భువనేశ్వర్: ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో BSF బెటాలియన్ సిబ్బంది నిర్వహించిన సోదాల్లో మావోయిస్టుల భారీ ఆయుధ సామాగ్రి లభ్యమైంది. పక్క సమాచారంతో జరిపిన సోదాల్లో లభ్యమైన ఈ సామాగ్రి మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు సరిహద్దు భద్రతా దళాలు.
బెజంగివడ రిజర్వ్ ఫారెస్ట్‌లో మావోయిస్టుల కదలికలపై పక్కా సమాచారం అందడంతో మల్కన్‌గిరి జిల్లాలో BSF బెటాలియన్ సిబ్బంది సోమవారం సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది. ఇందులో భాగంగా మల్కన్ గిరి జిల్లాలోని కలిమెల పోలీస్ పరిధి అమపాదర్-ఎల్కనూర్ గ్రామం, బోడిలుగూడ- బృందమామిడి సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్‌లో జరిపిన సోదాల్లో రాకెట్ లాంచర్‌లతో సహా భారీ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు BSF సిబ్బంది.
సరిహద్దు భద్రతా దళాల వారు స్వాధీనం చేసుకున్న ఆయుధాల్లో ఒక 303 రైఫిల్, 11 బ్యారెల్ (SBML), 303 రైఫిల్ యొక్క మ్యాగజైన్, 15 మెరుగైన హ్యాండ్ గ్రెనేడ్‌లు, మూడు దేశీయ తుపాకులు, రెండు 51 MM మోర్టార్ బాంబులు, ఒక గ్యాస్ వెల్డింగ్ యంత్రం, 42 లైవ్ కాట్రిడ్జ్‌లు, రాకెట్ లాంచర్, రెండు బ్రెన్ 303 ఎల్‌ఎంజీ స్పేర్ బ్యారెల్స్, 29 జెలటిన్ స్టిక్స్, ఐదు అల్యూమినియం నైట్రేట్ ప్యాకెట్లు, 30 ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, తొమ్మిది సింథటిక్ వెయిస్ట్ బెల్ట్‌లు ఉన్నాయి.
ఒకప్పుడు ఈ ప్రాంతం మావోయిస్టులకు వారి సానుభూతిపరులకు కంచుకోటగా ఉండేదని, వామపక్ష దళాలు పేలుడు ముడి పదార్థాలను ఇటువంటి రిమోట్ ప్రదేశాలలో ఉంచి అవసరమైనప్పుడు వీటిని ఉపయోగిస్తూ ఉంటారని తెలిపింది BSF సిబ్బంది. ఒక్కసారిగా ఇంత పెద్ద మొత్తంలో ఆయుధ సామగ్రి దొరకడంతో మావోయిస్టుల ఉనికి నిర్ధారణ అయ్యిందని అనుమానిత ప్రాంతాల్లో కూడా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: ఉత్తరాఖండ్‌లో చిక్కుకున్న యాత్రికులు
Comments
Please login to add a commentAdd a comment