సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రభుత్వ విప్, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్యాకాండకు కుట్రదారులు అధికార టీడీపీ నేతలేనని తేలిపోయింది. మావోయిస్టులకు ఉప్పొందించడమేకాదు.. ఆశ్రయమిచ్చి.. భోజనం పెట్టి వారికి సపర్యలు చేసినట్టుగా విచారణలో స్పష్టమైంది. డుంబ్రిగుడ మండలం లివిటిపుట్టు ఘటన జరిగిన మరుసటి రోజు నుంచే ఈ హత్యాకాండ వెనుక ప్రతిపక్ష పార్టీల హస్తం ఉందంటూ టీడీపీ నేతలు బురద జల్లే ప్రయత్నం చేశారు. కానీ వారి ఆరోపణల్లో ఇసుమంతైనా వాస్తవం లేదని సిట్ తేల్చేసింది. పైగా అవన్నీ కుట్రపూరిత ఆరోపణలేనని కుండ బద్దలు కొట్టింది.
డుంబ్రిగుడ మండలం సర్రాయి గ్రామదర్శినికి వెళుతున్న అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను లివిటిపుట్టు వద్ద మావోయిస్టులు చుట్టు ముట్టి హతమార్చడం సంచలనమైంది. అనంతరం వారి అనుచరులు, టీడీపీ శ్రేణులు అరకు, డుంబ్రిగుడ పోలీస్ స్టేషన్‌కు నిప్పు పెట్టి విధ్వంసానికి పాల్పడ్డారు. జంట హత్యలు, హింసాకాండలపై విచారణకు విశాఖ డీసీపీ ఫకీరప్ప నేతృత్వంలో ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. ఈ బృందం గడిచిన 22 రోజులుగా లోతైన విచారణ జరిపింది. మరోపక్క ఈ ఘటన వెనుక విపక్ష నేతల హస్తం ఉందేమోనంటూ అధికార టీడీపీ నేతలు విమర్శలు మొదలు పెట్టారు.
స్వయంగా టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విపక్షాలనుద్దేశించి అన్యాపదేశంగా మాట్లాడితే ఇక విశాఖ అర్బన్ జిల్లా అధ్యక్షుడు వాసుపల్లి గణేష్‌కుమార్ నోటికొచ్చిన రీతిలో విపక్షాలపై విమర్శలు గుప్పించారు. కానీ ఈ హత్యాకాండ వెనుక విపక్ష పార్టీల పాత్ర ఏమాత్రం లేదని..అధికార టీడీపీ నేతల హస్తం ఉన్నట్టుగా సిట్ విచారణలో తేలడంతో వారి పేర్లు బయటకు రానీయకుండా ఒత్తిడి తీసుకొచ్చేందుకు విఫలయత్నం చేశారు. కానీ పక్కా ఆధారాలతో టీడీపీ నేతలు అడ్డంగా సిట్‌కి దొరికిపోవడంతో అధికార టీడీపీ నేతల వాదనలో పసలేదని తేలిపోయింది.
ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమలను హతమార్చిన మావోయిస్టులకు సహకంచారంటూ డుంబ్రిగుడ మండల టీడీపీ మండలాధ్యక్షుడు, తూటంగి మాజీ ఎంపీటీసీ సభ్యుడు యేడెల సుబ్బారావు, అతని భార్య ఈశ్వరితో పాటు డుంబ్రిగుడ మండలం ఆంత్రగుడ గ్రామానికి చెందిన గెమ్మిలి శోభన్, గుంటసీమ పంచాయతీ తడ్డ గ్రామానికి చెందిన కొర్రా కమలలు అరెస్ట్ చేసి ఆదివారం కోర్టులో హాజరు పరిచారు. టీడీపీలో క్రియాశీలకంగానే వ్యవహరించిన ఈ నలుగురు గతంలో ఆర్గనైజేషన్ ఆఫ్ ప్రొటక్షన్ గిరిజన రైట్స్ (ఓపీజీఆర్)లో పనిచేశారని గుర్తించారు. కానీ ఈ నలుగురు ఓపీజీఆర్‌లో పనిచేశారని చెప్పిన సిట్ చీఫ్ ఫకీరప్ప, ఎస్పీ రాహుల్ దేవ్‌శర్మలు ఎక్కడా వారు టీడీపీతో వారికున్న అనుబంధాన్ని మాత్రం చెప్పలేదు.
ఎందుకు చంపారో... సమాధానం లేని ప్రశ్నలెన్నో..
ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను చంపేందుకు టీడీపీ నేతలు సుబ్బారావు తదితరులే ఉప్పొందించారని చెబుతున్న పోలీసులు ఎందుకు ఆ పని చేసారన్నది మాత్రం చెప్పలేకపోతున్నారు. మావోలతో వాళ్లకు సంబం«ధాలున్నాయని చెబుతున్న పోలీసుల వాదనలు కూడా అనుమానాలకు తావిచ్చేలా ఉన్నాయి. వాస్తవానికి సుబ్బారావు ఒక్కడే గతంలో ఓపీజీఆర్‌లో పనిచేశాడు. మిగిలిన వారెవరూ ఈ సంస్థలో పనిచేసిన దాఖలాలు లేవని తెలుస్తోంది. ఇప్పటికప్పుడు వారు మావోలతో కలిసి కిడారి, సోమలను మట్టుపెట్టాల్సిన అవసరం ఎందుకొచ్చింది. రాజకీయ విభేదాలా? వ్యాపార కారణాలా? మరే ఇతర కారణాలున్నాయా? అనే అంశాలపై పోలీసులు పెదవి విప్పడం లేదు. కేవలం ఉప్పొందించారన్న మాటే తప్ప ఎందుకు చేశారన్న విషయాన్ని మాత్రం పోలీసులు బయటపెట్టలేకపోతున్నారు.
సుబ్బారావు ఇంట్లోనే మావోయిస్టుల మకాం
టీడీపీ మండల పార్టీ ఉపాధ్యక్షుడు సుబ్బారావు ఇంటికి మావోయిస్టులు దాసు, జోగేష్, కిషోర్‌లు కొద్దిరోజుల క్రితం సివిల్ దుస్తుల్లో వచ్చి బస చేశారని, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల హతమార్చేందుకు రెక్కీ కూడా నిర్వహించాలని జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ప్రకటించడం చూస్తుంటే ఈ జంట హత్యల వెనుక అధికార టీడీపీ నేతల హస్తం ఏ స్థాయిలో ఉందో తేటతెల్లమైంది. 21వ తేదీన సర్రాయి గ్రామదర్శిని ఖరారు కాగానే ఆ సమాచారం మావోయిస్టులకు చేరవేసింది సుబ్బారావేనని తేల్చారు. అంతేకాదు ఘటన జరిగిన రోజు పెద్దసంఖ్యలో లివిటిపుట్టు చేరుకున్న మావోయిస్టులకు భోజన వసతి సౌకర్యాలు కల్పించింది కూడా సుబ్బారావు దంపతులేనని సిట్ తేల్చింది.
మావోయిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితులై వారి సానుభూతిపరులుగా ఉంటూ తాము వారు నిర్వహించే సమావేశాలకు హాజరవడమే కాదు..పరిసర గ్రామాలకు వచ్చినపుడల్లా వారికి ఆశ్రయమిస్తూ, భోజన వసతి కల్పించేవారమని విచారణలో సుబ్బారావు అంగీకరించినట్టు సిట్ స్పష్టం చేసింది.అంతే కాదు కిడారి, సోమలను హతమార్చిన రోజున వై జంక్షన్ వద్ద ట్రాఫిక్‌ను క్రమబద్దీకరిం చింది కూడా సుబ్బారావేనని విచారణలో తేలింది. ఇలా రకాలుగా మావోయిస్టులకు పూర్తి సహాయసహకారాలు అందించింది అధికార టీడీపీ నేతలేనని తేలిపోయింది. వీరితో పాటు మరో ఇరువురు పోలీసుల అదుపులో ఉన్నారని తెలుస్తోంది.
ఘటనలో పాల్గొన్నది 53 మంది..
ఇప్పటి వరకు 300 మందికిపైగా అనుమానితులను విచారించిన పోలీసులు ఈ ఘటనలో 53 మంది పాల్గొన్నట్టుగా గుర్తించి వారిపై హత్యానేరంతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆదివారం అరెస్ట్ చేసిన సుబ్బారావు తదితరుల నుంచి 8 కరపత్రాలు, రెండు ఎరుపు రంగు బ్యానర్లు స్వాధీనం చేసుకోగా, మధ్యవర్తుల సమక్షంలో పదికిలోల సామర్థ్యం కల్గిన ఓ మందు పాతర, 20మీటర్లు పొడవు గల ఎలక్ట్రికల్ వైరును స్వాధీనం చేసుకున్నారు. రెండ్రోజుల క్రితం ఏఒబీ సరిహద్దు లోని ఆండ్రపల్లి వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృత్యువాత పడిన మావో అగ్రనేత గాజర్ల రవి భార్య నిడిగొండ ప్రమీల అలియాస్ జిలానీ బేగం అలియాస్ మీనా ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్యాకాండలో 21వ నిందితునిగా గుర్తించారు. ఘటనా స్థలంలో ఉన్న మావోయిస్టు నేతలు చలపతి, అరుణ స్వయంగా ఈ ఆపరేషన్‌ను పర్యవేక్షించినట్టు వెల్లడించారు. సుబ్బారావు ఇచ్చిన సమాచారంతో లివిటిపుట్టు ఘటన వెనుక మరింతమంది టీడీపీ నేతల హస్తం లేకపోలేదని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment