ములుగు ఆస్పత్రిలో స్వరూప
ఏటూరునాగారం: ఓ గర్భిణి డెలివరీ కోసం 4 రోజులపాటు ప్రభుత్వ ఆస్పత్రుల చుట్టూ తిరిగినా వైద్యులు స్పందించలేదు. చివరకు బిడ్డను గర్భంలోనే పోగొట్టుకున్నా ఆ మృత శిశువునూ తొలగించని ఘటన ములుగు జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ములుగు జిల్లా మంగపేట మండలం చెరుపల్లికి చెందిన ఎంపెల్లి స్వరూప రెండో కాన్పు కోసం ఈ నెల 1న మంగపేట ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లగా వరంగల్ ఎంజీఎంకు రెఫర్ చేశారు. అదేరోజు ఆమె ఎంజీఎంకు వెళ్లినా చేర్చుకోకపోవడంతో ఆరుబయటే వర్షంలోనే తడుస్తూ రేకులషెడ్డులో కాలం గడిపింది.
మరుసటిరోజు వైద్యుల సూచన మేరకు బయట స్కానింగ్ తీసుకుని రిపోర్టులు తెచ్చాక 3వ తేదీ ఉదయం పరిశీలించి గర్భంలో శిశువు మరణించిందని వైద్యులు చెప్పారు. శిశువును కడుపులో నుంచి తొలగించకుండా, పరిస్థితి విషమం గా ఉందని హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి రెఫర్ చేశారు. చేతిలో చిల్లి గవ్వ లేని ఆ నిరుపేద దంపతులు ఎలాగోలా గాంధీ ఆస్పత్రికి చేరుకున్నారు. అక్కడి వైద్యులు ‘సమ్మెలో ఉన్నామని, ఎలాంటి ఆపరేషన్లు చేయబోమని’స్వరూపను బయటకు పంపించి గేట్లు మూసివేశారు. ఆశా వర్కర్ విజయలక్ష్మి సహాయంతో ఉన్నతాధికారులకు సమాచారమివ్వగా ములుగు ఆస్పత్రికి తీసుకురావాలని వారు చెప్పారు. తీరా అక్కడికి వెళ్లాక ఆదివారం సెలవు రోజు కావడంతో గైనకాలజిస్ట్, మత్తు వైద్యులు లేక డెలివరీ చేయలేదు. మృతశిశువు గర్భంలోనే ఉండడంతో ఆ బాధకు తట్టుకోలేక స్వరూప రోదిస్తున్నా పట్టించుకునేవారే లేకుండా పోయారు.
Comments
Please login to add a commentAdd a comment