రాజ్‌కుమార్ మృతదేహం
సాక్షి, భూపాలపల్లి : తనకు వచ్చిన ఉపాధ్యాయ ఉద్యోగాన్ని వదిలి మావోయిస్టు పార్టీలో చేరి 15 ఏళ్లుగా విప్లవోద్యమంలో కొనసాగుతున్న సుంకరి రాజ్‌కుమార్ అలియాస్ అరుణ్‌కుమార్(36) ప్రస్థానం ముగిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కుర్నపల్లి–నిమ్మలవాగు అటవీ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఎన్‌కౌంటర్‌లో రాజ్‌కుమార్ మృతిచెందడంతో తన స్వగ్రామం భూపాలపల్లి మండలం దూదేకులపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. దూదేకులపల్లి చెందిన సుంకరి రామక్క, సమ్మయ్య దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు ఉన్నారు. అందరిలో చిన్నవాడైన రాజ్‌కుమార్ డిగ్రీ, బీఈడీ పూర్తి చేశాడు. కొన్నాళ్లు గ్రామంలోనే విద్యావలంటీర్‌గా పనిచేశాడు. గ్రామస్తుల సహకారం తీసుకుని పాఠశాలలో వసతులు కల్పించాడు. ఈ క్రమంలోనే అతడికి నాగార్జున సాగర్‌లో ఉద్యోగం వచ్చినప్పటికీ వెళ్లకుండా విప్లవోద్యమానికి ఆకర్షితుడై 2003లో అప్పటి సీపీఐ(ఎంఎల్) పీపుల్స్‌వార్‌లో చేరాడు.
2004లో ప్రభుత్వంతో జరిగిన మావోయిస్టులు చర్చల అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. సంవత్సరంపాటు గ్రామంలోనే ఉండి మళ్లీ ఉద్యమబాట పట్టాడు. జిల్లాలోని మహదేవ్‌పూర్ ఏరియాలో కొన్నాళ్లు పనిచేసిన అనంతరం ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లిపోయాడు. ప్రస్తుతం చర్ల శబరి ఏరియా కమిటీ మెంబర్‌గా కొనసాగుతున్నాడు. రాజ్‌కుమార్ దళంలో పని చేసేవారికి వైద్య సేవలు అందిస్తున్నాడు. ఈ క్రమంలో అతడు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలిసింది.
ఎదురుకాల్పుల్లో మృత్యువాత..
ఈ నెల 28 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చిం ది. ఈ నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా సరిహద్దు ప్రాంతంలో పోలీసులు కూంబిం గ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే కుర్నపల్లి–నిమ్మలగూడెం మధ్యలోని అటవీ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో మావోయిస్టులు–పోలీసులు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
ఈ కాల్పుల్లో మావోయిస్టు పార్టీ చర్ల శబరి ఏరియా కమిటీ సభ్యుడు అరుణ్ అలియాస్ రాజ్‌కుమా ర్ మృతిచెందాడు. మరికొందరు మావోయిస్టులకు గాయాలయ్యాయని, వారు తప్పించుకున్నారని సమాచారం. కాల్పులు జరిగిన ప్రాంతం నుంచి మృతదేహంతోపాటు ఒక 303 రైఫిల్, కిట్ బ్యాగులు, గొడుగులు, చేతి సంచులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని ట్రాక్టర్‌లో కుర్నపల్లి అటవీ ప్రాంతం నుంచి సత్యనారాయణపురంలోని సీఆర్‌పీఎఫ్ 151 బెటాలియన్ క్యాంప్ నకు తరలించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో భద్రాచలం ఏరియా వైద్యశాలకు చేర్చారు.
Comments
Please login to add a commentAdd a comment