సరిహద్దుల్లో ఉద్రిక్తత | Maoist Encounter: Red Alert At Borders In Warangal | Sakshi
Sakshi News home page

సరిహద్దుల్లో ఉద్రిక్తత

Published Sat, Sep 5 2020 12:42 PM | Last Updated on Sat, Sep 5 2020 12:45 PM

Maoist Encounter: Red Alert At Borders In Warangal - Sakshi

సాక్షి, వరంగల్‌: మూడు రాష్ట్రాల సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర బోర్డర్‌లో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఓవైపు మావోయిస్టుల సంచారం, మరోవైపు పోలీసు, గ్రేహౌండ్స్‌ బలగాల తనిఖీలు, కూంబింగ్‌.. అటవీ పల్లెల్లో అలజడి రేపుతోంది. గోదావరి పరిరీవాహక ప్రాంతాతల అడవుల్లో మావోయిస్టులు తలదాచుకుని ఉంటారని భావిస్తూ ప్రత్యేక దళాలతో జల్లెడ పడుతున్నారు. మావోయిస్టుల కదలికలపై పక్కా సమాచా రంతో గోదావరి, ప్రాణహిత పరివాహక ప్రాంతాలపై మూడు నెలలుగా దృష్టి సారించిన పోలీసులు పెద్ద ఎత్తున కూంబింగ్‌ చేస్తున్నారు. ఈ ప్రాంతాలను ఇప్పటికే రెండు పర్యాయాలు సందర్శించిన పోలీసు బాస్, డీజీపీ ఎం.మహేందర్‌ రెడ్డి మరోమారు బుధవారం నుంచి కొమురం భీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లా నుంచి శ్రీకారం చుట్టారు. ఈ సంద ర్భంగా మూడు రాష్ట్రాల సరిహద్దు, గోదావరి పరివాహక ప్రాంతాల్లోని పోలీసుస్టేషన్లలో పనిచేస్తున్న పలువురు పోలీసు అధికారుల బదిలీలు కూడా జరిగాయి. మావోయిస్టుల కార్యకలాపాలను కట్టడి చేయడంలో అనుభవం, ఆసక్తి ఉన్న వారికి పోస్టింగ్‌ ఇచ్చారు.

దేవార్లగూడెం ఎన్‌కౌంటర్‌తో రెడ్‌అలర్ట్
ఓ వైపు పోలీసుబాస్‌ పర్యటన, మరోవైపు దేవార్లగూడెం ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో పోలీసులు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం దేవార్లగూడెం – దుబ్బగూడెం గ్రామాల మధ్య గురువారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు యాక్షన్‌ టీం నాయకుడు దూది దేవాల్‌ అలియాస్‌ శంకర్‌ మృతి చెందా డు. దీనిపై స్పందించిన మావోయిస్టులు ఈనెల 6న జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, పెద్దపల్లి, తూర్పు గోదావరి జిల్లాల బంద్‌కు పిలుపునిచ్చారు. ఛత్తీస్‌గఢ్‌ సుక్మా జిల్లా నల్లకుంట ఏరియా అర్లపల్లికి చెందిన శంకర్‌ అనారోగ్యంతో  ఆస్పత్రికి వెళ్లగా పట్టుకున్న పోలీసులు చిత్రహింసలకు గురిచేసి కాల్చి చంపారని ఆ ప్రకటనలో ఆరోపించారు. ఈ మేరకు బంద్‌కు పిలుపునివ్వగా ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, మహబూబాబాద్‌ జిల్లాల్లో పోలీసులు హైఅలర్ట్‌ ప్రకటించారు.

అలాగే, గుండాల ఎన్‌కౌంటర్‌తో అప్రమత్తమైన పోలీసులు నక్సల్స్‌ కోసం వేట మొదలుపెట్టారు. మణుగూరు నుంచి ములుగు జిల్లా మంగపేట, ఏటూరు నాగారం, తాడ్వాయి, కన్నాయిగూడెం, భూపాలపల్లి జిల్లా పలిమెల, మహదేవపూర్, మహముత్తారం అడవుల్లోకి మావోయిస్టులు వచ్చినట్లు నిఘా వర్గాల సమాచారంతో తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రతీకారంగా మావోయిస్టులు ఏదైనా ఘటనకు పాల్పడుతారేమోననే అనుమానంతో పోలీసులు తనిఖీలు విస్తృతం చేయడంతో పాటు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అలాగే, నక్సల్స్‌ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లోని టీఆర్‌ఎస్, బీజేపీ నేతలను పట్టణ ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తున్నారు. దీంతో ప్రశాంతంగా ఉన్న ఏజెన్సీ పల్లెలు ఉలిక్కి పడుతున్నాయి. 

బడే చొక్కారావు, వెంకటేశ్‌ లక్ష్యంగా కూంబింగ్‌
మావోయిస్టు నేతలు బడే దామోదర్‌ అలియాస్‌ చొక్కారావు, కంకనాల రాజిరెడ్డి అలియాస్‌ వెంకటేశ్‌ లక్ష్యంగా పోలీసుల కూంబింగ్‌ సాగుతోంది. “ఆపరేషన్‌ ప్రహార్‌’ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌ నుంచి వచ్చిన మావోయిస్టు దళాలు వీరి నాయకత్వంలోనే గోదావరి పరివాహక ప్రాంతంలో సంచరిస్తున్నాయన్న సమాచారం మేరకు పోలీసులు ప్రత్యేక దృష్టి సారించినట్లు చెబుతున్నారు. మావోయిస్టు పార్టీలో కీలక నేతలుగా ఉన్న రాష్ట్ర యాక్షన్‌ టీం కార్యదర్శి దామోదర్, జయశంకర్‌ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, పెద్దపల్లి(జేఎండబ్ల్యూపీ) డివిజన్‌ కమిటీ కార్యదర్శి వెంకటేష్‌ను టార్గెట్‌ చేసుకొని పోలీసులు కూంబింగ్‌ నిర్వహిస్తున్నట్టు తెలిసింది. ఈ ఇద్దరు నేతలు భూపాలపల్లి, ములుగు అడవుల్లో మకాం వేసినట్టు నిఘా వర్గాలు గుర్తించాయని సమాచారం. అయితే కేకేడబ్ల్యూ కార్యదర్శిగా పని చేసిన దామోదర్‌కు పూర్వ వరంగల్, ఖమ్మం, కరీంనగర్‌ అడవులపై పట్టు ఉండడంతో పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటున్నట్లు భావిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement