రొయ్యో.. మొర్రో!
భీమవరం: మండుతున్న ఎండలకు వనామి రొయ్య ఎదురీదుతోంది. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో చెరువుల్లోని రొయ్యలు విలవిల్లాడుతున్నాయి. దీంతో ఆక్వా రైతులకు ప్రస్తుత పరిస్థితి దడపుట్టిస్తోంది. ఆక్వా సాగు అధికంగా ఉండే ఉభయగోదావరి జిల్లాల్లో సుమారు 45వేల ఎకరాల్లో వనామి రొయ్యలు సాగు చేస్తున్నారు. పదిహేను రోజులుగా ఉష్ణోగ్రత తీవ్రం కావడంతో చెరువుల్లోని నీళ్లు వేడెక్కి రొయ్యలు తేలియాడుతున్నాయి. వనామి రొయ్యలకు వైట్‌కాట్ (తెల్లమచ్చ) వ్యాధి సోకి మేత తినలేక కళ్లు తేలే సి మృత్యువాత పడుతున్నాయి.
ఐదారు రోజులుగా ఉభయ గోదావరి జిల్లాల్లోని ఆక్వా చెరువుల్లో ఎండ దెబ్బకు రన్నింగ్ మెటాలిటీ సిలికాం(ఆర్‌ఎంఎస్) వ్యాధికి గురై రోజుకు సుమారు 2వేల 500 నుంచి 3 వేల ఎకరాల్లో రొయ్యలు తుడిచిపెట్టుకుపోతున్నాయి. దీంతో సరైన ధర లేనప్పటికీ రైతులు ఎంతోకొంత దక్కుతుందనే ఆశతో పట్టుబడులు సాగిస్తూ ప్రతిరోజూ 600 నుంచి 700 టన్నుల రొయ్యలను ఈ జిల్లాల నుంచి ఎగుమతి చేస్తున్నారు. అయినకాడికి అమ్ముకుంటూ రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.
విద్యుత్ కోతలతో పెరుగుతున్న వెతలు
ఒక పక్క వేసవి ఉష్ణోగ్రతలకు ఉక్కిరిబిక్కిరి అవుతున్న వనామి రొయ్యలు సాగుచేస్తున్న రైతులను విద్యుత్ కోతలు మరింత కుంగదీస్తున్నాయి. వేళాపాళాలేని విద్యుత్ కోతలతో చెరువుల్లోని ఏరియేటర్ల తిరిగే పరిస్థితి కనిపించడంలేదు. ప్రకృతితో పాటు ప్రభుత్వం కూడా తమకు సహకరించటంలేదని ఆక్వా రైతులు వాపోతున్నారు. విద్యుత్ కోతలకు ఏరియేటర్ల తిరగక చెరువు నీటిలో ఆక్సిజన్ శాతం లోపించటం రొయ్యలకు మరో విఘాతంగా పరిణమించిందని రైతులు గగ్గోలు పెడుతున్నారు.
పడిపోతున్న ధర
వ్యాధి భారిన పడుతున్న చెరువుల్లోని రొయ్యలను ముందుగానే పట్టుబడులు పట్టలేక, అలాగే వాటిని చెరువుల్లో వదిలేయలేక రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. ప్రస్తుతం 40 కౌంటు కిలో రూ.350, 50 కౌంట్ రూ.300 చొప్పున ఉన్న ధరలు గిట్టుబాటు కాకపోయినా గత్యంతరం లేక తెగనమ్ముకుని తీవ్రంగా నష్టపోతున్నారు.