Vannamei Prawns
-
ఎదురీదుతున్న వనామీ.. భారీ వర్షాలతో వైరస్ల ముప్పు
భీమవరం అర్బన్: ఈ ఏడాది వనామీ రొయ్య గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. జూన్ నెల నుంచి భారీ వర్షాలు పడుతుండటంతో రొయ్యల పెంపకం రైతుకు కత్తిమీద సాములా మారింది. చెరువులలో వనామీ రొయ్య పిల్లలు వదిలిన 15 రోజుల నుంచి నెల రోజుల లోపే వైట్ స్పాట్, విబ్రియో వంటి వైరస్లు సోకి చనిపోతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం, కాళ్ల, ఉండి, వీరవాసరం, మొగల్తూరు, నరసాపురం, ఆచంట, పాలకోడేరు తదితర మండలాల్లో సుమారు 75 వేల ఎకరాలలో వనామీ రొయ్యల పెంపకం చేస్తున్నారు. ఏడాదికి జిల్లా నుంచి 2 లక్షలకు పైగా టన్నులు చైనా, సింగపూర్, దక్షిణకొరియా, అమెరికా తదితర దేశాలకు ఎగుమతవుతున్నాయి. రూ.7 వేల కోట్ల వ్యాపారం జరుగుతుందని మత్స్యశాఖ అధికారుల అంచనా. వనామీ రొయ్యలు 2 నుంచి 3 నెలలు మధ్య పట్టుబడికి వస్తే లాభాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో ఎక్కువ మంది రైతులు ఈ రొయ్యలను పెంచేందుకు ఆసక్తి చూపుతున్నారు. అధిక వర్షాలతో వైరస్ల ముప్పు జూన్ నుంచి ఎడతెరిపి లేని వర్షాలతో వనామీ రొయ్యల పిల్లలకు వైట్‌స్పాట్, విబ్రియో వంటి వైరస్లు సోకడంతో నెల రోజులు లోపే మృత్యువాత పడుతున్నాయి. దీంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు చెబుతున్నారు. కొంతమంది రైతులు ప్రత్నామ్నాయ మార్గాలైన పండుగొప్ప, శీలావతి చేపలు పెంచుతున్నారు. (క్లిక్ చేయండి: అక్కడ చెట్లకు డబ్బులు కాస్తాయ్!) భారీగా పెరిగిన రొయ్య ధరలు గత మూడు నెలలుగా జిల్లాలో పట్టుబడికి వచ్చిన కౌంట్ రొయ్యలు తక్కువగా ఉండటం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి రొయ్యలకు ఆర్డర్లు రావడంతో రొయ్య ధరకు రెక్కలు వచ్చాయి. 100 కౌంట్ రూ.280, 90 కౌంట్ రూ.290, 80 కౌంట్ రూ.310, 70 కౌంట్ రూ.330, 60 కౌంట్ రూ. 340, 50 కౌంట్ రూ.360, 45 కౌంట్ రూ.370, 40 కౌంట్ రూ.400, 30 కౌంట్ రూ. 450, 25 కౌంట్ రూ.540 ధర పలుకుతుంది. రొయ్యల వ్యాపారస్తులు దూరం, టన్నుల మేరకు ధరలు మారుతున్నారు. వర్షాలతో రొయ్యకు వైరస్ అధిక వర్షాల కారణంగా వనామీ రొయ్యకు వైట్‌స్పాట్, విబ్రియో వైరస్లు సోకడంతో సీడ్ దశలోనే మృత్యువాత పడుతున్నాయి. కౌంట్‌కు వచ్చిన రొయ్యలు పట్టుబడులు లేకపోవడంతో రొయ్యల ధరలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో రొయ్యకు భారీగా ఆర్డర్లు వస్తున్నాయి. – ఎల్ఎల్ఎన్ రాజు, ఏడీ, మత్స్యశాఖ, భీమవరం ధరలు ఒకేలా ఉండేలా చూడాలి రొయ్యలకు వేసే 25 కేజీల మేత రూ.2500 అయింది. ఎండాకాలంలో రొయ్యల ధరలు అమాంతం తగ్గిస్తున్నారు. అన్ సీజన్లో రొయ్యల ధరలు పెంచుతున్నారు. వనామీ పెంపకంలో ఎక్కువ నష్టాలు వస్తున్నాయి. సన్న, చిన్నకారు రైతులు చేపల పెంపకం చేస్తున్నారు. ఎప్పుడూ రొయ్యల ధరలు ఒకేలా ఉండేలా చూసి రైతులను ఆదుకోవాలి. – జడ్డు రమేష్ కుమార్, రైతు, గూట్లపాడురేవు -
వెనామీకి గిరాకీ: ఆక్వా రైతుల్లో జోష్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఆక్వా రంగం మళ్లీ వికసిస్తోంది. 2014–19 టీడీపీ హయాంలో కుదేలైన రైతులు ప్రభుత్వ ప్రోత్సాహంతో మళ్లీ కోలుకుంటున్నారు. విద్యుత్ సబ్సిడీ, ధరల స్థిరీకరణ, నాణ్యమైన సీడ్, ఫీడ్ అందే విధంగా ఆక్వా ల్యాబ్‌లను అందుబాటులోకి తేవడంతో ఆదాయబాట పడుతున్నారు. జిల్లాలో 15 వేల హెక్టార్లలో ఆక్వా సాగులో ఉంది. దాదాపు లక్ష టన్నుల ఆక్వా ఉత్పత్తులు వస్తున్నాయి. ఈ దఫా విదేశాలకు ఎగుమతులకు అనుమతులు లభించడంతో ఒక్కసారిగా ధరలు ఊపందుకున్నాయి. పక్షం రోజుల క్రితం వరకు 100 కౌంట్ రూ. 90 ఉండగా ఇప్పుడు రూ. 270లకు చేరడంతో ఆక్వా రైతులు ఆనందానికి అవధుల్లేవు. ఆక్వా రైతుల పక్షపాతిగా.. రైతు ముఖ్యమంత్రిగా ముద్ర వేసుకున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆక్వా రంగంలో పెను మార్పులు తీసుకువచ్చారు. విద్యుత్ చార్జీల తగ్గింపు, ఉచితంగా ఆక్వా ల్యాబ్‌లు, నాణ్యమైన సీడ్, సాగులో మెళకువలు, సూచనలు అందేలా మత్స్యశాఖ పర్యవేక్షణలో చేపట్టారు. దళారుల నియంత్రణ, గిట్టుబాటు ధర, విదేశాలకు ఎగుమతులకు అనుమతులు తదితర లాభసాటి ప్రయోజనాలతో ప్రభుత్వం రైతులకు అండగా నిలిచింది. ఆక్వా సాగు రోజు రోజుకు వృద్ధి చెందింది. వెనామీ రొయ్యల ధరలు మూడు వారాలు ఆశాజనకంగా ఉన్నాయి. ప్రతి నెల ఆక్వా ధరలు పెరుగుతూ ప్రతి కౌంట్‌లో వ్యత్యాసం కనిపిస్తోంది. 30 కౌంట్ రూ. 530 వద్ద ట్రేడ్ అవుతోంది. గత రెండు నెలల ధరలతో పోలిస్తే ప్రస్తుతం ప్రతి కౌంట్‌పై రూ.100 నుంచి రూ. 150 వరకు ధర పెరుగుదలతో రైతులకు గణనీయమైన ఆదాయం దక్కుతోంది. టీడీపీ హయాంలో ఆక్వాసాగు కుదేలు టీడీపీ హయాంలో ఆక్వా రైతులు అప్పులు ఊబిలో కూరుకుపోయారు. అధిక విద్యుత్ చార్జీలు, ప్రకృతి వైపరీత్యాలతో టీడీపీ ప్రభుత్వ హయాంలో సాగు సంక్షోభంలో పడింది. ఆశించిన దిగుబడులు లభించకపోవడంతో ఆక్వా రంగం క్రమేపీ అవరోహణ క్రమంలో దిగజారిపోయింది. -
ఏపీ రొయ్య.. మీసం మెలేసింది!
సాక్షి, అమరావతి: దేశంలో రొయ్యల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టించింది. 2020–21 ఆరి్థక సంవత్సరంలో దేశ రొయ్యల ఉత్పత్తిలో ఏపీ 75.84% వాటాతో దూసుకుపోయినట్లు మెరైన్ ప్రోడక్టస్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ (ఎంపెడా) తెలిపింది. 2020–21లో దేశవ్యాప్తంగా 8,43,633 టన్నుల రొయ్యలు ఉత్పత్తి అయితే అందులో ఏపీలోనే 6,39,894 టన్నులు ఉత్పత్తి అయినట్లు ఎంపెడా జాయింట్ డైరెక్టర్ జయబాల్ తెలిపారు. ఇందులో అత్యధికంగా వనామి రకం రొయ్యలు 6,34,672 టన్నులు ఉత్పత్తి అయ్యిందని, బ్లాక్ టైగర్ రొయ్యలు వాటా 5,222 టన్నులని చెప్పారు. సముద్ర ఉత్పత్తుల్లో కూడా ఏపీ తొలి స్థానంలో నిలిచినట్లు వెల్లడించారు. 2021లో రాష్ట్రం నుంచి 2,90,859 టన్నుల సముద్ర ఆహార ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయని వీటి విలువ రూ.16,733.81 కోట్లని వివరించారు. పెరిగిన సాగు, ఉత్పత్తి... అంతకుముందు ఏడాదితో పోలిస్తే రాష్ట్రంలో రొయ్యల సాగు విస్తీర్ణం, ఉత్పత్తిలో గణనీయమైన వృద్ధి నమోదైంది. 2019–20తో పోలిస్తే రాష్ట్రంలో సాగు విస్తీర్ణంలో 15.41%, ఉత్పత్తిలో 24.91% వృద్ధి నమోదైంది. 2019–20లో 64,559.94 హెక్టార్లలో సాగు చేయడం ద్వారా 5,12,244.4 టన్నుల రొయ్యలు ఉత్పత్తి అయితే 2020–21లో సాగు విస్తీర్ణం 74,512 హెక్టార్లకు పెరిగి ఉత్పత్తి 6,39,894 టన్నులకు చేరింది. దేశవ్యాప్తంగా రొయ్యల సాగు విస్తీర్ణంలో రాష్ట్ర వాటా 44.69%గా ఉన్నట్లు ఎంపెడా పేర్కొంది. రాష్ట్రంలో 188 మండలాల్లో 1,553 గ్రామాల్లో 53 వేల చెరువుల్లో ఆక్వా చెరువు సాగు జరుగుతోంది. రాష్ట్రంలో ఆక్వా ఎగుమతుదారులు 154 మంది ఉండగా, 97 ప్రోసెసింగ్ యూనిట్లు, 97 శీతల గిడ్డంగులు ఉన్నట్లు ఎంపెడా పేర్కొంది. రాష్ట్రంలో ఆక్వా ఎగుమతులు ప్రోత్సహించడానికి ఎంపెడా కృషి చేస్తోందని, ఇందుకోసం కాల్‌సెంటర్ నంబర్ 18004254648ను కేటాయించినట్లు తెలిపారు. -
రొయ్యో.. మొర్రో!
భీమవరం: మండుతున్న ఎండలకు వనామి రొయ్య ఎదురీదుతోంది. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో చెరువుల్లోని రొయ్యలు విలవిల్లాడుతున్నాయి. దీంతో ఆక్వా రైతులకు ప్రస్తుత పరిస్థితి దడపుట్టిస్తోంది. ఆక్వా సాగు అధికంగా ఉండే ఉభయగోదావరి జిల్లాల్లో సుమారు 45వేల ఎకరాల్లో వనామి రొయ్యలు సాగు చేస్తున్నారు. పదిహేను రోజులుగా ఉష్ణోగ్రత తీవ్రం కావడంతో చెరువుల్లోని నీళ్లు వేడెక్కి రొయ్యలు తేలియాడుతున్నాయి. వనామి రొయ్యలకు వైట్కాట్ (తెల్లమచ్చ) వ్యాధి సోకి మేత తినలేక కళ్లు తేలే సి మృత్యువాత పడుతున్నాయి. ఐదారు రోజులుగా ఉభయ గోదావరి జిల్లాల్లోని ఆక్వా చెరువుల్లో ఎండ దెబ్బకు రన్నింగ్ మెటాలిటీ సిలికాం(ఆర్ఎంఎస్) వ్యాధికి గురై రోజుకు సుమారు 2వేల 500 నుంచి 3 వేల ఎకరాల్లో రొయ్యలు తుడిచిపెట్టుకుపోతున్నాయి. దీంతో సరైన ధర లేనప్పటికీ రైతులు ఎంతోకొంత దక్కుతుందనే ఆశతో పట్టుబడులు సాగిస్తూ ప్రతిరోజూ 600 నుంచి 700 టన్నుల రొయ్యలను ఈ జిల్లాల నుంచి ఎగుమతి చేస్తున్నారు. అయినకాడికి అమ్ముకుంటూ రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. విద్యుత్ కోతలతో పెరుగుతున్న వెతలు ఒక పక్క వేసవి ఉష్ణోగ్రతలకు ఉక్కిరిబిక్కిరి అవుతున్న వనామి రొయ్యలు సాగుచేస్తున్న రైతులను విద్యుత్ కోతలు మరింత కుంగదీస్తున్నాయి. వేళాపాళాలేని విద్యుత్ కోతలతో చెరువుల్లోని ఏరియేటర్ల తిరిగే పరిస్థితి కనిపించడంలేదు. ప్రకృతితో పాటు ప్రభుత్వం కూడా తమకు సహకరించటంలేదని ఆక్వా రైతులు వాపోతున్నారు. విద్యుత్ కోతలకు ఏరియేటర్ల తిరగక చెరువు నీటిలో ఆక్సిజన్ శాతం లోపించటం రొయ్యలకు మరో విఘాతంగా పరిణమించిందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. పడిపోతున్న ధర వ్యాధి భారిన పడుతున్న చెరువుల్లోని రొయ్యలను ముందుగానే పట్టుబడులు పట్టలేక, అలాగే వాటిని చెరువుల్లో వదిలేయలేక రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. ప్రస్తుతం 40 కౌంటు కిలో రూ.350, 50 కౌంట్ రూ.300 చొప్పున ఉన్న ధరలు గిట్టుబాటు కాకపోయినా గత్యంతరం లేక తెగనమ్ముకుని తీవ్రంగా నష్టపోతున్నారు. -
మీసం మెలేసిన రొయ్య!
సాక్షి, నెల్లూరు : రొయ్య మీసం మెలేసింది.. రొయ్యల చరిత్రలో మునుపెన్నడూ లేనంతగా వెనామీ రొయ్యలు అత్యధిక ధర పలుకుతున్నాయి. కిలో రొయ్య ధర సోమవారం నాటికి రూ.680 పలికింది. ఇది 20 ఏళ్ల రొయ్యల సాగు చరిత్రలోనే అత్యధిక ధర. ఎన్నడూ లేని విధంగా ధర పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సముద్ర తీరప్రాంతంలోని సూళ్లూరుపేట, కోట, వాకాడు, గూడూరు, ముత్తుకూరు, టీపీ గూడూరు, ఇందుకూరుపేట, విడవలూరు, బోగోలు, కావలి, అల్లూరు తదితర మండలాల పరిధిలో 12 వేల హెక్టార్లలో 4 వేల మందికి పైగా రైతులు వెనామీ రొయ్యల సాగు చేపట్టారు. అమెరికాలో సాగుచేస్తున్న వెనామీ ఎనిమిదేళ్ల క్రితం జిల్లాకు చేరింది. ఐదేళ్లుగా జిల్లాలో వెనామీ సాగు పెరిగింది. ఈ సమయంలో ఎన్నడూ కిలో రొయ్యలు రూ.200 నుంచి రూ. 300 దాట లేదు. రొయ్య ధర ప్రస్తుతం కిలో రూ.680 పలుకుతోంది. సోమవారం (కిలోగ్రాముకు) 30 కౌంట్ రొయ్య రూ. 680 ఉండగా 40 కౌంట్ రూ.600, 50 కౌంట్ రూ.550 పలికింది. ఎనిమిదేళ్ల వెనామీ చరిత్రలోనే కాదు 21 ఏళ్ల టైగర్, ఇండికాస్ రొయ్యలసాగు చరిత్రలోనే ఇంతధర ఎన్నడూ లేదు. ఈ లెక్కన లక్ష రొయ్యల సీడ్‌కు సరాసరి 70 శాతం దిగుబడి 1500 కిలోల లెక్కన ప్రస్తుత ధరతో రూ.7.5 లక్షలు రాబడి వస్తోంది. లక్ష రొయ్యల సాగుకు సంబంధించి సీడ్ రూ. 50 వేలతో పాటు ఫీడ్, విద్యుత్, నీటి శుభ్రత పరిరక్షణ తదితర ఖర్చులు లెక్కిస్తే మొత్తం రూ. 2.5 లక్షలు అవుతుంది. ఒక్కొక్క రొయ్య పెంపకానికి రూ. 2.50 ఖర్చు వస్తోంది. ఈ లెక్కన పెట్టుబడి పోను లక్ష రొయ్యల సీడ్ లో సరాసరి 70 శాతం దిగుబడి 1500 కేజీలు లెక్కిస్తే రూ.5 లక్షలకు తగ్గకుండా ఆదాయం వస్తున్నట్లు వెనామీ రైతులు పేర్కొంటున్నారు. హెక్టారులో నిబంధనల మేరకు 6 లక్షల సీడ్ వేయాల్సి ఉంది. అయితే రైతులు హెక్టారులో సుమారు 10 లక్షల వరకూ సీడ్‌ను పెంచుతున్నారు. ఈ లెక్కన ప్రస్తుత ధరతో లెక్కిస్తే వెనామీ రైతుల ఆదాయం పెద్ద ఎత్తున ఉండే అవకాశముంది. రైతన్న ఏమంటున్నారు.. ‘వెనామీ’ బాగుంది. మూడేళ్ల నుంచి వెనామీ రొయ్యల సాగు హెక్టారులో చేపట్టా. ఈ ఏడాది అక్టోబర్ వరకు వెనామీకి పెద్దగా ధరలు లేవు. కిలో రూ.300కు మించి అమ్మింది లేదు. అక్టోబర్ నుంచి రేట్లు పెరిగాయి. ప్రస్తుతం కిలో రూ.680కి పైగా పలుకుతోంది. ఇలా ధరలుంటే రైతులకు మంచి ఆదాయం. -హనుమంతరావు నాయుడు, రైతు, రాముడిపాళెం, నెల్లూరు జిల్లా జిల్లాలో రొయ్యల సాగు ఎప్పుడు ప్రారంభమైంది: 1991 నుంచి ఏ రకం రొయ్యలు సాగు చేస్తున్నారు: టైగర్, స్కాంపీ, ఇండికాస్ వెనామీ రకం ఎప్పుడొచ్చింది: 8 ఏళ్ల క్రితం జిల్లాకు వచ్చింది వెనామీ పెంపకం కాలం ఎంత: 90 రోజుల నుంచి 110 రోజులు. ఎప్పుడు విక్రయించవచ్చు: కేజీ కౌంట్ 30 నుంచి 50 లోపు ఎప్పుడైనా దీనిని విక్రయించుకోవచ్చు. ఎన్ని గ్రాములు పెరుగుతుంది: 30.3 గ్రాముల వరకూ పెరుగుతుంది. ఎక్కడ డిమాండ్ ఉంది: వెనామీకి విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. అక్కడ కేజీ రొయ్య ధర రూ. 1200 కు పైనే ఉంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి: క్వాలిటీ సీడ్ వేసుకోవాలి. ప్రభుత్వ అనుమతులు ఉన్న కంపెనీల నుంచి నాణ్యత కలిగిన ఫీడ్‌ను వాడాలి. రొయ్యల చెరువుల్లోకి బయటనుంచి హానికర క్రిములు, కీటకాలు రాకుండా జాగ్త్రలు తీసుకోవాలి. ఆక్సిజన్ సరఫరా సక్రమంగా జరిగేలా చూడాలి. ఇందుకోసం ఏరియేటర్లను ఉపయోగించాలి.