Seafoods
-
మత్స్య ఎగుమతుల్లో ఏపీ టాప్
సాక్షి, న్యూఢిల్లీ: మత్స్య ఉత్పత్తుల ఎగుమతుల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలిచింది. రాష్ట్రం నుంచి 2019–24 మధ్య 15.74లక్షల టన్నుల మత్స్య సంపదను ఎగుమతి చేశారు. దీనిద్వారా రూ.90,633కోట్ల ఆదాయం వచ్చింది. ఈ మేరకు ఇటీవల లోక్‌సభలో కేంద్ర మత్స్య, పశుసంవర్థక శాఖ మంత్రి రాజీవ్‌రంజన్ సింగ్ ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ 2019–24 మధ్య ఏపీలో మత్స్య ఉత్పత్తులు, ఎగుమతులు రికార్డు స్థాయిలో పెరిగాయని చెప్పారు.మత్స్య రంగానికి, రైతులకు నాటి వైఎస్ జగన్ ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహకమే ఇందుకు కారణమని ప్రకటించారు. 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో రూ.65,312 కోట్ల విలువైన సుమారు 11లక్షల టన్నులు మత్స్య సంపద మాత్రమే ఎగుమతి అయినట్లు తెలిపారు. వైఎస్ జగన్ హయాంలో అనూహ్యంగా 15.74 లక్షల టన్నుల మత్స్య ఉత్పత్తులు ఎగుమతులు చేసినట్లు వివరించారు. అదేవిధంగా మత్స్య ఉత్పత్తిలో ప్రపంచంలో భారతదేశం రెండో స్థానంలో ఉందని ఆయన చెప్పారు. జగన్ ప్రభుత్వ ప్రోత్సాహంతో పెరిగిన ఆక్వా సాగు రాష్ట్రంలో 2019–24 మధ్య వైఎస్ జగన్ ప్రభుత్వ ప్రోత్సాహంతో ఆక్వా సాగు గణనీయంగా పెరిగింది. ఆక్వా రంగ సుస్థిరాభివృద్ధి కోసం ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ, ఏపీ ఫిష్, ఏపీ సీడ్ యాక్టులను తీసుకొచ్చారు. రైతులకు సబ్సిడీపై విద్యుత్‌ను అందించడం, ధరలు పతనం కాకుండా చూడటం వంటి అనేక చర్యలు చేపట్టారు. ఫలితంగా రాష్ట్రంలో 1.75లక్షల మంది రైతులు ఆక్వాసాగు చేస్తున్నారు. ఐదేళ్లలో మత్స్య ఉత్పత్తులు 39 లక్షల టన్నుల నుంచి 51 లక్షల టన్నులకు పెరిగాయి. రొయ్యల దిగుబడులు 4.54లక్షల టన్నుల నుంచి 9.56 లక్షల టన్నులకు పెరగడం విశేషం. -
‘ఆక్వా’ సంక్షోభం తాత్కాలికమే
సాక్షి, రాజమహేంద్రవరం: ‘ఆక్వా సంక్షోభం అంతర్జాతీయ స్థాయిలో ఏర్పడిందని.. మరో రెండు నెలల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని.. సంక్షోభం నుంచి రైతులను గట్టెక్కించేందుకు ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు రొయ్యలు కొనుగోలు చేస్తామని సీఫుడ్స్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు అల్లూరి ఇంద్రకుమార్, రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్రావ్, అసోసియేషన్ నేతలు వెల్లడించారు. రాజమహేంద్రవరంలో గురువారం ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు తదితర జిల్లాలకు చెందిన రైతులు, ఎగుమతిదారుల సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో వారు మాట్లాడారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ఫలితంగా యూరోపియన్, చైనాల జీరో కోవిడ్ పాలసీ అమలు, అమెరికాలో వనామీ రొయ్యల నిల్వలు పెరిగిపోవడం లాంటి పరిణామాలతో ఆక్వా రంగం గత మూడు నెలలుగా సంక్షోభాన్ని ఎదుర్కొంటోందన్నారు. డిసెంబర్, జనవరి నెలల్లో విదేశాల్లో పండుగలు ఉన్నాయని.. అక్కడ నిల్వ ఉన్న సరుకుతోపాటు దేశంలో ఎగుమతిదారుల వద్ద ఉన్న సరుకు అమ్ముడుపోతుందని, ఫలితంగా భారత్‌లో తిరిగి రొయ్యల ఎగుమతులు పుంజుకుంటాయన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు అండగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం సూచించిన మేరకు 100 కౌంట్ రూ.210, 30 కౌంట్ రూ.380కి కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రతిరోజూ ధరల్లో మార్పులేకుండా 10–20 రోజుల పాటు నిర్ణీత ధర ఇచ్చేందుకు అంగీకరించారు. సంక్షోభంలో ఉన్న రైతులను ఆదుకోవాల్సింది పోయి.. కొంతమంది జె–ట్యాక్స్, ఆ ట్యాక్స్, ఈ ట్యాక్స్ అంటూ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలను మానుకోవాలని హితవు పలికారు. వ్యవసాయం తర్వాత అత్యధిక సాగులో ఉన్న ఆక్వా రంగంపై లేనిపోని ఆరోపణలుచేసి రైతులతో రాజకీయం చెయ్యొద్దని వారు విజ్ఞప్తి చేశారు. క్రాప్ హాలిడే ఆలోచనే లేదు: ఆక్వా రంగం సంక్షోభాలు రైతులకు కొత్తేమీకాదన్నారు. టైగర్ రొయ్య సాగులో నష్టాలు చూశారన్నారు. ప్రస్తుతం వనామీలో సంక్షోభం తాత్కాలికమేనని వారు స్పష్టంచేశారు. రైతులు క్రాప్ హాలిడే ప్రకటిస్తారన్న ఆరోపణలను వారు ఖండించారు. అలాంటి ఆలోచన రైతులకు లేదన్నారు. కేవలం గిట్టుబాటు ధర కావాలని డిమాండ్ చేస్తున్నారన్నారు. అందుకనుగుణంగా ప్రభుత్వం ఎప్పటికప్పుడు రైతులు, ఎగుమతిదారులను సంప్రదిస్తూ సూచనలు చేస్తోందన్నారు. ఇందుకుగాను ఒక కమిటీ వేసి మరీ పర్యవేక్షిస్తోందని గుర్తుచేశారు. రైతుల సమస్యలపై సంప్రదించేందుకు త్వరలో టోల్‌ఫ్రీ నంబర్‌ను కూడా ఏర్పాటుచేస్తామన్నారు. రైతులకు సూచనలు.. ఆక్వా రంగంలో నష్టాల నుంచి గట్టెక్కాలంటే రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాలని విధానాలపై వక్తలు అవగాహన కల్పించారు. భవిష్యత్తులో ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా రైతులకు పలు సూచనలు చేశారు. అవి.. ► అందరూ ఒకేసారి పంట వేసి ఇబ్బందులు పడకుండా క్రాప్ రొటేషన్ పద్ధతి పాటించాలి. ► ఎగుమతులకు ఇబ్బందికరంగా మారిన 100 కౌంట్ రొయ్యల సాగుకు స్వస్తిపలికి 70, 80, 30 కౌంట్ రొయ్యలపై దృష్టిపెట్టాలి. ► చెరువుల్లో తక్కువ స్థాయిలో సీడ్ వేసి ఎక్కువ కౌంట్ సాధించేలా ప్రణాలికాబద్ధంగా వ్యవహరించాలి. ► దేశంలో 8 లక్షల మెట్రిక్ టన్నుల రొయ్యలు ఉత్పత్తి అవుతుంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే 5 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి జరుగుతోంది. ► ఇందులో సింహభాగం ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచే ఉంటోంది. పెద్ద రైతులకూ విద్యుత్ సబ్సిడీ ఇవ్వాలి ప్రభుత్వం చిన్న రైతులకు విద్యుత్ సబ్సిడీ ఇస్తోంది. వాటిని పెద్ద రైతులకూ అమలుచేయాలి. మేతల ధరలు పెరగడంతో ఉత్పత్తి వ్యయం పెరుగుతోంది. నాణ్యమైన సీడ్, మేత లభించకపోవడం ఓ కారణమైపోతోంది. – రుద్రరాజు నానిరాజు, ఆక్వా రైతులు, కోనసీమ -
సీఫుడ్డే సో బెటరు..
* చేప వంటకాలపై హైదరాబాదీల మక్కువ.. * ఫుడ్‌పాండా.ఐఎన్ సర్వేలో వెల్లడి * తొలి మూడు స్థానాల్లో బెంగళూరు, హైదరాబాద్, ముంబయి సాక్షి,సిటీబ్యూరో: భాగ్యనగర వాసులు సీఫుడ్స్ అంటే లొట్టలు వేస్తున్నారట.. ఆన్లైన్లో చేపలు,రొయ్యలు వంటి వంటకాలను ఆర్డర్ చేసి తమ జిహ్వ చాపల్యాన్ని తీర్చుకుంటున్నట్టు ఆన్లైన్లో ఆహార పదార్థాలను విక్రయించే ప్రముఖ వెబ్సైట్ ఫుడ్‌పాండా.ఐఎన్ దేశంలోని పలు నగరాల్లో చేసిన సర్వేలో వెల్లడైంది. ఇందులో బెంగళూరు నగరం తొలిస్థానంలో ఉండగా.. హైదరాబాద్ రెండోస్థానంలో నిలవడం విశేషం. మూడో స్థానాన్ని ముంబ యి దక్కించుకుంది. ఇక సముద్ర ఉత్పత్తులతో చేసిన వంటకాల ధర కాస్త ఎక్కువైనా ఆర్డరిచ్చే విషయంలో వెనుకాడక పోవడం గమనార్హం. గృహ వినియోగదారులు సైతం సముద్ర ఉత్పత్తులను కడుపారా ఆరగించేందుకు రూ.1500 నుంచి రూ.2400 వరకు ఖర్చు చేసేందుకు వెనుకాడడం లేదని ఈ సర్వేలో తెలింది. చేపముల్లు ఆనవాళ్లు లేని అపోలో ఫిష్ వంటకమంటే గ్రేటర్ వాసులు లొట్టలేస్తున్నారని తెలిపింది. బెంగళూరు వాసులు ఫిష్ బిర్యానీ అంటే మనసు పారేసుకుంటున్నారని తెలిపింది. ఇక ముంబయి, చెన్నై ప్రజలు రొయ్యలంటే మక్కువగా లాగించేస్తున్నారట. సీఫుడ్‌ను ఆన్లైన్లో ఆర్డర్ చేయడంలో ముంబయి వాసులు మూడోస్థానంలో నిలిచారని ఈ సర్వే తెలిపింది. ఈ సిటీ వాసులు రొయ్యలు, ఫిష్ తావా కబాబ్‌లను మనసారా ఆరగిస్తున్నారంది. హైదరాబాద్ నగరంలో అపోలో ఫిష్‌తోపాటు, ఫిష్ బిర్యానీ, రొయ్యల బిర్యానీ, ఫిష్ ఫ్రై వంటి వంటకాలంటే ఇష్టపడుతున్నట్టు తెలిపింది. సంప్రదాయ వంటకాలకే మొగ్గు.. ప్రయోగాలకంటే సంప్రదాయ వంటకాలకే దేశంలోని పలు సిటీజన్లు ప్రాధాన్యతనిస్తున్నట్లు ఈ సర్వే గుర్తించింది. ఫిష్ టిక్కా, చేపల కూర, పులుసు, బిర్యానీకి గిరాకీ బాగుందని తెలిపింది. సముద్ర తీరం ఉన్న నగరాల కంటే తీరం అందుబాటులో లేని హైదరాబాద్ నగరంలో సీఫుడ్‌కు ఆన్లైన్ గిరాకీ అధికమని తేల్చింది. గోవా, కేరళ, బెంగాల్ రాష్ట్రాల్లో ఆన్లైన్లో సీఫుడ్ ఆర్డర్ చేసే వారు కనిష్ట సంఖ్యలో ఉన్నారని తెలిపింది.