ఆక్వా సాగులో నష్టాలెందుకు వస్తున్నాయ్‌? | Aquaculture Loses In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

కష్టాల సాగు.. ఆక్వా

Published Fri, Dec 14 2018 11:59 AM | Last Updated on Fri, Dec 14 2018 4:48 PM

Aquaculture Loses In Andhra Pradesh - Sakshi

ఈ చిత్రంలో వ్యక్తి.. సతీష్‌. కృష్ణా జిల్లా బందరు మండలంలో 20 ఎకరాల విస్తీర్ణంలోని చెరువుల్లో వనామీ సాగు చేస్తున్నాడు. ఎకరానికి లక్ష చొప్పున 20 లక్షల రొయ్యి పిల్లలు వదిలాడు. గత మూడు రోజులుగా వాతావరణ మార్పులతో కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నాడు. మంగళవారం అర్ధరాత్రి ఆక్సిజన్‌ లోపించి రొయ్య పిల్లలు చెరువుల పై భాగానికి వచ్చేశాయి. ఇది గమనించి అప్పటికప్పుడు ఎకరానికి కిలో చొప్పున 20 కిలోల ఆక్సిజన్‌ బిళ్లలు చల్లడంతో రొయ్యి పిల్లలు బతికిపోయాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పిల్లలకు వెచ్చించిన రూ.6 లక్షలు నష్టపోవాల్సి వచ్చేది. ఇది.. ఆక్వా రైతు అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని వివరించే ఘటన.

ఈ చిత్రంలో వ్యక్తి.. కల్లూరు బాబు. నెల్లూరు జిల్లా వాకాడు మండలం కల్లూరులో రొయ్యల సాగు చేస్తున్నాడు. ఒక ఎకరా చెరువులో రూ.45 వేలు ఖర్చు చేసి లక్ష రొయ్య పిల్లలను వదిలాడు. అప్పటి నుంచి రొయ్యలు పట్టే వరకూ కరెంట్‌ బిల్లు రూ. 50 వేలు వచ్చింది. రొయ్యలకు రెండు టన్నుల ఫీడ్‌ వాడాడు. దీనికి రూ.1.60 లక్ష అయింది. అలాగే చెరువులో ఆక్సిజన్‌ కోసం ఏరేటర్స్, జనరేటర్‌కు అద్దె, దాని ఇంధనం, కాపలాదారు కూలీకి రూ.50 వేలు ఖర్చు చేశాడు. ఇలా అన్నిటికి కలిపి రూ.3.5 లక్షలు వ్యయమైంది. దిగుబడి.. 80 కౌంట్‌ రొయ్యలు టన్ను వచ్చింది. వాటిని విక్రయించగా రూ. 1.90 లక్షల రాబడి వచ్చింది. దీంతో రూ.1.15 లక్షల నష్టం వాటిల్లింది. ఇవి.. సతీష్, కల్లూరు బాబు బాధలు మాత్రమే కాదు. రాష్ట్రవ్యాప్తంగా ఆక్వా రైతులందరూ ఇలాంటి కష్టాలే ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆక్వా సాగులో రైతుల కష్టాలపై ప్రత్యేక కథనం..

సాక్షి, మచిలీపట్నం: డాలర్ల పంటగా పిలిచే ఆక్వా రంగంలో ఎన్నో కన్నీటి కష్టాలు ఉన్నాయి. సాగు ప్రారంభం నుంచి దిగుబడి వరకూ రైతుల కష్టం అంతా ఇంతా కాదు. ప్రతిక్షణం అప్రమత్తంగా ఉంటేనే పంట చేతికి దక్కేది.. లేకపోతే తీవ్ర నష్టాలు తప్పవు. ఆక్వా సాగుకు వైరస్‌ సోకడంతోపాటు ధరలు తగ్గిపోతే నష్టాల ఊబిలో కూరుకుపోవాల్సిందే. రాష్ట్రంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో ఆక్వా రంగం విస్తరించి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల ఎకరాల్లో అధికారికంగా, 1.20 లక్షల ఎకరాల్లో అనధికారికంగా సాగు జరుగుతోంది.

సీడ్‌ నుంచే కష్టాలు ప్రారంభం
చెరువును బాగుచేసి రొయ్య పిల్లలు (సీడ్‌) వేయడం నుంచి ఆక్వా సాగు ప్రారంభమవుతుంది. చెరువు లోతును బట్టి లక్ష నుంచి లక్షన్నర వరకు పిల్లలను వదులుతారు. పిల్లల్ని వదిలిన క్షణం నుంచి ప్రతిరోజూ చెరువు వద్ద అప్రమత్తంగా ఉండాలి. రోజూ మూడు, నాలుగు పర్యాయాలు వాటికి మేత (ఫీడ్‌) ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కపూట మేత ఇవ్వకపోయినా రొయ్య దిగుబడిపై ప్రభావం పడుతుంది. రాత్రిళ్లు సైతం పిల్లల పరిస్థితిని పరిశీలిస్తుండాలి. ఎప్పటికప్పుడు మారిపోయే వాతావరణ పరిస్థితుల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. అధిక ఉష్ణోగ్రతలు, శీతల వాతావరణంలో ఆక్సిజన్‌ కొరత ఏర్పడి పిల్లలు ఎక్కువగా చనిపోతుంటాయి. ఈ సందర్భంలో ఆక్సిజన్‌ బిళ్లలను ఎకరానికి కిలో చొప్పున చల్లాలి. ఏరేటర్లు క్రమంగా తిరుగుతున్నాయో? లేదో? గమనిస్తుండాలి.

ఎకరం చెరువులో లక్ష వరకు పిల్లలకు రూ.30 నుంచి రూ.40 వేలు, మేత (ఫీడ్‌), మందులు, చెరువు లీజుకు మొత్తం రూ.4–5 లక్షలు వెచ్చించాలి. ఎకరం చెరువుకు విద్యుత్‌ బిల్లు నెలకు రూ.5 నుంచి రూ.10 వేల వరకు వస్తుంది. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగితే ఏరేటర్‌ను వినియోగించాల్సి ఉంటుంది. ఎకరానికి రెండు ఏరేటర్లు వినియోగిస్తారు. అంటే.. రోజుకు రూ.500 డీజిల్‌ రూపంలో అదనపు భారం పడుతోంది. పంట దిగుబడి ఆశించిన మేర అందితేనే లాభాలు ఆర్జించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం హేచరీల నుంచి నాసిరకం పిల్లలు దిగుమతి అవుతుండటంతో లక్ష పిల్లలను చెరువులో వేస్తే 30 నుంచి 40 శాతం వరకు చనిపోతున్నాయి. దీంతో పెట్టిన పెట్టుబడులు కూడా రాని దుస్థితి.

వైరస్‌లతో తీవ్ర నష్టం
వాతావరణంలో నెలకొంటున్న మార్పులతో వైరస్‌లు (వైట్‌స్పాట్, విబ్రియో), ఈహెచ్‌పీ (ఎండ్రోజోవన్‌ హెపటోపినై) అనే ప్రొటోజోవా విజృంభిస్తున్నాయి. వీటి నియంత్రణకు మందులు, మినరల్స్‌ చెరువులో చల్లాల్సి ఉంటుంది. లేని పక్షంలో రొయ్యల్లో నాణ్యత లోపిస్తుంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర ఉండటం లేదు. వెనామీ రొయ్యలు గతేడాది 30 కౌంట్‌ (కిలోకి 40 రొయ్యలు) రూ.500 ఉండగా ప్రస్తుతం రూ.380కు మించడం లేదు. గతేడాదితో పోల్చితే టన్నుపై రూ.60 వేల నుంచి రూ.70 వేల వరకూ ధరలు పడిపోయాయి. పంట బాగా వచ్చిందంటే.. ఎకరానికి టన్ను నుంచి టన్నున్నర దిగుబడి వస్తుంది. ప్రస్తుత ధరల ప్రకారం చూస్తే రాబడి రూ. 5–6 లక్షల మధ్య ఉంటుంది. పెట్టుబడి రూ.4–5 లక్షల వరకు అవుతోంది.

వ్యయప్రయాసల కోర్చి పగలనక, రాత్రనక పనిచేస్తే.. మూడు నెలల కష్టానికి కేవలం రూ.లక్ష ఆదాయం మాత్రమే లభిస్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఏదైనా తేడా వస్తే.. పెట్టుబడి మొత్తం బూడిదలో పోసినట్లే. 60 కౌంట్‌ వరకు రొయ్యి పెరిగితే.. పెద్దగా నష్టం లేకుండా పెట్టుబడులు అయినా వస్తాయి. కౌంట్‌ 60 దాటితే... రైతు నష్టపోయినట్లే. కౌంట్‌ 100 దాటితే... పెట్టుబడి దాదాపు పోయినట్లే. 100 కౌంట్‌ దాటితే ఎగుమతికి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. స్థానికంగా అమ్ముకోవాల్సిందే. స్థానికంగా విక్రయిస్తే పెద్దగా ధరలు ఉండవు. రొయ్యలకు దేశీయంగా పెద్దగా ధర వచ్చే మార్కెటింగ్‌ లేదు. అమెరికా, ఐరోపా, ఆసియాలోని కొన్ని దేశాలకు ఎగుమతి చేయాల్సి వస్తోంది. ఇదే అదునుగా భావించిన కొనుగోలుదారులు సిండికేటై ధరలు అమాంతం తగ్గించేస్తున్నారు.

గత పక్షంలో ధరల పతనం ఇలా..
పక్షం క్రితం 100 కౌంట్‌ రొయ్యలు టన్ను ధర రూ. 2.30 లక్షలు ఉండగా.. ప్రస్తుతం రూ.2 లక్షలే ఉంది. అలాగే 90 కౌంట్‌ టన్ను రూ.2.50 లక్షలు ఉండగా.. ప్రస్తుతం రూ.2.20 లక్షలే పలుకుతోంది. ఇలా ప్రతి కౌంట్‌పై టన్నుకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకూ ధరలు పతనం అయ్యాయి. రాబోయే రోజుల్లో ధరలు మరింత పతనమవుతాయనే రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఆక్వా రైతుల డిమాండ్లు ఇవీ..
రైతుల చేతికి పంట వచ్చే సమయానికి వ్యాపారులంతా సిండికేట్‌గా మారి ధరలు తగ్గిస్తుండటంతో రైతులు నష్టపోతున్నారు. నెక్‌.. రోజూ కోడిగుడ్డు ధరలను ప్రకటించినట్టే దేశీయంగా, అంతర్జాతీయంగా రొయ్యల ధరలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాలి.
రొయ్యల మందులు, మేతలు, రొయ్య పిల్లల ఉత్పత్తి మీద దేశంలో ఎలాంటి నియంత్రణ లేదు. నాణ్యత లేనివి మార్కెట్‌లోకి రాకుండా ప్రభుత్వం నియంత్రించాలి. నాణ్యత లేని సరుకు అమ్మితే చర్యలు తీసుకొనే వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
నష్టాల పాలవుతున్న ఆక్వా రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.

రొయ్య పిల్లల నాణ్యత చాలా ముఖ్యం
రొయ్యల సాగులో రొయ్య పిల్లల నాణ్యత చాలా ముఖ్యం. నాణ్యత లేని పిల్లలు మార్కెట్లోకి వస్తున్నాయి. తల్లి రొయ్యకు కనీసం 100 రోజులు ఉంటేనే పిల్లలు ఆరోగ్యంగా ఉంటాయి. వీటిని తీసుకుని మన ప్రాంతానికి అలవాటుపడేలా మరో 20–30 రోజుల పాటు హేచరీల్లో వేయాలి. ఇక్కడి నీరు, వాతావరణం, నేలను అలవాటు చేసిన తర్వాత చెరువులో వేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.  
– పట్టపు శ్రీనివాసరావు, చెరుకుమిల్లి, కృత్తివెన్ను మండలం, కృష్ణా జిల్లా

ధరల తగ్గుదలతో నష్టాలు
వాతావరణం అనుకూలించకపోవడం, వైట్‌కట్, వైరస్‌లతో పిల్లలు చనిపోతున్నాయి. డ్రెయిన్లలో ఉప్పు శాతం ఎక్కువగా ఉండటంతో ఇబ్బందిగా ఉంది. నాణ్యత లేమితోపాటు దాణా ధరలు పెరగడంతో ఖర్చులు పెరిగి నష్టాలొస్తున్నాయి.
– పులగం శీను, చెరుకుమిల్లి, కృత్తివెన్ను మండలం, కృష్ణా

జాగ్రత్తలు పాటించాలి
రొయ్యల సాగులో జాగ్రత్తలు పాటిస్తే మంచి దిగుబడులు సాధ్యమే. నేను మూడెకరాల్లో వనామీ రొయ్యల సాగు చేసి ఇటీవల మూడున్నర టన్నుల దిగుబడిని సాధించాను. ఎకరం చెరువులో 60 వేల పిల్లలను మాత్రమే వేసి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను.
– నారాయణ, రుద్రవరం, బందరు మండలం, కృష్ణా

అవగాహన ఉంటే ఆక్వా లాభదాయకం
రైతుల్లో అవగాహన, వాతావరణ అనుకూలత ఉంటే ఆక్వాకల్చర్‌ లాభదాయకమే. అయితే కనీస మెలకువలు, అవగాహన లేక నష్టాలను చవి చూడాల్సి వస్తోంది. ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాలు, భౌతిక, రసాయనిక మార్పులతో రొయ్యలు మనుగడ సాగించలేకపోవడంతో రైతులకు నష్టాలు తప్పడం లేదు. చేపలు చనిపోతే నీటిలో పైకి తేలతాయి. కానీ రొయ్యలు చనిపోతే చనిపోయినట్లు కూడా తెలియదు. రొయ్య పిల్లలు చనిపోతే చెరువులో కిందకు చేరి వ్యర్థాలుగా మారి విషపూరిత రసాయనాలుగా మారతాయి. ఎగువ భాగంలో ఉండే చెరువు నీటిలో వైరస్‌ ఉంటే.. అది దిగువన ఉన్న చెరువులకు కూడా సోకుతుంది. దీన్ని ఆక్వా రైతులు గ్రహించలేకపోతున్నారు. లాభాలు అధికంగా వస్తాయనే ఆశతో ఎకరానికి వేయాల్సిన రొయ్యల పిల్లల సంఖ్య కంటే రెట్టింపు వేస్తున్నారు. దీంతో అవి పెరిగేందుకు చెరువు సరిపోవడం లేదు. అంతేకాకుండా కృత్రిమ ఆహారం, రసాయనిక ఆహారాలను రెట్టింపు వేస్తున్నారు. ఆహారం మొత్తం పిల్లలకు చేరకుండా సగం నీటిలో కలిసి అడుగున విషపదార్థంగా మారుతుంది. ఈ వాతావరణంలో పెరిగిన రొయ్యలు తినడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. ఇలాంటి రొయ్యలనే విదేశాలు తిప్పిపంపేస్తున్నాయి.
– ఆచార్య కె.వీరయ్య, కోఆర్డినేటర్, మ్యాట్రిక్స్‌ ఆక్వాకల్చర్‌ సెంటర్, ఏఎన్‌యూ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement