మల్కన్‌గిరి అడవుల్లో ఆర్కే కదలికలు?
మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్.. అలియాస్ ఆర్కే చాలా కాలం తర్వాత మళ్లీ ఏఓబీలోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. ఒడిషాలోని మల్కన్‌గిరి జిల్లాలోగల జంత్రి అనే ప్రాంతంలో జరిగిన ఓ సమావేశంలో ఆర్కే కనిపించినట్లు చెబుతున్నారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి కూడా అయిన ఆర్కే.. అంత సాధారణంగా బయటకు కనిపించరు. సరిగ్గా జంత్రి ప్రాంతంలోనే 2011లో అప్పటి మల్కన్‌గిరి జిల్లా కలెక్టర్ వినీల్ కృష్ణను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. మళ్లీ ఇప్పుడు అదే ప్రాంతంలో ఆర్కే కదలికలు కనిపించాయంటే ఏం జరుగుతుందోనన్న చర్చ మొదలైంది.
మల్కన్‌గిరి - కోరాపుట్ - విశౄఖ సరిహద్దు డివిజన్ కమిటీ కార్యదర్శి గాజర్ల రవి అలియాస్ ఉదయ్, రాష్ట్ర కమిటీ సభ్యుడు సలీం, బెంగాల్ నాయకులు సుధీర్, అనిల్, నవీన్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారని, దీనికి దాదాపు వెయ్యి నుంచి 1500 మంది వరకు గ్రామస్థులు హాజరయ్యారని అంటున్నారు. 2010లో కోరాపుట్ ప్రాంతంలో తన భార్య అరెస్టయినప్పటి నుంచి ఆర్కేకు సంబంధించిన విషయాలు ఏవీ పెద్దగా బయటకు రావడం లేదు. ఆయన గత ఏడేళ్లుగా స్పాండిలైటిస్ తదితర ఇబ్బందులతో బాదపడుతున్నట్లు తెలిసింది. అందుకే భద్రత కోసం ఆయనను ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యం ప్రాంతానికి పంపినట్లు కూడా చెబుతున్నారు.
మల్కన్‌గిరి ప్రాంతం ఎప్పటినుంచో మావోయిస్టులకు కంచుకోట. దాని భౌగోళిక పరిస్థితుల కారణంగా అక్కడకు సులభంగా చేరుకోవడం, అక్కడి నుంచి అంతే సులభంగా తప్పించుకోవడం వాళ్లకు బాగా అలవాటని, అక్కడకు మావోయిస్టు అగ్రనేతలు వచ్చినట్లు తమకు కూడా సమాచారం ఉందని యాంటీ నక్సల్ విభాగం అధికారులు అంటున్నారు.