకెళుతున్న తరుణంలో వ్యాధులు భయపెడుతున్నాయని ఆక్వా రైతులు వాపోతున్నారు. ఈ ఏడాది జనవరిలో వెనామీ దిగుబడి కోసం వాడుతున్న మందులు ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయని జపాన్ పరిశోధన శాస్త్రవేత్తలు కేంద్రానికి లేఖ రాయడంతో రైతులు కలత చెందారు. వెనామీని ఎక్కువగా సాగుచేసే వియత్నాం, చైనా, థాయ్‌లాండ్ తదితర దేశాల్లో భయంకరమైన ఎర్లీ మోర్టాలిటీ సిండ్రోమ్ వ్యాధి వ్యాపించడంతో దాదాపు అక్కడ ఈ సాగు తుడిచిపెట్టుకుపోయింది. దీంతో ఎగమతుల్లో సింహభాగం మన రాష్ట్రం నుంచే వెళుతున్నాయి. ప్రధానంగా ఈ సీజన్లో రొయ్యల రైతులను తెల్లమచ్చ, విబ్రియో వ్యాధులు వెంటాడుతున్నాయి. తెల్లమచ్చ వైరస్ వ్యాధి... వైట్ స్పాట్ సిండ్రోమ్ వైరస్ (డబ్ల్యూఎస్‌ఎస్‌వీ) కారణంగా ఈ వ్యాధి వ్యాపిస్తోంది. రొయ్యల తలభాగం, తోక, శరీరంపై తెల్లమచ్చలు ఏర్పడటం వల్ల దీనికి తెల్లమచ్చల వ్యాధి అని పేరు వచ్చింది. వ్యాధి లక్షణాల విషయానికి వస్తే రొయ్యలు గులాబీ రంగులో ఉంటాయి. నీటిలో నిరసంగా ఈదుతూ మేతలు తినడం తగ్గిస్తాయి. ఆహార నాళం ఖాళీగా ఉండి ఎదుగుదల ఉండదు. చెక్ ట్రేలలో చూసినప్పుడు రంగుమారి మరణించిన రొయ్యలు ఎక్కువగా కనిపిస్తాయి. వ్యాధి ముదిరిన సందర్భాల్లో రోజుకు 80 నుంచి 100 రొయ్యలు చనిపోతాయి. పిల్లవేసిన 30 -45 రోజుల్లో ఈ వ్యాధి లక్షణాలు రొయ్యల చెరువుల్లో కనిపిస్తాయి. విబ్రియో వ్యాధి.... విబ్రియో బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది. విబ్రియో సోకిన వెనామీ రొయ్య తలలో హెపటో, పేంక్రియా (కాలేయం, క్లోమం) ఎరుపు రంగులోకి మారతాయి. మిగిలిన శరీరం సాధారణ స్థితిలోనే ఉంటుంది. వ్యాధి లక్షణాల విషయానికొస్తే రొయ్య అంగాలు తినివేయబడి ఉంటాయి. చనిపోయిన రొయ్యలు గులాబీ, ఎరుపు రంగుల్లోకి మారి చెరువులో ఎయిరేటర్ల వల్ల నీటి పైభాగంగలో తేలుతూ ఉంటాయి. వ్యాధి సోకిన ప్రాథమిక దశలో నిత్యం కొన్ని రొయ్యలు మరణిస్తాయి. వ్యాధిగ్రస్త రొయ్యలు మందంగా తిరుగుతూ ఆహారం తీసుకోవు. పక్షులు ఎక్కువుగా రొయ్యల చెరువుపై తిరగుతూ ఉంటాయి. ముందస్తు చర్యలే ముఖ్యం పైన వివరించిన రెండు వ్యాధులు రొయ్యల సాగులో అత్యంత ప్రమాదకరమైనవని కైకలూరు మత్స్యశాఖ అభివృద్ధి అధికారి (ఆక్వాల్యాబ్) పి.సురేష్ సూచించారు. నివారణ లేని హచ్‌ఐవీ వ్యాధి మాదిరిగా ఈ వ్యాధులు రొయ్యలకు సోకితే నివారణ లేదన్నారు. ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే వ్యాధులనుంచి పంటను రక్షించుకోవచ్చని వివరించారు.