లింగన్న( ఫైల్) కూల్చివేతకు గురైన లింగన్న స్మారక స్తూపం (ఫైల్)
గుండాల: బాల్యం నుంచే విప్లవ భావాలతో.. ఉద్యమ బాటలో నడిచి.. 22 ఏళ్లు అజ్ఞాత జీవితం గడిపి.. భూమి, భుక్తి, విముక్తి కోసం పోరాటమే ఊపిరిగా ఎన్నో సమస్యలను పరిష్కరిస్తూ.. ఆటుపోట్లను ఎదుర్కొంటూ జైలు జీవితాన్ని లెక్కచేయక వీరోచితంగా పోరాడి అమరుడైన జననేత లింగన్న తమ గుండెల్లో పదిలంగా ఉన్నాడని ప్రజలు అంటున్నారు. లింగన్న ఎన్‌కౌంటర్‌లో మృతి చెంది శుక్రవారానికి ఏడాది పూర్తయింది. అయినా.. ఆ ఘటన తాలూకు దృశ్యాలు ఇంకా కళ్లముందు కదలాడుతూనే ఉన్నాయని చెబుతున్నారు. న్యూడెమోక్రసీ అజ్ఞాత దళనేత, రీజినల్ కార్యదర్శి పూనెం లింగయ్య అలియాస్ లింగన్న బాల్యం నుంచే విప్లవ భావాలు కలిగి ఉండి విద్యార్థి, యువజన సంఘాలతో పనిచేస్తూనే 1997లో అజ్ఞాతంలోకి వెళ్లాడు. 22 ఏళ్లపాటు అజ్ఞాత జీవితం గడిపాడు. 2017 డిసెంబర్‌లో ఖమ్మంలో వైద్యం పొంది తిరిగి వస్తున్న క్రమంలో రఘునాథపాలెం వద్ద అరెస్టు చేశారు. జైళ్లో మూడు నెలలు, ఇంటి వద్ద మరో మూడు నెలల పాటు ఉన్నారు. మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లాలని నిర్ణయించుకుని వెళ్లాడు.
అప్పటి నుంచి లింగన్న పోలీసులకు టార్గెట్ అయినట్లు సమాచారం. జూలై 28 నుంచి మావోయిస్టు వారోత్సవాల్లో భాగంగా ఉమ్మడి ఖమ్మం–వరంగల్ జిల్లా సరిహద్దుల్లో గ్రేహౌండ్స్ బలగాలు అడవిని జల్లెడ పడుతున్నాయి. ఈ క్రమంలోనే రోళ్లగడ్డ అటవీ ప్రాంతంలో పందిగుట్ట వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో లింగన్న మృతి చెందాడు. అనంతరం మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తుండగా ప్రజలు పోలీసులపై రాళ్ల వర్షం కురిపించారు. ప్రజలంతా ఒక్కసారిగా పోలీసులపై తిరగుబాటు చేయడం ఇదే తొలిసారి కావచ్చని పలువురు చెబుతున్నారు. అలా దాడి చేసిన మండలానికి చెందిన పార్టీ నాయకులతో పాటు స్థానికులైన 60 మందిపై పోలీసులు కేసులు పెట్టి విడుతల వారీగా జైలుకు పంపారు.
కాగా, కోర్టు అనుమతితో గతేడాది సెప్టెంబర్ 29న గుండాలలో సంతాపసభ నిర్వహించారు. లింగన్న కుటుంబ సభ్యులు వారి సొంత భూమిలోనే స్మారక çస్తూపం నిర్మించుకున్నారు. నవంబర్ 16 అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు స్థూపాన్ని కూల్చారు. ఆ ప్రాంతంలో లింగన్న జ్ఞాపకాలు ఉండొద్దని భావించి కొందరు స్తూపాన్ని కూల్చారని ప్రజలు ఆరోపించారు. అయినా ఆయన త్యాగాలు, ఆయన అమరత్వం వృథా కావని, తమ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాడని ప్రజలు పేర్కొంటున్నారు. ఆయన ఆశయ సాధన కోసం పోరాడుతూనే ఉంటామని ఎన్డీ పార్టీ నాయకులు చెబుతున్నారు. రెండు రోజుల్లో పాటల సీడీని ఆవిష్కరిస్తున్నట్లు వారు తెలిపారు. జైలు నుంచి వచ్చిన లింగన్న మండలంలోని ప్రతి ఇంటికి వెళ్లి పలుకరించిన తీరును ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment