నిర్ణయం మీరే తీసుకోండి
శ్రుతి, విద్యాసాగర్ పోస్టుమార్టం రిపోర్టులు ఎన్‌హెచ్‌ఆర్‌సీకి
ఇమ్మనడంపై ప్రభుత్వానికి తేల్చిచెప్పిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: గత ఏడాది సెప్టెంబర్‌లో వరంగల్ జిల్లా, గోవిందరావుపేట మండల పరిధిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన శ్రుతి అలియాస్ మైత్రి, విద్యాసాగర్‌రెడ్డి అలియాస్ సూర్యంలకు నిర్వహించిన పోస్టుమార్టం నివేదికలను జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ)కు ఇవ్వాలా? వద్దా? అనేదానిపై తాము ఏ అభిప్రాయం వ్యక్తం చేయబోమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో మీరే తగిన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి చెప్పింది. శ్రుతి, విద్యాసాగర్‌రెడ్డిల ఎన్‌కౌంటర్‌పై ఎయిమ్స్ నివేదిక రాకపోవడంతో విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.
ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రుతి, విద్యాసాగర్‌రెడ్డిలది బూటకపు ఎన్‌కౌంటరని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ సివిల్ లిబర్టీస్ కమిటీ ప్రధాన కార్యదర్శి చిల్కా చంద్రశేఖర్ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది.
ఈ సందర్భంగా తెలంగాణ అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ.. మృతుల పోస్టుమార్టం నివేదికలను, వీడియో ఫుటేజీని పరిశీలించి వాటిపై అభిప్రాయం తెలుపుతూ నివేదిక ఇవ్వాలని ఎయిమ్స్ డెరైక్టర్‌ను ధర్మాసనం ఆదేశించిందని, ఆ నివేదిక రానందున కొంత గడువు కావాలన్నారు. ఇందుకు ధర్మాసనం అంగీకరించింది. శ్రుతి, విద్యాసాగర్‌రెడ్డిల పోస్టుమార్టం నివేదికలను ఎన్‌హెచ్‌ఆర్‌సీ కోరిందని, ఇవ్వమంటారా అని రామచంద్రరావు ధర్మాసనాన్ని అడిగారు. దీనిపై నిర్ణయాన్ని మీరే స్వయంగా తీసుకోవాలని ధర్మాసనం తేల్చి చెప్పింది.