మీసం మెలేసిన రొయ్య!
సాక్షి, నెల్లూరు : రొయ్య మీసం మెలేసింది.. రొయ్యల చరిత్రలో మునుపెన్నడూ లేనంతగా వెనామీ రొయ్యలు అత్యధిక ధర పలుకుతున్నాయి. కిలో రొయ్య ధర సోమవారం నాటికి రూ.680 పలికింది. ఇది 20 ఏళ్ల రొయ్యల సాగు చరిత్రలోనే అత్యధిక ధర. ఎన్నడూ లేని విధంగా ధర పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సముద్ర తీరప్రాంతంలోని సూళ్లూరుపేట, కోట, వాకాడు, గూడూరు, ముత్తుకూరు, టీపీ గూడూరు, ఇందుకూరుపేట, విడవలూరు, బోగోలు, కావలి, అల్లూరు తదితర మండలాల పరిధిలో 12 వేల హెక్టార్లలో 4 వేల మందికి పైగా రైతులు వెనామీ రొయ్యల సాగు చేపట్టారు. అమెరికాలో సాగుచేస్తున్న వెనామీ ఎనిమిదేళ్ల క్రితం జిల్లాకు చేరింది. ఐదేళ్లుగా జిల్లాలో వెనామీ సాగు పెరిగింది. ఈ సమయంలో ఎన్నడూ కిలో రొయ్యలు రూ.200 నుంచి రూ. 300 దాట లేదు. రొయ్య ధర ప్రస్తుతం కిలో రూ.680 పలుకుతోంది.
సోమవారం (కిలోగ్రాముకు) 30 కౌంట్ రొయ్య రూ. 680 ఉండగా 40 కౌంట్ రూ.600, 50 కౌంట్ రూ.550 పలికింది. ఎనిమిదేళ్ల వెనామీ చరిత్రలోనే కాదు 21 ఏళ్ల టైగర్, ఇండికాస్ రొయ్యలసాగు చరిత్రలోనే ఇంతధర ఎన్నడూ లేదు. ఈ లెక్కన లక్ష రొయ్యల సీడ్‌కు సరాసరి 70 శాతం దిగుబడి 1500 కిలోల లెక్కన ప్రస్తుత ధరతో రూ.7.5 లక్షలు రాబడి వస్తోంది. లక్ష రొయ్యల సాగుకు సంబంధించి సీడ్ రూ. 50 వేలతో పాటు ఫీడ్, విద్యుత్, నీటి శుభ్రత పరిరక్షణ తదితర ఖర్చులు లెక్కిస్తే మొత్తం రూ. 2.5 లక్షలు అవుతుంది. ఒక్కొక్క రొయ్య పెంపకానికి రూ. 2.50 ఖర్చు వస్తోంది.
ఈ లెక్కన పెట్టుబడి పోను లక్ష రొయ్యల సీడ్ లో సరాసరి 70 శాతం దిగుబడి 1500 కేజీలు లెక్కిస్తే రూ.5 లక్షలకు తగ్గకుండా ఆదాయం వస్తున్నట్లు వెనామీ రైతులు పేర్కొంటున్నారు. హెక్టారులో నిబంధనల మేరకు 6 లక్షల సీడ్ వేయాల్సి ఉంది. అయితే రైతులు హెక్టారులో సుమారు 10 లక్షల వరకూ సీడ్‌ను పెంచుతున్నారు. ఈ లెక్కన ప్రస్తుత ధరతో లెక్కిస్తే వెనామీ రైతుల ఆదాయం పెద్ద ఎత్తున ఉండే అవకాశముంది.
రైతన్న ఏమంటున్నారు..
‘వెనామీ’ బాగుంది. మూడేళ్ల నుంచి వెనామీ రొయ్యల సాగు హెక్టారులో చేపట్టా. ఈ ఏడాది అక్టోబర్ వరకు వెనామీకి పెద్దగా ధరలు లేవు. కిలో రూ.300కు మించి అమ్మింది లేదు. అక్టోబర్ నుంచి రేట్లు పెరిగాయి. ప్రస్తుతం కిలో రూ.680కి పైగా పలుకుతోంది. ఇలా ధరలుంటే రైతులకు మంచి ఆదాయం. -హనుమంతరావు నాయుడు, రైతు, రాముడిపాళెం, నెల్లూరు జిల్లా
జిల్లాలో రొయ్యల సాగు ఎప్పుడు ప్రారంభమైంది: 1991 నుంచి
ఏ రకం రొయ్యలు సాగు చేస్తున్నారు: టైగర్, స్కాంపీ, ఇండికాస్
వెనామీ రకం ఎప్పుడొచ్చింది: 8 ఏళ్ల క్రితం జిల్లాకు వచ్చింది
వెనామీ పెంపకం కాలం ఎంత: 90 రోజుల నుంచి 110 రోజులు.
ఎప్పుడు విక్రయించవచ్చు: కేజీ కౌంట్ 30 నుంచి 50 లోపు ఎప్పుడైనా దీనిని విక్రయించుకోవచ్చు.
ఎన్ని గ్రాములు పెరుగుతుంది: 30.3 గ్రాముల వరకూ పెరుగుతుంది.
ఎక్కడ డిమాండ్ ఉంది: వెనామీకి విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. అక్కడ కేజీ రొయ్య ధర రూ. 1200 కు పైనే ఉంది.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి: క్వాలిటీ సీడ్ వేసుకోవాలి. ప్రభుత్వ అనుమతులు ఉన్న కంపెనీల నుంచి నాణ్యత కలిగిన ఫీడ్‌ను వాడాలి. రొయ్యల చెరువుల్లోకి బయటనుంచి హానికర క్రిములు, కీటకాలు రాకుండా జాగ్త్రలు తీసుకోవాలి. ఆక్సిజన్ సరఫరా సక్రమంగా జరిగేలా చూడాలి. ఇందుకోసం ఏరియేటర్లను ఉపయోగించాలి.