మావోల దుర్గం బెజ్జంగి | With the water around the archipelago | Sakshi
Sakshi News home page

మావోల దుర్గం బెజ్జంగి

Published Thu, Jan 15 2015 12:26 AM | Last Updated on Tue, Oct 9 2018 2:47 PM

మావోల దుర్గం  బెజ్జంగి - Sakshi

మావోల దుర్గం బెజ్జంగి

చుట్టూ నీటితో  ద్వీపాల సమూహం
బాహ్య ప్రపంచంతో సంబంధం లేని ప్రాంతం
మావో అగ్రనేతలకు స్థావరం

 
విశాఖపట్నం  భౌగోళికంగా చిన్నచిన్న ద్వీపాల సమూహాన్ని తలపిస్తుంది  బలిమెల బ్యాక్‌వాటర్‌తో ‘అన్యులకు’ అంతుచిక్కుండా ఉంటుంది చుట్టూ దట్టమై అడవులతో శత్రుదుర్బేధ్యంగా అనిపిస్తుంది వేలాదిమంది గిరిజనులు ఆవాసప్రాంతంగా నిలుస్తోంది
 అందుకే అది మావోయిస్టులకు రక్షాకవచంగా మారింది

 అదే బెజ్జంగి.!
 
ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని ఈ అటవీప్రాంతం మావోయిస్టులకు పెట్టనికోటగా మారింది.  మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్(ఆర్కే), మల్కనగిరి జిల్లా కమిటీ కార్యదర్శి ఉదయ్‌లతోపాటు కీలక నేతలందరికీ ఈ ప్రాంతమే స్థావరంగా మారింది. కాని బెజ్జంగిపై పట్టు సాధించడం ఏపీ, ఒడిశా, కేంద్ర పోలీసు బలగాలకు సాధ్య పడటం లేదు.  ఆ అట వీప్రాంతం మావోయిస్టులకు కొట్టిన పిండి.  మరోవైపు వేలాదిమంది గిరిజనులను మావోయిస్టులు తమ రక్షాకవచంగా వాడుకుంటున్నారు. అందుకే  ఆర్కే, ఉదయ్‌లతోపాటు కీలక నేతలు బెజ్జంగిలోనే ఉన్నారని భావిస్తున్నా పోలీసులు సాహసించి ఆపరేషన్ నిర్వహించలేకపోతున్నారు.
 
గిరిజనులే రక్షాకవచం

బేజింగ్ అటవీప్రాంతంలోని 188 గ్రామాల్లో దాదాపు 12వేలమంది గిరిజనులు ఉన్నారు. 1959-60లలో మాచ్‌ఖండ్ విద్యుత్తు కేంద్రం నిర్మించినప్పుడు ఆ ప్రాంతం నుంచి గిరిజనులను ఇతర ప్రాంతానికి తరలించి పునరావాసం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాని తమ ప్రాంతాన్ని వదిలి వెళ్లేందుకు చాలామంది గిరిజనులు సమ్మతించ లేదు. అతికష్టం మీద దాదాపు 10వేలమంది గిరిజనులను ఒప్పించి ఇతర ప్రాంతాల్లో పునరావసం కల్పించారు. తరలిరావడానికి సమ్మతించని 8 వేల మందికిపైగా గిరిజనులు బెజ్జంగిలో ఉండిపోయారు. ఆ గిరిజన జనాభా ప్రస్తుతం దాదాపు 12వేలకు చేరుకుంది. ఆ గిరిజనులు మావోయిస్టులకు తప్ప, ఇతర ప్రాంతాలకు చెందిన వారిని ఈ గిరిజనులు తమ గ్రామాల్లోకి రానివ్వరు. ప్రభుత్వ అధికారులు కూడా రావడానికి ఇష్టపడరు. 2011లో మల్కనగిరి కలెక్టర్‌గా ఉన్న వినీల్ కృష్ణ బెజ్జంగి అటవీప్రాంతంపై ప్రత్యేక దృష్టిసారించారు. బెజ్జంగిలోని గ్రామాల్లో రోడ్లు నిర్మించాలని, బాహ్య ప్రపంచంతో రాకపోకలకు అవకాశం కల్పించాలని ప్రణాళిక సిద్ధం చేశారు.

దాంతో మావోయిస్టులు వినీల్ కృష్ణను కిడ్నాప్ చేసి సంచలనం సృష్టించారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరిపి ఆయన్ని విడిపించుకోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి బెజ్జంగి అటవీప్రాంతంలో రోడ్లు, ఇతర మౌలిక వసతులు కల్పించాలన్న ప్రతిపాదన పూర్తిగా మరుగునపడిపోయింది.  పోలీసు బలగాలు  భారీ ఆపరేషన్లకు వ్యూహం పన్నిన ప్రతిసారి  మావోయిస్టులు ఈ గిరిజనులను ముందు వరుసలో నిలిపి రక్షాకవచంగా ఉపయోగించుకుంటున్నారు. మరోవైపు బెజ్జంగిలోని గ్రామాల్లోకి చొచ్చుకుపోవాలంటే బలిమెల బ్యాక్‌వాటర్‌గుండాగాని, వాగుల గుండాగాని ప్రయాణించాలి. అలా నదిలో ప్రయాణిస్తే మావోయిస్టులకు సులువుగా లక్ష్యంగా మారతారు. 2008లో బలిమెల బ్యాక్‌వాటర్‌లో ప్రయాణిస్తున్న ఏపీ గ్రేహౌండ్స్‌పై మావోయిస్టులు ఒడ్డు నుంచి మెరుపుదాడి చేసి దారుణంగా దెబ్బతీశారు. ఈ దాడిలో 36మంది గ్రేహౌండ్స్ జవాన్లు మృతిచెందడం తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటివరకు మళ్లీ బెజ్జంగిపై ఆపరేషన్లకు పోలీసు బలగాలు వెనక్కుతగ్గాయి. నది ఒడ్డున రెండు ఔట్ పోస్టులు ఉన్నాయి. అక్కడి నుంచి కేవలం బెజ్జంగిపై నిఘా కార్యకలాపాలు మాత్రమే నిర్వహిస్తున్నాయి. అంతేగాని ఎలాంటి ఆపరేషన్లకు సాహసించడం లేదు. వాస్తవానికి బెజ్జంగి పరిధిలోని జోడంబ్‌లో ఓ పోలీస్ స్టేషన్ ఉంది. కాని ఆ పోలీస్ స్టేషన్ కేవలం నామమాత్రంంగా ఉంటుం ది. అక్కడి నుంచి ఎలాంటి ఆపరేషన్లుగాని ఇతరత్రా కార్యక్రమాలుగాని సాగవు.

ఆర్కే స్థావరం అదేనా!?

మావోయిస్టు అగ్రనేత ఆర్కే కొంతకాలంగా బెజ్జంగినే తన స్థావరంగా చేసుకున్నారని పోలీసు శాఖ భావిస్తోంది. అక్కడి నుంచే మావోయిస్టుల కార్యకలాపాల విస్తరణ, కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల ఆర్కే, ఉదయ్‌లతోపాటు కొందరు అగ్రనేతలు బెజ్జంగి పరిధిలోని గ్రామాల్లో పర్యటించి గిరిజనులతో సమావేశమయ్యారని కూడా సమాచారం. జనవరిలో భారీ ప్లీనరీ నిర్వహించాలని కూడా భావిస్తున్నట్లు తెలుసుకున్న పోలీసు బలగాలు మరోసారి ఆపరేషన్ చేపట్టాయి. కేంద్ర ప్రభుత్వంతో చర్చించి ‘ఏపీ, ఒడిశా పోలీసులు ఆపరేషన్ ఆల్ ఔట్’ చేపట్టాయి. కొన్ని రోజులుగా హెలికాఫ్టర్లతో దూరం నుంచే ఏరియల్ సర్వే నిర్వహించి మరీ ఆపరేషన్ చేపట్టినా బెజ్జంగిలో ప్రవేశించేందుకు సాహసించలేకపోయాయి. పనాసపట్టు ప్రాంతంలోని కొండపై ఉన్న మావోయిస్టులపై చెరోవైపు నుంచి ఏపీ, ఒడిశా పోలీసులు సోమవారం అంతా పలుసార్లు కాల్పులు జరిపినా ఏమాత్రం ప్రయోజనం లేకుండాపోయింది. మావోయిస్టులు ఎదురుకాల్పులకు దిగి సులువుగా అక్కడి నుంచి జారుకున్నారు. పోలీసు బలగాలు మాత్రం వాగులను దాటి బెజ్జంగి గ్రామాల్లోకి చొచ్చుకుపోయేందుకు సాహసించలేదు. ఇక ఫలితం లేదని భావించిన ఏపీ బలగాలు మంగళవారం ఉదయం కాల్పులు విరమించి వెనక్కు వచ్చేశాయి. ఒడిశా పోలీసులు కూడా మంగళవారం మధ్యాహ్నం తరువాత ఆపరేషన్‌ను విరమించాయి. బలిమెల బ్యాక్‌వాటర్‌లో ప్రయాణిస్తున్న ముగ్గురు గిరిజనులను  మావోయిస్టులు అని భావించి ఒడిశా పోలీసులు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఒకరు మృతిచెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. దాంతో గిరిజనుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవడం కూడా ఆపరేషన్‌ను నిలిపివేయడానికి మరో ప్రధాన కారణం. ఏది ఏమైనప్పటికీ బెజ్జంగి అటవీప్రాంతం మాత్రం మావోయిస్టులకు పెట్టనికోటగా మారి  పోలీసు బలగాలకు సవాలుగా విసురుతోంది.
 
ప్రకృతి సహజ దుర్గం
 
ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా పరిధిలోని దట్టమైన అటవీప్రాంతం బెజ్జంగి.   జిల్లాలోని ఇతర ప్రాంతాలతో సంబంధాలుగాని, రాకపోకలుగాని లేవు. పూర్తిగా కటాఫ్ ఏరియాగా ఉంటుంది. చుట్టూ దట్టమైన అడవులు, వేగంగా ప్రవహించే లోతైన వాగులు, ఎత్తై కొండలతో అన్యులకు అంతుచిక్కుండా ఉంటుంది. బలిమెల రిజర్వాయర్ బ్యాక్ వాటర్ ఓ వైపు  ఉంటుంది. మరోవైపు వాగులు, వంకలతో నిండిన నీరు చుట్టూ ప్రవహిస్తూ ఉంటుంది. దాదాపు 200కి.మీ. పరిధిలో  188 చిన్న గ్రామాలు ఉన్నాయి. అవన్నీ అందుపల్లి, జోడంబ్, పనసపుట్టు, రాళ్లగెడ్డ, బోనపుడ అనే ఐదు పంచాయతీల పరిధిలోకి వస్తాయి. నలువైపులా నదులు, వాగులు ప్రవహిస్తూ ప్రతి గ్రామం ఓ ద్వీపాన్ని తలపిస్తుంది. ఈ గ్రామాలను బాహ్య ప్రపంచంతో  రాకపోకలకు ఎలాంటి బ్రిడ్జిలుగాని రోడ్డు మార్గంగాని లేదు. పూర్తిగా నాటు పడవలపైనే వెళ్లాలి.  పక్కా రోడ్లు లేని ఈ గ్రామాల్లో రాకపోకలకు కాలిబాటలే శరణ్యం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement