రైలు టాయ్‌లెట్‌లో పెద్ద నోట్ల కలకలం
భువనేశ్వర్: నల్లధనం దాచుకున్న కుబేరులు కొందరు పాతనోట్లను మార్చుకునేందుకు అడ్డదారులు తొక్కుతుంటే.. మరి కొందరు వాటిని వదిలించుకునేందుకు పాట్లు పడుతున్నారు. నోట్లను కాల్చి నదిలో పడేయడం, కత్తరించి రోడ్ల పక్కన విసిరేయడం, చెత్తకుండీల్లో వేయడం.. వంటి పనులు చేస్తున్నారు. తాజాగా గుర్తు తెలియని వ్యక్తులు ఢిల్లీ-భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ టాయ్‌లెట్‌లో పాత నోట్లను పడేశారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో రైల్వే పోలీసులు 4.5 లక్షల రూపాయల నగదును గుర్తించారు. అన్ని రద్దయిన 500, 1000 రూపాయల నోట్లు ఉన్నాయని తెలిపారు.
రాజధాని ఎక్స్‌ప్రెస్ బి-6 కోచ్‌లో ఈ మొత్తం దొరికిందని, స్వాధీనం చేసుకున్నామని రైల్వే ఎస్పీ సంజయ్ కౌషల్ చెప్పారు. ఈ డబ్బును ఆదాయ పన్ను శాఖ అధికారులకు అందజేసినట్టు తెలిపారు. కేంద్రపడా జిల్లాకు చెందిన ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు రైల్వే పోలీసు వర్గాలు వెల్లడించాయి. రైలు టాయ్‌లెట్ లోపల ఎవరో కొన్ని నిమిషాల పాటు లాక్ చేసుకుని ఉన్నట్టు కొందరు ప్రయాణికులు సమాచారం అందించారని, రైల్వే పోలీసులు వెళ్లి టాయ్‌లెట్ డోర్ తెరవగా ముగ్గురు వ్యక్తులు బయటకు వచ్చినట్టు చెప్పారు. టాయ్‌లెట్‌లో తనిఖీ చేయగా పాత నోట్ల కరెన్సీ లభించిందని, ఈ ముగ్గురిని విచారిస్తున్నట్టు తెలిపారు.