వీరస్వామి మృతదేహం
సాక్షి, కొత్తగూడెం: మణుగూరు మండలం బుడుగుల సమీప అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం 6 – 7 గంటల మధ్య పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీ దళసభ్యుడు, గుండాల మండలం దామరతోగు గ్రామానికి చెందిన జాడి వీరస్వామి అలియాస్ రఘు మృతిచెందాడు. మృతదేహం వద్ద రెండు తపంచాలు, 17 బుల్లెట్లు, రెండు కిట్‌బ్యాగులు, విప్లవ సాహిత్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పినపాక నియోజకవర్గంలో 20 రోజుల వ్యవధిలోనే రెండు ఎన్‌కౌంటర్లు జరగడంతో ఏజెన్సీ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది.
కార్యకలాపాల విస్తరణకు మావోల యత్నం
పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కార్యకలాపాలు విస్తరించేందుకు మావోలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ సరిహద్దు నుంచి భద్రాద్రి ఏజెన్సీలో చొరబడి గోదావరి పరీవాహక ప్రాంతాల ద్వారా ఇతర జిల్లాల్లోకి వచ్చి రిక్రూట్‌మెంట్లు చేసుకునేందుకు యత్నిస్తున్నారు. ముఖ్యంగా వలస గొత్తికోయ గ్రామాలపై దృష్టి పెట్టారు. మూడు నెలలుగా మావోయిస్టు పార్టీ అగ్రనేత హరిభూషణ్ ఆధ్వర్యంలో వచ్చిన యాక్షన్ టీమ్‌లు పినపాక, ఇల్లెందు డివిజన్లలో తిరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 20 రోజుల తేడాతో వరుసగా రెండు ఎన్‌కౌంటర్లు చోటుచేసుకున్నాయి.
గత నెల 31న మావోయిస్టుల కోసం పోలీసు బలగాలు కూంబింగ్ చేస్తున్న సమయంలో గుండాల మండలం రోళ్లగడ్డ వద్ద సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రీజినల్ కార్యదర్శి, అజాత దళాల కమాండర్ లింగన్న దళం తారసపడింది. ఈ నేపథ్యంలో జరిగిన కాల్పుల్లో లింగన్న మృతిచెందాడు. మిగిలిన సభ్యులు తప్పించుకున్నారు. తాజాగా బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ మణుగూరు ఏరియా దళ కమాండర్ జాడి వీరస్వామి హతమయ్యాడు. అయితే ఈ రెండు ఎన్‌కౌంటర్ల విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రోళ్లగడ్డ ఎన్‌కౌంటర్ జరిగినప్పుడు లింగన్న మృతిచెందిన విషయాన్ని కొన్ని గంటలపాటు ధ్రువీకరించకుండా వ్యవహరించడంతో గుండాల మండలంలోని పలు గ్రామాల నుంచి ప్రజలు తిరుగుబాటు చేశారు.పోలీసులపై రాళ్లు రువ్వి దాడి చేశారు. ఇక ప్రస్తుతం మణుగూరు మండలం బుడుగుల సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్ విషయంలోనూ పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లేందుకు మీడియాకు అనుమతి ఇవ్వకపోగా, మృతిచెందిన వీరస్వామి ఫొటో తీసే అవకాశం కూడా కల్పించలేదు. మృతదేహాన్ని మణుగూరు ఆస్పత్రికి తరలిస్తున్నామని కాసేపు, కొత్తగూడెం ఆస్పత్రికని మరికొంత సేపు చెప్పి.. చివరకు భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. దీంతో మీడియా నిరసన వ్యక్తం చేసింది.
పోలీసుల జల్లెడ..
మూడు నెలల క్రితం హరిభూషణ్ ఆధ్వర్యంలో గోదావరికి రెండువైపులా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోకి రెండు యాక్షన్ టీమ్‌లు వచ్చినట్లు సమాచారం. ఇవి భద్రాద్రి జిల్లాలోని చర్ల, ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలాల మీదుగా గోదావరి దాటి పినపాక, మణుగూరు, కరకగూడెం, గుండాల, ములుగు జిల్లా లోని మంగపేట, ఏటూరునాగారం, తాడ్వాయి మండలాల్లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. యాక్షన్ టీమ్‌లు చర్ల మండలం నుంచి గోదావరి దాటి పినపాక మండలంలోని భూపతిరావుపేట, పిట్టతోగు, దోమెడ, కరకగూడెం మండలం ఆర్.కొత్తగూడెం, గుండాల మీదుగా మహబూబాబాద్ జిల్లా గంగారం, కొత్తగూడ, వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు సమాచారం. దీంతో పోలీసులు అభయారణ్యాన్ని జల్లెడ పడుతున్నారు.
తెలంగాణలో కార్యకలాపాలు పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్న మావోయిస్టులు ముందుగా ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో ఉన్న భద్రాద్రి, ములుగు ఏజెన్సీ ప్రాంతాల్లో తిరిగి పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏజెన్సీ జిల్లాల్లో పోడు భూముల వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో మావోయిస్టులు గిరిజన ప్రాంతాల్లో పట్టు పెంచుకుని కొత్తగా రిక్రూట్‌మెంట్లు చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మావోయిస్టులు చర్ల మండలం బెస్తకొత్తూరుకు చెందిన టీఆర్‌ఎస్ ఎంపీటీసీ సభ్యుడు నల్లూరి శ్రీనివాసరావును హతమార్చారు. ఇప్పటివరకు సరిహద్దుకు అవతల ఛత్తీస్‌గఢ్ పరిధిలో మావోలకు, పోలీసులకు మధ్య పోరు నడుస్తోంది. ప్రస్తుతం సరిహద్దు ఏజెన్సీతోపాటు ఇల్లెందు, మణుగూరు ఏజెన్సీలో సైతం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అటు రిక్రూట్‌మెంట్లు, ఇటు ఎన్‌కౌంటర్లతో ఏజెన్సీలో అలజడి చోటుచేసుకుంది.
ఎదురుకాల్పుల్లో మృతి చెందాడు: భద్రాద్రి ఎస్పీ సునీల్ దత్
మణుగూరు: ఎదురు కాల్పుల్లో మణుగూరు ఏరియా కమిటీ ఇన్‌చార్జ్ దళ కమాండర్ జాడి వీరస్వామి అలియాస్ రఘు మృతి చెందినట్లు జిల్లా ఎస్పీ సునీల్ దత్ తెలిపారు. మణుగూరు డీఎస్పీ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. ఎన్నికల అనంతరం జిల్లాలో రెండు, మూడు మావోయిస్టు టీంలు తమ కార్యకలాపాలను విస్తృతం చేశాయన్నారు. గతంలో లాగా మావోయిస్టులు యూనిఫాం ధరించకుండా సాధారణ దుస్తుల్లో ప్రజల్లో సంచరిస్తూ తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారన్నారు. వీరస్వామి మణుగూరు ఏరియా దళ కమాండర్‌గా, నర్సంపేట, ఇల్లెందు ఏరియా కమాండర్‌గా భద్రు, సుధీర్ ఇన్‌చార్జ్‌గా, ఏటూర్‌నాగారం, కాటారం, మహదేవ్‌పూర్ డివిజన్ కమిటీ దళ కమాండర్‌గా పూన సుధాకర్‌లు వ్యవహరిస్తున్నారన్నారు. నాలుగు రోజుల క్రితం వీరస్వామి, రవి మిగతా సభ్యులు పాల్వంచ వలస ఆదివాసీ గ్రామంలో సంచరిస్తూ, రెండు రోజుల క్రితం మణుగూరులోని వలస ఆదివాసీ గిరిజన గ్రామమైన బుడుగులకు చేరుకున్నట్లు తెలిసిందన్నారు. దీనిలో భాగంగానే స్పెషల్ పార్టీ పోలీసులు బుధవారం తెల్లవారు జామున బుడుగుల ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుం డగా వీరస్వామి, అతడి టీం పోలీసులపై కాల్పులు జరిపారన్నారు. పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో మృతిచెందాని తెలిపారు.
ఏజెన్సీ అప్రమత్తం
చర్ల: ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీకి చెందిన ఒక దళ సభ్యుడు మృతి చెందగా పలువురు మావోయిస్టులు తప్పించుకున్నట్లు పోలీసులు వెల్లడిస్తున్న క్రమంలో భద్రాచలం ఏజెన్సీ ప్రాంతాన్ని అప్రమత్తం చేశారు. మణుగూరు ప్రాంతానికి సమీపంలో ఉన్న గోదావరి దాటి ఎన్‌కౌంటర్‌లో తప్పించుకున్న మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతానికి పారిపోతారనే అనుమానంతో గోదావరి తీర ప్రాంతాల్లో నిఘా ముమ్మరం చేశారు.
భద్రాచలం ఆస్పత్రిలో పోస్టుమార్టం..
ఎన్‌కౌంటర్‌లో హతమైన వీరస్వామి మృతదేహానికి భద్రాచలం ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో పోస్ట్‌మార్టం నిర్వహించారు.
తల్లిదండ్రుల మృతితో అనాథ ఆశ్రమానికి..
గుండాల: జాడి వీరస్వామి అలియాస్ రవి గుండాల మండలం దామరతోగా గ్రామానికి చెందిన వ్యక్తి. హైదారాబాద్‌లో ఉంటున్న వీరస్వామి గతంలో న్యూడెమోక్రసిలో పనిచేశాడు. ఇతను తల్లిదండ్రులు, సోదరుడు మృతి చెందాడు. బంధువుల సాయంతో హైదరాబాద్ లోని ఓ అనాథ ఆశ్రమంలో చేరాడు. అప్పుడప్పుడు దామరతోగు గ్రామానికి వచ్చిపోయేవాడని బంధువులు తెలిపారు. తన పెద్దనాన్న జాడి నర్సయ్య భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో మృతి చెందగా అతన్ని చూసేందుకు వచ్చాడని తెలిపారు. పోలీసుల కాల్పుల్లో మృతి చెందే వరకు అతను మావోయిస్టులతో ఉంటున్నట్లు తమకు సమాచారం లేదని తెలిపారు. నాలుగేళ్ల కిత్రం న్యూడెమోక్రసీ రామన్న దళంలో చేరి రెండేళ్ల పాటు పని చేశాడు. 2017లో దళం నుంచి రెండు తుపాకులతో పారిపోయి పోలీసుల ముందు లొంగిపోయాడు. అనంతరం 2017 నుంచి మావోయిస్టులతో సంబంధాలు పెట్టుకున్నట్లు పోలీసులు తెలుపుతున్నారు. అప్పుడప్పుడు బయటకు వస్తూ.. పోతూ భద్రూ దళంలోకి వెళ్లినట్లు పోలీసులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment