ముగిసిన చంద్రహాస్ అలియాస్ పాండు ప్రస్థానం
స్వస్థలం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా యాప్రాల్
జవహర్‌నగర్/దుమ్ముగూడెం/చర్ల/హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్–ఒడిశా సరిహద్దులోని గరియాబంద్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్ మృతుల్లో చంద్రహాస్ కూడా ఉన్నారు. మేడ్చల్ –మల్కాజిగిరి జిల్లా అల్వాల్ మండలం యాప్రాల్‌కు చెందిన అలువాల లచ్చువమ్మ–నర్సింహ దంపతుల కుమారుడే చంద్రహాస్ అలియాస్ పాండు. 1967లో యాప్రాల్‌లో జన్మించిన చంద్రహాస్ విద్యాభ్యాసం.. స్థానిక ప్రభుత్వ పాఠశాలలోనే కొనసాగింది. 1981లో టెన్త్ ఫెయిల్ అయ్యాడు. అప్పుడే నక్సల్బరీ ఉద్యమం జోరందుకుంది.
1984–85లో ఆర్‌వైఎల్ కార్యదర్శి ప్రభు నాయకత్వంలో జరిగిన రాజకీయ సమావేశాలకు హాజరయ్యేవాడు. ఇలా ఆ సమావేశాలకు వెళ్లి ఆకర్శితుడై అడవిబాట పట్డాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చంద్రహాస్ ఇంటికి కూడా రాలేదు. నాలుగు దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో పనిచేసి ఛత్తీస్‌గఢ్ స్టేట్ కమిటీ సభ్యుడి స్థాయికి ఎదిగాడు. పార్టీలోనూ కీలకంగా వ్యవహరించాడు.
అబూజ్‌మడ్‌లో సుదీర్ఘకాలం పనిచేయడంతో ఆ ప్రాంతంపై ఆయనకు పూర్తి పట్టు ఉంది. ఎన్‌కౌంటర్‌లో చంద్రహాస్ చనిపోయినట్టు ఛత్తీస్‌గఢ్ పోలీసులు ధ్రువీకరించడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. చంద్రహాస్ కుటుంబ సభ్యులను మావోయిస్టు పార్టీ మాజీ నేతలు, సానుభూతిపరులు, బంధుమిత్రుల సంఘం ప్రధాన కార్యదర్శి పద్మకుమారి, ఉపాధ్యక్షురాలు సత్య, కార్యవర్గ సభ్యురాలు ఉష, జననాట్య మండలి మాజీ సభ్యుడు రాజనర్సింహ తదితరులు పరమార్శించారు. చంద్రహాస్ మృతదేహాన్ని చూసి పాతకాలం మిత్రులు గుర్తు పట్టారని పద్మకుమారి చెప్పారు.
మావోల డంప్ స్వాదీనం..
భద్రతా బలగాల జాయింట్ ఆపరేషన్‌లో ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా పరిధి మెటగూడెం–దులేర్ అటవీ ప్రాంతంలో పేలుడు పదార్థాలు, ఆయుధ తయారీ సామగ్రి గురువారం బయటపడ్డాయి. మెటగూడెం గ్రామానికి 1.5 కి.మీ. దూరంలో ఒక గుహలో దాచిన ఈ డంప్‌లో 21 ఇంప్రూవైజ్డ్ పేలుడు పరికరాలు (ఐఈడీలు), మల్టిపుల్ బ్యారల్ గ్రెనేడ్ లాంచర్లు (బీజీఎల్), బాంబులు, ఒక జనరేటర్, ఇతర సామగ్రి స్వా«దీనం చేసుకున్నారు.
బలగాలకు తప్పిన పెనుప్రమాదం
బీజాపూర్ జిల్లా పోలీసులు, సీఆర్‌పీఎఫ్ బలగాలు బాసగూడ–ఆవుపల్లి మార్గంలో తిమ్మాపూర్ సమీపంలోని దుర్గామాత ఆలయం వద్ద వంతెన కింద మందుపాతరను గురువారం గుర్తించారు. అయితే, దీనిని తీయాలని భావించినా చాలా లోతులో, భారీ సైజులో ఉండడంతో అక్కడే నిర్వీర్యం చేశారు. 50 కిలోల బరువైన ఈ మందుపాతరను నిర్వీర్యం చేయడంతో బలగాలకు పెనుప్రమాదం తప్పినట్టయ్యింది.
గణతంత్ర వేడుకలకు గట్టి భద్రత
సరిహద్దు రాష్ట్రాల్లో జరుగుతున్న వరుస ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టులు తెలంగాణ వైపు తరలిరాకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. గణతంత్ర వేడుకలకు సమయం దగ్గర పడుతుండటంతో ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాల ఎస్పీలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని పోలీస్ ఉన్నతాధికారులు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment