ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న ఎస్పీ సునీల్‌దత్ తదితరులు
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: కొన్ని నెలలుగా నిత్యం పోలీసుల సెర్చ్ ఆపరేషన్లు, మావోయిస్టు యాక్షన్ టీమ్‌ల సంచారంతో జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఎప్పుడేం జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో తాజాగా గుండాల మండలం దేవళ్లగూడెం వద్ద ఎన్‌కౌంటర్ చోటుచేసుకోవడంతో మన్యం ఉలిక్కిపడింది. యాక్షన్ టీమ్‌లు సంచరిస్తున్నాయనే సమాచారంతో పోలీసులు గత మూడు రోజులుగా గుండాల, ఆళ్లపల్లి అటవీ ప్రాంతాల్లో తనిఖీ చేస్తున్నారు. గురువారం తెల్లవారుజామున 4:15 గంటల సమయంలో గుండాల పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు ఆపే ప్రయత్నం చేశారు. వారు ఆపకుండా వెళ్లడంతో పోలీసులు వెంబడించారు. ఈ క్రమంలో సదరు వ్యక్తులు కాల్పులు జరపగా పోలీసులు సైతం ఎదురుకాల్పులకు దిగారు. తర్వాత ఆ ప్రాంతంలో తనిఖీ చేయగా ఒక మృతదేహం కనిపించింది.
మరో వ్యక్తి పారిపోయాడు. మృతుడు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన యాక్షన్ కమిటీ సభ్యుడు శంకర్ అని తెలుస్తోంది. దీంతో పోలీసులు అటవీ ప్రాంతాల్లో మరింతగా గాలిస్తున్నారు. తెలంగాణలో తిరిగి పట్టు సాధించేందుకు మావోయిస్టులు ప్రయత్నిస్తూ గోదావరి పరీవాహక జిల్లాల్లో కొన్ని యాక్షన్ టీమ్‌లను రంగంలోకి దించారు. ఈ క్రమంలో మావోయిస్టులకు – బలగాలకు మధ్య వరుస ఎదురుకాల్పులు చోటుచేసుకుంటున్నాయి. గత జూలై 15న కరకగూడెం మండలంలోని అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగా యి. ఆ తెల్లవారి మణుగూరు మండలం మల్లెతోగు అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. అయితే జూలై 13న ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలోని మంగి అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడేళ్లు అలియాస్ భాస్కర్ తప్పించుకున్నాడు.
ఇక గత ఏడాది ఆగస్టు 21న మణుగూరు మండలం బుడుగుల అటవీ గ్రామంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో గుండాల మండలం దామరతోగు గ్రామానికి చెందిన జాడి వీరస్వామి అలియాస్ రఘు అనే మావోయిస్టు మృతి చెందాడు. మావోలు ఛత్తీస్‌గఢ్ నుంచి భద్రాద్రి ఏజెన్సీ మీదుగా ములుగు, మహబూబాబాద్, వరంగల్, భూపాలపల్లి, పెద్దపల్లి, ఆదిలాబాద్, మంచిర్యాల ఏజెన్సీ ప్రాంతాల్లోకి వస్తున్నారు. దీంతో ఆదిలోనే అడ్డుకట్ట వేసేందుకు నేరుగా రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి గత రెండు నెలలుగా గోదావరి పరీవాహక జిల్లాల్లో వరుసగా హెలీక్యాప్టర్ ద్వారా పర్యటిస్తున్నారు. ఆయా జిల్లాల్లో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఆసిఫాబాద్ జిల్లాలో వరుసగా రెండు రోజులు మకాం వేశారు.
రాష్ట్రంలో పట్టు సాధించేందుకే..
తెలంగాణలో గత ప్రాభవాన్ని తిరిగి సాధించేందుకు మావోయిస్టు పార్టీ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. గత పదేళ్లుగా రాష్ట్రంలో ఆ పార్టీ కార్యకలాపాలు నామమాత్రంగానే ఉన్నాయి. అయితే గత ఏడాది నుంచి కార్యకలాపాలు పెంచేందుకు వ్యూహం రూపొందిస్తున్నారు. యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ ఆధ్వర్యంలో యాక్షన్ టీమ్‌లు భద్రాద్రి జిల్లాలోకి ప్రవేశించి తరువాత ఇతర జిల్లాల్లోకి వెళ్లాయి. దీంతో పోలీసులు ఏజెన్సీ అటవీ ప్రాంతాల్లో భారీ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. కాగా, గత జూన్‌లో జరిగిన మావోయిస్టు కేంద్ర కమిటీ సమావేశాల అనంతరం ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం నుంచి కీలక నేతలంతా తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలకు వెళ్లి క్యాడర్ పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో 21 మంది ఉండగా 11 మంది తెలంగాణ వారే ఉండడంతో రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో రాష్ట్ర స్థాయి యాక్షన్ కమిటీతో పాటు మరికొన్ని యాక్షన్ టీములు గోదావరి పరీవాహక జిల్లాల్లో తిరుగుతుండడంతో నేరుగా డీజీపీ దృష్టి సారించారు. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని పోలీసు సిబ్బంది, సాయుధ బలగాలకు దిశానిర్ధేశం చేస్తున్నారు.
గుర్తించిన వారు పోలీసులను సంప్రదించాలి : ఎస్పీ
కొత్తగూడెంఅర్బన్: గుండాల మండలంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టును గుర్తించిన వారు జిల్లా పోలీసులను సంప్రదించాలని ఎస్పీ సునీల్‌దత్ గురువారం ఒక ప్రకటనలో కోరారు. 26 సంవత్సరాల వయసు ఉండి, గులాబీ రంగు టీషర్ట్, నీలం రంగు లోయర్, గోధుమ రంగు ఛాయ కలిగిన మావోయిస్టు మృతదేహాన్ని కొత్తగూడెం ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో ఉంచామని తెలిపారు. బంధువులు, ఇతర వ్యక్తులు ఎవరైనా గుర్తించినట్టయితే జిల్లా పోలీసులను సంప్రదించాలని సూచించారు. లేదంటే జిల్లా పోలీసు కంట్రోల్ రూం 08744–242097, ఎస్పీ కార్యాలయం 08744–243444 నంబర్లకు ఫోన్ చేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment