లింగన్న విడిది పొందిన అటవీ ప్రాంతంలోని ప్రదేశం
సాక్షి, ఖమ్మం(ఇల్లెందు) : నిన్నటి వరకు ఎన్డీ నేత మధు జైళ్లో.. అదే స్థాయిలో ఉన్న లింగన్న తిరిగి అజ్ఞాతంలోకి వెళ్లి ఉద్యమ విస్తరణకు సన్నద్ధమవుతున్న వేళ అదును చూసి హతమార్చారని అనుకుంటున్నారు. 2012లో ఎన్డీలో సంభవించిన చీలిక రెండు వర్గాలకు తీరని నష్టంగా మారింది. 2016 నుంచి అగ్రనేతలంగా వరుస అరెస్టుల పర్వం జరిగింది. ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న గోపీ నుంచి మొదలుకొని విజయ్, రమేష్ వరకు జనజీవనంలో ఉన్న మధు, ఐలయ్య వరకు అంతా అరెస్టు అయిన నేతలే. అయితే పోలీసులు మాత్రం వీరు రెండో దఫా అజ్ఞాతంలోకి వెళ్లటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అజ్ఞాతంలో ఉన్న వారందరినీ లేకుండా చేయాలనే లక్ష్యంలో పోలీసులు వరుస అరెస్టులకు పాల్పడ్డారు.
ఈ నేపథ్యంలో అజ్ఞాతంలో ఉన్న నేతలు మళ్లీ అడివి బాట పడుతుండటంతో ఒక వైపు పీడీ యాక్టులు పెట్టి జైళ్ల పాలు చేయటం, మరొక వైపు భయభ్రాంతులకు గురి చేసేందుకు ఎన్‌కౌంటర్లకు తెరలేపారనే ప్రచారం జరుగుతోంది. లింగన్న ఎన్‌కౌంటర్ లాంటి సంఘటనలు ఎన్డీకి కొత్త కాకపోయినప్పటికీ ఈ ఎన్‌కౌంటర్ ఆ గ్రూపుల్లోని అజ్ఞాత నేతలకు ఒక సంకేతంగా చూపించేందుకే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. లింగన్న లాంటి ఓ కీలక నేతను కోల్పోవడటం ఎన్డీకి కోలుకోలేని దెబ్బగా అభివర్ణిస్తున్నారు.
సుదీర్ఘకాలం అజ్ఞాతంలో...
సుదీర్ఘకాలం అజ్ఞాతంలో ఉండి ప్రజలతో సత్సం బంధాలు కలిగి ప్రజల మధ్య వైరుధ్యాలు, ఘర్షణలను సునాయాసంగా ప్రజాకోర్టుల ద్వారా పరిష్కరించి అందరినీ మెప్పించి పంపించే నేతను కోల్పోవడం తీరని లోటుగా భావిస్తున్నారు. సిద్ధాంత, రాజకీయ సంక్షోభం ఎదుర్కొంటున్న ఎన్డీకి ఈ తరుణంలో లింగన్నను ఎన్‌కౌంటర్ రూపంలో కోల్పోవటం కొంత నష్టమేనని చెప్పవచ్చు. 2017 డిసెంబబర్ 7న రఘునాథపాలెం వద్ద అరెస్టు అయిన లింగన్న కొద్ది కాలం జైలు జీవితం గడిపి బయటకు వచ్చి ఇంటి వద్ద ఉన్నాడు. ఈ క్రమంలో మధు రెండో దఫా హైదరాబాద్‌లో అరెస్టు కావటంతో సర్పంచ్, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలు రావటం తమకు ప్రతికూల పరిస్థితి ఎదురు కావటంతో గత్యంతరం లేని పరిస్థితిలో ఎంపీటీసీ ఎన్నికల ముందు అజ్ఞాతంలోకి వెళ్లారు. గుండాల మండంలో మెజార్టీ ఎంపీటీసీలను కైవసం చేసుకుని ఎంపీపీని, జెడ్పీటీసీ నిలబెట్టుకున్నారు. అధికార టీఆర్‌ఎస్ పుంజుకుంటుదని అంతా భావించారు, కానీ ఎంపీపీ, జెడ్పీటీసీ చేజారటం, ఎన్డీ ఖాతాలో జమ కావటం లింగన్న కృషేనని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో లింగన్న ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు.
ఎన్‌కౌంటర్‌కు ముందు.. తర్వాత ఏమైంది...?
ఇదిలా ఉండగా ఎన్‌కౌంటర్‌కు ముందు ఎన్‌కౌంటర్‌కు తర్వాత ఏమి జరిగింది. ఈ ప్రశ్నలకు సమాధానాలు అంతుచిక్కటం లేదు. ఎన్‌కౌంటర్‌కు ముందు అక్కడ ఏమి జరిగింది.. ఎన్ని గంటల సమయంలో ఎన్‌కౌంటర్ జరిగింది.. ఎన్ని రోజుల నుంచి ఆ ప్రదేశంలో విడిది పొందారు.. అన్ని రోజులు ఒకే ప్రదేశంలో విడిది పొందటానికి గల కారణాలు ఏమిటి, అక్కడ విడిది పొందిన సమాచారం ఎంత మందికి తెలుసు, ఆ ప్రదేశం అంత సేఫ్ కానిది అయినా అన్ని రోజులు ఎందుకు అక్కడే విడిది పొందినట్లు, ఎన్‌కౌంటర్ సమయంలో ఆ స్థలంలో ఎంత మంది సభ్యులు ఉన్నారు, ఎన్‌కౌంటర్ తర్వాత వారంతా ఎటు వెళ్లారు.. ఇంకా గాయపడిన సభ్యులు ఉన్నారా.. వారంతా ఎన్డీ కంట్రోల్‌లోకి వచ్చి ఆ రోజు జరిగిన సంఘటన పూర్వాపరాలు వెల్లడించారా లాంటి ప్రశ్నలకు సమాధానాలు లభించాల్సి ఉంది.
రఘునాథపాలెంలో అరెస్టుకు పూర్వమే లింగన్న లొంగిపోయే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరిగిన క్రమంలోనే అరెస్టు అయి ఆరు నెలల వరకు ఇంటివద్దనే ఉండి రెండో దఫా అడవిబాట ఎందుకు పట్టాడు.. లింగన్న ఎన్‌కౌంటర్‌పై ఎన్నో ప్రశ్నలు అందరి మదిలో మెదులుతున్నాయి. బాటన్న దళంలో సభ్యుడిగా చేరిన లింగన్న 22 ఏళ్ల కాలంలో జిల్లా కార్యదర్శి, రీజియన్ కమిటీ కార్యదర్శి, రాష్ట్ర కమిటీ సభ్యుడి స్థాయికి ఎదిగారు.
Comments
Please login to add a commentAdd a comment