మొన్న మధు.. నిన్న గోపి.. నేడు లింగన్న... | new democracy party maoists linganna arrest | Sakshi
Sakshi News home page

మొన్న మధు.. నిన్న గోపి.. నేడు లింగన్న...

Published Fri, Dec 8 2017 10:45 AM | Last Updated on Wed, Oct 17 2018 3:43 PM

new democracy party maoists linganna arrest - Sakshi

న్యూడెమోక్రసీ పార్టీ అజ్ఞాత దళ అగ్ర నేతలను పోలీసులు వరుసగా అరెస్ట్‌ చేస్తున్నారు. మావోయిస్టుల మాదిరిగా తుపాకులు చేబూని, అడవుల్లో దాక్కుని, అజ్ఞాతంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ దళాలపై పోలీసులు దృష్టి కేంద్రీకరించారు. ప్రధానంగా దళాల నేతలను అరెస్టు చేస్తున్నారు. మొన్న మధును, నిన్న గోపిని, నేడు లింగన్నను అరెస్ట్‌ చేశారు. ఈ జాబితాలో తరువాతి స్థానం ఎవరిదో..! గతంలో ఎన్నడూ లేనట్టుగా ఇటీవలి కాలంలో ఇలా వరుస అరెస్టులు ఎందుకో..?!  న్యూడెమోక్రసీ శ్రేణుల్లో, సానుభూతిపరుల్లో, ప్రజల్లో వ్యక్తమవుతున్న సందేహాలివి.

ఇల్లెందు: న్యూడెమోక్రసీ అజ్ఞాత దళాలకు చెందిన అగ్ర నేతల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ముఖ్య నాయకుల్లో ఇప్పటివరకు ఆవునూరి నారాయణ స్వామి (మధు), దనసరి సమ్మయ్య (గోపి), పూనెం లింగయ్య (లింగన్న)ను అరెస్ట్‌ చేశారు.

ఏడాది క్రితం...
న్యూడెమోక్రసీ రాయలవర్గానికి చెందిన అజ్ఞాత దళ నేతలు యదళ్లపల్లి విశ్వనాధం(ఆజాద్‌), కొమురం వెంకటేశ్వర్లు (గణేష్‌) అరెస్టయ్యారు. గుండాల మండలం బాటన్న నగర్‌ గ్రామం వద్ద గణేష్‌ను, ఇల్లెందు మండలం మాణిక్యారం గ్రామం వద్ద ఆజాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్డీ చంద్రన్న వర్గానికి చెందిన సురేష్, ప్రతాప్‌ను కూడా మాణిక్యారం వద్దనే అరెస్ట్‌ చేశారు.  

జులై 25న...
మధును గార్లలో పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఉల్ఫా కేసులో జైలుకు పంపారు. నెల రోజుల క్రితమే బెయిల్‌పై బయటకు వచ్చారు. అప్పటి నుంచి ఇల్లెందు కేంద్రంగా లీగల్‌ కార్యకలాపాలు సాగిస్తున్నారు.

నవంబర్‌ 30న...
మహబూబాబాద్‌ జిల్లా కార్యదర్శి దనసరి సమ్మయ్య (గోపి)ని నవంబర్‌ 30న మహబూబాబాద్‌లోని ఓ ఇంటిలో ఉన్నారన్న సమాచారంతో పోలీసులు వల పన్నారు. పట్టుకునేందుకు ప్రయత్నించారు. తప్పించుకుని ఆటోలో వెళుతుండగా అరెస్ట్‌ చేశారు.

డిసెంబర్‌ 7న...
రఘునాధపాలెం వద్ద గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో లింగన్నను పోలీసులు అరెస్ట్‌ చేశారు. న్యూడెమోక్రసీ కీలక నాయకుల్లో ఇతను ఒకరు.

20 ఏళ్లుగా అజ్ఞాతంలోనే...
గురువారం అరెస్టయిన లింగన్న, గత 20 ఏళ్లుగా అజ్ఞాత వాసంలో ఉన్నారు. 1997లో న్యూడెమోక్రసీకి, పీపీజీ శంకరన్నకు మధ్య తారాస్థాయిలో యుద్ధం జరిగింది. గుండాల మండలంలోని లింగగూడెం, దేవాళ్లగూడెం, రోళ్లగడ్డ వద్ద పలుమార్లు ఈ రెండు పార్టీలకు చెందిన దళాల మధ్య కాల్పులు (క్రాస్‌ ఫైరింగ్‌) జరిగాయి. ఇరువైపులా దళ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలోనే గుండాల మండలంలోని రోళ్లగడ్డ, దేవాళ్లగూడెం, లింగగూడెం, చీమలగూడెం, నర్సాపురం తండాలకు చెందిన కొందరు ఎన్డీ నాయకులు అడవి బాట (అజ్ఞాత వాసం) పట్టారు. వారిలో లింగన్న కూడా ఉన్నారు. అప్పుడు అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయన ఇప్పటివరకు బయటకు రాలేదు.

ఎవరీ లింగన్న...?
ఈయన స్వస్థలం.. గుండాల మండలం రోళ్లగడ్డ గ్రామం. పీవైఎల్‌లో లీగల్‌గా పనిచేశారు. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయికి, ఇల్లీగల్‌గా దళ సభ్యుడి నుంచి జిల్లా కార్యదర్శి స్థాయికి ఎదిగారు. ఇటీవల ఎన్డీ చంద్రన్న వర్గంలోకి వెళ్లారు. రెండు రోజుల తర్వా (పార్టీ, కుటుంబీకుల ఒత్తిడికి తలొగ్గి) తిరిగి ఎన్డీ రాయల వర్గంలోకి వచ్చారు. సుదీర్ఘ అజ్ఞాత వాసం నుంచి బయటికొస్తారని అప్పుడు ప్రచారం జరిగింది. పోలీసులు కూడా లింగన్నను పట్టుకునేందుకు అదును కోసం ఎదురుచూశారు. రఘునాధపాలెం వద్ద గురువారం అరెస్ట్‌ చేశారు.

2012 నుంచి కష్టకాలం...
న్యూడెమోక్రసీ పార్టీకి 2012లో కష్ట–నష్ట కాలం మొదలైంది. ఈ సంవత్సరంలోనే ఆ పార్టీ రెండుగా (రాయల వర్గం–చంద్రన్న వర్గం) చీలింది. నాటి నుంచి ఆ పార్టీ కోలుకోలేనంతగా నష్టపోతోంది. సుదీర్ఘకాలంగా అజ్ఞాత జీవితంలో ఉన్న అగ్ర నేతలు ఒకరొక్కరుగా అరెస్టవుతుండడంతో ఆ పార్టీ దిగువ శ్రేణి నాయకుల్లో, కేడర్‌లో అయోమయం నెలకొంది. ఖమ్మం–వరంగల్‌ ఏరియా పరిధిలోని అజ్ఞాత ఉద్యమం ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది.
 
అజ్ఞాతంలో మిగిలింది చోటా–మోటా నాయకులే...
ఎన్డీ రాయల వర్గానికి చెందిన అజ్ఞాత నాయకుల్లో దాదాపుగా అందరూ అరెస్టయినట్టే. ఇక మిగిలింది చోటా–మోటా నాయకులే. బయ్యారం ఏరియాలో బండారి ఐలయ్య, ఇల్లెందు ఏరియాలో రమేషన్న, గుండాల ఏరియాలో శంకరన్న, చెట్టుపల్లి ఏరియాలో యాకన్న, ఆళ్లపల్లి–బంగారుచెల్క ఏరియాలో ఆజాద్‌ ఉన్నారు. అరెస్టయి, ఏడాది క్రితం విడుదలైన ఆజాద్‌.. తిరిగి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఎన్డీ వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన ప్రశ్న ఒక్కటే.. ‘‘మొన్న మధు, నిన్న గోపి, నేడు లింగన్న. ఈ జాబితాలో తరువాతి స్థానం ఎవరిది..? మున్ముందు ఇలా ఇంకెంతమంది..? అజ్ఞాత దళాలు మనుగడ సాగిస్తాయా..?’’.

లింగన్నను కోర్టుకు అప్పగించాలి
ఖమ్మంమయూరిసెంటర్‌: న్యూడెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి, రీజనల్‌ కమిటీ సభ్యుడు, అజ్ఞాత దళ నేత లింగన్నను రఘునాథపాలెం మండలంలోని ఎస్‌ఎన్‌.మూర్తి పాలిటెక్నిక్‌ కళాశాల వద్ద జిల్లా పోలీసులు అరెస్ట్‌ చేసినట్టు ఆ పార్టీ రాష్ట సహాయ కార్యదర్శి పోటు రంగారావు చెప్పారు. లింగన్నను వెంటనే మీడియా ముందు ప్రవేశపెట్టి, కోర్టుకు అప్పగించాలని డిమాండ్‌ చేశారు. ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పూనెం లింగయ్య (లింగన్న వైద్యం కోసం ఖమ్మం వచ్చి వెళ్తుండగా, పక్కా సమాచారంతో నిఘా వేసి అరెస్ట్‌ చేశారని చెప్పారు. ఆదివాసీ గిరిజనుడైన లింగన్నది గుండాల మండలం రోళ్ళగడ్డ గ్రామమని, 1997లో సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ ప్రతిఘటన దళంలో సభ్యుడిగా చేరాడని చెప్పారు. గుండాల, ఇల్లెందు, టేకులపల్లి మండలాల్లో ఆదివాసీ భూమి, రైతాంగ సమస్యలపై అనేక పోరాటాలు సాగించాడని చెప్పారు. లింగన్నను మట్టుపెట్టేందుకు పోలీసులు అనేకసార్లు ప్రయత్నించారని చెప్పారు. వీటి నుంచి లింగన్న తప్పించుకుని ప్రజాపోరాటాలు సాగించాడని అన్నారు. ఆయన గత ఇరవయ్యేళ్లుగా అజ్ఞాత జీవితం గడుపుతున్నట్టు చెప్పారు. ‘‘ప్రభుత్వం, పోలీసుల తీరు చూస్తుంటే.. లింగన్నకు ప్రాణ హాని తలపెడతారేమోనని అనుమానంగా ఉంది’’ అని ఆయన భయాందోళన వ్యక్తం చేశారు. ‘‘లింగన్నకు ఎలాంటి హాని తలపెట్టవద్దు. కోర్టులో హాజరుపరచాలి’’ అని డిమాండ్‌ చేశారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వరరావు, నాయకులు ఆవుల వెంకటేశ్వర్లు, సీవై పుల్లయ్య, జి.రామయ్య, ఆవుల అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement