సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, కరీంనగర్: మావోయిస్టు పార్టీ విస్తరణను గడ్చిరోలి భారీ ఎన్‌కౌంటర్ పెద్ద దెబ్బతీసింది. దక్షిణాదిలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కుదేలైన పార్టీని ఆదుకునేందుకు కేంద్ర కమిటీ నియమించిన విస్తరణ కమిటీ హెడ్, కేంద్ర కమిటీ సభ్యుడు దిలీప్ తేల్తుంబ్డే అలియాస్ మిలింద్ ఈ ఎన్‌కౌంటర్ మరణించి నట్లు గడ్చిరోలి పోలీసులు స్పష్టంచేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో ఈ ఏడాది సెప్టెంబర్ 26న ఢిల్లీలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సమావేశం జరిగింది. ఆ తర్వాత ఇదే అతి పెద్ద తొలి ఎన్‌కౌంటర్. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మావోయిస్టు పార్టీ భారీ స్థాయిలో నియామకంపై దృష్టి పెట్టాయి.
అయితే ఆర్కే అనారోగ్యం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో పెద్దగా ఫలితం రాలేదు. అంతేకాదు తెలంగాణలో నియామకానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కమిటీ ప్రత్యక్ష కార్యకలాపాలు పెద్దగా లేకపోవడం ప్రతికూల ఫలితాలే ఇచ్చాయి. ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ విస్తరణ హెడ్‌గా ఉన్న మిలింద్ నేరుగా రంగంలోకి దిగారు. నాగ్‌పూర్‌తో పాటు కొన్ని ప్రాంతాలు తిరిగి నియామక ప్రక్రియపై అనుసరించాల్సి వ్యూహాలను రచించినట్లు తెలిసింది. అయితే డయాబెటిక్ సమస్యతో పాటు స్పాండలైటిస్ సమస్య, నడుస్తూనే సృహ తప్పిపడిపోయే వ్యాధితో మిలింద్ బాధపడుతున్నట్టు పోలీస్ వర్గాలు తెలిపాయి.
రిక్రూట్‌మెంట్‌తో పాటు కమిటీలను బలోపేతం చేసే దిశగా గడ్చిరోలి కమిటీతో సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిసింది. కోర్చి పరిధిలోని మర్దిన్‌తోలా అటవుల్లో 48మందితో మిలింద్ సమావేశం నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. కోవర్టుల ద్వారా ఇది తెలుసుకున్న పోలీసులు, సీఆర్‌పీఎఫ్ ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిసింది. ఈ భేటీలో మిలింద్ కీలక సూచనలు చేసే సమయంలోనే తుపాకుల మోత ప్రారంభమైనట్లు సమాచారం.
నలుగురు తెలుగువారు..
గడ్చిరోలి కమిటీ భేటీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన మావోయిస్టు నేతలు నలుగురు, ఒడిశాకు చెందిన ముగ్గురు ఉన్నట్లు రాష్ట్ర నిఘా వర్గాల సమాచారం. మృతదేహాలను గుర్తిస్తే గానీ, ఆ నలుగురు ఎవరన్నది చెప్పలేమని వారు పేర్కొంటున్నారు. కాగా, కేంద్ర కమిటీలోని 21 మందిలో అనారోగ్య కారణాలతో ముగ్గురు మృతిచెందగా, మరో నలుగురు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరో ముగ్గురు గడిచిన ఏడాదిలో లొంగిపోయారు. దీనితో పార్టీలో యాక్టివ్‌గా ఉన్న వారి సంఖ్య సగానికిపైగా తగ్గింది.
వరుస ఎదురుదెబ్బలు...
దేశంలో మావోయిస్టు పార్టీకి ప్రస్తుతం అత్యంత గడ్డు రోజులు నడుస్తున్నాయి. కరోనా మొదటివేవ్, లాక్‌డౌన్ కాలంలో అనూహ్యంగా తెలంగాణలో ప్రాబల్యం చాటుకునే యత్నం చేసిన మావోలు.. రెండోవేవ్‌లో తమను తాము వైరస్ బారినుంచి, భద్రతా బలగాల నుంచి కాపాడుకులేకపోతున్నారు. పెరిగిన టెక్నాలజీ, దండకారణ్యంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు, వరుసగా మావోయిస్టు అగ్రనేతలను కోల్పోవడంతో పార్టీకి ఎదురుదెబ్బలు తాకుతున్నాయి.
తాజాగా మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు దీపక్, డీవీసీ కార్యదర్శి సుఖ్‌లాల్ ఉన్నట్లు తెలిసింది. వీరిలో దీపక్‌పై రూ.25 లక్షల రివార్డు ఉంది. ఈ విషయాన్ని మహారాష్ట్ర పోలీసులు ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మరోవైపు జార్ఖండ్‌లో జరిగిన ఓ ప్రమాదంలో కేంద్ర కమిటీ సభ్యుడు రవి మృతి చెందాడు. ఈ రెండు ఘటనలు మావోయిస్టు పార్టీకి ఊహించని విధంగా నష్టం కలిగించాయి.
Comments
Please login to add a commentAdd a comment