సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఆక్వా రంగం మళ్లీ వికసిస్తోంది. 2014–19 టీడీపీ హయాంలో కుదేలైన రైతులు ప్రభుత్వ ప్రోత్సాహంతో మళ్లీ కోలుకుంటున్నారు. విద్యుత్ సబ్సిడీ, ధరల స్థిరీకరణ, నాణ్యమైన సీడ్, ఫీడ్ అందే విధంగా ఆక్వా ల్యాబ్‌లను అందుబాటులోకి తేవడంతో ఆదాయబాట పడుతున్నారు. జిల్లాలో 15 వేల హెక్టార్లలో ఆక్వా సాగులో ఉంది. దాదాపు లక్ష టన్నుల ఆక్వా ఉత్పత్తులు వస్తున్నాయి. ఈ దఫా విదేశాలకు ఎగుమతులకు అనుమతులు లభించడంతో ఒక్కసారిగా ధరలు ఊపందుకున్నాయి. పక్షం రోజుల క్రితం వరకు 100 కౌంట్ రూ. 90 ఉండగా ఇప్పుడు రూ. 270లకు చేరడంతో ఆక్వా రైతులు ఆనందానికి అవధుల్లేవు.
ఆక్వా రైతుల పక్షపాతిగా..
రైతు ముఖ్యమంత్రిగా ముద్ర వేసుకున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆక్వా రంగంలో పెను మార్పులు తీసుకువచ్చారు. విద్యుత్ చార్జీల తగ్గింపు, ఉచితంగా ఆక్వా ల్యాబ్‌లు, నాణ్యమైన సీడ్, సాగులో మెళకువలు, సూచనలు అందేలా మత్స్యశాఖ పర్యవేక్షణలో చేపట్టారు. దళారుల నియంత్రణ, గిట్టుబాటు ధర, విదేశాలకు ఎగుమతులకు అనుమతులు తదితర లాభసాటి ప్రయోజనాలతో ప్రభుత్వం రైతులకు అండగా నిలిచింది.
ఆక్వా సాగు రోజు రోజుకు వృద్ధి చెందింది. వెనామీ రొయ్యల ధరలు మూడు వారాలు ఆశాజనకంగా ఉన్నాయి. ప్రతి నెల ఆక్వా ధరలు పెరుగుతూ ప్రతి కౌంట్‌లో వ్యత్యాసం కనిపిస్తోంది. 30 కౌంట్ రూ. 530 వద్ద ట్రేడ్ అవుతోంది. గత రెండు నెలల ధరలతో పోలిస్తే ప్రస్తుతం ప్రతి కౌంట్‌పై రూ.100 నుంచి రూ. 150 వరకు ధర పెరుగుదలతో రైతులకు గణనీయమైన ఆదాయం దక్కుతోంది.
టీడీపీ హయాంలో ఆక్వాసాగు కుదేలు
టీడీపీ హయాంలో ఆక్వా రైతులు అప్పులు ఊబిలో కూరుకుపోయారు. అధిక విద్యుత్ చార్జీలు, ప్రకృతి వైపరీత్యాలతో టీడీపీ ప్రభుత్వ హయాంలో సాగు సంక్షోభంలో పడింది. ఆశించిన దిగుబడులు లభించకపోవడంతో ఆక్వా రంగం క్రమేపీ అవరోహణ క్రమంలో దిగజారిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment