charla mandal
-
కీలక మావోయిస్టు లొంగుబాటు.. 45మంది జవాన్ల హత్యలో సూత్రధారి
సాక్షి, చర్ల: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 45 మంది జవాన్లను హతమార్చిన ఓ మావోయిస్టు కాంకేర్ జిల్లాలో బీఎస్ఎఫ్ పోలీసుల ఎదుట మంగళవారం లొంగిపోయాడు. బీజాపూర్ జిల్లాకు చెందిన సున్నూ మడవి అలియాస్ శివాజీ మావోయిస్టు పార్టీ ప్లాటూన్ నంబర్-5లో డిప్యూటీ కమాండర్‌గా పని చేస్తున్నాడు. అయితే, ఆ పార్టీలో పనిచేసే ఓ మహిళా మావోయిస్టును వివాహం చేసుకోవడంతో పార్టీ డీప్రమోట్ చేసి గంగులూరు ఏరియా కమిటీకి పంపింది. ఆ సమయంలో అతడికి అగ్రనాయకుల వేధింపులు ఎదురవడంతో పార్టీ నుంచి పారిపోయి ఇంటికి వచ్చాడు. కాగా, గ్రామంలో అప్పటికే లొంగిపోయిన కొందరు మావోయిస్టులు.. మళ్లీ పార్టీలోకి వెళ్లవద్దని, నేరుగా పోలీసుల ఎదుట లొంగిపోవాలని సూచించడంతో కాంకేర్‌లోని బీఎస్ఎఫ్ 135 బెటాలియన్ పోలీసు అధికారులను ఆశ్రయించాడు. బాలల సంఘం నుంచి డిఫ్యూటీ కమాండర్‌గా.. శివాజీ తొలుత 2005లో మావోయిస్టు పార్టీతో సంబంధాలు పెంచుకుని బాలల సంఘంలో చేరాడు. 2006లో కాంకేర్ జిల్లాలోని పార్తాపూర్ ఏరియా కమిటీ సభ్యుడిగా, ఆ తర్వాత మిలటరీ ప్లాటూన్ కంపెనీ నంబర్-5కు డిప్యూ టీ కమాండర్‌గా నియమితులయ్యాడు. ఇక, అతనిపై రూ.3 లక్షల రివార్డు ఉంది. 2009లో మదనవాడలో ఎస్పీ వినోద్ చౌబోతే సహా 29 మంది జవాన్లను, 2006లో దంతెవాడలో ఎనిమిది మంది సీఐఎఫ్ జవాన్లపై దాడి చేసి హత మార్చిన ఘటనలో మడవి అలియాస్ శివాజీ పాల్గొన్నాడు. ఇది కూడా చదవండి: బెదిరింపు కాల్స్ రావడంతో అజ్ఞాతంలోకి -
మహిళా మావోయిస్టులో అసభ్యకర ప్రవర్తన.. పీఎల్జీఏ సభ్యుడి హతం
చర్ల: మహిళా మావోయిస్టులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న పీఎల్జీఏ సభ్యుడిని మావోయిస్టులు ప్రజాకోర్టు నిర్వహించి హతమార్చారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో మంగళవారం చోటు చేసుకోగా బుధవారం వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. పీఎల్జీఏ 17వ బెటాలియన్‌కు చెందిన మను దుగ్గ పార్టీలో పనిచేస్తున్న మహిళా మావోయిస్టులపై అసభ్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. దీంతో ఆయనపై మహిళా మావోయిస్టులు అగ్ర నాయకులకు ఫిర్యాదు చేయగా.. వారు పలుమార్లు హెచ్చరించినా తీరు మార్చుకోలేదు. ఈ నేపథ్యంలో మంగళవారం కాంకేర్ జిల్లాలోని దండకారణ్య ప్రాంతంలో ప్రజాకోర్టు నిర్వహించిన మావోయిస్టులు ఆయనను హతమార్చారు. ఈ మేరకు లేఖను కూడా మృతదేహం వద్ద వదిలారు. కాగా, మావోయిస్టులు హతమార్చిన పార్టీ పీఎల్జీఏ సభ్యుడు మను దుగ్గపై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం రూ.5 లక్షల రివార్డు ప్రకటించింది. ఇది కూడా చదవండి: ఇంజనీరింగ్ కాలేజ్ పార్ట్నర్స్ భారీ స్కెచ్.. ఓనర్ హత్యకు సుపారీ -
ముగ్గురు మావోల ఎన్కౌంటర్
చర్ల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చెన్నాపురం అటవీ ప్రాంతంలో బుధవారం రాత్రి జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ మేరకు ఎస్పీ సునీల్‌దత్ బుధవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. చెన్నాపురం అటవీ ప్రాంతంలో గల గుట్టల వద్ద రాత్రి ఏడు గంటల ప్రాంతంలో మావోయిస్టులు.. పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. అనంతరం ఆ ప్రాంతంలో గాలించగా.. సంఘటనా ప్రాంతంలో ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. వీరిలో ఇద్దరు మహిళా మావోయిస్టులు, మిలీషియన్ కమాండర్ సోడి జోగయ్య మృతదేహం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాల వద్ద ఒక 8 ఎంఎం రైఫిల్, పేలుడుకు ఉపయోగించే సామగ్రి, ఒక కిట్ బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎదురుకాల్పుల్లో పలువురు మావోయిస్టులు తప్పించుకోగా.. వారి కోసం కూంబింగ్ ఆపరేషన్‌ను ముమ్మరం చేసినట్లు ఎస్పీ తెలిపారు. జిల్లాలో ఇరవై రోజుల వ్యవధిలో జరిగిన మూడు ఎన్కౌంటర్లలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందడంతో రాష్ట్రంలో ఇటీవల జరిగిన వరుస ఎన్కౌంటర్లలో మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య 8కి చేరింది. కిన్నెరసాని అడవుల్లో ఎదురుకాల్పులు పాల్వంచ రూరల్: పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. అయితే.. మావోయిస్టులు త్రుటిలో తప్పించుకున్నారు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కిన్నెరసాని అభయారణ్యం పరిధిలోని ఉల్వనూరు శివారు పాములదున్న గుట్ట అటవీ ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. మావోయిస్టుల కోసం పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఎదురుపడిన పోలీసులపై మావోయిస్టులు కాల్పులు జరుపుతూ రెండు వర్గాలుగా విడిపోయి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే పోలీసులకు తారసపడింది ఏ దళానికి చెందిన సభ్యులు అనేది తెలియరాలేదు. సంఘటనా స్థలంలో ఒక తుపాకీ, కిట్ బ్యాగులు, సోలార్ ప్లేట్, వంట సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ కేఆర్కే ప్రసాదరావు తెలిపారు. ఎస్పీ సునీల్‌దత్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. డ్రోన్ ద్వారా మావోల కదలికలపై నిఘా మహాముత్తారం: మావోయిస్టుల కదలికలపై పోలీసులు గట్టి నిఘా పెట్టారు. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని నియంత్రించేందుకు చర్యలు చేపడుతున్నారు. డ్రోన్ కెమెరాలతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా సరిహద్దు గ్రామాలు, అడవులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఒకప్పుడు మావోయిస్టులకు పెట్టిన కోటగా ఈ ప్రాంతం ఉండేది. తర్వాత కాలంలో పోలీసులు నియంత్రించినా, ఇటీవల సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ ప్రాంతంలోకి మావోలు వచ్చారని ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించినట్లు సమాచారం. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఇటీవల ఓ ప్రభుత్వ ఉద్యోగిని కాల్చి చంపిన నేపథ్యంలో.. మావోల కదలికలపై నిఘా ఏర్పాటు చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా డ్రోన్ కెమెరాల ద్వారా గాలింపు చర్యలు చేపడుతున్నారు. మహాముత్తారం మండలంలోని సరిహద్దు ప్రాంతాలైన కనుకునూర్, రెడ్డిపల్లి, సింగంపల్లి, సింగారంతోపాటు పలిమెల మండలం ముకునూర్, నీలంపల్లి, ఇచ్చంపల్లి అటవీ ప్రాంతాల్లోని నీటి స్థ్ధావరాలను కనుగొనేందుకు డ్రోన్ కెమెరాతో పర్యవేక్షిస్తున్నారు. -
తుపాకీ మిస్‌ఫైర్.. ఆర్ఎస్ఐ మృతి
చర్ల: తుపాకీ మిస్‌ఫైర్ అయి రిజర్వ్డ్ సబ్ ఇన్స్పెక్టర్ మృతి చెందారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా బుధవారం చోటుచేసుకుంది. తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దులోని చెన్నాపురం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో తెల్లవారుజామున ఆర్ఎస్ఐ ఆదిత్య సాయికుమార్ (25) చేతిలో ఉన్న ఏకే 47 తుపాకీ పేలి బుల్లెట్లు తొడలోకి దూసుకుపోయాయి. సహచర జవాన్లు సాయికుమార్‌ను తిప్పాపురం తరలించగా, ఆయన అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రవీకరించారు. మృతదేహానికి భద్రాచలం ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి, అతడి స్వస్థలమైన హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌కు తరలించారు. మరో రెండు నెలల్లో గ్రేహౌండ్స్ ఆర్ఐగా పదోన్నతి పొందాల్సిన సాయికుమార్ మృతి పట్లకుటుంబ సభ్యులు, సహచర జవాన్లు ఆవేదన చెందుతున్నారు. -
కేజీబీవి నుంచి ఇద్దరు విద్యార్థినులు అదృశ్యం
సాక్షి, చర్ల: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ(కేజీబీవి) నుంచి ఇద్దరు విద్యార్థినులు అదృశ్యమయ్యారు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని లక్ష్మి కాలనీలో జరిగింది. స్థానికంగా ఉన్న కేజీబీవీలో చదువుతున్న కొయ్యూరుకు చెందిన గౌరి, సాయినగర్ కాలనీకి చెందిన సౌజన్యలు సోమవారం ఉదయం అదృశ్యమయ్యారు. వీరిద్దరూ పదో తరగతి చదువుతున్నారు. యాజమాన్యం ఫిర్యాదు మేరకు వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
ప్రశాంతంగా కొనసాగుతున్న మావోయిస్టు బంద్
చర్ల : మావోయిస్టుల పిలుపు మేరకు ఖమ్మం జిల్లా చర్ల మండలంలో శుక్రవారం బంద్ ప్రశాంతంగా సాగుతోంది. కాగా, మండలంలోని లెనిన్ కాలనీలో గురువారం రాత్రి మావోయిస్టులు బంద్ కు పిలుపునిస్తున్నట్లు పోస్టర్లు అంటించారు. వెంకటాపురం ఏరియా కమిటీ పేరిట ఉన్న ఈ పోస్టర్లలో...బంద్‌ను విజయవంతం చేయాలని ఉంది. పోలీసులు అక్కడికి చేరుకుని, వాటిని తొలగించారు. అయితే గత కొన్ని రోజుల కిందట నుంచి ఫిబ్రవరి 20న బంద్ కు పిలుపునిస్తున్నట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే.