‘ఆక్వా’ సంక్షోభం తాత్కాలికమే | Seafoods Exporters Association Leaders On aqua crisis | Sakshi
Sakshi News home page

‘ఆక్వా’ సంక్షోభం తాత్కాలికమే

Published Fri, Nov 18 2022 3:16 AM | Last Updated on Fri, Nov 18 2022 8:04 AM

Seafoods Exporters Association Leaders On aqua crisis - Sakshi

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న బీద మస్తాన్‌రావు, అసోసియేషన్‌ నాయకులు

సాక్షి, రాజమహేంద్రవరం: ‘ఆక్వా సంక్షోభం అంతర్జాతీయ స్థాయిలో ఏర్పడిందని.. మరో రెండు నెలల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని.. సంక్షోభం నుంచి రైతులను గట్టెక్కించేందుకు ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు రొయ్యలు కొనుగోలు చేస్తామని సీఫుడ్స్‌ ఎక్స్‌పోర్టర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షులు అల్లూరి ఇంద్రకుమార్, రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్‌రావ్, అసోసియేషన్‌ నేతలు వెల్లడించారు. రాజమహేంద్రవరంలో గురువారం ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు తదితర జిల్లాలకు చెందిన రైతులు, ఎగుమతిదారుల సమావేశం నిర్వహించారు.

అనంతరం మీడియాతో వారు మాట్లాడారు. రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం ఫలితంగా యూరోపియన్, చైనాల జీరో కోవిడ్‌ పాలసీ అమలు, అమెరికాలో వనామీ రొయ్యల నిల్వలు పెరిగిపోవడం లాంటి పరిణామాలతో ఆక్వా రంగం గత మూడు నెలలుగా సంక్షోభాన్ని ఎదుర్కొంటోందన్నారు. డిసెంబర్, జనవరి నెలల్లో విదేశాల్లో పండుగలు ఉన్నాయని.. అక్కడ నిల్వ ఉన్న సరుకుతోపాటు దేశంలో ఎగుమతిదారుల వద్ద ఉన్న సరుకు అమ్ముడుపోతుందని, ఫలితంగా భారత్‌లో తిరిగి రొయ్యల ఎగుమతులు పుంజుకుంటాయన్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు అండగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం సూచించిన మేరకు 100 కౌంట్‌ రూ.210, 30 కౌంట్‌ రూ.380కి కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రతిరోజూ ధరల్లో మార్పులేకుండా 10–20 రోజుల పాటు నిర్ణీత ధర ఇచ్చేందుకు అంగీకరించారు. సంక్షోభంలో ఉన్న రైతులను ఆదుకోవాల్సింది పోయి.. కొంతమంది జె–ట్యాక్స్, ఆ ట్యాక్స్, ఈ ట్యాక్స్‌ అంటూ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలను మానుకోవాలని హితవు పలికారు. వ్యవసాయం తర్వాత అత్యధిక సాగులో ఉన్న ఆక్వా రంగంపై లేనిపోని ఆరోపణలుచేసి రైతులతో రాజకీయం చెయ్యొద్దని వారు విజ్ఞప్తి చేశారు. 

క్రాప్‌ హాలిడే ఆలోచనే లేదు: 
ఆక్వా రంగం సంక్షోభాలు రైతులకు కొత్తేమీకాదన్నారు. టైగర్‌ రొయ్య సాగులో నష్టాలు చూశారన్నారు. ప్రస్తుతం వనామీలో సంక్షోభం తాత్కాలికమేనని వారు స్పష్టంచేశారు. రైతులు క్రాప్‌ హాలిడే ప్రకటిస్తారన్న ఆరోపణలను వారు ఖండించారు. అలాంటి ఆలోచన రైతులకు లేదన్నారు. కేవలం గిట్టుబాటు ధర కావాలని డిమాండ్‌ చేస్తున్నారన్నారు. అందుకనుగుణంగా ప్రభుత్వం ఎప్పటికప్పుడు రైతులు, ఎగుమతిదారులను సంప్రదిస్తూ సూచనలు చేస్తోందన్నారు. ఇందుకుగాను ఒక కమిటీ వేసి మరీ పర్యవేక్షిస్తోందని గుర్తుచేశారు. రైతుల సమస్యలపై సంప్రదించేందుకు త్వరలో టోల్‌ఫ్రీ నంబర్‌ను కూడా ఏర్పాటుచేస్తామన్నారు. 

రైతులకు సూచనలు..
ఆక్వా రంగంలో నష్టాల నుంచి గట్టెక్కాలంటే రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాలని విధానాలపై వక్తలు అవగాహన కల్పించారు. భవిష్యత్తులో ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా రైతులకు పలు సూచనలు చేశారు. అవి..

► అందరూ ఒకేసారి పంట వేసి ఇబ్బందులు పడకుండా క్రాప్‌ రొటేషన్‌ పద్ధతి పాటించాలి.
► ఎగుమతులకు ఇబ్బందికరంగా మారిన 100 కౌంట్‌ రొయ్యల సాగుకు స్వస్తిపలికి 70, 80, 30 కౌంట్‌ రొయ్యలపై దృష్టిపెట్టాలి.
► చెరువుల్లో తక్కువ స్థాయిలో సీడ్‌ వేసి ఎక్కువ కౌంట్‌ సాధించేలా ప్రణాలికాబద్ధంగా వ్యవహరించాలి.
► దేశంలో 8 లక్షల మెట్రిక్‌ టన్నుల రొయ్యలు ఉత్పత్తి అవుతుంటే ఒక్క ఆంధ్రప్రదేశ్‌ నుంచే 5 లక్షల మెట్రిక్‌ టన్నులు ఉత్పత్తి జరుగుతోంది.
► ఇందులో సింహభాగం ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచే ఉంటోంది. 

పెద్ద రైతులకూ విద్యుత్‌ సబ్సిడీ ఇవ్వాలి
ప్రభుత్వం చిన్న రైతులకు విద్యుత్‌ సబ్సిడీ ఇస్తోంది. వాటిని పెద్ద రైతులకూ అమలుచేయాలి. మేతల ధరలు పెరగడంతో ఉత్పత్తి వ్యయం పెరుగుతోంది. నాణ్యమైన సీడ్, మేత లభించకపోవడం ఓ కారణమైపోతోంది. 
– రుద్రరాజు నానిరాజు, ఆక్వా రైతులు, కోనసీమ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement