బిజాపూర్: నిషేధిత మావోయిస్టు పార్టీ నేతలకు చెందినట్లుగా భావిస్తున్న రూ.10 లక్షల విలువైన రూ.2 వేల నోట్లను పోలీసులు పట్టుకున్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బిజాపూర్‌లో చోటుచేసుకుంది. గంగలూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పల్నార్ గ్రామానికి చెందిన దినేశ్ తాటి(23) శుక్రవారం స్థానిక ట్రాక్టర్ షోరూంకు వచ్చాడు. పోలీసులు అతడిని అనుమానంతో ప్రశ్నించగా గంగలూర్ ఏరియా కమిటీ మావోయిస్టులు ఆ నోట్లను మార్చాలంటూ తనకు ఇచ్చారని వెల్లడించాడు.
రూ.2 వేల నోట్లతో ట్రాక్టర్ కొనేందుకు వచ్చానన్నాడు. ఇటీవల రూ.2 వేల నోట్లను చలామణీ నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన ఆర్‌బీఐ.. సెప్టెంబర్ 30ని ఆఖరు తేదీగా నిర్ణయించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఛత్తీస్‌గఢ్ పోలీసులు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో గట్టి నిఘా ఉంచారు. మే 25న మావోయిస్టు కమాండర్ ఇచ్చిన రూ.6 లక్షల విలువైన 2 వేల నోట్లను పట్టుకుని, బిజాపూర్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ నెల 10న దంతెవాడ జిల్లాలోనూ రూ.1 లక్ష విలువైన రెండు వేల నోట్లను పట్టుకుని, ముగ్గురు మావోయిస్టు సానుభూతి పరులను అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment