సాక్షి, మంచిర్యాల : మావోల ఏరివేతే లక్ష్యంగా ఉమ్మడి జిల్లా పోలీసు యంత్రాంగం సాగుతుండగా పట్టు పెంచుకునే ప్రయత్నాల్లో మావోలు ఉన్నారు. ఈనెల 19న కాగజ్‌నగర్ మండలం కదంబా అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు దళ సభ్యులు మృతి చెందగా, ఇందులో ఒకరు చత్తీస్‌గడ్‌కు చెందిన చుక్కాలు కాగా, మరొకరు ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం అద్దాల తిమ్మాపూర్‌కు చెందిన జుగ్నాక్ బాదీరావు ఉన్నాడు. బాదీరావు నాలుగు నెలల క్రితమే కుమురంభీం–మంచిర్యాల డివిజన్ కమిటీలో చేరాడు. గత ఆర్నెళ్ల క్రితం కరోనా ప్రభావం, లాక్‌డౌన్ కాలంలో చతీస్‌గడ్‌లోని దండకారణ్యం నుంచి మహారాష్ట్ర మీదుగా ఆసిఫాబాద్‌లోకి ప్రవేశించినట్లు పోలీసులు గుర్తించారు. ఉమ్మడి జిల్లాలో తిర్యాణి, సిర్పూర్(యూ), జన్నారం, ఊట్నూరు, నేరడిగొండ, సిరికొండ, పెంబి అటవీ ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు పట్టు పెంచుకునే పనిలో పడ్డారు. అంతేకాక ఏరియాల వారీగా బాధ్యతలు అప్పగిస్తూ కొత్త నియామకాలపై దృష్టి పెట్టారు. కొత్త సభ్యులు పలు గ్రామాల్లో ప్రజలను కలిసి తమ కార్యకలాపాలు విస్తరించే సందర్భాల్లోనే ఆచూకీ తెలిసి ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఎన్‌కౌంటర్ బూటకమంటూ కేబీఎం కమిటీ కార్యదర్శి అడెల్లు పేరుతో ఆదివారం ఓ లేఖ విడుదల అయింది. (తప్పించుకున్న భాస్కర్?)
కేబీఎం కమిటీకి నేతృత్వం వహిస్తూ గత 25ఏళ్లుగా అజ్ఞాతంలో దండకారణ్యంలో ఉద్యమంలో ఆరితేరిన మైలరపు అడెల్లు అలియాస్ భాస్కర్‌ది బోథ్ మండలం పొచ్చెర కావడంతో ఇక్కడి యువతను ఉద్యమంలోకి ఆకర్షించే పనిలో ఉన్నారు. మాజీల సాయం పొందినట్లు పోలీసులు గుర్తించారు. వారం రోజుల పాటు బోథ్ మండలంలోని ఆదివాసీ గ్రామాలు, నేరడిగొండ, పెంబి ప్రాంతాల్లో పలువుర్ని కలిసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే కొందరు మాజీలు పోలీసులకు సహకరిస్తుండడంతో దళ సభ్యుల కదలికలు గుర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే పలుమార్లు తిర్యాణి, ఆసిఫాబాద్ ప్రాంతాల్లో తృటిలో తప్పించుకున్నారు. మావోలు వదిలివేసిన సామగ్రిలో కీలక సమాచారం తెలుసుకోవడంతో గత రెండు నెలలుగా మరింత అప్రమత్తమయ్యారు. ఉమ్మడి జిల్లాలో 15 మంది వరకు కొత్తగా దళంలో చేరినట్లు అనుమానాలు ఉన్నాయి. వీరిపై ఇప్పటికే పోలీసుల పలువుర్ని అదుపులోకి తీసుకున్నారు.
పట్టు కోసం గట్టి ప్రయత్నాలు
గతంలో నక్సల్స్‌కు గట్టి పట్టున్న తిర్యాణి, మంగి, సిర్పూర్ యూ, ఊట్నూరు, పెంబి, నేరడిగొండ, సిరికొండ తదితర ఆదివాసీ ప్రాంతాల్లో రహస్యంగా సంచరిస్తు పలువుర్ని దళంలోకి చేర్చుకున్నారు. అంతేకాక సానుభూతి పరులతో పట్టుపెంచుకున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. దళంలో చేరేందుకు స్థానిక యువతకు డబ్బుల ఆశ చూపిస్తున్నట్లు సమాచారం. తాజా ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన బాదీరావు స్వస్థలం అద్దాల తిమ్మాపూర్ నేరడిగొండ మండలంలోనే అత్యంత మారుమూల ప్రాంతం. ఇలాంటి ఆదివాసీ గూడల నుంచి కొత్త నియామకాలను, ఉమ్మడి జిల్లాలో దళాన్ని ఆదిలోనే నిలువరించేందుకు డీజీపీ మహేందర్ రెడ్డి నెలన్నర వ్యవధిలోనే రెండు సార్లు పర్యటించారు. ఈ నెల 2న ఆసిఫాబాద్‌కు వచ్చి ఐదు రోజుల పాటు మకాం వేశారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఐదుగురు దళ సభ్యుల లక్ష్యంగానే కాకుండా కొత్తగా యువత రిక్రూట్‌ను అరికట్టాలనే తీరుగా ఆయన పర్యటన సాగింది. డీజీపీ పర్యటన జరిగిన రెండు వారాల్లోనే ఈ ఎన్‌కౌంటర్ చోటు చేసుకోవడం గమనార్హం.
ఎన్‌కౌంటర్‌తో ఉలిక్కిపాటు
కదంబా ఎన్‌కౌంటర్‌తో ఉమ్మడి జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గత పదేళ్లుగా ఎటువంటి అలజడి లేకుండా సాగిన ఈ ప్రాంతంలో కాగజ్‌నగర్ మండలం కదంబా అడవుల్లో జరిగిన ఎదరు కాల్పులతో ఉమ్మడి జిల్లాలో హైఅలర్ట్ నెలకొంది. పెద్ద ఎత్తున బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.
19 ఏళ్లకే దళంలోకి..
కదంబా ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన జుగ్నాక్ బాధీరావు 19 ఏళ్లకే దళంలో చేరాడు. పత్తి విత్తనాలు పెట్టే సీజన్‌లో ఇల్లు వదిలిపోయి ఇప్పటికీ కనిపించలేదని తల్లి చిన్నుబాయి పేర్కొంది. తల్లిదండ్రులు చిన్నుబాయి, భూమన్న. తండ్రి బాల్యంలోనే చనిపోయాడు. బాదీరావు లారీ క్లీనర్, చికెన్ సెంటర్ నిర్వాహాణ తదితర పని చేశాడని కుటుంబ సభ్యులు తెలిపారు. దళంలో చేరిన మూడు నెలలకే ఎన్‌కౌంటర్‌లో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
దద్దరిల్లిన కదంబా
కాగజ్‌నగర్: కదంబా అడవి మరోమారు తుపాకుల మోతతో దద్దరిళ్లింది. దాదాపు పదేళ్ల అనంతరం శనివారం రాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. కాగజ్‌నగర్ మండలం కదంబా గ్రామానికి దాదాపు ఏడు కిలోమీటర్ల దూరంలో కొండపై జరిగిన ఎన్‌కౌంటర్‌తో ఉమ్మడి జిల్లా ఉలిక్కిపడింది. ఎన్‌కౌంటర్ నేపథ్యంలో ఆదివారం సంఘటన స్థలాన్ని రామగుండం పోలీస్ కమిషనర్, కుమురం భీం జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ సత్యనారాయణతో పాటు ఉమ్మడి జిల్లా ఓఎస్‌డీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఏఎస్పీ సుధీంద్ర, పోలీస్ అధికారులు పరిశీలించారు. అనంతరం ఎన్‌కౌంటర్ జరిగిన తీరును ఇన్‌చార్జి ఎస్పీ వెల్లడించారు.
గంట పాటు కాల్పులు..
గ్రేహౌండ్స్, స్పెషల్‌పార్టీ, స్థానిక పోలీస్ సిబ్బందితో కదంబా అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తుండగా శనివారం రాత్రి 10 గంటల సమయంలో మావోయిస్టులు ఎదురుపడ్డారు. లొంగిపోవాలని హెచ్చరిస్తున్నా కాల్పులు జరపడంతో ఆత్మ రక్షణ కోసం పోలీసుల వైపు నుంచి సైతం ఎదురుకాల్పులు జరిపారు. అయితే ఇరువర్గాల మధ్య దాదాపు గంటకు పైనే కాల్పులు జరిగినట్లు ఇన్‌చార్జి ఎస్పీ వెల్లడించారు. తెల్లవారుజామున వెతకగా ఆడెల్లు అలియాస్ భాస్కర్ దళంలోని ఇద్దరు సభ్యులు జుగ్నాకా బాదిరావు(19), చుక్కాలు(22) మృతదేహాలు లభించాయి. చనిపోయిన వారిలో బాదిరావుది ఆదిలాబాద్ జిల్లా నేరెడిగొండ మండలం అద్దాల తిమ్మాపూర్, చుక్కాలుది ఛత్తీస్‌ఘడ్‌లోని బీజాపూర్ జిల్లాగా నిర్ధారించారు. అయితే కుమురం భీం, మంచిర్యాల జిల్లాల డివిజన్ కమిటీకి సారథ్యం వహిస్తున్న అడేల్లు అలియాస్ భాస్కర్‌తో పాటు మరికొందరు తప్పించుకున్నారు. భాస్కర్‌తో పాటు దళసభ్యులను పట్టుకునేందుకు కూంబింగ్ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.
పదేళ్ల తర్వాత ఎన్‌కౌంటర్..
పులుల ఆవాసంగా పేరొందిన కాగజ్‌నగర్ పరిధి కదంబా అడవి ఇప్పటి పలు ఎన్‌కౌంటర్లకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది. ఉమ్మడి రాష్ట్రంలో 1998లో మొదటిసారి కదంబా ప్రభు త్వ స్కూల్ పరిసరాల్లో పీపుల్స్‌వార్, పోలీసులకు మధ్య కాల్పులు జరగగా ఇద్దరు నక్సల్స్ చనిపోయారు. మరుసటి ఏడాదే 1999లో రెండోసారి ఎన్‌కౌంటర్ జరగగా ముగ్గురు నక్సల్స్ చనిపోయారు. మళ్లీ 20 ఏళ్ల తర్వాత ప్రత్యేక రాష్ట్రంలో ఈనెల 19న జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోలు మృతి చెందారు. 2003లో బెజ్జూర్ మండలం ఆగర్‌గూడలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మవోయిస్టులు మృతిచెందారు. అదే ఏడాది కొండపల్లిలో ఎన్‌కౌంటర్ జరిగింది. 2010లోనూ మవోయిస్టు కీలకనేతను పోలీసులు మట్టుపెట్టారు. మవోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు రాజ్‌కుమార్ అలియాస్ ఆజాద్ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందాడు.
సిర్పూర్(టి)లో పోస్టుమార్టం
సిర్పూర్(టి): ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టుల మృతదేహాలకు సిర్పూర్(టి) సామాజిక ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. పోలీసుల భారీ బందోబస్తు మధ్య అంబులెన్సులో మృతదేహాలను ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో మృతదేహాలను తీసుకొచ్చి పోస్టుమార్టం నిర్వహించారు. ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ డీఎస్పీలు అచ్చేశ్వర్‌రావ్, స్వామి, కౌటాల సీఐ శ్రీనివాస్, ఎస్సైలు రవికుమార్, సందీప్, ఆంజనేయులు, వినోద్ ఆస్పత్రి వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. పోస్టుమార్టం అనంతరం బాదిరావ్ కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. చుక్కాలు మృతదేహాన్ని మార్చురీలో ఉంచారు. బాదిరావ్ మృతదేహం వద్ద తల్లి చిన్నుబాయి కన్నీరుమున్నీరుగా విలపించింది.
Comments
Please login to add a commentAdd a comment