Banned currency notes
-
మావోయిస్టులకు చెందిన రూ.10 లక్షలు స్వాధీనం
బిజాపూర్: నిషేధిత మావోయిస్టు పార్టీ నేతలకు చెందినట్లుగా భావిస్తున్న రూ.10 లక్షల విలువైన రూ.2 వేల నోట్లను పోలీసులు పట్టుకున్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బిజాపూర్‌లో చోటుచేసుకుంది. గంగలూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పల్నార్ గ్రామానికి చెందిన దినేశ్ తాటి(23) శుక్రవారం స్థానిక ట్రాక్టర్ షోరూంకు వచ్చాడు. పోలీసులు అతడిని అనుమానంతో ప్రశ్నించగా గంగలూర్ ఏరియా కమిటీ మావోయిస్టులు ఆ నోట్లను మార్చాలంటూ తనకు ఇచ్చారని వెల్లడించాడు. రూ.2 వేల నోట్లతో ట్రాక్టర్ కొనేందుకు వచ్చానన్నాడు. ఇటీవల రూ.2 వేల నోట్లను చలామణీ నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన ఆర్బీఐ.. సెప్టెంబర్ 30ని ఆఖరు తేదీగా నిర్ణయించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఛత్తీస్‌గఢ్ పోలీసులు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో గట్టి నిఘా ఉంచారు. మే 25న మావోయిస్టు కమాండర్ ఇచ్చిన రూ.6 లక్షల విలువైన 2 వేల నోట్లను పట్టుకుని, బిజాపూర్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ నెల 10న దంతెవాడ జిల్లాలోనూ రూ.1 లక్ష విలువైన రెండు వేల నోట్లను పట్టుకుని, ముగ్గురు మావోయిస్టు సానుభూతి పరులను అదుపులోకి తీసుకున్నారు. -
సినీనటి బంధువు అరెస్ట్
-
సినీనటి బంధువు అరెస్ట్
హైదరాబాద్: రద్దైన పెద్దనోట్ల మార్పిడి ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా నగరంలోని జూబ్లిహిల్స్‌లో పెద్ద ఎత్తున పాత కరెన్సీ నోట్లు పట్టుబడ్డాయి. పెద్ద మొత్తంలో నోట్ల మార్పిడి జరుగుతోందనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 7 కోట్ల రద్దైన పాతనోట్లను స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో ఒకరు సినీనటి జీవితా రాజశేఖర్‌కు సమీప బంధువుగా తెలుస్తోంది. జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో శ్రీనివాస్ ఎంటర్ ప్రైజెస్ పేరుతో కంపెనీ నడుపుతున్న శ్రీనివాస్‌తో పాటు రవి అనే మరో వ్యక్తిని సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఈ అంశంలో జీవిత ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసులు దృష్టి సారించారు. ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాస్‌తో గతంలోనూ ఒకసారి అరెస్టైనట్టు తెలుస్తోంది. డ్రగ్స్ తీసుకుంటూ ఒకసారి అతడు పోలీసులకు చిక్కాడు. -
రైలు టాయ్లెట్లో పెద్ద నోట్ల కలకలం
భువనేశ్వర్: నల్లధనం దాచుకున్న కుబేరులు కొందరు పాతనోట్లను మార్చుకునేందుకు అడ్డదారులు తొక్కుతుంటే.. మరి కొందరు వాటిని వదిలించుకునేందుకు పాట్లు పడుతున్నారు. నోట్లను కాల్చి నదిలో పడేయడం, కత్తరించి రోడ్ల పక్కన విసిరేయడం, చెత్తకుండీల్లో వేయడం.. వంటి పనులు చేస్తున్నారు. తాజాగా గుర్తు తెలియని వ్యక్తులు ఢిల్లీ-భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ టాయ్లెట్లో పాత నోట్లను పడేశారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో రైల్వే పోలీసులు 4.5 లక్షల రూపాయల నగదును గుర్తించారు. అన్ని రద్దయిన 500, 1000 రూపాయల నోట్లు ఉన్నాయని తెలిపారు. రాజధాని ఎక్స్‌ప్రెస్ బి-6 కోచ్‌లో ఈ మొత్తం దొరికిందని, స్వాధీనం చేసుకున్నామని రైల్వే ఎస్పీ సంజయ్ కౌషల్ చెప్పారు. ఈ డబ్బును ఆదాయ పన్ను శాఖ అధికారులకు అందజేసినట్టు తెలిపారు. కేంద్రపడా జిల్లాకు చెందిన ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు రైల్వే పోలీసు వర్గాలు వెల్లడించాయి. రైలు టాయ్‌లెట్ లోపల ఎవరో కొన్ని నిమిషాల పాటు లాక్ చేసుకుని ఉన్నట్టు కొందరు ప్రయాణికులు సమాచారం అందించారని, రైల్వే పోలీసులు వెళ్లి టాయ్‌లెట్ డోర్ తెరవగా ముగ్గురు వ్యక్తులు బయటకు వచ్చినట్టు చెప్పారు. టాయ్లెట్లో తనిఖీ చేయగా పాత నోట్ల కరెన్సీ లభించిందని, ఈ ముగ్గురిని విచారిస్తున్నట్టు తెలిపారు.