సీఫుడ్డే సో బెటరు..
* చేప వంటకాలపై హైదరాబాదీల మక్కువ..
* ఫుడ్‌పాండా.ఐఎన్ సర్వేలో వెల్లడి
* తొలి మూడు స్థానాల్లో బెంగళూరు, హైదరాబాద్, ముంబయి
సాక్షి,సిటీబ్యూరో: భాగ్యనగర వాసులు సీఫుడ్స్ అంటే లొట్టలు వేస్తున్నారట.. ఆన్‌లైన్‌లో చేపలు,రొయ్యలు వంటి వంటకాలను ఆర్డర్ చేసి తమ జిహ్వ చాపల్యాన్ని తీర్చుకుంటున్నట్టు ఆన్‌లైన్‌లో ఆహార పదార్థాలను విక్రయించే ప్రముఖ వెబ్‌సైట్ ఫుడ్‌పాండా.ఐఎన్ దేశంలోని పలు నగరాల్లో చేసిన సర్వేలో వెల్లడైంది. ఇందులో బెంగళూరు నగరం తొలిస్థానంలో ఉండగా.. హైదరాబాద్ రెండోస్థానంలో నిలవడం విశేషం.
మూడో స్థానాన్ని ముంబ యి దక్కించుకుంది. ఇక సముద్ర ఉత్పత్తులతో చేసిన వంటకాల ధర కాస్త ఎక్కువైనా ఆర్డరిచ్చే విషయంలో వెనుకాడక పోవడం గమనార్హం. గృహ వినియోగదారులు సైతం సముద్ర ఉత్పత్తులను కడుపారా ఆరగించేందుకు రూ.1500 నుంచి రూ.2400 వరకు ఖర్చు చేసేందుకు వెనుకాడడం లేదని ఈ సర్వేలో తెలింది. చేపముల్లు ఆనవాళ్లు లేని అపోలో ఫిష్ వంటకమంటే గ్రేటర్ వాసులు లొట్టలేస్తున్నారని తెలిపింది. బెంగళూరు వాసులు ఫిష్ బిర్యానీ అంటే మనసు పారేసుకుంటున్నారని తెలిపింది.
ఇక ముంబయి, చెన్నై ప్రజలు రొయ్యలంటే మక్కువగా లాగించేస్తున్నారట. సీఫుడ్‌ను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయడంలో ముంబయి వాసులు మూడోస్థానంలో నిలిచారని ఈ సర్వే తెలిపింది. ఈ సిటీ వాసులు రొయ్యలు, ఫిష్ తావా కబాబ్‌లను మనసారా ఆరగిస్తున్నారంది. హైదరాబాద్ నగరంలో అపోలో ఫిష్‌తోపాటు, ఫిష్ బిర్యానీ, రొయ్యల బిర్యానీ, ఫిష్ ఫ్రై వంటి వంటకాలంటే ఇష్టపడుతున్నట్టు తెలిపింది.
సంప్రదాయ వంటకాలకే మొగ్గు..
ప్రయోగాలకంటే సంప్రదాయ వంటకాలకే దేశంలోని పలు సిటీజన్లు ప్రాధాన్యతనిస్తున్నట్లు ఈ సర్వే గుర్తించింది. ఫిష్ టిక్కా, చేపల కూర, పులుసు, బిర్యానీకి గిరాకీ బాగుందని తెలిపింది. సముద్ర తీరం ఉన్న నగరాల కంటే తీరం అందుబాటులో లేని హైదరాబాద్ నగరంలో సీఫుడ్‌కు ఆన్‌లైన్ గిరాకీ అధికమని తేల్చింది. గోవా, కేరళ, బెంగాల్ రాష్ట్రాల్లో ఆన్‌లైన్‌లో సీఫుడ్ ఆర్డర్ చేసే వారు కనిష్ట సంఖ్యలో ఉన్నారని తెలిపింది.