సాక్షి, విశాఖపట్నం: ప్రశాంతంగా ఉండే విశాఖలో ఎప్పుడు ఏదో ఒక అలజడి రేపాలని ఎల్లో బ్యాచ్ కుట్రలు చేస్తూనే ఉంటుంది. తాజాగా కంచర్లపాలెం పరిధిలో రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురికి గాయాలయ్యాయి. అయితే ఈ ఘటనను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఎల్లో బ్యాచ్ రంగంలోకి దిగింది.
కుటుంబ కలహాలను పోలింగ్ ఘర్షణలకు లింకు పెట్టి దుష్ప్రచారం మొదలుపెట్టారు. పరామర్శకు వెళ్లిన టీడీపీ నేతలు డ్రామాలకు తెరతీశారు.
పరామర్శ ప్రక్రియ పూర్తయ్యాక.. మభ్య పెట్టే మాటలు చెప్పి.. ఎల్లో మీడియాలో గొడవకు సంబంధించి కట్టుకథను వండివర్చారు. దీనికి మసాలా యాడ్ చేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ట్వీట్ చేశారు. టీడీపీకి ఓటు వేసినందుకు హింసిస్తున్నారంటూ.. తన నక్క తెలివి తేటలతో మభ్య పెట్టే ప్రయత్నం చేశారు. కల్పిత కథనాలను పదేపదే ప్రచారం చేస్తూ విశాఖలో ఏదో జరిగిపోయిందంటూ గగ్గొలు పెట్టింది ఎల్లో మీడియా. వారికి సోషల్ మీడియాలో పచ్చబ్యాచ్ కూడా తోడైంది. టీడీపీ నీచ రాజకీయాలను గుర్తించిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేసి అసలు నిజాలను ఆధారాలతో సహా బయటపెట్టారు. దీంతో మరోసారి ఎల్లో గ్యాంగ్ బొక్క బోర్లా పడింది.
అసలు జరిగింది ఇదే..
కంచరపాలెం పరిధిలో బుధవారం రాత్రి ఓ కుటుంబంపై జరిగిన దాడి వ్యక్తిగత గొడవల వల్లే తప్ప.. రాజకీయ ప్రమేయం లేదని డీసీపీ మేక సత్తిబాబు తెలిపారు. ఓట్ల కోసం జరిగిన దాడిగా తప్పుడు ప్రచారం జరుగుతుందని విచారం వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం కంచరపాలెం పోలీస్ స్టేషన్‌లో విలేకరులకు వివరాలు వెల్లడించారు. స్థానిక బర్మా క్యాంప్, నూకాలమ్మ ఆలయం సమీపంలో సుంకర నూకరత్నం(నిరీష) కుటుంబంతో నివాసం ఉంటున్నారు. ఆమె ఇంటికి సమీపంలో ఆశ కుటుంబంతో ఉంటున్నారు. ఈ రెండు కుటుంబాల మధ్య పాత గొడవలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి చిన్నపాటి వివాదానికి ముందుగా నూకరత్నం, ఆమె కుటుంబ సభ్యులు ఆశ ఇంటిపై గొడవకు దిగి, వారి ఇంటిపై బీరు సీసాలు విసిరారు. ఇంటికి సమీపంలో ఉన్న ఆశ బంధువైన లోకేష్‌కు విషయం తెలిసి అక్కడికి చేరుకున్నాడు. అక్కడే ఉన్న నూకరత్నం, ఆమె తల్లి ధనలక్ష్మి, కుమారుడు మణికంఠపై కర్రతో దాడి చేశాడు. గాయాలపాలైన వారంతా కేజీహెచ్ వెళ్లి అత్యవసర విభాగంలో చేరారు. అక్కడ బాధితులిచ్చిన ఎమ్మెల్సీ రిపోర్టు ప్రకారం పోలీసులు దాడికి పాల్పడిన లోకేష్, మరో నలుగురిపై కేసు నమోదు చేశారు. లోకేష్‌ను రిమాండ్‌కి తరలించారు.
టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం
రెండు కుటుంబాల మధ్య వివాదానికి టీడీపీ నేతలు రాజకీయ రంగు పులిమి దుష్ప్రచారం చేశారు. వైఎస్సార్ సీపీకి ఓటేయలేదని ఆ నేతలే దాడి చేశారని పరామర్శ పేరుతో బాధితుల ఇంటికి వెళ్లి డ్రామాలు చేశారు. బాధితులతో ఆ విషయం చెప్పించారు. వాస్తవంగా పాత గొడవలు నేపథ్యంలోనే తమపై దాడి చేశారంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నారు. వాస్తవాలను పక్కనపెట్టి రాజకీయ దాడి అంటూ టీడీపీ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment