కర్నూలు : డోన్ సుందర్‌సింగ్ కాలనీలో నెల క్రితం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన గ్లోరి ఎంజెల్ అలియాస్ స్వీటీ (25)ది హత్యేనని పోస్టుమార్టం నివేదికలో తేలింది. రైల్వే ఉద్యోగి రాజప్ప, సౌజన్య దంపతుల కుమార్తె అయిన గ్లోరీ, అదే కాలనీకి చెందిన పవన్‌కుమార్ ఆరేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి కుమార్తెలు హన్సిక (9), డింపుల్ (6)ఉన్నారు. గత నెల 22వ తేదీన గ్లోరి ఇంటిలో అనుమానాస్పదంగా మృతి చెందడంపై ఆమె తల్లిదండ్రులు డోన్ పోలీస్ స్టేషన్‌లో అల్లుడిపై ఫిర్యాదు చేశారు. సంఘటన అనంతరం పవన్ కుమార్, తన చిన్న కుమార్తెతో అజ్ఞాతంలోకి వెళ్లడంతో అతడిపై పోలీసులకు అనుమానం బలపడింది. ఎస్‌ఐ జయశేఖర్ గౌడ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే పోస్టుమార్టం నివేదికలో వాస్తవం వెలుగు చూసింది. గ్లోరిని గొంతు నులిమి హత్య చేసిన అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు చీరతో ఉరి వేసి పవన్‌కుమార్ పరారైనట్లు ఎస్‌ఐ తెలిపారు. నిందితుడిని సోమవారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు మెజిస్ట్రేట్ ఆంజనేయులు ఎదుట నిందితుడిని హాజరుపరిచగా రిమాండ్‌కు ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment