post-mortem reports
-
కరోనా రోగుల శవ పరీక్షల్లో షాకింగ్ విషయాలు
లండన్ : కరోనా వైరస్ మృతుల పోస్టుమార్టమ్ నివేదికల ద్వారా పలు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. కోవిడ్ కారణంగా మృతి చెందిన వారిలో ఊపిరితిత్తుల్లో గాయాలు, రక్తం గడ్డకట్టడం వంటివి సాధారణంగా ఉన్నాయని లండన్‌కు చెందిన పరిశోధకులు వెల్లడించారు. వారు నిర్వహించిన పది పోస్టుమార్టాల్లో మృతులందరికీ ఊపిరితిత్తుల్లో గాయాలున్నాయని, ప్రారంభ లక్షణాలుగా ఊపిరితిత్తుల్లో మచ్చలు, కిడ్నీల్లో గాయాలు అయ్యాయని తెలిపారు. దాదాపు తొమ్మిది మందిలో ప్రధాన అవయవాలైన గుండె, కిడ్నీలు, ఊపిరితిత్తులో రక్తం గడ్డ కట్టిందని పేర్కొన్నారు. ( కరోనా భారత్: 30 లక్షలు దాటిన కేసులు ) ఈ మేరకు ఓ నివేదికను ఇంపీరియల్ కాలేజ్ వెబ్సైట్లో ప్రచురించారు. తాము కనుగొన్న ఈ వివరాల ద్వారా కరోనా రోగులకు మరింత మెరుగైన వైద్యం అందించే అవకాశం ఉందని, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ద్వారా సంభవించే మరణాలను అడ్డుకోవచ్చని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. బ్లడ్ తిన్నర్స్‌ను ఉపయోగించటం ద్వారా రక్తం గడ్డకట్టకుండా ముందుగానే జాగ్రత్త పడొచ్చని చెప్పారు. ఇలాంటి పరిశోధనలు రోగుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించటానికి, సరైన చికిత్స అందించటానికి ఉపయోగపడతాయని అన్నారు. -
పైసలిస్తేనే పోస్ట్‌మార్టం..
ఎంజీఎం (వరంగల్): మహాత్మాగాంధీ మెమోరియల్ ఆస్పత్రిలోని మార్చురీలో ప్రతి రోజు సుమారు ఐదు నుంచి ఎనిమిది శవాలకు పోస్టుమార్టం జరుగుతుంది. మృతుల కటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం నిత్యం మార్మోగుతూ ఉంటుంది. ఆ హృదయ విదారకర దృశ్యాలు చూస్తే ఎవరికైనా కంట నీరు రాక మానదు. కానీ.. ఎంజీఎం మార్చురీలో కాసులకు కక్కుర్తి పడే పలువురు వైద్యులు, సిబ్బందికి వీరి కన్నీళ్లు కనపడవు.. వీరి ఆర్తనాదాలు వినపడవు. పైసలిస్తేనే పోస్ట్‌మార్టం చేస్తామని కరాఖండీగా చెబుతున్నారు. గతంలోనూ ఇలాం టి ఘటనలు చోటుచేసుకోగా విమర్శలు వెల్లువెత్తాయి. అయినా.. అవినీతికి అలవాటుపడిన కొంత మంది వైద్యు లు, సిబ్బందిలో మార్పు రాలేదనడానికి సోమవారం చోటు చేసుకున్న ఘటనే ఉదాహరణ. 3 గంటలపాటు నిలిచిన సేవలు.. మృతదేహాలకు పోలీసులు పంచనామా నిర్వహించిన తర్వాత ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోస్టుమార్టం నిర్వహించాల్సి ఉంటుంది. సోమవారం ఎంజీఎం మార్చురీలో ఎనిమిది మృతదేహాలు ఉండగా.. ఉదయం కొన్నింటికి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు మధ్యాహ్న భోజనానికి వెళ్లారు. సాయంత్రం ఐదు గంటల వరకు కూడా తిరిగి రాలేదు. అప్పటికే పోస్టుమార్టం కోసం పంచనామా పూర్తి చేసుకుని వేచి చూస్తున్న మృతుల కుటుంబ సభ్యులు, బంధువుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మార్చురీ గేటు వద్ద మూకుమ్మడిగా ఆందో ళన చేపట్టారు. వైద్యుల పనితీరుపై మండిపడ్డారు. వైద్యు లు, సిబ్బంది అక్రమ వసూళ్లపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శాసన మండలిలో చర్చ జరిగినా.. ఎంజీఎం మార్చురీలో పైసలిస్తే పోస్టుమార్టం చేస్తున్నారని గతంలో సోషల్ మీడియాలో క్లిప్పింగ్స్ హల్చల్ చేశాయి. మార్చురీలో కింది స్థాయి సిబ్బంది బహిరంగంగా పైసలు డిమాండ్ చేస్తున్న క్రమంలో మృతుల కుటుంబ సభ్యులు ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియా ద్వారా బహిర్గతం చేశారు. విస్తృతం ప్రచారం కావడంతో ఇక్కడి వైద్యులు, సిబ్బంది తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై రాష్ట్ర స్థాయి అధికారులతోపాటు ప్రజాప్రతినిధులు స్పందించారు. దీంతో ఆ వీడియోలో కనిపించినటువంటి నాలుగో తరగతి ఉద్యోగులపై కాకతీయ మెడికల్ కళాశాల అధికారులు చర్యలు తీసుకుని చేతులు దులుపుకున్నారు. వసూలు చేసిన డబ్బులను పంచుకున్న పలువురు వైద్యులను వదిలేశారని అప్పట్లోనే విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాదు.. ఎంజీఎం మార్చురీలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించడానికి రూ. 5 వేలు ఖర్చవుతుందని అప్పటి కలెక్టర్ అమ్రపాలికి ఓ ఎంపీపీ ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా ఓ ఎమ్మెల్సీ స్థాయి వ్యక్తి ఎంజీఎం మార్చురీ అవినీతిపై చర్చించారు. ఈ ఘటనల తర్వాత కొద్ది రోజుల పాటు మార్చురీలో పైసల వసూళ్లు ఆగినప్పటికీ.. దందా మళ్లీ మొదలైంది. రూ. 5 వేలు ఖర్చు చేయాల్సిందే.. ఎంజీఎం మార్చురీకి పోస్టుమార్టం కోసం వస్తే రూ.5 వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. పైసలు ఎందుకని ప్రశ్నిస్తే ఈ రోజు పోస్టుమార్టం కాదు. రేపు అవుతుందని బెదిరిస్తున్నారు. గత్యంతరం లేక డబ్బులివ్వక తప్పడం లేదు. మృతదేహాన్ని కోసే వ్యక్తికి వెయ్యి, వైద్యునికి వెయ్యి, అంబులెన్స్‌కు రెండు వేలు చెల్లిస్తే గానీ.. ఇంటికి మృతదేహాం తీసుకెళ్లలేని దుస్థితి. – జమలాపురం నగేష్, ఓ మృతుడి బంధువు ఫోరెన్సిక్ సిబ్బంది కొరత ఉంది.. కాకతీయ మెడికల్ కళాశాలలో ఫోరెన్సిక్ వైద్యుల కొరత ఉంది. ప్రస్తుతం ఇద్దరు వైద్యులు మాత్రమే ఉన్నారు. విధుల్లో కొనసాగుతున్న అసోసియేట్ ప్రొఫెసర్ కోర్టు డ్యూటీపై వెళ్లగా.. మరో వైద్యుడు మధ్యాహ్నం వైద్యవిద్యార్థులకు తరగుతులు నిర్వహిస్తున్నారు. దీంతో మార్చురీకి నాలుగు గంటలకు వెళ్లాల్సి వచ్చింది. మార్చురీలో అవినీతి నా దృష్టికి రాలేదని, అవినీతి జరుగకుండా సీసీ కెమెరాలతో పాటు అన్ని రకల చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ సంధ్య, కేఎంసీ ప్రిన్సిపాల్ మార్చరీ వద్ద ఆందోళన చేస్తున్న మృతుల కుటుంబ సభ్యులు -
కట్టుకున్నోడే కడతేర్చాడు
కర్నూలు : డోన్ సుందర్‌సింగ్ కాలనీలో నెల క్రితం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన గ్లోరి ఎంజెల్ అలియాస్ స్వీటీ (25)ది హత్యేనని పోస్టుమార్టం నివేదికలో తేలింది. రైల్వే ఉద్యోగి రాజప్ప, సౌజన్య దంపతుల కుమార్తె అయిన గ్లోరీ, అదే కాలనీకి చెందిన పవన్‌కుమార్ ఆరేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి కుమార్తెలు హన్సిక (9), డింపుల్ (6)ఉన్నారు. గత నెల 22వ తేదీన గ్లోరి ఇంటిలో అనుమానాస్పదంగా మృతి చెందడంపై ఆమె తల్లిదండ్రులు డోన్ పోలీస్ స్టేషన్లో అల్లుడిపై ఫిర్యాదు చేశారు. సంఘటన అనంతరం పవన్ కుమార్, తన చిన్న కుమార్తెతో అజ్ఞాతంలోకి వెళ్లడంతో అతడిపై పోలీసులకు అనుమానం బలపడింది. ఎస్ఐ జయశేఖర్ గౌడ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే పోస్టుమార్టం నివేదికలో వాస్తవం వెలుగు చూసింది. గ్లోరిని గొంతు నులిమి హత్య చేసిన అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు చీరతో ఉరి వేసి పవన్‌కుమార్ పరారైనట్లు ఎస్ఐ తెలిపారు. నిందితుడిని సోమవారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు మెజిస్ట్రేట్ ఆంజనేయులు ఎదుట నిందితుడిని హాజరుపరిచగా రిమాండ్‌కు ఆదేశించారు. -
నిర్ణయం మీరే తీసుకోండి
శ్రుతి, విద్యాసాగర్ పోస్టుమార్టం రిపోర్టులు ఎన్హెచ్ఆర్సీకి ఇమ్మనడంపై ప్రభుత్వానికి తేల్చిచెప్పిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: గత ఏడాది సెప్టెంబర్‌లో వరంగల్ జిల్లా, గోవిందరావుపేట మండల పరిధిలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన శ్రుతి అలియాస్ మైత్రి, విద్యాసాగర్‌రెడ్డి అలియాస్ సూర్యంలకు నిర్వహించిన పోస్టుమార్టం నివేదికలను జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ)కు ఇవ్వాలా? వద్దా? అనేదానిపై తాము ఏ అభిప్రాయం వ్యక్తం చేయబోమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో మీరే తగిన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి చెప్పింది. శ్రుతి, విద్యాసాగర్‌రెడ్డిల ఎన్‌కౌంటర్‌పై ఎయిమ్స్ నివేదిక రాకపోవడంతో విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రుతి, విద్యాసాగర్రెడ్డిలది బూటకపు ఎన్కౌంటరని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ సివిల్ లిబర్టీస్ కమిటీ ప్రధాన కార్యదర్శి చిల్కా చంద్రశేఖర్ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా తెలంగాణ అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ.. మృతుల పోస్టుమార్టం నివేదికలను, వీడియో ఫుటేజీని పరిశీలించి వాటిపై అభిప్రాయం తెలుపుతూ నివేదిక ఇవ్వాలని ఎయిమ్స్ డెరైక్టర్‌ను ధర్మాసనం ఆదేశించిందని, ఆ నివేదిక రానందున కొంత గడువు కావాలన్నారు. ఇందుకు ధర్మాసనం అంగీకరించింది. శ్రుతి, విద్యాసాగర్‌రెడ్డిల పోస్టుమార్టం నివేదికలను ఎన్హెచ్ఆర్సీ కోరిందని, ఇవ్వమంటారా అని రామచంద్రరావు ధర్మాసనాన్ని అడిగారు. దీనిపై నిర్ణయాన్ని మీరే స్వయంగా తీసుకోవాలని ధర్మాసనం తేల్చి చెప్పింది.