ముగ్గురు మావోల ఎన్‌కౌంటర్‌  | Encounter Of Three Maoists In Charla Mandal | Sakshi
Sakshi News home page

ముగ్గురు మావోల ఎన్‌కౌంటర్‌ 

Published Thu, Sep 24 2020 5:27 AM | Last Updated on Sat, Sep 26 2020 10:16 PM

Encounter Of Three Maoists In Charla Mandal - Sakshi

చర్ల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చెన్నాపురం అటవీ ప్రాంతంలో బుధవారం రాత్రి జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ మేరకు ఎస్పీ సునీల్‌దత్‌ బుధవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. చెన్నాపురం అటవీ ప్రాంతంలో గల గుట్టల వద్ద రాత్రి ఏడు గంటల ప్రాంతంలో మావోయిస్టులు.. పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. అనంతరం ఆ ప్రాంతంలో గాలించగా.. సంఘటనా ప్రాంతంలో ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. వీరిలో ఇద్దరు మహిళా మావోయిస్టులు, మిలీషియన్‌ కమాండర్‌ సోడి జోగయ్య మృతదేహం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాల వద్ద ఒక 8 ఎంఎం రైఫిల్, పేలుడుకు ఉపయోగించే సామగ్రి, ఒక కిట్‌ బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎదురుకాల్పుల్లో పలువురు మావోయిస్టులు తప్పించుకోగా.. వారి కోసం కూంబింగ్‌ ఆపరేషన్‌ను ముమ్మరం చేసినట్లు ఎస్పీ తెలిపారు. జిల్లాలో ఇరవై రోజుల వ్యవధిలో జరిగిన మూడు ఎన్‌కౌంటర్లలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఆసిఫాబాద్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందడంతో రాష్ట్రంలో ఇటీవల జరిగిన వరుస ఎన్‌కౌంటర్లలో మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య 8కి చేరింది.  

కిన్నెరసాని అడవుల్లో ఎదురుకాల్పులు 
పాల్వంచ రూరల్‌: పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. అయితే.. మావోయిస్టులు త్రుటిలో తప్పించుకున్నారు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కిన్నెరసాని అభయారణ్యం పరిధిలోని ఉల్వనూరు శివారు పాములదున్న గుట్ట అటవీ ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. మావోయిస్టుల కోసం పోలీసులు కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఎదురుపడిన పోలీసులపై మావోయిస్టులు కాల్పులు జరుపుతూ రెండు వర్గాలుగా విడిపోయి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే పోలీసులకు తారసపడింది ఏ దళానికి చెందిన సభ్యులు అనేది తెలియరాలేదు. సంఘటనా స్థలంలో ఒక తుపాకీ, కిట్‌ బ్యాగులు, సోలార్‌ ప్లేట్, వంట సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ కేఆర్‌కే ప్రసాదరావు తెలిపారు. ఎస్పీ సునీల్‌దత్‌ సంఘటనా స్థలాన్ని సందర్శించారు.

డ్రోన్‌ ద్వారా మావోల కదలికలపై నిఘా
మహాముత్తారం: మావోయిస్టుల కదలికలపై పోలీసులు గట్టి నిఘా పెట్టారు. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని నియంత్రించేందుకు చర్యలు చేపడుతున్నారు. డ్రోన్‌ కెమెరాలతో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా సరిహద్దు గ్రామాలు, అడవులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఒకప్పుడు మావోయిస్టులకు పెట్టిన కోటగా ఈ  ప్రాంతం ఉండేది.  తర్వాత కాలంలో పోలీసులు నియంత్రించినా, ఇటీవల సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణ ప్రాంతంలోకి మావోలు వచ్చారని ఇంటెలిజెన్స్‌ వర్గాలు గుర్తించినట్లు సమాచారం. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో ఇటీవల ఓ ప్రభుత్వ ఉద్యోగిని కాల్చి చంపిన నేపథ్యంలో.. మావోల కదలికలపై నిఘా ఏర్పాటు చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా డ్రోన్‌ కెమెరాల ద్వారా గాలింపు చర్యలు చేపడుతున్నారు. మహాముత్తారం మండలంలోని సరిహద్దు ప్రాంతాలైన కనుకునూర్, రెడ్డిపల్లి, సింగంపల్లి, సింగారంతోపాటు పలిమెల మండలం ముకునూర్, నీలంపల్లి, ఇచ్చంపల్లి అటవీ ప్రాంతాల్లోని నీటి స్థ్ధావరాలను కనుగొనేందుకు డ్రోన్‌ కెమెరాతో పర్యవేక్షిస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement