మావోల కదలికలపై గ్రేహౌండ్స్ డేగ కన్ను
ఎన్నికల వేళ ‘ప్రభావిత’ ప్రాంతాల్లో బలగాల మోహరింపు
సాక్షి, హైదరాబాద్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ తొలిదశ పోలింగ్ సందర్భంగా ఆదివారం విశాఖ, ఖమ్మం ఏజెన్సీ ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలపై గ్రేహౌండ్స్ దళాలు దృష్టి సారించాయి.
ముఖ్యంగా ఆంధ్రా, ఒడిశా సరిహద్దులతోపాటు ఖమ్మం, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో భారీ ఎత్తున మోహరించిన గ్రేహౌండ్స్ దళాలు మావోయిస్టుల కోసం గాలింపు చర్యలను ఉధృతం చేశాయి. ఎన్నిల బహిష్కరణకు పిలుపునిచ్చిన నేపథ్యంలో తమ ఉనికిని చాటుకోవడానికి మావోలు అవాంఛనీయ సంఘటనలకు పాల్పడవచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు ఇప్పటికే హెచ్చరించాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని గత రెండు రోజులుగా ఒడిశా, ఛత్తిస్‌గఢ్ సరిహద్దుల్లో గ్రేహౌండ్స్ బలగాలు నక్సల్స్ కోసం వేట కొనసాగిస్తున్నాయి.
ముఖ్యంగా మావోయిస్టు ఆంధ్రా,ఒడిశా స్పెషల్ జోన్‌కమిటీ కార్యకలాపాలు ఎక్కువగా ఉన్న విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో గ్రేహౌండ్స్ మెరుపు దళాలు రాత్రి వేళ సైతం శక్తివంతమైన బైనాక్యూలర్స్‌తో గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ సందర్భంగా నక్సల్స్ సానుభూతిపరులుగా అనుమానిస్తున్న కొందరిని విశాఖ ఏజెన్సీ, ఖమ్మం సరిహద్దుల్లో పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. కాగా, రాష్ట్రంలో ఎన్నికలు ముగిసేంతవరకు సరిహద్దుల్లో గ్రేహౌండ్స్‌తో పాటు సీఆర్‌పీఎఫ్ బలగాలతో కూంబింగ్ కొనసాగుతుందని సీనియర్ ఐపిఎస్‌అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు.