‘ఎలుక తోలుదెచ్చి ఏడాది ఉతికినా.. నలుపు నలుపేగాని తెలుపుగాదు’ అని మా మీద ఎందుకు ఏడ్వడం? మేమెలాగూ మారం! మరి మీరు?. ఈ రోజు ఒకరిని కొర్కినం.. రేపు మరొకర్ని’ అంటూ ఎంజీఎం వైద్యులు, దవాఖాన పరిస్థితిపై ఎలుక చెప్పిన కథ!
– ఎంజీఎం/వరంగల్ డెస్క్
‘‘గీ ఎంజీఎంను.. ధర్మాసుపత్రని చెప్తుండ్రు కదా.. మరి ఇక్కడ్కి రావాల్నంటే రోగులు ఎందుకు భయపడుతుండ్రు. మేం ఎలుకలు, మా పెద్దన్న(పందికొక్కు)లు ఉన్నయనా? దవాఖాన ఆర్‌ఐసీయూలో ఓ రోగిని కొరికినమనా? సరే.. మొదటిసారి కొరికినం. అది మా తప్పే? ఆ తర్వాత ఐదు దినాల్లో అదే రోగిని మూడుచోట్ల కొరికినం.
అధికారులు, వైద్యులు మీరంతా ఏం జేసిండ్రు. కట్టు కట్టి వదిలేసిండ్రు. అది మీ తప్పు కాదా? అంతా మాపై నెట్టేసి.. చేతులు దులుపుకుంటుండ్రు! ఒక్కటి చెప్పుండ్రి మేమిక్కడ(ఎంజీఎంలో) టికానా ఏర్పాటు చేసుకునేతందుకు కారణం మీ నిర్లక్ష్యం కాదా?’’ అని ఎలుక తన మనోగతాన్ని బయటపెట్టింది.
సంబంధిత వార్త: రోగి కాళ్లు, చేతులు కొరికిన ఎలుకలు
మరో ఎలుక మీసాలు రువ్వుతూ గళమెత్తింది!
‘‘ఇట్లా ఒక్కటేమిటి మీ తప్పులు లెక్కలేనన్ని సూసినం. కొన్ని చెప్త ఇనుండ్రి. ఏ రోజైనా ఇక్కడి సిబ్బంది యాళ్లకు విధులకు హాజరైండ్లా? శానిటేషన్ ఎట్లుంది? వార్డుల నిర్వహణ ఎట్లున్నది? రోగులేమో వందల్లో, వేలల్లో ఉంటరు.. వైద్యులేమో అతి తక్కువ మంది ఉంటరు? యాళ్లపొద్దుగాళ్ల ఇంటికాన్నుంచి అచ్చే రోగులకు సక్కటి వైద్యమందిత్తలేరు! ఎలుకలమై ఉండి మాకే బాధనిపిస్తుంది’’ అంటూ మీసం తిప్పుతూ ఆర్‌ఐసీయూ వార్డుకు వెళ్లిపోయింది.
చిట్టెలుక స్వరం మార్చి(బాధతో)
‘‘ఎంజీఎం ఆస్పత్రిలో ఆర్‌ఎంఓ–1 గా వైద్యాధికారి డాక్టర్ హరీశ్‌రాజును గవుర్నమెంటు డిప్యూటేషన్‌పై వేరే జిల్లా డీఎంహెచ్‌ఓగా కొనసాగిస్తండ్లు. ఎంజీఎం ఆస్పత్రిలో నిత్యం ముగ్గురు ఆర్‌ఎంఓలు విధులు నిర్వర్తించాల్సి ఉండగా.. ఒక్క అధికారి డిప్యుటేషన్‌లో ఉండగా, మరో ఒక్క ఆర్‌ఎంఓ స్థాయి అధికారి పోస్టు ఖాళీగా ఉండడంతో ఒకే ఒక్క ఆర్‌ఎంఓ విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి. గీ ముచ్చట్లన్నీ దవాఖాన్ల సదువుకున్నోళ్లు చెప్తే విన్న’’ అంటూ చిట్టెలుక సరసరా ఆవరణలోని కలుగులోకెళ్లింది.
ముక్కు మూసుకుంటూ మరో మూషికం..
‘‘సుట్టపు సూపోలె ఎంజీఎంకు డాక్టర్లు వస్తరు. పోతరు! మేమే(ఎలుకలం) ఎప్పట్నుంచో ఈన్నే ఉంటన్నం. కొంతమంది డాక్టర్లు, సిబ్బంది సుట్టపు సూపోలే.. ఆస్పత్రికి వస్తున్నరు. రిజిస్టర్ల సంతకాలు పెట్టేతందుకే వస్తున్నరేమో అనే అనుమానం కల్గుతంది. వాళ్లతో పోలిస్తే మేమే నయం. మా పని మేం సక్కగ చేసుకుంటున్నం’’ అంటూ మూషికం దవాఖానలోని జంబుఖానను కొరుకుతూ చెబుతోంది!
బరాబర్ అల్కిరి చేస్తం!
‘‘ఎంజీఎం మా అడ్డా. అవ్ బరాబర్ ఇక్కడ్నే ఉంటం. అల్కిరి జేస్తం. ఎవ్వర్నైనా కొరుకుతం. ఏ విభాగంలకైనా దూరుతం. అధికార్లు, వైద్యులు ఏం చేస్తరో చేసుకోండ్రి. మా జోలికొచ్చే ముందు శానిటేషన్ వ్యవస్థను ప్రక్షాళన చెయ్యుండ్రి. ఆస్పత్రి ఆవరణల ఎక్కడపడితే అక్కడ చెత్త వేసుడు మానేయుండ్రి. ఆ తర్వాత మా జోలికి రండ్రి! అంటూ ఎలుకలన్నీ మూకుమ్మడిగా గొంతు కదిపాయి!
Comments
Please login to add a commentAdd a comment