
సీతమ్మకు అధికారులు చికిత్స సాయం అందించిన దృశ్యం
సాక్షి, అల్లూరి: మావోయిస్టు అగ్రనేత కాకూరి పండన్న అలియాస్ జగన్, తల్లి సీతమ్మ కన్నుమూసింది. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతోంది. అయితే.. ఆ మధ్య ఆమె దీనస్థితి గురించి తెలుసుకున్న అధికారులు.. ఆమె ఇంటికి వెళ్లి మరీ చికిత్సకు సాయం అందించారు. అయినప్పటికీ వృద్ధాప్యరిత్యా సమస్యలతో నెల తిరగకుండానే ఆమె కన్నుమూసినట్లు తెలుస్తోంది.
పండన్న అలియాస్ జగన్ స్వగ్రామం అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం దుప్పిలవాడ పంచాయతీ పరిధిలోని కొమ్ములవాడ గ్రామం. పండన్న ఉద్యమంలోకి వెళ్లిన నాటి నుంచి తల్లి సీతమ్మ స్వగ్రామంలో ఉంటోంది. అయితే.. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న సీతమ్మకు.. కిందటి నెలలో పోలీసులు చికిత్స సాయం అందించారు.
ఆ సమయంలో ఉద్యమాన్ని వదిలి జనాల్లోకి రావాలని, వచ్చి వ్యవసాయం చేసుకోవాలని, అన్నింటికి మించి వృద్ధాప్యంలో ఉన్న తన బాగోగులు చూసుకోవాలని ఆమె తన కొడుకుకి పిలుపు ఇచ్చారు. ఇది జరిగిన నెలకే ఆమె కన్నుమూశారు. ఇదిలా ఉంటే.. ఆంధ్రా-ఒడిశా ప్రత్యేక జోనల్ కమిటీ ప్రత్యామ్నాయ సభ్యుడైన జగన్, తన తల్లి అంత్యక్రియలకు హాజరవుతాడనే ఉద్దేశంతో పోలీసులు నిఘా పెంచారు.
Comments
Please login to add a commentAdd a comment