కైకలూరు, న్యూస్‌లైన్ : ఓ సారి అతివృష్టి, మరోసారి అనావృష్టి.. ఇపుడేమో సమైక్యాంధ్ర ఉద్యమ ఫలితంగా అతలాకుతలమవుతున్న ఆక్వారైతును వ్యాధుల సునామీ భయపెడుతోంది. డెల్టాలో వరి తరువాత ప్రధాన సాగుగా వెనామీ (రొయ్యల్లో ఒక రకం) ఖ్యాతికెక్కింది. దేశవ్యాప్తంగా ఈ ఏడాది ప్రారంభంలో 2 లక్షల 45 వేల 613 టన్నుల రొయ్యల ఎగుమతి జరగగా, దానిలో లక్షా 23 వేల 551 టన్నులు వెనామీ దే. ఈ సాగులో మన రాష్ట్ర వాటా దాదాపు 80 వేల టన్నులుగా ఉంది.
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 70 వేల ఎకరాల్లో వెనామీ సాగవుతుండగా, జిల్లాలోనే 30 వేల ఎకరాల్లో జరుగుతుంది. యాంటీ డంపింగ్, దిగుమతుల సుంకం వంటి ఒడిదొడుకులను అధిగమించి ముందుకెళుతున్న తరుణంలో వ్యాధులు భయపెడుతున్నాయని ఆక్వా రైతులు వాపోతున్నారు. ఈ ఏడాది జనవరిలో వెనామీ దిగుబడి కోసం వాడుతున్న మందులు ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయని జపాన్ పరిశోధన శాస్త్రవేత్తలు కేంద్రానికి లేఖ రాయడంతో రైతులు కలత చెందారు.
వెనామీని ఎక్కువగా సాగుచేసే వియత్నాం, చైనా, థాయ్‌లాండ్ తదితర దేశాల్లో భయంకరమైన ఎర్లీ మోర్టాలిటీ సిండ్రోమ్ వ్యాధి వ్యాపించడంతో దాదాపు అక్కడ ఈ సాగు తుడిచిపెట్టుకుపోయింది. దీంతో ఎగమతుల్లో సింహభాగం మన రాష్ట్రం నుంచే వెళుతున్నాయి. ప్రధానంగా ఈ సీజన్‌లో రొయ్యల రైతులను తెల్లమచ్చ, విబ్రియో వ్యాధులు వెంటాడుతున్నాయి.
తెల్లమచ్చ వైరస్ వ్యాధి...
వైట్ స్పాట్ సిండ్రోమ్ వైరస్ (డబ్ల్యూఎస్‌ఎస్‌వీ) కారణంగా ఈ వ్యాధి వ్యాపిస్తోంది. రొయ్యల తలభాగం, తోక, శరీరంపై తెల్లమచ్చలు ఏర్పడటం వల్ల దీనికి తెల్లమచ్చల వ్యాధి అని పేరు వచ్చింది. వ్యాధి లక్షణాల విషయానికి వస్తే రొయ్యలు గులాబీ రంగులో ఉంటాయి. నీటిలో నిరసంగా ఈదుతూ మేతలు తినడం తగ్గిస్తాయి. ఆహార నాళం ఖాళీగా ఉండి ఎదుగుదల ఉండదు. చెక్ ట్రేలలో చూసినప్పుడు రంగుమారి మరణించిన రొయ్యలు ఎక్కువగా కనిపిస్తాయి. వ్యాధి ముదిరిన సందర్భాల్లో రోజుకు 80 నుంచి 100 రొయ్యలు చనిపోతాయి. పిల్లవేసిన 30 -45 రోజుల్లో ఈ వ్యాధి లక్షణాలు రొయ్యల చెరువుల్లో కనిపిస్తాయి.
విబ్రియో వ్యాధి....
విబ్రియో బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది. విబ్రియో సోకిన వెనామీ రొయ్య తలలో హెపటో, పేంక్రియా (కాలేయం, క్లోమం) ఎరుపు రంగులోకి మారతాయి. మిగిలిన శరీరం సాధారణ స్థితిలోనే ఉంటుంది. వ్యాధి లక్షణాల విషయానికొస్తే రొయ్య అంగాలు తినివేయబడి ఉంటాయి. చనిపోయిన రొయ్యలు గులాబీ, ఎరుపు రంగుల్లోకి మారి చెరువులో ఎయిరేటర్ల వల్ల నీటి పైభాగంగలో తేలుతూ ఉంటాయి. వ్యాధి సోకిన ప్రాథమిక దశలో నిత్యం కొన్ని రొయ్యలు మరణిస్తాయి. వ్యాధిగ్రస్త రొయ్యలు మందంగా తిరుగుతూ ఆహారం తీసుకోవు. పక్షులు ఎక్కువుగా రొయ్యల చెరువుపై తిరగుతూ ఉంటాయి.
ముందస్తు చర్యలే ముఖ్యం
పైన వివరించిన రెండు వ్యాధులు రొయ్యల సాగులో అత్యంత ప్రమాదకరమైనవని కైకలూరు మత్స్యశాఖ అభివృద్ధి అధికారి (ఆక్వాల్యాబ్) పి.సురేష్ సూచించారు. నివారణ లేని హచ్‌ఐవీ వ్యాధి మాదిరిగా ఈ వ్యాధులు రొయ్యలకు సోకితే నివారణ లేదన్నారు. ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే వ్యాధులనుంచి పంటను రక్షించుకోవచ్చని వివరించారు.
వెనామీపై వ్యాధుల సునామీ!
Published Mon, Sep 30 2013 2:22 AM | Last Updated on Fri, Sep 1 2017 11:10 PM
Advertisement
Advertisement