=స్థానికులకు విక్రయంపై వ్యాపారి షరతు
=నష్టపోతున్న తాండవ జాలర్లు
గొలుగొండ, న్యూస్‌లైన్: తాండవ జలాశయంలో రొయ్యలవేట సాగిస్తున్న జాలర్లకు అరకొర సొమ్ము చెల్లింపు, అమ్మకాలపై ఆంక్షలు విధించడం వివాదాస్పదమవుతున్నాయి. మూడేళ్ల నుంచి తునికి చెందిన ఒక వ్యాపారి తాండవ రొయ్యలపై పెత్తనం సాగిస్తున్నారు. కొంతమంది స్థానికులు ఆయనకు అండగా నిలిచి జాలర్ల పొట్టకొడుతున్నారు. మార్కెట్‌లో తాండవ రొయ్యకు ఎంతో గిరాకీ ఉన్నా స్థానికంగా వేట సాగించే జాలర్లకు కిలో రూ.115 నుంచి రూ.130 మాత్రమే చెల్లిస్తున్నారు.
అంతగా పనికిరాని బిగ్ చేప పిల్లలను జలాశయంలో వేసి వేటగాళ్లు, స్థానిక వ్యాపారుల పొట్టగొడుతున్నారు. త్వరగా పెరిగే బిగ్‌చేపలు తినడం వల్ల ప్రజలు రోగాలు పాలవుతారు. వ్యాపారి తాను చేపపిల్లలు ఇస్తున్నందున రొయ్యలు తనకే అమ్మాలని ఆంక్షలు విధించి మార్కెట్లో లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. ఈ జలాశయంలో దొరికే విలువైన రొయ్యలు ఇక్కడ నుంచి తమిళనాడు, కర్ణాటక, కోల్‌కతా, ఇతర ప్రాంతాలతో పాటు గ్రేడ్-1 రొయ్య విదేశాలకు కూడా ఎగుమతి అవుతోంది.
ఇతర రాష్ట్రాల్లో కిలో రూ.800 వరకు పలుకుతున్నట్టు తెలిసింది. అయితే ఆ వ్యాపారి స్థానికంగా ప్రజలకు ఒక్క రొయ్య కూడా విక్రయించరాదన్న ఆంక్షలతో జాలర్లు స్థానికంగా ఎవ రికీ అమ్మడం లేదు. దీంతో గొలుగొండ, నర్సీపట్నం, నాతవరం మండలాల్లో తాండవ రొయ్యలు తినడానికి నోచుకోవడం లేదు. దీంతో స్థానిక జాలర్లకు సరైన గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నారు.
ఏటా తాండవ జలాశయంలో రూ.80 లక్షల నుంచి రూ.3 కోట్ల వరకు రొయ్యల వ్యాపారం జరుగుతుంది. దీనినిబట్టి స్థానిక జాలర్లు సుమారు రూ.2 కోట్ల మేరకు నష్టపోతున్నట్టు అంచనా. దీనిపై మత్స్యశాఖ అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. తాండవ జలాశయం పరివాహక ప్రాంతాలైన పొగచెట్లపాలెం, వెంకటాపురం, గొలుగొండ, జోగుంపేట, మరో 10 గ్రామాల్లో 450 మంది వరకు మత్స్యకారులు జలాశయంపైనే జీవనం సాగిస్తారు.
దీనిపై మత్స్యశాఖ నర్సీపట్నం ఏడీ నిర్మలను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా రొయ్య పిల్లలను తాండవ జలాశయంలో వేయలేదని, అవి సహజసిద్ధంగా వచ్చినవని తెలిపారు. ధర నిర్ణయించే అధికారం తమకు లేదని, జాలర్లు అందరూ కలిసికట్టుగా ధర నిర్ణయించుకుని అమ్ముకోవలసి ఉందన్నారు. తునికి చెందిన రొయ్యల వ్యాపారి అప్పారావును వివరణ కోరగా సమాధానం చెప్పడానికి నిరాకరించారు.