సాక్షి, కొత్తగూడెం: సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రీజినల్ కార్యదర్శి పూనెం లింగన్న ఎన్‌కౌంటర్ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. అజ్ఞాత దళాల కమాండర్‌గా ఉన్న లింగన్న ఎన్‌కౌంటర్‌తో గుండాల మండలంలోని ఆదివాసీ గిరిజనుల్లో ఆగ్రహం పెల్లుబికింది. ఊహించని రీతిలో సమీప గ్రామాల ప్రజల నుంచి తిరుగుబాటు ఎదురు కావడంతో ఇల్లెందు, పినపాక నియోజకవర్గాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు మరింత పకడ్బందీగా వ్యవహరించారు. ఇప్పటికే మావోయిస్టు పార్టీ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నడుస్తుండడంతో పోలీసు బలగాలు ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని దండకారణ్యంతో పాటు ఇల్లెందు, పినపాక ఏజెన్సీ పరిధిలోనూ భారీగా కూంబింగ్ చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో న్యూడెమోక్రసీ కమాండర్ లింగన్న ఎన్‌కౌంటర్‌తో మరింత అలజడి నెలకొంది. లింగన్న మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు.
దీంతో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాయల, చంద్రన్న వర్గాలతో పాటు ఇతర సంఘాలకు చెందిన సానుభూతిపరులు ఆస్పత్రి వద్దకు వస్తుండగా జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్డీ (రాయల) రాష్ట్ర కార్యదర్శి డీవీ.కృష్ణ, ఎన్డీ (చంద్రన్న) రాష్ట్ర కార్యదర్శి సాధినేని వెంకటేశ్వర్‌రావుతో పాటు ఆ పార్టీలకు చెందిన రాష్ట్ర, జిల్లా, స్థానిక నాయకులను, తెలంగాణ ప్రజాఫ్రంట్ తదితర సంఘాల నాయకులను ఇల్లెందు, మణుగూరు, గుండాల, ఆళ్లపల్లి, టేకులపల్లి, కొత్తగూడెం పరిధిలో అరెస్టు చేసి ఆయా పోలీసుస్టేషన్లకు తరలించారు. దీంతో జిల్లావ్యాప్తంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. లింగన్న సొంత మండలం గుండాలలో 144 సెక్షన్ విధించారు. అంత్యక్రియలకు సైతం ప్రజలు రాకుండా పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారని ఎన్డీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రీపోస్టుమార్టంపై హైకోర్టులో పిటిషన్..
కొత్తగూడెం ఏరియా ఆస్పత్రిలో లింగన్న మృతదేహాన్ని పోస్టుమార్టం చేసి కుటుంబసభ్యులకు అప్పగించేందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే లింగన్నను పట్టుకుని కాల్చిచంపారని ఆరోపిస్తున్న పార్టీ, పౌరహక్కుల సంఘం నాయకులు మాత్రం సిట్టింగ్ జడ్జి సమక్షంలో పోస్టుమార్టం చేయించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు ఆదేశాల కోసం సాయంత్రం వరకు ఉత్కంఠగా ఎదురుచూడాల్సి వచ్చింది. సాయంత్రం హైకోర్టు తీర్పు రావడంతో రీపోస్టుమార్టం కోసం లింగన్న మృతదేహాన్ని హైదరాబాద్ తరలించాల్సి వచ్చింది. హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో మెడికల్ బోర్టు సీనియర్ అధికారులతో పోస్టుమార్టం చేయించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించాలని సూచించింది. పోస్టుమార్టం నివేదికను సీల్డ్‌కవర్‌లో ఇవ్వాలని ఆదేశించింది.
ఎన్‌కౌంటర్ పూర్తి వివరాలపై 5వ తేదీ నాటికి కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా గుండాలలో అంత్యక్రియల కోసం వివిధ ప్రాంతాలకు చెందిన వారు వస్తుండడంతో పోలీసులు భారీగా మోహరించారు. జిల్లాలో అడుగడుగునా పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. దీంతో ఇల్లెందు డివిజన్‌లో ఉద్రిక్తత నెలకొంది. అదేవిధంగా ఎక్కడి నాయకులను అక్కడే అరెస్టు చేసి కొత్తగూడెం ఆస్పత్రికి సైతం రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు పోలీసులు జిల్లా ఏజెన్సీ మొత్తం జల్లెడ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే టెన్షన్ వాతావరణం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment