ఎంజీఎం మార్చురీ ఆవరణ, (ఇన్‌సెట్‌లో) మార్చురీ వద్ద ఆందోళన చేస్తున్న మృతుల కుటుంబ సభ్యులు
ఎంజీఎం (వరంగల్): మహాత్మాగాంధీ మెమోరియల్ ఆస్పత్రిలోని మార్చురీలో ప్రతి రోజు సుమారు ఐదు నుంచి ఎనిమిది శవాలకు పోస్టుమార్టం జరుగుతుంది. మృతుల కటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం నిత్యం మార్మోగుతూ ఉంటుంది. ఆ హృదయ విదారకర దృశ్యాలు చూస్తే ఎవరికైనా కంట నీరు రాక మానదు. కానీ.. ఎంజీఎం మార్చురీలో కాసులకు కక్కుర్తి పడే పలువురు వైద్యులు, సిబ్బందికి వీరి కన్నీళ్లు కనపడవు.. వీరి ఆర్తనాదాలు వినపడవు. పైసలిస్తేనే పోస్ట్‌మార్టం చేస్తామని కరాఖండీగా చెబుతున్నారు. గతంలోనూ ఇలాం టి ఘటనలు చోటుచేసుకోగా విమర్శలు వెల్లువెత్తాయి. అయినా.. అవినీతికి అలవాటుపడిన కొంత మంది వైద్యు లు, సిబ్బందిలో మార్పు రాలేదనడానికి సోమవారం చోటు చేసుకున్న ఘటనే ఉదాహరణ.
3 గంటలపాటు నిలిచిన సేవలు..
మృతదేహాలకు పోలీసులు పంచనామా నిర్వహించిన తర్వాత ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోస్టుమార్టం నిర్వహించాల్సి ఉంటుంది. సోమవారం ఎంజీఎం మార్చురీలో ఎనిమిది మృతదేహాలు ఉండగా.. ఉదయం కొన్నింటికి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు మధ్యాహ్న భోజనానికి వెళ్లారు. సాయంత్రం ఐదు గంటల వరకు కూడా తిరిగి రాలేదు. అప్పటికే పోస్టుమార్టం కోసం పంచనామా పూర్తి చేసుకుని వేచి చూస్తున్న మృతుల కుటుంబ సభ్యులు, బంధువుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మార్చురీ గేటు వద్ద మూకుమ్మడిగా ఆందో ళన చేపట్టారు. వైద్యుల పనితీరుపై మండిపడ్డారు. వైద్యు లు, సిబ్బంది అక్రమ వసూళ్లపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
శాసన మండలిలో చర్చ జరిగినా..
ఎంజీఎం మార్చురీలో పైసలిస్తే పోస్టుమార్టం చేస్తున్నారని గతంలో సోషల్ మీడియాలో క్లిప్పింగ్స్ హల్‌చల్ చేశాయి. మార్చురీలో కింది స్థాయి సిబ్బంది బహిరంగంగా పైసలు డిమాండ్ చేస్తున్న క్రమంలో మృతుల కుటుంబ సభ్యులు ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియా ద్వారా బహిర్గతం చేశారు. విస్తృతం ప్రచారం కావడంతో ఇక్కడి వైద్యులు, సిబ్బంది తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై రాష్ట్ర స్థాయి అధికారులతోపాటు ప్రజాప్రతినిధులు స్పందించారు.
దీంతో ఆ వీడియోలో కనిపించినటువంటి నాలుగో తరగతి ఉద్యోగులపై కాకతీయ మెడికల్ కళాశాల అధికారులు చర్యలు తీసుకుని చేతులు దులుపుకున్నారు. వసూలు చేసిన డబ్బులను పంచుకున్న పలువురు వైద్యులను వదిలేశారని అప్పట్లోనే విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాదు.. ఎంజీఎం మార్చురీలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించడానికి రూ. 5 వేలు ఖర్చవుతుందని అప్పటి కలెక్టర్ అమ్రపాలికి ఓ ఎంపీపీ ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా ఓ ఎమ్మెల్సీ స్థాయి వ్యక్తి ఎంజీఎం మార్చురీ అవినీతిపై చర్చించారు. ఈ ఘటనల తర్వాత కొద్ది రోజుల పాటు మార్చురీలో పైసల వసూళ్లు ఆగినప్పటికీ.. దందా మళ్లీ మొదలైంది.
రూ. 5 వేలు ఖర్చు చేయాల్సిందే..
ఎంజీఎం మార్చురీకి పోస్టుమార్టం కోసం వస్తే రూ.5 వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. పైసలు ఎందుకని ప్రశ్నిస్తే ఈ రోజు పోస్టుమార్టం కాదు. రేపు అవుతుందని బెదిరిస్తున్నారు. గత్యంతరం లేక డబ్బులివ్వక తప్పడం లేదు. మృతదేహాన్ని కోసే వ్యక్తికి వెయ్యి, వైద్యునికి వెయ్యి, అంబులెన్స్‌కు రెండు వేలు చెల్లిస్తే గానీ.. ఇంటికి మృతదేహాం తీసుకెళ్లలేని దుస్థితి. – జమలాపురం నగేష్, ఓ మృతుడి బంధువు
ఫోరెన్సిక్ సిబ్బంది కొరత ఉంది..
కాకతీయ మెడికల్ కళాశాలలో ఫోరెన్సిక్ వైద్యుల కొరత ఉంది. ప్రస్తుతం ఇద్దరు వైద్యులు మాత్రమే ఉన్నారు. విధుల్లో కొనసాగుతున్న అసోసియేట్ ప్రొఫెసర్ కోర్టు డ్యూటీపై వెళ్లగా.. మరో వైద్యుడు మధ్యాహ్నం వైద్యవిద్యార్థులకు తరగుతులు నిర్వహిస్తున్నారు. దీంతో మార్చురీకి నాలుగు గంటలకు వెళ్లాల్సి వచ్చింది. మార్చురీలో అవినీతి నా దృష్టికి రాలేదని, అవినీతి జరుగకుండా సీసీ కెమెరాలతో పాటు అన్ని రకల చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ సంధ్య, కేఎంసీ ప్రిన్సిపాల్
మార్చరీ వద్ద ఆందోళన చేస్తున్న మృతుల కుటుంబ సభ్యులు
Comments
Please login to add a commentAdd a comment