కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమ హత్య కేసులో నిందితురాలు కామేశ్వరి అలియాస్ స్వరూప అలియాస్ రింకీ ఎదురుకాల్పుల్లో మృతిచెందిన దృశ్యం
పశ్చిమగోదావరి ,జంగారెడ్డిగూడెం : అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్య కేసులో నిందితురాలిగా ఉన్న మావోయిస్టు, భీమవరానికి చెందిన కామేశ్వరి అలియాస్ స్వరూప, అలియాస్ చంద్రి, అలియాస్ సింద్రి, అలియాస్ రింకీ పోలీసులు, మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో మృతి చెందింది. బుధవారం ఒడిస్సాలోని కోరాపుట్ జిల్లా పడువా పోలీస్‌స్టేషన్ పరిధిలో మావోయిస్టులు, పోలీసు బలగాలు, స్పెషల్ ఆపరేషన్ గ్రూపు(ఎస్‌ఓజీ) మధ్య పెద్దెత్తున ఎదురు కాల్పులు జరిగాయి. కోరాపుట్ జిల్లా ఎస్పీ కేవీ సింగ్ తెలిపిన వివరాలు ప్రకారం కోరాపుట్ జిల్లా నందాపూర్ బ్లాక్ పరిధిలో గల హతీబరి పంచాయతీ సమీపంలో కిటువాకమీ అడవుల్లో 15 మందికి పైగా మావోయిస్టులు సమావేశమైనట్లు అందిన సమాచారం మేరకు పోలీసులు, ఎస్‌వోజీ బలగాలతో దాడులు నిర్వహించామన్నారు. ఈ నేపధ్యంలో పోలీసులు, ఎస్‌వోజీ, మావోయిస్టుల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయని, ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు ఆయన ధృవీకరించారు. వీరిలో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నట్లు పేర్కొన్నారు. చనిపోయిన మహిళా మావోయిస్టుల్లో భీమవరానికి చెందిన కామేశ్వరి అలియాస్ స్వరూప అలియాస్ రింకీ ఉన్నట్లు ఎస్పీ తెలియజేశారు.
కామేశ్వరిది శ్రీకాకుళం కాగా, ఈమె తండ్రి ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. ఈమె తల్లితండ్రులు శ్రీకాకుళంలో ఉండగా కామేశ్వరిని భీమవరంలో ఒక వ్యక్తికి చ్చి వివాహం చేశారు. కొంతకాలం కామేశ్వరి భర్తతో కాపురం చేయగా, వీరి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. తరువాత తూర్పుగోదావరి జిల్లా గోకవరం ఆర్టీసీ డిపోలో కామేశ్వరి కండక్టర్‌గా పనిచేసింది. ఈ సమయంలోనే మావోయిస్టులపై ఆకర్షితురాలై 2008–09లో కామేశ్వరి మావోయిస్టుల్లో చేరింది. అప్పటి నుంచి క్రియాశీలకంగా వ్యవహరిస్తూ యాక్షన్ టీమ్ సభ్యురాలిగా మారింది. కిడారి, సోమ హత్యోదంతం అనంతరం వీటి వెనుక భీమవరానికి చెందిన కామేశ్వరి అనే మావోయిస్టు పాత్ర ఉందని పోలీసులు పేర్కొన్నప్పుడు జిల్లా వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం మావోయిస్టులకు షెల్టర్ జోన్‌గా ఉంటూ వస్తోంది. ఈ సమయంలో మావోయిస్టుల వైపు ఎక్కువగా గిరిజనులు ఆకర్షితులై చేరుతుంటారు. అయితే మైదాన ప్రాంతం నుంచి మావోయిస్టుల్లో చేరడం అరుదు. జిల్లా నుంచి భీమవరంలో కొంత కాలం నివాసం ఉన్న కామేశ్వరి మావోయిస్టుల్లో చేరడం, క్రియాశీలకంగా మారి మావోయిస్టుల్లో ప్రధాన వ్యక్తిగా రూపాంతరం చెందింది. ఈ నేపధ్యంలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆమె హతమైంది. జిల్లా నుంచి ఇలా మావోయిస్టుల్లో చేరి ఎన్‌కౌంట్‌లో హతమైన ఘటనలు గతంలోనూ జరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment